ఛత్రపతి శివాజీ
వేల కొలది బీజాపూర్ సైన్యం ఎదురైనా భయమన్నదే ఎరుగని వీరుడు ఎవరు ? లక్షలాది మొఘల్ సైన్యాన్ని చూసి బెదురన్నదే లేని యోధుడు ఎవరు ? హిందూ స్వరాజ్య స్థాపన కోసం నడుం బిగించిన శూరుడు ఎవరు ? ఇంకెవ్వరు ? మరాఠాల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అతడే ఛత్రపతి శివాజీ.
భోంస్లే వంశ చరిత్ర :
ఔరంగాబాద్ వద్ద వేరూడ్ అనే గ్రామంలో మాలోజీ రావు అనే హిందూ సర్దార్ ఉండేవాడు. ఇతను అహ్మద్ నగర్ ను పాలించే నిజాంషాహీల వద్ద పనిచేసేవాడు. వీరు ఇతని పరాక్రమానికి మెచ్చి పూనా జాగీర్ ను అప్పగించారు. వీరి పక్షాన మొఘలులతో పోరాడుతూ 1605 లో వీర మరణం చెందాడు. అప్పటికి మాలోజీ రావు పెద్ద కుమారుడు షహాజీ బాలుడు. మాలోజీ రావు తమ్ముడు విఠోజీ షహాజీని పెంచి పెద్ద చేశాడు. నిజాం షాహీల వద్ద సర్దార్ గా ఉన్న లఖూజీరావ్ జాదవ్ కూతురు జిజియాబాయి తో షహాజీ వివాహం జరిపించాడు. లఖూజీరావ్ సర్దార్ గా పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడం చూసి నిజాం షాహీ నవాబుకు కన్ను కుట్టింది. తన రాజధాని దౌలతాబాద్ కు పిలిపించి లఖూజీరావ్ మరియు అతని కుమారులను చంపించి వేశాడు. ఈ విషయం తెలిసి షహాజీ నిజాంషాహీల వద్ద నుండి బయటకు వచ్చి పూనా ప్రాంతానికి వచ్చి స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
శివాజీ బాల్యం :
షహాజీ ప్రధమ పుత్రుడు శంభాజీ. శంభాజీ తరువాత పుట్టే బిడ్డలు చనిపోతుండడంతో పార్వతీ దేవి పేరు శివై అనే పేరు పెట్టుకుంటానని జిజియాబాయి మ్రొక్కుకుంది. భవానీ మాత కటాక్షంతో 1630 ఫిబ్రవరి 19 వ తేదీన పూనా రాజ్యంలోని జున్నార్ పట్టణం వద్ద శివనేరి అనే కోటలో పండంటి బిడ్డను ప్రసవించింది. శివాజీ అని నామకరణం చేశారు. పూనా చుట్టుపక్కల ప్రాంతాలు బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉండేవి. షహాజీ పూనా వద్ద ఉంటే ఇంకా బలపడతాడని బీజాపూర్ సుల్తాన్ భావించాడు. షహాజీని కర్నాటక ప్రాంతంలోని బెంగుళూరుకు తన ప్రతినిధిగా పంపాడు. షహాజీ పూనా ప్రాంతాన్ని జిజియాబాయికి అప్పగించి, శివాజీ కి అండగా దాదాజీ కొండదేవ్ అనే బ్రాహ్మణుడిని నియమించాడు. పెద్ద కుమారుడు శంభాజీతో కలిసి బెంగుళూరుకు వెళ్ళాడు.
విద్యాభ్యాసం :
జిజియాబాయి శివాజీకి చిన్నప్పుడే రామాయణం, మహాభారతం, భాగవతం లోని కథలను చెప్పేది. ఆమె నుంచే పరమత సహనం మరియు మహిళల పట్ల గౌరవ భావం అలవడింది. దాదాజీ కొండదేవ్ శివాజీకి కత్తి సాము, గుర్రపుస్వారీ, మల్ల యుద్ధం మొదలగు యుద్ధ విద్యలను నేర్పాడు. భక్త తుకారాం వద్ద భక్తి, భజనలు నేర్చుకున్నాడు. సమర్థ రామదాసు శివాజీ వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి రూపశిల్పి అయ్యాడు. ఆయన వద్దనే హిందూ ధర్మ మార్గం గురించి వివరంగా తెలుసుకున్నాడు. ‘ధర్మం కోసం ప్రాణాలైనా లెక్కచేయకు, నీవు ప్రాణ త్యాగం చేయవలసి వస్తే నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాలను గురించి ఆలోచించకు’ అన్న గురు బోధనలు శివాజీ మనసులో సుస్థిరంగా నాటుకొన్నాయి.
ఒక సారి రాంఝూ అనే గ్రామ పటేల్ ఒక స్త్రీని బలాత్కారం చేసినందుకు శివాజీ కోపోద్రిక్తుడై శిక్షగా అతని కాళ్ళు, చేతులు నరికించాడు. బీజాపూర్ సుల్తాన్ తన ఆధీనంలోని భూములను దాటుటకు దారి మధ్యలో పాత చెప్పులను తాడుకు కట్టి ఉంచేవాడు. తల వంచుకొని ఆ మార్గం గుండా ప్రయాణించ వలసి వచ్చేది. ఎంతో అవమానంగా భావించిన తల్లి జిజియాబాయి అభీష్టం మేరకు గడ్డ పారతో ఒక్క పోటుతో దానిని పెకలించి వేశాడు. మావళీలు అనే అక్కడి ప్రజలకు యుద్ధ విద్యలు నేర్పించాడు. బీజాపూర్ సుల్తాన్ కు వ్యతిరేకంగా చాందా, గోండు అరణ్యాలలో తన మిత్ర బృందంతో కలిసి రహస్య సమావేశాలను ఏర్పాటు చేసేవాడు. ఒక సారి పాతబడిన దేవాలయంలో, కొండ గుహలల్లో ఒకసారి, దట్టమైన అడవిలో ఇంకోసారి, సముద్ర తీరంలో మరోసారి చర్చలు పెట్టేవాడు. పదహారు సంవత్సరాల చిరు ప్రాయంలోనే అతి తక్కువ మంది సైన్యంతో బీజాపూర్ సుల్తాన్ అధీనంలోని తోరణ కోటను ఆక్రమించాడు. ఆ కోటను బాగు చేస్తున్నప్పుడు దొరికిన నిధితో మురుంబా దేవ కొండపై రాజ్ ఘడ్ కోటను నిర్మించాడు. బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలోని కువారి కోట, శిరవళ కోట, సుభాన మంగళ కోటలను ఆక్రమించాడు. దీనితో ఆగ్రహించిన బీజాపూర్ సుల్తాన్ శివాజీ తండ్రి షహాజీని జింజి కోటలో బంధించాడు. తన తండ్రిని చెరసాల నుండి విడిపిస్తే తాను, తన తండ్రి మొఘలులకు అనుయాయులుగా ఉంటామని షాజహాన్ కు లేఖ వ్రాశాడు. ఆ లేఖ విషయం తెలుసుకున్న బీజాపూర్ సుల్తాన్ మొఘలులకు భయపడి షహాజీని వదిలి పెట్టాడు. శివాజీ శత్రు దుర్భేధ్యమైన ప్రతాప్ ఘడ్ కోటను పటిష్ఠంగా నిర్మించాడు.
శత్రువు వ్యూహాన్ని ముందుగానే పసి గట్టుట :
బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్షా 1656 నవంబర్ 2 న మరణించాడు. అతని కుమారుడు చిన్నవాడు కావడంతో ఆదిల్షా పెద్ద భార్య బడీసాహెబా ఆధ్వర్యంలో పాలన సాగింది. ఇదే అదనుగా దాభోల్, భీవండీ,కళ్యాణీ కోటలను శివాజీ ఆక్రమించాడు. దీనితో బడీసాహెబా కోపంతో అఫ్ జల్ ఖాన్ తో సైన్యాన్ని ఇచ్చి శివాజీపై దాడికి పంపింది. అఫ్ జల్ ఖాన్ అత్యంత క్రూరుడు. నమ్మక ద్రోహుడు. ఒక సారి బీజాపూర్ సుల్తాన్ శివాజీ అన్న శంభాజీని కనక గిరి కోటను జయించడానికి పంపించాడు. అఫ్ జల్ ఖాన్ ని సహాయంగా పంపాడు. కానీ శంభాజీ ఆపదలో ఉన్నాడన్న సంగతి తెలిసినా అఫ్ జల్ ఖాన్ సహాయ మందించక పోవడంతో శంభాజీ మరణించాడు. అఫ్ జల్ ఖాన్ మొదట తుల్జాపూర్ భవానీ దేవాలయంపై తరువాత పండరీ పురం లోని పాండురంగ దేవాలయంపై దాడి చేశాడు. శివాజీ బావమరిది బజాజీ నింబాళకర్ ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. శివాజీ జిజియాబాయిని, తన భార్య సయీబాయిని, తన కుమారుడు శంభాజీని రాజ్ ఘడ్ కోటలో ఉంచి తాను ప్రతాప్ ఘడ్ కోటకు చేరాడు. సయీబాయికి ఆరోగ్యం క్షీణించి మరణించినా అంత్యక్రియలకు సైతం వెళ్ళలేక పోయాడు. తన భార్య మరణించడం వల్ల బాధలో ఉన్నానని ఇప్పుడు యుద్ధం చేయలేనని ప్రతాప్ ఘడ్ కు వస్తే సంధి చేసుకుంటానని పతాంజీ అనే రాయబారిని అఫ్ జల్ ఖాన్ వద్దకు శివాజీ పంపాడు. అఫ్ జల్ ఖాన్ తో సమావేశామవ్వడానికి ముందే కవచం వేసుకొని దానిపై మామూలు దుస్తులు ధరించాడు. పైకి ఉంగరంలా కనబడే పులి గోర్లను రహస్యంగా పెట్టుకొన్నాడు. నవంబర్ 10, 1659 న అఫ్ జల్ ఖాన్ తో సమావేశమయ్యాడు. శివాజీ కన్నా అఫ్ జల్ ఖాన్ చాలా పొడుగరి. పరస్పర ఆలింగనం చేసుకొనే సమయంలో అఫ్ జల్ ఖాన్ చురకత్తి తో శివాజీ వీపుపై పొడిచాడు. కవచం ఉండటం వల్ల శివాజీకి గాయం కాలేదు. వెంటనే శివాజీ నరసింహ అవతారం ఎత్తినట్లు అఫ్ జల్ ఖాన్ పొట్టను పులి గోర్లతో చీల్చి చెండాడాడు. అఫ్ జల్ ఖాన్ వధతో శత్రు సైన్యం చెల్లా చెదరయ్యింది. తరువాత శివాజీ పన్హాలా కోట, కొల్హాపూర్ దాభోల్ కోట లను ఆక్రమించాడు.
మరో శివాజీ :
బీజాపూర్ సుల్తాన్ గోల్కొండ నవాబుల సహాయంతో కర్నూల్ కోట అధిపతి సిద్ధి జౌహార్ ను పన్హాలా కోట పైకి శివాజీని బంధించ డానికి పంపింది. శివాజీ సేనాని బాజీ ప్రభు అచ్చం శివాజీ లాగా ఉండే శివ కాషిద్ అనే మంగలికి వేషం వేసి ఒక పల్లకిలో కూర్చోబెట్టి పంపాడు. సిద్ధి జోహార్ సేనాని మసూద్ శివాజీ దొరికాడని సంబరపడ్డాడు. సిద్ధి జోహార్ వద్దకు తీసుకురాగా అతడు నిజమైన శివాజీ కాదని తెలుసుకొని చేతికి చిక్కి నట్లే చిక్కి తప్పుకొన్నందుకు ఆగ్రహం చెంది బాజీ ప్రభు పై దాడి చేస్తాడు. బాజీ ప్రభు శివాజీని విశాల్ ఘడ్ కోటకు తప్పించాడు. బాజీ ప్రభు శత్రు సైనికులతో వీరోచితంగా పోరాడి వారిని తరమగొట్టాడు. కానీ బలమైన గాయాలు తగలడంతో వీర మరణం పొందాడు. ఆ దేశ భక్తుని మరణంచే పావనమైన కనుమకు ‘పావన కనుమ’ అనే పేరు వచ్చింది. శివాజీని పట్టుకోలేక పోయినందుకు సిద్ధి జోహార్ కు విషమిచ్చి బీజాపూర్ సుల్తాన్ చంపించాడు.
అర్ధరాత్రి దాడి :
శివాజీ మొఘలులకు చెందిన అహ్మద్ నగర్, జున్నార్ లను లూటీ చేయాడంతో ఆగ్రహం చెందిన ఔరంగజేబు తన మేమమామ షయిస్తా ఖాన్ ను లక్ష మంది సైనికులతో శివాజీ పైకి పంపాడు. షయిస్తా ఖాన్ శివాజీకి చెందిన అనేక కోటలను ఆక్రమించాడు కానీ ఒక రోజులో ఆక్రమించాలనుకున్న చాకణ కోటను యాభై రోజులు వీరోచితంగా పోరాడారు. సొరంగ మార్గం ద్వారా కోట గోడల వద్ద మందు గుండు పెట్టించి కోటను బ్రద్దలు చేసి షయిస్తా ఖాన్ ఆక్రమించాడు. పూణేను కూడా ఆక్రమించి శివాజీ కట్టించిన లాల్ మహల్ లో స్థావరం ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ ఎప్పటికైనా దాడి చేస్తాడని బలమైన సైన్యాన్ని కాపలాగా పెట్టించాడు. తను నిర్మించిన కట్టడం కావడం వలన శివాజీ నీటి గొట్టం గుండా అర్థరాత్రి వంట శాలలోకి ప్రవేశించాడు. అంతఃపురం లో నిద్రిస్తున్న షయిస్తా ఖాన్ గదిలోకి పరదాలను చీల్చుకొని శివాజీ ప్రవేశించాడు. శివాజీ ఖడ్గానికి షయిస్తా ఖాన్ చేతి వ్రేళ్ళకు తగిలి మూడు వ్రేళ్ళు తెగి పడ్డాయి. అంతః పుర స్త్రీలు అక్కడి నుంచి తప్పించడంతో బ్రతుకు జీవుడా అని పూణేను వదిలి పారిపోయాడు. పారి పోయి వచ్చి తనకు అవమానం కలిగించినందుకు ఔరంగజేబు ఖాన్ ను సుదూరంగానున్న బెంగాల్ కు సుబేదార్ గా పంపించి వేశాడు.
రాజా జయసింగ్ తో :
కచ్ వాయి ప్రాంతంలోని మీర్జా రాజా జయసింగ్ ని శివాజీ పై దండెత్త వలసిందిగా ఔరంగజేబు ఉసిగొలిపాడు. జయసింగ్ చండీ యాగం చేసి శివాజీని పట్టుకోవడానికి పూణే కు బయలు దేరాడు. జయసింగ్ తో యుద్ధం చేయడం ఇష్టం లేక సంధి కోరుకుంటున్నట్లు శివాజీ ఒక లేఖ వ్రాసి పంపాడు. కానీ ఔరంగజేబు తనకు సంధి చేసే అధికారం ఇవ్వలేదని, ఆగ్రాకు వస్తే పాదుషా తో సంధి చేయిస్తానని చెప్పాడు. పురంధర్ సంధికి శివాజీ ఒప్పుకున్నాడు. జయసింగ్ మాటలను నమ్మి శివాజీ తన కుమారునితో సహా ఆగ్రా చేరతాడు. శివాజీని ఔరంగజేబు అవమాన పరచి శివాజీని బంధించాడు. శివాజీని అంతం చేస్తే మరాఠులు విజృంభిస్తారని భయపడి, ఆఫ్ఘన్ కు పంపిచాలని కుట్ర పన్నాడు. కోటలోని తోటలో సేకరించే పండ్లను సాధువులకు పంచడానికి అనుమతించ వలసిందిగా ఔరంగజేబును శివాజీ అభ్యర్థించాడు. ఔరంగజేబు అందుకు సమ్మతించాడు. పండ్లు అమ్మేవాడి వేషం వేసుకొని ఒక బుట్టలో కుమారుడిని కూర్చోబెట్టి శివాజీ మదాని మోక్తర్ అనే తన అంగ రక్షకుని సహాయంతో తప్పించుకొని తాను కోల్పోయిన కోటలను తిరిగి ఆక్రమించాడు.
పట్టాభిషేకం :
అనేక కోటలను ఆక్రమించుకొన్న అనంతరం కూడా శివాజీని రాజుగా కొందరు గుర్తించక పోవడంతో జిజియాబాయి కాశీ నుంచి గంగాభట్టు అనే పండితుడిని పిలిపించి వేద మంత్రాల మధ్య శివాజీని ఛత్రపతిగా చేసి 1674 జూన్ 6 న పట్టాభిషేకం జరుపుతుంది. శివాజీ అనేక హిందూ దేవాలయాలకు భూరి విరాళాలను అందించాడు. శ్రీశైలంకు వచ్చి భ్రమరాంబను దర్శించి ఇక్కడ అడవిలో కొన్ని రోజులు తపస్సు చేశాడు. భాగ్యనగరంలో గోల్కొండ, ఛార్మినార్ లను సందర్శించాడు.
ఉడుము సహాయంతో యుద్ధం :
అనేక కోటలను ఆక్రమించుకున్నా కొండన కోటను స్వాధీనం చేసుకోలేదనే దిగులు జిజియాబాయికి ఉండేది. పురంధర సంధిలో భాగంగా ఇది మొఘలుల వశమయ్యింది. దీనిని ఉదయ్ భాన్ రాథోడ్ మొఘలుల ప్రతినిధిగా పాలిస్తున్నాడు. కొండన కోటను ఆక్రమించే వరకూ తాను పాదరక్షలు కూడా తోడగనని జిజియాబాయి శపధం పూనింది. శివాజీ స్వయంగా దాడి చేయాలని బయలు దేరబోవగా ఈ విషయం తెలుసుకున్న శివాజీ సేనాని తానాజీ మాలుసరే తనకు ఈ అవకాశం ఇవ్వవలసిందిగా శివాజీని కోరాడు. కానీ తానాజీ కుమారుని వివాహ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని శివాజీ ఒప్పుకోడు. జిజియా బాయి దగ్గరికి వెళ్లి శివాజీ లాగే తననీ ఒక కొడుకు లాగే చూసుకున్నారని నేను లేక పొతే శివాజీనే తన కుమారునికి వివాహం జరిపించాలని వేడుకున్నాడు. తానాజీ జిజియా బాయి ఆశీస్సులు తీసుకొని కొండన కోట వద్దకు వెళ్ళాడు. కోటకు పశ్చిమాన ఏటవాలుగా ఉన్న కొండకు యశ్వంతి అనే ఉడుముకు తాడు కట్టి కోట లోనికి ప్రవేశించాడు. ఉడుము సహాయంతో శత్రువుల కోటను ఆక్రమించటం చరిత్రలో ఇదే మొదటి సారి. తానాజీ తమ్ముడు సూర్యాజీ కోట తలుపులు బ్రద్దలు కొట్టి ద్వారం నుండి ప్రవేశించి దాడి చేశాడు. తానాజీ మూడు వందల వీరులతో వెళ్లి అయిదు వేల మంది శత్రు సైన్యాలను మట్టి కరిపించాడు. ఉదయ్ భాన్ రాథోడ్ తానాజీని వెనుక నుంచి వచ్చి చంపాడు. ఇది చూసి కోపంతో తానాజీ ఆప్తమిత్రుడు షేలార్ మామా ఉదయ్ భాన్ రాథోడ్ ని చంపాడు. కోటపై కాషాయ జెండాను చూసి శివాజీ కోట వశమయ్యింది అని భావించి కోటలోకి వచ్చి నా సోదరుడు తానాజీ ఎక్కడ అని ఆత్రుతతో అడగగా తానాజీ మరణించాడని సైనికులు చెప్పడంతో ‘కోటైతే దక్కింది కానీ నా సింహం వెళ్ళిపోయిందని’ వెక్కి వెక్కి రోదించాడు. అందుకే ఆ కొండన కోటకు సింహ ఘడ్ అనే పేరు పెట్టాడు.
హిర్కణీ బురుజు :
హిరా అనే పాలు అమ్మే మహిళ సాయంత్రం వరకూ పాలు అమ్ముతూ రాయ్ ఘడ్ కోటలోనే ఉండిపోతుంది. కోట తలుపులు మూసివేస్తారు. పసిబిడ్డ పల్లెలో ఉందని పాలు ఇవ్వాలని తలుపులు తెరవాలని అధికారులను వేడుకొన్నా లాభం లేక పోవడంతో ధైర్యంతో ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకొంటుంది. కోట వెనక కొంత భాగం పడిపోవడంతో అక్కడి నుండి పశ్చిమ కనుమల్లోని ఏటవాలుగా ఉన్న కొండ దిగుతుంది. కటిక చీకటి, కౄర మృగాలు ఇవేవీ అడ్డుకాలేదు ఆ మాతృప్రేమకు. ముళ్ళ చెట్ల గాయాలతో ఇంటికి చేరి తన బిడ్డకు పాలు ఇస్తుంది. ఉదయం అనుమానం రాకూడదని పాలు అమ్మడానికి కోటకు వెళుతుంది. కోట తలుపులు తెరిచే సమయానికి హిరాను చూసి ఎలా వెళ్లావు ? అని ప్రశ్నించి శివాజీ వద్దకు తీసుకొస్తారు. కోటలోని బలహీనతలను గుర్తు చేసి మా నిర్లక్ష్యమనే అంధకారాన్ని పోగొట్టి, వజ్రంలా మాకు వెలుగునిచ్చావని మెచ్చుకొని బహుమతులను ఇచ్చి పంపాడు. కోటను పటిష్ఠపరచి ఆ బురుజుకు హిర్కణీ బురుజు అనే పేరు పెట్టాడు.
పరిపాలన :
అనేక సంవత్సరాలు యుద్ధాలలో మునిగి ఉన్నా పట్టాభిషేకం తరువాత శివాజీ తన దైన శైలిలో మంచి పరిపాలనను అందించాడు. అష్ట ప్రధాన్ అనే మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు. ఇందులో పీష్వా ప్రధానమంత్రిగా ఉండేవాడు. వాకినవీస్ అనే గూఢచారి శాఖా మంత్రిని ప్రత్యేకంగా నియమించాడు. రెవిన్యూ పరిపాలనలో మాలిక్ అంబార్ చేత ప్రభావితుడై పన్నులను వసూలు చేసే శాఖను ఏర్పాటు చేశాడు. సైన్యానికి జీతాలను ఇచ్చే పద్దతి, వారి సామర్ధ్యం మేరకు స్థానాలను ఇచ్చే పద్దతిని ప్రవేశ పెట్టాడు. నావికా దళాన్ని అభివృద్ధి చేసి స్వదేశీ యుద్ధ నౌకలను తయారు చేయించడంతో శివాజీని ‘భారత దేశ నౌకా పితామహుడు’ గా పేరు గడించాడు.
పరమత సహనం :
శివాజీ తన పోరాటాన్ని మరాఠా అస్థిత్వ పోరాటంగా భావించాడే కానీ ముస్లింల పై దాడిగా చూడలేదు. మతద్వేషి కాదు. ఖురాన్ ను గౌరవించే వాడు. సైన్యంలో మూడు వంతుల మంది ముస్లింలు ఉండేవారు. సైన్యంలో కీలక పదవులు ముస్లింలకు ఇచ్చాడు. ఆయుధాల అధివతిగా హైదరాలి, నావికా దళపతిగా ఇబ్రహీం ఖాన్, మందుగుండు సామాగ్రికి అధిపతిగా సిద్ధి ఇబ్రహీం, సైన్యాధ్యక్షులుగా దౌలత్ ఖాన్, అంగరక్షకులుగా దరియా సారంగ్, సిద్ధిక్ మొదలగు వారు ప్రముఖ స్థానాల్లో ఉండేవారు. ఒక సారి శివాజీ సైన్యాధికారి ఒక ముస్లిం రాజును ఓడించి అతని కోడలిని బందిగా తీసుకొని వచ్చి శివాజీకి అప్పగించాడు. అప్పుడు శివాజీ ఆమెను చూసి ‘నా తల్లి కూడా నీ అంత అందంగా ఉండి ఉంటే నేను ఎంత అందంగా ఉండే వాడినో’ అని ఆ ముస్లిం యువతితో అన్నాడు. పరాయి స్త్రీల పట్ల మాతృ భావన కలిగి ఉండాలని ఇకపై ఇటువంటి తప్పులు చేస్తే సహించేది లేదని ఆ సైనికాధికారిని మందలించి, ఆమెను సగౌరవంగా, సకల లాంఛనాలతో పంపించాడు.
గెలుపు కోసం ఒక అడుగు వెనక్కు వేసి, మాటు వేసి శత్రువు పై విరుచుకు పడేలా గొరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యుద్ధ మేధావి శివాజీ. అపజయాల నుంచీ గెలుపు శిఖరాల్ని తాకిన తారాజువ్వ శివాజీ. స్వరాజ్య సంస్థానాన్ని నెలకొల్పిన హిందూ పద పాదుషాహీ ఛత్రపతి శివాజీ.

