మేడిపండు పుస్తక సమీక్ష - రాము కోలా.దెందుకూరు.ఖమ్మం.9849001201

మేడిపండు పుస్తక సమీక్ష //పుస్తక సమిక్ష// "మేడిపండు" మనిషిని మనిషిలా చూపిన రచన ఓట్లు ఆడుక్కుంటూ వీధి వీధి తిరిగినోడు,నేడు కోట్ల ధనం దండుకుంటుండు. ఓటు వేసిన సామాన్యుడు,తన నుదుట రాతను నిందించుకుంటూ వెట్టిచాకిరీ చేస్తూ మగ్గిపోతుంటుండు.. దీనికి కారణమేమిటి?దీనికి బాధ్యులెవ్వరూ?. ఆర్థిక అసమానతలను చూస్తూ,చెమర్చిన కన్నులు తూడ్చుకుంటూ... రేపటి వెలుగులు కోసం నిరీక్షిస్తూ... కాలం గడుపుదామా? అనే ప్రశ్న ప్రతి పాఠకుని ఎదను సూటిగా,తాకేలా రచనలను సంధించిన" కథల సంకలనం మేడిపండు". "ఎదను తడిమేస్తున్న కథనాలు" శ్రమజీవుల ధీనగాథలు మేడిపండు కథల సంకలనం.. సమాజంలోని వాస్తవిక సంఘటనలను కథలుగా మలచి,అందించగల బహునేర్పరి అన్న రాచమళ్ళ ఉపేందర్ గారు. అనేక సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో ఉత్తమ కథలు విభాగంలో ఎన్నో పురస్కారాలను అందుకుంటూ,"అక్షరాల తోవ" అనే సాహిత్య వేదిక సమన్వయకర్త గా బాధ్యతలు నిర్వహిస్తూనే, వర్ధమాన కవులను ప్రోత్సాహిస్తూ,తనలోని భావాలను నలుగురితో పంచుకునే ,కవి ,కథా రచయిత, వ్యాసకర్త. ఇలా అనేకానేక రంగాల్లోనూ,రాణిస్తున్న రాచమళ్ళ ఉపేందర్,గారి మస్తిష్క మధనం నుండి పురుడు పోసుకున్న కథల సంకలనం "మేడిపండు." మేడిపండులా కనిపించే సమాజంలో అంతరంగా . దాగిన అనేక సమస్యలను తనదైన శైలిలో,కవి కోణంతో చాలా దగ్గరిగా , నిశితంగా పరిశీలిస్తూ,అక్షరీకరించి, సగటు సామాన్యుని జీవన విధానం,కన్నులకు కట్టినట్లుగా వివరిస్తూ మనకు అందించిన కథల అక్షయ పాత్ర ఈ "మేడిపండు కథల "సంకలనం. ఒక కథ చదివిన తరువాత ,ఆ కథలోని పాత్రలు మనతో కొన్ని రోజులు ప్రయాణించాలి, అటువంటి కథలను పాత్రలను సృష్టించి,సమాజంలోని వాస్తవ సంఘటనలో వాటిని ప్రతిష్టించిన కథల మణిహారమే మేడిపండు . కథ యొక్క లక్షణాలు మనం పరిశీలించినట్లయితే,కథకు ప్రారంభం ఎంత ముఖ్యమో ముగింపుకు అంతకంటే ప్రాముఖ్యత ఉంటుంది రెండింటినీ సమన్వయ పరిచే మధ్యస్థం పాఠకుల్ని కథనం వైపుకు పరుగులు పెట్టించాలి. ఊహకందని ముగింపుతో,కథ ముగింపు కోరుకుంటాడు పాఠకుడు. ఈ విషయంను దృష్ఠిలో పెట్టుకొని సంకలనంలో చాలా వైవిద్యమైన,ఇతివృత్తాలను ఎన్నుకుని కథా రచయిత గా తనని తాను నిరూపించుకున్నారు. ఇక్కడ మనం వేమన పద్యం గుర్తు చేసుకుందాం. మేడిపండు చూడ మేలిమైయుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు... ఈ వేమన పద్యం మీకు తెలిసిందే. కానీ ఈ మేడిపండు సంకలనం మొదటి పేజీ నుండి చివరి పేజీవరకు మధ్యతరగతికి చెందిన మనిషి జీవన విధానం,తను ఎదుర్కొంటున్న సమస్యలు,వాటిని పరిష్కరించడానికి సహకరించే కుటుంబ బంధాలు...ఇలా చెప్పుకోవడానికి ఎన్నో.. మనకు కనిపిస్తూ పలకరిస్తుంటాయ్. కన్నీటి ప్రవాహం కథ చదువుతుంటే నాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి "అర్దశతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రమందామా,!దానికి స్వర్ణోత్సవాలు చేద్దామా"అనే పాట గుర్తుకు వస్తుంది. ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వేసినా ! మారని పేదవాని జీవన విధానం చూస్తుంటే ,మనం సాధించిన ప్రగతి ఎక్కడ అనే ప్రశ్న ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంది. వేదికపై రాజకీయ నాయకులు చెప్పే మాటే మనం అభివృద్ధి పదంలో దూసుకు పోతున్నాం అని. కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం అభివృద్ధి సాధించాము అని చెప్పుకునే ధైర్యం కానీ తెగువ కానీ నిజాయితీ కానీ మనలో ఉందా?. అలా ఉంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో రవాణా వైద్య విద్యా సౌకర్యాలు లేకుండా బ్రతుకుతున్న అనేక జీవితాలకు వెలుగు ఎందుకు అందడం లేదు అని ప్రశ్నిస్తే , మనం సమాధానం తడుముకోవలసిన పరిస్థితి నెలకొంది నేడు. కన్నీటి ప్రవాహం ఒక వాస్తవిక సంఘటనే . ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన సోషల్ మీడియాలో ,టీ వీ డిబెట్ లో వినిపిస్తూనే ఉంటాయి. ఒకటి రెండు రోజులు చర్చ జరుగుతూనే ఉంటుంది. తర్వాత వాస్తవ సంఘటనలు కాలగర్భంలో కలిసిపోతుంటాయి . కానీ సంఘటనకు మూలమైన ప్రాంతంలోని ప్రజల జీవన విధానంలో మాత్రం ఏటువంటి మార్పు రాదు. మార్పు రాకపోవడానికి కారణం ఎవ్వరు?. అందులో నా పాత్ర ఎంత? మార్పు తీసుకు రాలేకపోతున్న నేటి వ్యవస్థలోని యంత్రాంగం చేత పని చేయించుకోలేని మన నిస్సహాయతను కాదనగలమ?. ఇలా వెంటాడే ప్రశ్నలకు సమాధానం మనం తప్పక వెతకాలి అనిపిస్తుంది. "నాన్నా ...!మన ఇంటికెల్దామా?అనే కథ గురించి ఇక్కడ చర్చించక తప్పదు. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా. దాని ప్రభావంతో ఎన్ని లక్షల కుటుంబాలు బలైపోయాయో? ,ఎందరు నిర్బాగ్యులు ఆత్మహత్యలను చేసుకున్నారో,? ఎన్ని వేల మృతదేహాలకు కనీస దహన సంస్కారాలు నోచుకోలేదో,?నేటికీ లెక్కతేలలేదు. అంతటి విపత్కర పరిస్థితుల్లో జీవనాధారం కోసం వలస వెళ్ళిన కాన్షీరాం కుటుంబం ,సొంతగూటిని చెరలేక, పొరుగు రాష్ట్రాల్లో ఉండపోలేక, జీవన్మరణ పోరాటంలో తన కన్న కూతుర్ని కోల్పోయిన విధానం ప్రతి పాఠకుని హృదయాన్ని ద్రవింపచెసేలా సాగుతుంది. ముగింపును విషాదభరింగా ముగించినా.చివరగా సంధించిన ప్రశ్న .ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనేంతగా ఎదను తాకుతుంది. "పసి ప్రాణం తీసిందెవ్వరు...??? ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పకప్పదు... ఈ పాపంలో తమ పాత్ర లేదని చెప్పగల యోగ్యుడు ఎవ్వరు?....సమాధానం మనకే వదిలేసాడు రచయిత. కొన్ని రోజులు వరకు ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది..అదే కథ గొప్పతనం. మరో కథ "మేడిపండు" సంకలనం ఆయువుపట్టు ఈ కథనమే. సమాజంలో దోపిడి వర్గాన్ని కొమ్ముకాసే ప్రభుత్వ, పాలక వర్గాలు, వ్యవస్థను ఎలా బ్రస్ట్ పుట్టిస్తుంది తెలిపిన కథ. దొచేవాడు ఒకడు,దండన భరించే వాడు మరోకడు. సామాన్యుని చెంతకు చేరని చట్టాలు, ఉన్నవాడికి ఊడిగం చేస్తూ, సామాన్యుని నడ్డి విరిచేస్తున్నాయ్. నేటి పాలక వర్గానికి నిదర్శనం ఈ కథనం. సామాన్యునికి న్యాయం జరిగేది ఎన్నడో ?అనే ప్రశ్నకు బీజం ఈ కథ. ఉన్నత కుటుంబల ఇవ్వాలో జరిగే దారుణాలకు , జీవనాధారం కోసం కూలి పని చేసుకునే అమాయకులు ఎలా బలి అవుతారో వివరించిన కథనం. " శివంగి." వ్యవస్థలో మార్పు రాదు,మార్పు తీసుకువచ్చే ప్రయత్నం మనతోనే మొదలవ్వాలనే సందేశాన్ని, నిలుపుకున్న కథ . నిరక్షరాస్యతను అడ్డుపెట్టుకుని,ధనవంతులు , సామాన్యున్ని దోచుకోవాలని చూసే ఇతివృత్తంగా తీసుకుని వ్రాసిన అద్భుతమైన కథ శివంగి. భర్తను,కన్న కోడుకును కోల్పోయి, జీవనాధారం కోసం చిన్న హోటల్ పెట్టుకు జీవించే చుక్కమ్మ. తన స్థలాన్ని మోసంతో ఆక్రమించుకోవాలని చూసే భూస్వాములపై తిరుగుబాటు చేసి తన జీవనాధారం దక్కించుకున్న విధానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. వ్యవస్థలో మార్పు రాదు,మార్పు తీసుకువచ్చే ప్రయత్నం మనతోనే మొదలవ్వాలనే సందేశాన్ని,నింపుకున్న కథ శివంగి. చుక్కమ్మతో మొదలైన తిరుగుబాటు,మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా సాగుతుంది. . మరో అద్భుతమైన కథ "తోవ " మానవత్వ పరిమళాల పూదోట,ఈ "తోవ "కథ. కథ ప్రారంభం ,ఎదుటి వ్యక్తిపై అనుమానంతో ప్రారంభమై, ప్రతిక్షణం అనుమానంగా చూస్తూ సాగుతూ ఉంటుంది ఎప్పుడూ కనిపించిన వ్యక్తి కనిపించడంతో , అనుమానం మొదలౌతుంది. పగలు కనిపించడుడు.రాత్రిమాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు. అసలు రాత్రి వేళ అతనికి ఇక్కడేం పని. అనుమానం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిస్తుంది. అనుమానాలు తొలగి మానవత్వం వికశిస్తుంది. ఎదుటి వ్యక్తికి మనం ఏం చేయగలం అనే ఆలోచన మొదలై,ఒక కుంటుంబానికి ఆసరాగా నిలిచేలా చేసిన మానవ సంబంధాలను కరుణరసాత్మకంగా తీర్చి దిద్దిన కథ. ఇలా ఎన్నో అద్భుతమైన కథలను తనలో నిలుపుకున్న ,మేడిపండు. సామాన్యుని జీవన విధానానికి దర్పణం. సమాజాన్ని అధ్యయనం చేసిన కవి, సమాజంలో తన బాధ్యతను గుర్తించిన కవి. కష్టాలను చేయించుకుంటూ,ఎదుటి వారి కష్టాలను అర్దం చేసుకుంటూ,మానవతా విలువలు శోధించే కవి, కలం నుండి జాలువారిన శ్రమజీవుల జీవితం. అందరూ తప్పక చదివ వలసిన కథా సంకలనం "మేడిపండు." సంకలం కొరకు సంప్రదించండి. రాచమళ్ళ ఉపేందర్,ఖమ్మం. సెల్. 9849277968. రాము కోలా.ఖమ్మం✍️ సెల్.9849001201.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు