శ్రీ రామకృష్ణ పరమహంస
19 వ శతాబ్దం చివరన భారతదేశంలో మత ప్రబోధ బీజాలను నాటి వివేకానందుల వంటి మేటి శిష్యులని ఫలాలుగా అందించిన మహనీయుడు శ్రీ రామకృష్ణ పరమహంస. భారతదేశంలోని మత లోపాలను సవరించి, భారతీయులను ఉద్ధరించి, పరమతాచరణను అరికట్టిన వారిలో అగ్రగణ్యుడు. కాంతాకాంచనముల పట్ల మోహ నిర్మూలన చేసుకొన్న మహాపురుషుడు.
బాల్యం :
వంగ రాష్ట్రంలో హుగ్లీ జిల్లాలో కామార్పుకూర్ గ్రామంలో 1836 ఫిబ్రవరి, 18 ఖుదీరామ్ ఛటోపాధ్యాయ, చంద్రమణీ దేవి పుణ్యదంపతులకు దివ్యమైన తేజస్సుతో ఒక పుత్రుడు జన్మించాడు. గయలోని నారాయణుని దర్శన భాగ్యం వల్ల జన్మించిన ఆ బాలునికి గదాధరుడు అని నామకరణం చేశారు.
జగజ్జనని సాక్షాత్కారం :
గదాధరుడు చిన్నప్పటినుండి దైవభక్తి తత్పరుడై భగవన్నామ సంకీర్తనలను శ్రద్ధగా నేర్చుకొని శ్రావ్యముగా పాడేవాడు. తల్లిదండ్రులతో కలిసి అనేక దేవాలయాలకు వెళ్ళేవాడు. ఏ దేవాలయం వెళ్ళినా విగ్రహాలను నిశితంగా పరిశీలించేవాడు. ఈ పరిశీలనా శక్తిని గమనించి నూతన దేవాలయాలలో విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు ఇతని సలహా తీసుకునే వారు. గదాధరునికి పది సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించగా అన్న రామకుమార్ కుటుంబ బాధ్యతలను స్వీకరించాడు. రామకుమార్ రాణి రాసమణి అనే ఆలయ ధర్మకర్త కట్టించిన దక్షిణేశ్వరాలయంలో పూజారిగా ఉండేవాడు. గదాధరుడు పాఠశాలలో కొంత కాలం చదివి, ఈ విద్య పొట్ట కూటికే గానీ మోక్ష సాధనకు ఉపకరించదని పాఠశాలకు వెళ్ళడం మానివేసాడు. అన్నకు సహాయంగా గుడికి వెళ్ళేవాడు. దక్షిణేశ్వరాలయంలోని కృష్ణమందిరంలో పూజలు నిర్వహించేవాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పరితపించేవాడు. ఒక రోజు కృష్ణుని విగ్రహం చెయ్యి విరిగి పోయిందని ఆ విగ్రహం స్థానంలో మరొక విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ నిర్వాహకులు నిశ్చయించారు. వారిని పిలిచి మీ పిల్లవానికి చెయ్యి విరిగితే ఏమిచేస్తారు? అని ప్రశ్నించి వారిని ఒప్పించి జాగ్రత్తగా ఆ విగ్రహానికి చేయిని అతికించాడు. కొంతకాలానికి అన్నగారు రామకుమార్ కాలంచేయగా, కుటుంబ భారమంతా గదాధరునిపైనే పడింది. అన్న గారి స్థానంలో అర్చకుడిగా మారాడు. పుజాకార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో సక్రమంగా నిర్వహిస్తూ ఉండేవాడు. కాళికామాత ప్రత్యక్ష్యం కోసం తలను గోడకు కొట్టుకొనే వాడు. అమ్మా! అమ్మా! మాట్లాడమ్మా! అని బ్రతిమాలే వాడు . పూజ చేస్తూ స్పృహని కోల్పోయేవాడు. ఒకరోజు కాళికామాతతో ‘నీవు ఉన్నావని నా విశ్వాసం నిజమైతే రాణిరసమణి కుమార్తెలు ఈ దేవాలయంలోని వటవృక్షం క్రిందికి వచ్చి నాతో మాట్లాడాలి’ అని మనసులో తలచాడు. అదేమి ఆశ్చర్యమేమో కానీ ఎన్నడూ అంతఃపురం దాటిరాని వారు వచ్చి ‘అన్నా! దేవి నీ పట్ల ప్రసన్నురాలు అయ్యింది. నీవు ఇక ఆందోళన పడద్దు’ అని చెప్పారు. కాళికామాత సాక్ష్యాత్కారం కోసం ఒకసారి కత్తి తీసుకొని పొడుచుకోబోయాడు. వెంటనే జగజ్జనని దర్శనమిచ్చింది. తరచుగా అమ్మతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. బాహ్య ప్రపంచాన్ని మరచిపోయేవాడు. దుస్తులు సరిగ్గా వేసుకొనే వాడు కాదు. కొందరు ఈయనను పిచ్చోడనుకున్నారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఆహారం సరిగ్గా తీసుకునేవాడు కాదు. ఇల్లు, బంధువులు గుర్తుకు వచ్చేవారు కాదు. తల్లి చంద్రమణి దిగులుపడి, పెద్దలను ఆశ్రయించగా పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని చెప్పారు. మంచి అమ్మాయి కోసం వెదుకుతూ ఉంటే గదాధరుడే ‘దీనికి ఎందుకు అంత తర్జన భర్జన పడుతున్నారు? పక్కనే ఉన్న జయరాంవటి గ్రామంలో రామచంద్ర ముఖోపాధ్యాయ గారి కూతురు ఉంది వెళ్లి తీసుకురండి పెళ్లి చేసుకుంటాను’ అని అన్నాడు. అప్పుడు గదాధరుని వయస్సు 16 సంవత్సరాలు. పెళ్లప్పటికి శారదాదేవి వయస్సు 5 సంవత్సరాలే కావడంతో పెళ్లి తరువాత వారి తల్లిదండ్రుల వద్దే ఉండి పెరిగింది. తన కుమారుడు దుస్తులు కూడా సరిగ్గా వేసుకోకుండా ఉంటున్నాడే అని దిగులు పడుతున్న చంద్రమణి దేవికి ఒకరోజు కలలో శివుడు కనబడి ‘నీవేం బాధ పడకు, నీకుమారుడు పిచ్చివాడు కాదు. చాలా గొప్ప వాడు, జ్ఞానాన్ని అందించే వాడవుతాడు’ అని చెప్పాడు. దీనితో ఆమెకు కొంత ఊరట లభించింది. యుక్తవయస్సు వయస్సు రాగానే శారదాదేవి కలకత్తా లోని అత్తగారింటికి వచ్చింది. ఆమె పాదాలపై పడి ‘తల్లీ, నేను స్త్రీ లందరినీ మాతృ భావనతోనే చూస్తాను. నీవు నన్ను ఈ సంసార కూపములోనికి లాగటానికి వచ్చావా?’ అని అనగా ‘లేదు స్వామీ! మీ తలంపుకు అడ్డురాను మీకు సేవ చేయడానికే వచ్చాను’ అని శారదాదేవి బదులిచ్చింది. ఆయన భార్యలో జగజ్జనని చూస్తే, ఆమె భర్తలో గురువుని చూసింది. వీరిరువురి సంబంధం గురుశిష్యుల సంబంధం. విదుషీమణి, స్పురద్రూపిణియైన భైరవీబ్రాహ్మణి గదాధరునికి తత్వవిజ్ఞానాన్ని బోధించింది. తోతాపురి అనే యతీంద్రులు గదాధరునికి సన్యాసం ఇచ్చి, రామకృష్ణ గా పేరు మార్చి, అద్వైతాన్ని బోధించి, బ్రహ్మ జ్ఞానోపదేశం చేశాడు. ఆధ్యాత్మిక విజ్ఞాన సంపత్తిని చూసి గ్రామస్థులు రామకృష్ణుని ‘పరమ హంస’ గా పిలిచే వారు.
పరీక్ష :
రామకృష్ణుడు బంగారాన్ని, మట్టిని సమానంగా చూసేవారు. డబ్బును, పెంకు బిళ్ళలను సమానంగా భావించి డబ్బులను గంగలోనికి విసిరివేసేవాడు. ఒకసారి రాణిరసమణి అల్లుడైన మధురనాధుడు రామకృష్ణుని పరీక్షించ దలచి కాశ్మీరము నుండి తెప్పించిన మంచి శాలువాను బహుకరించాడు. కానీ దానిని రామకృష్ణుడు మట్టిలో వేసి కాలితో తొక్కి విసిరేశాడు. శారదాదేవి వద్దకు వచ్చి ఈ డబ్బు తీసుకో తల్లి! కొంతకాలం సర్వసుఖాలను అనుభవించు అన్న మధురనాధునితో ‘మీకు ఎంతో కృతజ్ఞతలు కానీ పతి అడుగుజాడలలోనే నేను నడుస్తాను’ అని సున్నితంగా తిరస్కరించింది. రామకృష్ణుడు కొంతకాలం మహమ్మదీయ పధ్ధతిని అనుసరించి భగవంతుని ధ్యానించేవాడు. ఒకమారు ఏసుక్రీస్తును ధ్యానం చేస్తున్నప్పుడు ఏసు ప్రభువు ప్రత్యక్ష్యమయ్యారు. అలా ఏ మత పద్ధతిననుసరించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దేవుడు సాక్షాత్కారమయ్యేవారు. సర్వ మతములను అవలభించుట వలన ప్రతి మతము మంచిదే అని, ఏ మతాన్ని అవలంభించినా మానవునికి ముక్తి లభిస్తుందని తెలిపాడు. కేశవ చంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, గిరీష్ చంద్ర ఘోష్ లాంటి వారు ఇతనిని అనుసరించారు. రామకృష్ణుని శిష్యులలో మణిపూస వంటివారు వివేకానందుడు.
గురు శిష్య సంబంధం :
వివేకానందుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రుడు. నరేంద్రుడు చిన్నప్పుడు చక్కగా భక్తి గీతాలు పాడేవాడు. వయస్సు పెరిగే కొద్దీ నరేంద్రుడికి భగవంతుడు ఉన్నాడా? అనే సందేహం పెరిగింది. చాలామంది దగ్గరికి వెళ్లి తన సందేహాన్ని వెలిబుచ్చినా వారిచ్చిన సమాధానానికి అతను సంతృప్తి పొందలేదు. ‘దక్షిణేశ్వరాలయంలో రామకృష్ణుని దగ్గరికి వెళ్ళు, నీ సందేహం తీరుతుంది’ అని నరేంద్రుని బంధువు రామచంద్ర దత్తు సలహా ఇస్తే వెళ్ళాడు. నరేంద్రుని చూసి రామకృష్ణులు చాలా ఆనందించి, ‘వీలు చూసుకుని మా ఇంటికి రా’ అని ఆహ్వానించారు. రెండవసారి వెళ్లి కలవగా ఆదరంగా ఆహ్వానించి ఇంటిలో గడియ పెట్టి రామకృష్ణుడు నరేంద్రుని చేతులు పట్టుకుని ‘ఇంతకాలానికి వచ్చావా! నాయనా!’ అని కళ్ళనిండా నీళ్ళు పెట్టుకున్నాడు. మరొక సారి కలిసినప్పుడు నరేంద్రుని పై ఎడమ పాదం పెట్టగానే నరేంద్రుడు గొప్ప అనుభూతిని పొంది, ‘ఏం చేస్తున్నారు మీరు? నాకు అమ్మా,నాన్న ఉన్నారు వాళ్ళను నేను పోషించాల్సి ఉంది నన్నేం చేస్తున్నారు ?’ అని గట్టిగా అన్నాడు. రామకృష్ణుడు నవ్వి ‘ఇప్పటికి ఇది చాలు’ అని నరేంద్రుని గుండె నిమురుతూ మామూలు స్థితికి తెచ్చాడు.
మరికొంత కాలం తరువాత నరేంద్రుడు తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి మరో సారి రామకృష్ణుడిని ‘మీరు భగవంతుని చూసారా?’ అని ప్రశ్న అడిగాడు. ‘చూశాను, నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే చూశాను. నీకు కావాలంటే కూడా చూపిస్తాను.’ అని రామకృష్ణుడు అన్నాడు. ‘చుక్కలు పగలు కనబడక పోయినా ఉన్నాయా లేదా? అలాగే భగవంతుడు నీకు కనబడక పోయినా ఉన్నాడు. నీళ్ళల్లో ముంచితే నీవు ఎలా గిలగిలా కొట్టుకొని విలవిల లాడుతావో అలా భగవంతుని కోసం నీవు ప్రార్థిస్తే ఖచ్చితంగా భగవంతుడు కనబడతాడు.’ అని రామకృష్ణుడు చెప్పగానే నరేంద్రుని సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి. వివేకానండునిగా మారి సన్యాసం స్వీకరించి రామకృష్ణుని శిష్యునిగా మారిపోయాడు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు గురుశిష్యులు. వివేకానందునిది శరీరమైతే ఆత్మ రామకృష్ణుడిది. ఒకసారి వివేకానందుడు రామకృష్ణుని దగ్గరికి వచ్చి ‘నేను చాల బీద స్థితిలో ఉన్నాను. మా తండ్రిగారు పరమపదించి మా కుటుంబ పరిస్థితి బాగోలేదు. మీరు వెళ్లి అమ్మవారిని నన్ను కష్టాల నుంచి దరితీర్చమని అని అడగండి’ అని అన్నాడు. ‘నీకు నమ్మకం కలగటం లేదా? నీతో అమ్మ మాట్లాడదని అపనమ్మకమా? నీవే వెళ్లి అడుగు’ అని రామకృష్ణుడు అనగానే గురువు గారి మీద ఉన్న నమ్మకంతో వివేకానందుడు వెళ్లి అమ్మవారిని అడగడానికి వెళ్ళాడు. అమ్మవారు ప్రత్యక్ష్యం అయ్యింది. వెంటనే వివేకానందుడు ‘అమ్మా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు’ అని అడిగాడు. ‘ఏం అడిగావా?’ అని రామకృష్ణుడు అంటే ‘లేదు అమ్మవారు కనబడ గానే నేను నాకోరికను మర్చిపోయి జ్ఞానాన్ని ఇవ్వమ్మా’ అని అడిగాను అన్నాడు వివేకానందుడు. ‘సరే మరో సారి వెళ్లి అడుగు’ అని చెప్పి పంపారు రామకృష్ణులు. వివేకానందుడు వెళ్లి అమ్మ వారు కనబడి ‘ఏం కావాలి నాయనా?’ అనగానే అమ్మవారి పాదాలు పట్టుకొని ‘అమ్మా నాకు విరాగ్యాన్ని ఇవ్వు’ అని అడిగాడు. ‘ఏం ఈ సారైనా అడిగావా?’ అని రామకృష్ణుడు అడిగితే ‘లేదు లేదు తుచ్ఛమైన కోరికల బదులు వైరాగ్యాన్ని అడిగాను’ అన్నాడు వివేకానందుడు. వెంటనే రామకృష్ణుడు వివేకానందున్ని దగ్గరగా పిలిచి ‘ఇది కదా నీలో నేను ఆశించినది’ అని చెప్పి గట్టిగా హత్తుకున్నాడు. మనసులో వీడు కదా నా నిజమైన శిష్యుడు అని పొంగి పోయారు రామకృష్ణులవారు. అలా తీర్చిదిద్దారు శిష్యుడిని.
రామకృష్ణుని అనేక మంది పరీక్షించారు. రామకృష్ణునికి తాంత్రిక విద్యను నేర్పిన భైరవిబ్రాహ్మణి ఇతనిని పరీక్షించడానికి ఒక మహిళ ఒడిలో కూర్చోమనగానే ఆ మహిళను జగజ్జననిగా భావించి ఒడిలో కుర్చున్నారు. ఒక పాత్రలో చేపలు తెచ్చి తినమని చెబితే ఎన్నడూ మాంసాహారం ముట్టని రామకృష్ణుల వారు గురువు మీద నమ్మకంతో తినడానికి అవి ముట్టుకోగానే అవి ఫలాలై పోయాయి. డబ్బు మీద ఈయనకు వ్యామోహం ఉందో లేదో కనుక్కోవడానికి వివేకానందుడు ఒకసారి కొంత డబ్బుని రామకృష్ణుని పరుపు క్రింద ఉంచాడు. రామకృష్ణుడు వచ్చి పండుకోగానే వీపంతా మంటలు పెట్టాయి. పరుపు క్రింద డబ్బుని తీసివేసి పడుకోగానే మంట పోయింది. డబ్బంటే అంత విరక్తి రామకృష్ణునికి.
రామకృష్ణునికి గొంతులో పుండు ఏర్పడి నోటి నుంచి రక్తం వచ్చేది. దక్షిణేశ్వరం నుండి కాశీపూర్ కు రామకృష్ణుని నివాసాన్ని శిష్యులు మార్చారు. ఎంతో శుశ్రూష చేశారు. తనకు మృత్యువు ఆసన్నమవుతున్నదని ఒకరోజు ముందుగానే గ్రహించిన రామకృష్ణులవారు వివేకానండుడికి తన ఆధ్యాత్మిక శక్తి నంతటినీ ధారపోసారు. ఆగష్టు 16, 1886 న రామకృష్ణుడు భగవంతునిలో ఐక్యమయ్యారు.
చికాగోలో 1893 సెప్టెంబర్ 13న జరిగిన ప్రపంచ సర్వ మత మహాసభలో అమెరికాలోని ‘నా సోదర సోదరీమణులారా!’ అని ప్రారంభమైన ఉపన్యాసంలో వివేకానందుడు హిందూమత వైభవాన్ని రామకృష్ణుని బోధనా సారాంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. భారతదేశానికి తిరిగి వచ్చి రామకృష్ణుని బోధనలను ప్రచారం చేయడానికి 1897 మే 1వ తేదీన రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు.
పాలను నీళ్ళను వేరు చేయగలిగేది హంస. మనలోని అజ్ఞానాన్ని వేరు చేయగలిగే వాడే పరమహంస. రామకృష్ణ పరమహంస ప్రపంచానికి చాటిన ‘మానవ సేవే మాధవ సేవ’ అనే ఆశయాన్ని సాధిద్దాం.
“స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరుపిణే – అవతార వరిస్ఠాయ రామకృష్ణాయ మంగళం”

