శ్రీమతి నాగజ్యోతి శేఖర్ కవిత్వం--ఒక పరిశీలన - పి.సుబ్బరాజు

శ్రీమతి నాగజ్యోతి శేఖర్ కవిత్వం--ఒక పరిశీలన

శ్రీమతి దొండపాటి నాగజ్యోతి శేఖర్ కవితా సంపుటి "రెప్పవాల్చని స్వప్నం" లో 49 కవితలను నేటి సమాజంలో పలు అంశాలను స్పృశిస్తూ చదువరులలో ఆలోచనలు రేకెత్తించే విధంగా ఎంతో నేర్పుగా కూర్చారు. తన 'అంతరంగ తరంగం' లో తన నేపధ్యాన్ని వివరించడం ద్వారా వారి ఉద్దేశ్యాన్ని స్పష్ట పరిచారు. ఒక విధంగా తన కష్టాలే తన ఎదుగుదల కు మెట్లు అనే వాస్తవాన్ని చెప్పకనే చెప్పారు. "The happiest women like the happiest nations ,have no history". మంచి చదువరి మాత్రమే మంచి సాహితీ సేవ చేయగలుగుతారని మరొకసారి నిరూపించారు. తనను పైకి తెచ్చిన నిచ్చెన మెట్లను పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా ఆమెలోని సంస్కారం ,అణుకువ స్పష్ట మౌతాయి.

మిత్రులు కీ.శే. శ్రీ అదృష్ట దీపక్ నుడివినట్లుగా 'రెప్ప వాల్చని స్వప్నం' నిజంగా పరిణత కవిత్వం. డా.కె.ఎల్వీ.ప్రసాద్ గారు ఎంతో సహృదయంతో "ఆమె కవిత్వమే జ్యోతిని నాకు పరిచయం చేసింది" అని చెప్పిన మాటలు నిస్సందేహంగా ఆమెకు తగినవి. లత వంటి తాను ఎగబ్రాకడానికి ఆసరాగా నిలిచిన వారందరికీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలియచేస్తూనే సమాజంలో తన ఎదుగుదలను ఆటంకపరిచిన అంశాల పట్ల ద్వేషాన్ని లేశమాత్రంగానైనా కనబరచకపోవడం ఆమె పరిణత వ్యక్తిత్వానికి తార్కాణం. రెప్పవాల్చని స్వప్నం లో ప్రతి కవితా ఒక అద్భుత నిర్మాణమే. ఆమె వాక్యాలు ఎంతో ప్రసవ వేదన అనంతరం జనించినవే. ఒకొక్క కవిత గూర్చి పేజీలకు పేజీలు రాయవచ్చు.

'తల్లి వేరు' కవితలో అమ్మ త్యాగాన్ని, అమ్మ వృద్ధాప్యంలో బిడ్డలు అమ్మకు అమ్మగా మారి సాచుకోవాలని నొక్కి చెప్పడం ద్వారా రెంటాల వెంకటేశ్వరరావు గారి అద్భుత గజల్ "జీవిస్తే పసిపిల్లలుగా జీవించాలంతే" గుర్తు చేస్తారు. పుస్తెలతాడు' అమ్మతనాన్ని ప్రదర్శించిన తీరు, సమాజాన్ని ప్రశ్నించిన వైనం, 'నేనో అనామికను' లో అబల ఎదుర్కొంటున్న దౌర్జన్యాన్ని బలంగా అక్షరీకరిస్తారు. 'ఆమె చేతి నక్షత్రం' అమ్మ దేశభక్తిని కర్తవ్య దీక్షని, సైనికుని హృదయాన్నీ ఆవిష్కరిస్తారు. స్ఫూర్తి నింపుతారు.

'అనివార్యం' లో సమానహక్కుల గూర్చి ధైర్యంగా ప్రశ్నిస్తారు. 'పునాది రాళ్లు' లో అనాది చీకటి పారద్రోలే చిరుదీపపు వెలుగుని గూర్చి ప్రస్తావిస్తారు. ఆత్మవిశ్వాస శక్తిని ప్రస్ఫుటం చేస్తారు. 'నిశిదోచిన స్వప్నాలు', 'పిలిచిన వెంటనే రావు' దేనికదే ప్రస్తావించదగిన కవితా వస్తువులు. చేతులతో పాటు చేతల్ని శుభ్రపర్చుకోవాల్సిన కరోనా కాలపు 'అరుదైన సమయాన్ని ' మన ముందుకు తెస్తారు. 'స్మృతి చిహ్నం' కవిత గోదావరీ ప్రాంత నివాసులు అందరినీ కలచివేసే ఒక దురదృష్ట సంఘటనకు గుర్తు. పాఠశాలకు పడవ పై వెళుతూ తమ నూరేళ్ళ జీవితాన్ని ప్రమాదంలో పోగొట్టుకున్న చిన్నారుల స్మృతి చిహ్నం అందరి హృదయాలనీ ద్రవింప చేస్తుంది.

ప్రతి అడలేసేంట్ చదివి తీరాల్సిన కవిత 'పుట్టినిల్లు'. టీనేజీ ఆడపిల్లలకు పాఠ్యఅంశం కాదగ్గ అన్ని అర్హతలూ ఈ కవితకు ఉన్నాయి. సంపుటి పొడవునా అనేక వినూత్న పదబంధాలు స్నేహపూర్వకంగా పలుకరిస్తాయి. 'విఫల కలం', 'వెలుతురు పద్యం', 'పట్టుదలచీర', 'చినుకుమాట' , 'తడి(మే)వాక్యాలు' వంటివి మచ్చుకు కొన్ని మాత్రమే. 'సినీవాలి' వంటి సంస్కృత అపరిచితాలు చాలా అరుదుగా కనబడతాయి. మొత్తంగా 'రెప్పవాల్చని స్వప్నం' రెప్పవాల్చనీయని ఒక అద్భుత దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేస్తుదనడంలో కించిత్ సందేహం లేదు.

మహిళాచైతన్యం, సాధికారత, విద్య, కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం, అనుబంధలూ అన్నిటికీ అద్భుత చిరునామా 'రెప్పవాల్చని స్వప్నం'

--పి. సుబ్బరాజు

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు