బుద్ధుడు మళ్ళీ నవ్వాడు - భారతుల శ్రీవాణి

బుద్ధుడు మళ్ళీ నవ్వాడు

పోఖ్రాన్ - II అణుపరీక్షలు

(మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవ సందర్భంగా)

అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు 1998 సంవత్సరంలో పోఖ్రాన్ వద్ద అణుపరీక్షలు జరపాలని అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి ‘ఆపరేషన్ శక్తి’ అని నామకరణం చేశారు. అబ్దుల్ కలాం, ఆర్. చిదంబరం వంటి ప్రముఖులకు ఈ పనిని అప్పగించారు. తమ భుజస్కందాలపై ఉంచిన ఈ కార్యక్రమాన్ని వారు అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించారు. మే 11వ తేదీ న మూడు అణుబాంబులను పరీక్షించారు. మే 13 న మరో రెండు అణుపరీక్షలు చేపట్టారు. వారు ఈ పరీక్షలు అన్నీ విజయవంతం అయ్యాయని ప్రధానమంత్రికి ‘బుద్ధుడు మళ్ళీ నవ్వాడు’ అనే సందేశాన్ని పంపారు. మే 13 సాయంత్రం వాజ్ పేయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి భారతదేశం విజయవంతంగా అణుపరీక్షలను నిర్వహించిందని, ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన మే 11వ తేదీ న ‘నేషనల్ టెక్నాలజీ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొఖ్రాన్ అణుపరీక్షల గురించి కొంత వివరంగా తెలుసుకుందాం.

అణ్వాయుధం అంటే :

పదార్థాలలో అతి సూక్ష్మమైన కణాలు ఉంటాయి. వీటినే అణువులు అంటారు. ఇవి పరమాణువులతో నిర్మింపబడతాయి. అణువులను విచ్చిత్తి లేదా సంలీనం చేయడంతో శక్తి ఉద్భవిస్తుంది. ప్రేలుడు స్వభావం కలిగిన యురేనియం వంటి రేడియో ధార్మిక పదార్థాల అణువుల కేంద్రాన్ని బద్దలు కొట్టడం ద్వారా కానీ, రెండు అణువులను ఒక దానితో మరొకటి తాడనం చేయడం ద్వారా అధిక శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ శక్తిని క్రమబద్దీకరించితే అణువిద్యుత్ తయారు చేసికోవచ్చు. అదే శక్తిని ఉపయోగించి బాంబుగా తయారుచేసి శత్రుదేశాలపై ప్రయోగించడానికి ఉపయోగిస్తే దానిని ‘అణ్వాయుధం’ అంటారు.

అణుబాంబుల మొదటి వినియోగం:

అమెరికా దేశం ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా ‘మన్ హట్టన్ ప్రాజెక్ట్’ లో భాగంగా ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త సహకారంతో మూడు ఆటం బాంబులను తయారు చేయించింది. దానిని పరిశీలించేందుకు న్యూమెక్సికో లోని ఎడారి ప్రాంతంలోని అలమొగార్డో లో ప్రయోగించింది. అది విజయవంతం కావడంతో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించింది. అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. యుద్ధ వైఫల్యానికి ఇటలీ నియంత ముస్సోలినీయే కారణమని వారి సైనికులే కాల్చి చంపారు. ఇక అక్ష రాజ్య కూటమిలో లొంగని ఏకైక దేశం జపాన్. పెరల్ హార్బర్ పై దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది అమెరికా. 1946 ఆగస్ట్ 6 న జపాన్ లోని హిరోషిమా పట్టణంపై మొదటి అణుబాంబు ‘లిటిల్ బాయ్’ ని ప్రయోగించింది. దీని సామర్థ్యం 15 వేల TNT లు(Tri Nitro Toluene). మూడురోజుల అనంతరం ఆగస్ట్ 9 తేదీన నాగసాకి నగరంపై రెండవ అణుబాంబు ‘ఫాట్ మాన్’ ని ప్రయోగించింది. దీని సామర్థ్యం 22 వేల TNT లు. అత్యంత శక్తివంతమైన ఈ జనహరణ మారణాయుధాల (Mass Destructive Weapons)ధాటికి లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. జపాన్ లొంగి పోయింది. ఈ దుష్కార్య ఫలితంగా, నేటికీ కొంతమంది బాధలను అనుభవిస్తున్నారు.

భారతదేశం ఎందుకు అణుపరీక్షలను జరప వలసి వచ్చింది ?

రష్యా, ఇంగ్లాడ్, ఫ్రాన్స్ దేశాలు అణుపరీక్షలు నిర్వహించారు. 1964లో చైనా కూడా అణుపరీక్షలు నిర్వహించింది. దీనితో భారత దేశంలో గుబులు పుట్టింది. ఎందుకంటే 1962 లో చైనాతో జరిగిన యుద్దంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సరిహద్దు భద్రతపై ఉదాసీన వైఖరి ప్రవర్తించినందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అప్పటి రక్షణశాఖా మంత్రి కృష్ణమీనన్ నైతిక బాద్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. అప్పటి చైనా అధ్యక్షుడైన మావో, ‘హింది-చీని భాయి భాయి’ అని నెహ్రూతో అంటూనే మరో పక్క వెన్నుపోటు పొడిచాడు. భారతదేశం ఆక్సాయ్ చిన్ లో చాలా ప్రాంతాన్ని కోల్పోవలసి వచ్చింది. మన వద్ద ఆధునిక రక్షణాయుధాలు లేవని ప్రపంచానికి తెలిసింది. ఇదే అదనుగా తీసుకొని పాకిస్తాన్ మరోమారు యుధ్ధానికి కాలుదువ్వింది. అయితే ఇందిరాగాంధీ నేతృత్వంలో భారత సైన్యాలు పోరాట పటిమ చూపి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు. తదనంతరం పాకిస్తాన్ చైనాకు దగ్గరయ్యింది. ఇటువంటి పరిస్థితులలో భారతదేశ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ‘భారత అణుశాస్త్ర పితామహుడి’గా పేరొందిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారి నాయకత్వంలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ మరియు అటామిక్ ఎనర్జీ కమీషన్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసి కొంత పరిశోధన మొదలుపెట్టారు. కానీ నెహ్రూ గారు శాంతి కాముకుడు కావడంతో అణుశక్తిని కేవలం శాంతియుత ప్రయోజనాలకోసం మాత్రమే ప్రయోగాలు చేపట్టమని చెప్పారు. అణ్వాయుధాల జోలికి వెళ్ళలేదు.

పొఖ్రాన్ లో మొదటి అణుపరీక్షలు :

ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత అణుపరీక్షలకు అనుమతి తెలిపారు. దీనికి థార్ ఎడారిని అనుకూలమైన ప్రాంతంగా ఎన్నుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మీర్ జిల్లాలోని పొఖ్రాన్ ను గుర్తించారు. పొఖ్రాన్ అంటే స్థానిక బాషలో ఐదు ఎండమావులు (The place of five mirages) అని అర్థం. ఇది సైనిక నియంత్రణలో ఉన్న ప్రాంతం. 1974 మే 18వ తేదీన బుద్ధ జయంతి రోజున ‘స్మైలింగ్ బుద్ధా’ అనే పేరుతో ఉదయం 8.05 గంటలకు మొదటి అణుపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో ఇందిరాగాంధీ గారికి ‘బుద్ధుడు నవ్వాడు’ (Budda has smiled) అనే సందేశాన్ని పంపారు. దీనిని పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ గా అభివర్ణించింది. అమెరికా సహాయాన్ని నిలిపివేసింది. అమెరికా ఒత్తిడి వల్ల న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(NSG) లోని సభ్య దేశాలైన కెనడా, రష్యా దేశాలు భారత్ కు అణుపరిజ్ఞానాన్ని ఇవ్వడం ఆపి వేశాయి. భారతదేశాన్ని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(NPT- Non Proliferation Treaty), సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం(CTBT-Comprehensive Test Ban Treaty) పై సంతకం చేయాలని ఒత్తిడి చేశాయి. వీటి ప్రకారం 1968 కన్నా ముందు అణుసామర్థ్యం కలిగిన దేశాలైన అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా దేశాలు కాకుండా ఇక ఏదేశమూ అణుపరీక్షలు చేయటం కానీ, అణ్వాయుధాలను తయారు చేయడం కానీ చేయరాదు. కానీ ఇది నచ్చక వీటిపై భారతదేశం సంతకం చేయలేదు.

పొఖ్రాన్ లో రెండవ సారి అణుపరీక్షలు జరపవలసిన ఆవశ్యకత :

మొదటి పొఖ్రాన్ పరీక్ష కేవలం మనం అణుపరీక్షలు నిర్వహించే సత్తా భారతదేశానికి ఉంది అని చెప్పడానికే చేపట్టారు. కానీ అణుబాంబు తయారు చేసి దానిని పరీక్షించాల్సి ఉంది. హైడ్రోజన్ బాంబ్ ను పరిశీలించాల్సి ఉంది. యుద్ధ సమయాల్లో వీటిని వార్ హెడ్స్ గా పెట్టి ప్రయోగించాల్సిన అవసరం ఉంది. పి.వి.నరసింహారావు గారు ఈ పరీక్షలను నిర్వహించాలనుకున్నారు. కానీ అమెరికా పొఖ్రాన్ పైనే ప్రత్యేకంగా శాటిలైట్ నిఘా ఉంచడం వల్ల వీలుకాలేదు. అంతేకాకుండా అమెరికా నిఘా వ్యవస్థ (CIA-Central Intelligence Agency) ప్రత్యేకంగా దీనికి కొంతమంది ప్రతినిధులను పెట్టింది. ఇన్ని ఆటంకాలు ఉన్నా అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు ధైర్యంగా అణుపరీక్షలకు పచ్చ జెండా ఊపారు.

అమెరికా నిఘా వ్యవస్థకు తెలియకుండా అణుపరీక్షలు నిర్వహించిన తీరు :

పొఖ్రాన్ పై ఉంచిన శాటిలైట్ లోని కెమరాలు ఎంతటి శక్తి వంతమైనవంటే అవి నిలబడి ఉన్న వ్యక్తి పట్టుకున్న వస్తువు ఏమిటో కూడా కనిపెట్టగలవు. పొఖ్రాన్ లో అంతా ఇసుకే ఉంటుంది. చెట్లు కూడా ఉండవు. ఇందులో ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం, DRDO నుంచి R.చిదంబరం, BARC నుంచి సంతానం, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి అనీల్ కకోద్కర్, లెఫ్టి నెంట్ కల్నల్ ఇంద్రవర్మ మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. వీరు సైనిక దుస్తులు వేసుకొనే వారు. అమెరికాను మభ్య పెట్టడానికి క్రికెట్ గ్రౌండ్ తయారు చేసి సైనికులతో పాటు క్రికెట్ ఆడేవారు. రాత్రి పూట కందకాలను త్రవ్వి ఉదయానికల్లా కేబుల్స్ పెట్టి ఇసుక కప్పే వారు. అందరూ ఒకే సారి కాకుండా ఒకరు ఇద్దరూ వచ్చేవారు. వారి పేర్లకు బదులుగా మారు పేర్లు పెట్టుకునే వారు. వాటిని కూడా తరచుగా మార్చుకొనేవారు. ఉదాహరణకు అబ్దుల్ కలాం గారి పేరు మేజర్ జనరల్ పృధ్వీరాజ్, R.చిదంబరం గారి పేరు మేజర్ జనరల్ నటరాజ్ అనే మారు పేర్లతో పిలిచేవారు. బాంబులను BARC లో తయారు చేయించి జైసల్మీర్ ఆర్మీబేస్ కు విమానంలో తరలించి అక్కడి నుంచీ కేవలం నాలుగు ట్రక్కులలో కల్నల్ ఉమామ్ కపూర్ నాయకత్వంలో పొఖ్రాన్ కు తరలించారు. ఎవ్వరికి అనుమానం రాకుండా హైడ్రోజన్ బాంబ్ కోసం తవ్విన కందకానికి ‘వైట్ హౌస్’ అని, అలానే మిగతా అణు బాంబుల కందకాలకు ‘విస్కీ, తాజ్ మహల్, కుంభ కర్ణ’ అనే మారు పేర్లు పెట్టారు. మొత్తం ఆరు కందకాలు త్రవ్వారు కాని ఐదింటినే ఉపయోగించారు. సైంటిస్టులను ‘సియర్రా’ అని పిలిచేవారు. ఢిల్లీ నుంచి ఏ పని ఎంతవరకూ వచ్చిందని అడగాలనుకుంటే ‘ఈజ్ సియెర్రా సర్వింగ్ విస్కీ ఇన్ ది వైట్ హౌస్’ అనే వారు. అంటే “సైంటిస్టులు హైడ్రోజన్ బాంబ్ పెట్టే కందకంలో పని మొదలు పెట్టారా?’ అని అర్థం. ఒకవేళ అమెరికా గూడచారులు విన్నా వారికి విషయం ఏమాత్రం అర్థం కాకూడదని అలా మాట్లాడేవారు. ఫోన్ లో ఒకరితో మరొకరు మాట్లాడేటప్పుడు కలాం గారిని ‘చార్లీ’, లెఫ్టినెంట్ జనరల్ ఇంద్ర వర్మ గారిని ‘మైక్’, BARC టీంను ‘బ్రావో’ అనే మారు పేర్లతో పిలుచుకోనేవారు. ఒక సారి ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. “హ్యాస్ చార్లీ గాన్ ఇంటూ ద జూ అండ్ బ్రావో సేయింగ్ ప్రేయర్స్ అండ్ మైక్ ఈజ్ ఆన్” (Has Charlee gone into the Zoo and Brevo saying prayers and mike is on) అంటే “కలాం గారు కంట్రోల్ రూమ్ కు వెళ్ళారా ? బార్క్ టీం అణుపరీక్ష చేసే చోటికి వెళ్ళిందా ? నేను ఇంద్రవర్మను మాట్లాడుతున్నాను” అని సారాంశం. తవ్విన కందకాలను మళ్ళీ ఇసుకతో మూసివేసే వారు. ఎంత జాగ్రత్తగా అంటే గాలి ఏ పక్కకు వీచి మేట వేస్తుందో అంత సహజంగా చేశారు. ఆఖరికి టైర్ల గుర్తులు కూడా లేకుండా చేశారు. 1998 మే 11 మధ్యాహ్నం 3.43 గంటలకు అణుపరీక్షలు నిర్వహించారు. వీటి తీవ్రత ఎంత ఉందంటే పొఖ్రాన్ కు 200 కిలో మీటర్ల దూరంలోని ఇల్లు కూడా ఊగాయట. అక్కడి వారు అందరూ భూకంపం వచ్చిందేమోనని భ్రమపడ్డారు.

విజయవంతమైన అణుపరీక్షలు :

మొదట ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు సామర్థ్యం 45వేల TNT లు. తరువాతది ప్లుటోనియం బాంబు. దీని సామర్థ్యం 15 వేల TNTలు. ఇవేకాకుండా మరికొన్ని సామర్థ్యం తక్కువ గలవి, వాహనాలపై ఉంచేవి కూడా ప్రయోగించారు. ప్రయోగానంతరం ‘బుద్దుడు మళ్ళీ నవ్వాడు’(Buddha has smiled again) అనే సందేశం వాజ్ పేయి గారికి పంపారు. ఈ విషయాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేయడంతో అమెరికా తదితర దేశాలు ఆశ్చర్యానికి గురయ్యారు.

‘మొదట ప్రయోగించం’ (No first use) అనే స్వీయ నియంత్రణ పెట్టుకొని ఒకవేళ ఎవరైనా తమపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే ప్రతిదాడి చేయడానికే, ప్రతిబంధక ఆయుధాలుగా మాత్రమే వీటిని ఉపయోగిస్తామని భారతదేశం ప్రపంచానికి తెలిపింది. మే 11 వ తేదీనే హంస-3 అనే ఎయిర్ క్రాఫ్ట్ ను, త్రిశూల్ అనే క్షిపణిని ప్రయోగించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రతిభ కనబరచినవారికి టెక్నాలజీ డిపార్టుమెంటు బోర్డ్ వారు ప్రతి సంవత్సరం మే 11 న అవార్డులు ఇస్తారు.

రాబోయే రోజుల్లో భారతదేశం విద్య, వైద్య రంగాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే, కోవిడ్-19 లాంటి క్లిష్టమైన పరిస్థితులు మరెన్ని సంభవించినా వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోగలం.

జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్