పుట్టుకతో వచ్చిన బుద్ది... - బి.రామకృష్ణా రెడ్డి

పుట్టుకతో వచ్చిన  బుద్ది... పుట్టుకతో వచ్చిన బుద్ది ..!! ------------------------------------- (డా.ప్రసాద్ గారి "కనపడుటలేదు" గల్పిక పై సమీక్ష) ****************************************** బి.రామకృష్ణా రెడ్డి* -------------------------- డాక్టర్ గారి గల్పిక లోని కథానాయకుడు సోమలింగం లాంటి మనస్తత్వం గల వ్యక్తులు  మన సమాజంలో కోకొల్లలు. ఇటువంటి నడవడిక వారి సహజ సిద్ధమో , లేక పరిస్థితుల ప్రభావంతో అలవడినవో  తెలియదు కానీ, మీరన్నట్లు వాటి ప్రభావము తన పైన గాని ,తన మీద ఆధారపడి జీవించే వ్యక్తుల పైన గాని, ఏదో ఒక సందర్భంలో  దుష్ప్రభావాన్ని కలగజేసే అవకాశం లేకపోలేదు.       "పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు ! "అనే నానుడి సరైనది కాదేమో..అని అనిపిస్తుంది. కారణం ఏ వ్యక్తి తల్లిగర్భమునుండి బయటపడినప్పుడు పూర్వజ్ఞానం లేకుండానే ఈ భూమి మీద పడతాడు. తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యు ప్రభావము రోజులు గడిచేకొద్దీ  బహిర్గతమవుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.       "బుర్ర కో బుద్ధి ..జిహ్వకో రుచి " .. అనే రీతిలో  ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన  అలవాటు ఉంటుంది. దానినే మనం ఆంగ్ల భాషలో      "మ్యానరిజం "అంటూ ఉంటాం. ఈ మేనరిజం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. కారణం ఇది ఒక దురలవాటు అని కూడా అనలేము. అటువంటి ప్రవర్తన వారిలో అసంకల్పితంగా బయటపడుతూ ఉంటుంది. గమనిస్తే అందరిలోనూ ఆ విశేష గుణం కనిపిస్తూ ఉంటుంది .కొన్ని సందర్భాలలో ఎదుటి వారికి ఇబ్బందికరంగా నూ ఉండవచ్చు, లేదా సరదాగా మాట్లాడుకోవడానికి ఉపయోగపడే రీతిలోనూ ఉండవచ్చు. వయసు పెరిగేకొద్దీ కొన్ని అలవాట్లు వాటంతటవే అంతరించిపోతాయి. ఇబ్బందికరమైన జాబితాలోనివి  ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరికొన్ని జీవితాంతం వెంట వస్తూనే ఉంటాయి.    ఈ మధ్యకాలంలో నాకు తారసపడ్డ వ్యక్తిలో నేను గమనించిన ఒక వింత అలవాటును మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.    మార్చి 25 తారీకు నాడు నేను , నా శ్రీమతి సికింద్రాబాద్ స్టేషన్ నుండి రాత్రి పదకొండు గంటలకి నెల్లూరు స్టేషన్ కి సింహపురి ట్రైన్ లో బయలుదేరాము. ముందుగా రిజర్వు చేసుకోవటం వలన మాకు ఏసీ టు టైర్ లో 2 క్రింది బెర్త్లుఅలాట్ అయ్యాయి .మాకు ప్రక్కగా సైడ్ బెర్త్ లో ఇద్దరూ వయో వృద్ధులు కూర్చుని ఉన్నారు. వారిద్దరూ తండ్రి = కొడుకు అని, తండ్రికి  86సంవత్సరములు ,కొడుక్కి 62 సంవత్సరాలు అని ,వారు కూడా నెల్లూరు వరకు ప్రయాణం చేస్తున్నారని ,మరుసటి రోజు ఉదయం మాటల సందర్భంలో తెలియవచ్చింది . కొడుకు కన్నా తండ్రి చాలా ఆరోగ్యం గా కనిపిస్తున్నారు.   అసలు విషయంలోకి వెళితే  ...సికింద్రాబాద్ స్టేషన్ లో బండి బయలుదేరడానికి ముందే తండ్రి సైడ్ అప్పర్ బెర్త్ పైన సర్దుకొని ఏదో చదువుతూ కూర్చున్నారు .సైడ్ లోయర్ బెర్త్ పైన కొడుకు కిటికీ అద్దములో నుండి బయట పరిసరాలను గమనిస్తూ కూర్చున్నారు. ట్రైన్ ఇంకా బయలుదేర లేదు .మేము కూడా మా స్థానాలలో సర్దుకొని లైట్లు ఆర్పకుండా అలాగే కూర్చున్నాము. బండి బయలుదేరిన వెంటనే మాకు సైడ్ బెర్త్ లో ఉన్న వ్యక్తి వెంటనే "సార్ లైట్లు ఆఫ్ చేయండి "అని అన్నాడు. నేను వెంటనే "ఏం సార్ పడుకుంటారా! అని అడిగాను. దానికి సమాధానంగా "లైట్లు ఉంటే బయట సరిగా కనిపించడం లేదు" అని అన్నాడు .నాకు సరిగా అర్థం కాక ఎలాగూ పొద్దు పోయింది కదా ! మేము కూడా పడుకుందామని లైట్ ఆఫ్ చేశాను. వెంటనే నిద్ర పట్టక ,నేను మా ఆవిడ మెల్లగా మాట్లాడుతూ పడుకున్నాము. ఆ చీకట్లో నేను గమనించిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి అలాగే కిటికీ అద్దం లో నుండి బయటకు చూస్తూ "మౌలాలి స్టేషన్ వచ్చింది !,చర్లపల్లి స్టేషన్ వచ్చింది !"అంటూ లేచి నిలబడి పైన కూర్చున్న తండ్రితో ఆనందంగా చెప్పడం గమనించాను. ఆ తండ్రి కూడా  సరే !సరే!... ఇక పడుకో! అని చెప్పడం ,తిరిగి ఆయన అలాగే చూస్తూ ఉండటం గమనించాను. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత నేను కాలకృత్యాలకని లేచేసరికి కూడా ఆ మనిషి అలాగే కూర్చుని కిటికీలోనుంచి బయట చూస్తూనే ఉన్నాడు. తండ్రి హాయిగా నిద్రపోతున్నాడు .తను ఎప్పుడు పడుకున్నాడో తెలియదు కానీ, ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒంగోలు స్టేషన్ లో కాఫీ బాయ్ రాకతో మెలుకువ వచ్చి లేచేసరికి ఆ వ్యక్తి తండ్రితో పాటు క్రింది బెర్తులో కూర్చొని ఆయా స్టేషన్ల గురించి , ఆ వూరి పరిసరాల గురించి తండ్రితో ముచ్చటించడం గమనించాను. మేము నెల్లూరు చేరేవరకు ఇదే తీరు.    వారి గురించి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోవాలనే ఉత్సాహంతో వారితో మాటలు కలిపి వారి విశేషాలను రాబట్టాను.వారిద్దరు కూడా ఉన్నత పదవులలో ప్రభుత్వ సంస్థలో పనిచేసి పదవీ  విరమణ చేసిన వారేనని , నెల్లూరు వాసు లేనని తెలిసింది. చివరికి  వారితో నేను "రాత్రి మీరు అలాగే కూర్చొని ఉన్నారు! మీకు బెర్త్ కన్ఫార్మ్ అవ్వలేదా"   అని అడిగితే తండ్రి "చిన్నప్పటి నుండి వాడికి కిటికీ పక్కనే కూర్చొని ప్రయాణించటం, రన్నింగ్ ట్రైన్ లో నుండి పరిసరాలు దూరంగా కదలి పోయినట్టు కనిపించే దృశ్యం ఎంతో ఇష్టమని, సైడ్ సీట్ గురించి లౌవర్ క్లాస్ లో అయినా ప్రయాణం చేయడానికి ఇష్టపడతాడని, ఇక  వీడు మారడు" అని తండ్రి చెప్పిన సమాధానంతో నివ్వెర పోయాను. "ఎవడి పిచ్చి వాడికి ఆనందం "అని కొడుకు విషయంలో సరిపెట్టుకున్నా ...ఆ వయసులో కూడా అటువంటి  వింత బాల్య మనస్తత్వంతో ప్రవర్తించే తనయుని  పట్ల వయసులో ఎంతో పెద్దవాడైన తండ్రి చూపిస్తున్న వాత్సల్యము, సహనము, ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరించాలి  .          ఇటువంటి గుణగణాలు అలవరచుకున్న తండ్రి కావునే ఆ వయసులో కూడా ఆయన అంత ఆరోగ్యంగా ఉండగలున్నారేమే!.. 💐💐💐     ***