అపర నన్నయ్య - ambadipudi syamasundar rao

అపర నన్నయ్య

అచ్చ తెనుగు సాహిత్యములో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు అపర నన్నయ్య గా కీర్తింపబడిన కవి శ్రేష్ఠుడు ఆంధ్ర కల్హణ,కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. ఈయన సిద్దార్ది నామ సంవత్సరము ఫాల్గుణ పౌర్ణమి నాడు అంటే 1920 మార్చి 5 వతేదీన ఐ పోలవరం గ్రామములో తన తాతగారైన ఆకొండి రామమూర్తి శాస్త్రి గారి ఇంట్లో సత్యనారాయణ మూర్తి, లచ్చమ్మ దంపతులకు జన్మించారు బాల్యాన్ని వల్లిపాలెము గ్రాములోనే గడిపారు మహేంద్రవాడ సుబ్బరాయ శాస్త్రిగారు, ఓలేటి వెంకట రామశాస్త్రి గార్ల వద్ద కావ్య వ్యాకరణాలు అభ్యసించారు.1939 లోనే తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో ఆంధ్రి అనే మాసపత్రికను ప్రారంభించారు ఆ పత్రికను 1941 నవంబర్ వరకు నడిపారు ఆ పత్రికకు ఆనాటి పండిత శ్రేష్ఠులు రచనలు పంపేవారు. ఆ పత్రికలో ప్రచురించబడ్డ వ్యాసాలకు కవితలకు ప్రతి పేజీ దిగువన పాద గమనికలు వ్రాసేవారు వీటిలో నిర్మొహమాట విమర్శలు ఉండేవి. 1940 లో మద్రాసు విశ్వ విద్యాలయము నుండి విద్వాన్ పరీక్షలో ఉట్టెర్ణుడయినారు 1940-44 మధ్య కాలములో సూర్యరాయాంధ్ర నిఘంటువు కార్యాలయములో పండితుడిగా నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1947 నుండి రాజమండ్రి లోని వీరేశలింగము పంతులుగారి హైస్కూలులో తెలుగు అధ్యాపకుడిగా చేరి 1974 వరకు పనిచేసి పదవి విరమణ చేశారు

ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికి గాను ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైనా సాహితీ విలువలు కలిగిన కావ్యం. ఆంధ్ర పురాణము, ఆంధ్ర రచయితలు శాస్త్రి ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం.ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్త్రి ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి పింగళి-కాటూరి కవుల సౌందరనందము, దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతాప సింహచరిత్ర, శతావధాని గడియారం వేంకట శేషశాస్త్రి శ్రీ శివభారతము, తుమ్మల సీతారామమూర్తి బాపూజీ ఆత్మకథ అనేవి. శాస్త్రి రచించిన ఇతర రచనలు .

చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన పుస్తకం.చరిత్ర ధన్యులు. ఇందులో శాస్త్రి గారు శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య జీవితాలను చిత్రించారు . శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి.చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాయబడింది. శాస్త్రి రచించి ప్రచురించిన ఖండకావ్యాలు - (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్త్రి గారు పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక వ్రాస్తూ శాస్త్రి మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదహరించారు .

తే॥ నొడువ జాలని యిడుమల గుడిచి బడలి
చిక్కి జీర్ణించి నిజదేశ సేవ చేసి
తుదకు స్మరణీయులైన యాంధ్రుల దలంప
గాజు కన్నైన నొక యశ్రుకణము రాల్చు’’

శాస్త్రి గారు నవలలు, కథలు, చరిత్రలు, నాటకానువాదాలు, వ్యాసాలు మొదలైన సాహిత్య శాఖలలో రచనలు సాగించారు. బోధి వృక్షము - బుద్ధుని చరిత్ర ఇతివృతంగా వ్రాయబడిన నవల. కళ్యాణతార మరియొక నవల. ఇందు శ్రీకృష్ణదేవరాలు కొండపల్లి ముట్టడిని గూర్చిన ఇతివృత్తమున్నది. శాస్త్రి పతంజలి చరిత్ర, ధన్వంతరి చరిత్ర, షడ్దర్శన సంగ్రహం వారి రచనలో నొకటి. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్త్రి కుమారులు మధునామూర్తి సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశారు ఆంధ్ర కుటీరాన్ని స్థాపించి తెలుగు రచనా వ్యాసాంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించారు ఈయన తన సాహితి రచనలతో తెలుగు వారికి రసగుళికలను అందించిన సాహితి దిగ్గజము 1992,నవంబర్,7వ తేదీన కీర్తిశేషులు అయినారు.