సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడు - ambadipudi syamasundar rao

సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడు
బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలిసారిగా ఎన్నికైన ముఖ్యమంత్రి.బూర్గుల రామకృష్ణారావు గారు ఈయన రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు వీరి స్వగ్రామం బూర్గుల; అసలు ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ఇంటి పేరు అయింది తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడటానికి అమరజీవి పొట్టి శ్రీరాములు కారణమైతే నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా ఏర్పడటానికి బూర్గుల కారకుడు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ తన పదవికి రాజనీమా చేసి తెలంగాణా,ఆంధ్ర ల ఏకీకరణకు తీర్మానాన్ని ఆమోదింప జేశాడు. కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రామకృష్ణ రావు గారు 1899 మార్చి 13 న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించారు హైదరాబాద్ లోని ధర్మపంత్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు . 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పూణె లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివాడు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, హైదరాబాద్‌లో 1923లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.బూర్గుల దగ్గర మాజీ ప్రధాని పివినరసింహారావు గారు జూనియర్ లాయర్‌గా పనిచేశారు.1924లో వివాహము చేసుకున్నారు
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగార వాసం అనుభవించాడు. 1948లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, ఎమ్ .కె వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడి నపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు
1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగిపుడు, మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలో సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.అయన ముఖ్య మంత్రి గా ఉన్న కాలములోనే జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసి విప్లవత్మకమైన భూసంస్కరణలు ప్రవేశ పెట్టారు. 1956లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినపుడు,. బూర్గుల, కేరళ రాష్ట్రానికి గవర్నరుగా వెళ్ళాడు1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు.62 నుండి 66 వరకు రాజ్య సభ సభ్యునిగా కొనసాగారు

విద్యార్థి దశ నుంచే అయన అనేక ప్రజాహిత సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వాడు. 1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించాడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకముగా తానూ పాల్గొనటమే కాకుండా న్యాయవాదిగా స్వతంత్ర ప్రాతములో పాల్గొన్న వారిపై బ్రిటిష్ ప్రభుత్వమూ పెట్టిన కేసులను ఈయన ఉచితముఁగా వాదిస్తూ స్వతంత్ర పోరాటంలో పాల్గొనే వారికి సహాయము చేసేవాడు. ఆయనది అన్ని విధాలా విశిష్ట వ్యక్తిత్వము ఆకృతిలో వామనుడైనా అనేక రంగాల్లో తన విశేష ప్రతిభతో అనేక రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడు బూర్గుల

ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నాడు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించాడు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత పరిషత్‌ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించాడు.బూర్గులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీ పంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీ కృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు. ఈయన రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశాడు. అనువాద రచనలు కూడా చేశాడు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు.1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టాను ప్రదానం చేసింది.1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వం వీరి పేరున తపాలా బిళ్ళను రీలీజ్ చేసింది వీరు 1967, సెప్టెంబర్ 14 న గుండెపోటుతో మరణించాడు అయన మరణముతో తెలుగు జాతి గొప్ప రాజనీతిజ్ఞుడిని, సాహితి వేత్తను,త్యాగ ధనుడిని కోల్పోయింది.