కాశీ ప్రయాణ కథలు .లింగయ్య కోరిక
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి, శ్రీలక్ష్మి, శివయ్య, పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరంకొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామం చేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
ఈరోజు మీకు లింగయ్య కోరిక అనే కథ చెపుతాను వినండి అని బ్రహ్మయ్య కథ చెప్పడం ప్రారంభించాడు...
లింగయ్యకు తన పూర్వికులద్వారా కొద్దిపాటి పొలంతోపాటు వేపకాయంత
వెర్రి, వెలగ పండంత తిక్కకూడా లభించాయి.అందుకే అందరూ అతన్ని తిక్కలింగయ్య అనిపిలిచేవారు. మన లింగయ్య లీలలుఎన్నో...
ఓ పర్యాయం రాజబాటలో వెళుతున్న లింగయ్యకు రెండు కుక్కలు పోట్లాడుకుంటూ కనిపించాయి అందుబాటులోని రాయిని తీసి కుక్కలపైకి విసిరాడు.ఆరేండు కుక్కలు కలసి లింగయ్యనుతరిమి తరిమి కరిచాయి.
విషయం తెలిసి లింగయ్య భార్యలబ లబలాడుతూ' కూలిఇచ్చి తన్నించుకోవడం అంటే ఇదే 'అని వైద్యుని వద్దకు అతన్ని తీసుకు వెళ్ళింది. మరుదినం తప్పట వాయించుకుంటూ ఊరంతా తిరుగుతూ మన లింగయ్య ' ఇందుమూలంగా తెలియజేయడమేమనగా రెండువీధి కుక్కలు నాపై దాడిచేయడంతో ,నారెండు కాళ్ళకు గాయలైనందున కట్లు కట్టుకున్నాను కనుక మీరెవ్వరూ నాకాలికి కట్లెమిటి అని అడగకూడదహో ' అని ఊరంతా చాటింపు వేసాడు. అతని తిక్కల తనానికి ఆఊరివారు నవ్వుకున్నారు.
మరుదినం వెళ్ళివస్తున్న లింగయ్యను ఆఊరిలోని కొందరు ఆకతాయి యువకులు ' అన్నా నిన్ను కుక్కలు కరిచాయంటకదా దానికి ఉచితంగా మందు ఇదిగో 'అని లింగయ్యకు కల్లు బాగా తాగించారు.
కల్లు మత్తులోతడబడే అడుగులతో ఇల్లు చేరిన లింగయ్యను చూసిన అతని గయ్యాళి భార్య అందుబాటులోని కర్రతో నాలుగు తగిలించింది.
భయపడి మాటలురాని లింగయ్య కూలిడబ్బులు భార్యకు ఇచ్చి మంచపై వాలిపోయాడు.
తెల్లవారుతూనే రాత్రి తన భార్య కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా విపరీతంగా నొప్పిపెట్టసాగాయి .ఛీ ఛీ ఈలాంటి జన్మవృధా ఇంతకంటే మరణం మేలు అనుకుని ఆవేశపడిన లింగయ్య తలపాగా చుట్టుకుని సమీపంలోని అడవికివెళ్ళి పొడవైన తలగుడ్డతో చెట్టుకొమ్మకు ఉరి వేసుకునే ప్రయత్నం చేయసాగాడు.
ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు లింగయ్య ప్రయత్నంచూసి చేరువకువచ్చి " ఆగునాయనా ఆత్మహత్య మహపాతకం అయినా నీజాతకంలో చాలా ఆయ్షు ఉన్నది , ప్రతి విషయానికి ఆత్మహత్యే నిర్ణయమైతే భూలోకంలో మానవాళికి మనుగడ ఉంటుందా ? నీకేంకష్టం వచ్చిందో చెప్పు నేను తప్పక తీరుస్తాను ఇదేనా అభయం ఇస్తున్నాను నీఈప్రయత్నం మానుకో "అన్నాడు.
"సంసారి బాధలు బ్రహ్మచారులకు ఏంతెలుస్తాయి , సరే నాకు పరమ గయ్యాళి అయిన భార్యను ఎందుకు నాకు జతచేసాడో నీఅయ్యను అడిగి తెలుసుకోవాలి నన్ను బ్రహ్మలోకం తీసుకు వెళ్ళు " అన్నాడు లింగయ్య.
"ఇంత చిన్నవిషయానికి నాతండ్రి గారిదాకా ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీభార్య గయ్యాళితనం పోయేలా వరం ఇస్తాను చాలా " అన్నాడు నారదుడు.
"కుదరదు ఈవిషయం బ్రహ్మలోకంలో పంచాయితి పెట్టవలసిందే అభయం ఇచ్చరుగా తప్పదు " అన్నాడు లింగయ్య.
ఇతన్నిప్రజలందరు తిక్క లింగయ్య అని అందరూ ఎందుకంటారో అర్ధమైన నారదుడు " మాటఇచ్చాను కనుక తప్పదు పద " అని లింగయ్య చేయి పట్టుకుని ఆకాశమార్గాన బయలుదేరాడు.
కొంతదూరం ప్రయాణం చేసాక "నాయనా లింగయ్య వచ్చేది వైకుంఠం నేనువెళ్ళి శ్రీమహవిష్ణువు దర్శనం చేసుకువస్తాను నువ్వు అందాక పరిమళభరితమైన ఈకల్పవృక్షం కింద సేదతీరు ఈకల్పవృక్షం ఏదికోరుకున్న ఆకోరిక తీర్చుతుంది జాగ్రత్తగా ఉండు తుంటరి కోరికలు కోరుకోబోకు "అని నారదుడు వైకుంఠంలోనికి వెళ్ళిపోయాడు.
గత రాత్రి ఏమి తినకపోవడం,ఉదయం నుండి ఆకలి ,బడలికగా ఉన్న లింగయ్య కల్పవృక్షం కిందచేరి
"ఆహ ఈసుగంధ పరిమళానికి ,ఈచల్లగాలికి,ఇప్పుడు ఓహంసతూలికా తల్పం ఉంటేనా "అన్నాడు.
మరుక్షణం అక్కడ హంసతూలికాతల్పం ప్రత్యక్షమైయింది.
"ఆహ ఈచలిగాలికి వెచ్చగా కప్పుకోవడానికి ఓగింబళి ఉంటే బాగుంటుంది కదా "అన్నాడు.
వెంటనే అతనికి ఓగింబళి లభించింది. ' తినడానికి పచక్ష్యాలతో కూడిన రాజభోజనం ఉంటేనా ' అన్నాడు .మరుక్షణం రాజభోజన వచ్చింది. కడుపునిండా ఆహరం పట్టించిన లింగయ్య ' ఇప్పుడు కాళ్ళు వత్తడానికి దాసీలు, అమరగానంతో నృత్యం చేయడానికి రంభా,ఊర్వసి,మేనకా, తిలోత్తమలు నృత్యం చేస్తుంటే ఎంతబాగుంటుందోకదా 'అనుకున్నాడు.
క్షణాలపై అతని కోరిక నెరవేరింది. దాసీలు కాళ్ళు వత్తుతుండగా,
దేవ నర్తకీల నృత్యంచూస్తు అమర సుఖాలు అనుభవిస్తున్న మన లింగయ్య 'ఆహ నాఈరాజభోగము,ఈదేవనర్తకీల నృత్యం నేను చూస్తుండటం నాగయ్యాళి భార్య చూసిందంటే చీపురుకట్ట తిరగేసి మరీ బాదుతుంది కదా ' అనుకున్నాడు.
అది కల్పవృక్షంకదా ఏంకోరుకున్నాతప్పక తీరు స్తుంది.
మరుక్షణం లింగయ్య భార్య అక్కడకు వచ్చి ,అక్కడ జరుగుతున్న తంతుచూసి 'తింగరోడా పొయిలోకి కట్టెపుల్లలు లేక నేనేడుస్తుంటే కూలిపనికి పోకుండా నన్ను అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడ తైతక్కలాడుతుంటే వదులుతాను అనుకున్నావా? ఏలోకంలో ఉన్నా వదలను నీఆటలు నాదగ్గర సాగవు 'అని లింగయ్య జుట్టు పట్టుకుని చేతిలోని చీపురుకట్ట తిరగవేసి గసపెడుతూ బాదసాగింది.
అప్పుడే వచ్చిన నారదుడు '' నాయనా బ్రహ్మలోకం వెళదామా?"అన్నాడు.
"స్వామి నాకు ఏలోకము వద్దు నన్ను నాభార్యను మాభూలోకం పంపించు "అన్నాడు లింగయ్య.
"తధాస్తు " అన్నాడు నారదుడు.
మరుక్షణం లింగయ్య దంపతులు భులోకం చేరారు,వెంటనే గొడ్డలితో కట్టెపుల్లల కొరకు అడవిచేరాడు లింగయ్య ." అన్నాడు బ్రహ్మయ్య.
ఫక్కున నవ్వారు అక్కడ ఉన్నవారంతా అనంతరం అందరూ నిద్రకు ఉపక్రమించారు.

