మతం మానవత్వం - అయ్యగారి శ్రీనివాస్

Matam Manavatwam

 “Our attitude toward life determines life’s attitude toward us.” సుమారు అయిదు దశాబ్దాల నాటి మాట ఇది, అప్పుడు  నాకు ఏడేళ్లు, ఎనిమిదేళ్లు ఉంటాయేమో. ప్రతి ఏడూ డిసెంబర్ 25 వచ్చేసరికి మా ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం మా ఊరు ప్రకాశనగర్ లో వున్న చర్చి కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ వయసు లో మాక్కూడా అది ఒక పండగ లా ఉండేది. ఇప్పటికీ క్రిస్మస్ వస్తే, అదే గుర్తుకొస్తుంది. అందర్లోనూ ఒక ప్యూరిటీ కనపడేది ఆ రోజుల్లో. నేను పెరిగిన పరిస్థితులో, ఏంటో తెలియదు గానీ చాలా సబ్ డ్యూడ్ గా ఉండేది మైండ్ ఆనాటి నుండి. తరువాత కాలం లో విభిన్న మతాలకు చెందినవారితో స్నేహ బాంధవ్యాలు కలిగే భాగ్యం వచ్చింది. ఎప్పుడూ ఒక మతం అనే పేరు చెప్పి హృదయం వేరే విధంగా స్పందించడం ఎప్పుడూ జరగలేదు. ఎన్నో మంచి అనుభవాలు వీరందరి తొ నాకు. చిన్నతనం లో అస్తమాను సుస్తీ చేస్తోందని, నన్ను మసీదు కి తీసుకెళ్లి తాయెత్తు కట్టించిన సంగతి చాలా జ్ఞాపకం. ఇది గతం. మూడేళ్ల క్రితం నేను తుముకూరు లో పనిచేస్తున్న రోజులు. ఎందుకో ఒకరోజు పనిమీద మైసూర్ వెళ్ళాం నా కార్ లో నేను నా బెటర్ హాఫ్ కలిసి. తిరిగి రిటర్న్ తుముకూరు బయలుదేరేసరికి రాత్రి పొద్దుపోయింది. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయం. దారిలో నిర్మానుష్యం, చిమ్మ చీకటి.ఒక  కుగ్రామం దగ్గర నా కారు టైర్ పంక్చర్ అయి  ఆగిపోయింది. దరిదాపుల్లో మనిషి జాడ లేదు. మా దగ్గర చూస్తే, మైసూర్ లో మా లాకర్ వెకేట్ చేసి వస్తున్నామో ఏమో, తన ఒంటినిండా, జ్యువలరీ తో వుంది. కారు కదలని స్థితి, అయినా దగ్గర్లో ఒక స్ట్రీట్ లైట్ దగ్గరికి బలవంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ లైట్ దగ్గరికి తీసుకెళ్లి ఆపాను. వీధిలో ఊర కుక్కలు మా కార్ ని చుట్టుముట్టి భౌ భౌ మంటూ అరుపులు. ఇద్దరికీ కొంచెం గుబులు గా వుంది, లోకల్ భాష కన్నడ రాదు ఎవరినైనా సహాయం అడుగుదామంటే. సరిగ్గా అప్పుడు ఎదురుగా వున్న ఇంట్లోంచి లైట్స్ వెలిగాయి. ముప్పై ఏళ్ళ వయసున్న ఒక యువకుడు మా దగ్గరకొచ్చి ఉర్దూ భాష లో అడిగాడు ఏమైంది అంటూ. కొంచెం భయపడుతూనే చెప్పాను టైర్ ఫ్లాట్ అయిన సంగతి. "స్టేఫ్నీ ఉందా" అని అడిగాడు. "స్టేఫ్నీ వుంది గానీ టైర్ మార్చడానికి కావాల్సిన రెంచ్ వగైరా లేవు "అని చెప్పాను. "వెయిట్ చేయండి ఇప్పుడే వస్తాను" అంటూ  ఇంట్లోకి వెళ్లి ఒక వృద్ధ మహిళని పరిచయం చేసాడు తన అమ్మ అంటూ. ఆవిడ మమ్మల్నిద్దర్నీ వాళ్ళింట్లోకి తీసుకెళ్లి వేడి టీ తయారు చేసి ఇంట్లో వున్న బిస్కుట్లు ఒక ప్లేట్ లో పెట్టి మా ముందు పెట్టింది "టీ తాగి రిలాక్స్ అవండి, ఈ లోగా మా అబ్బాయి మీ కార్ రిపేర్ చేస్తాడు "అంటూ. గోడ మీద దేముడి ఫోటో లు చూస్తే తెలిసింది వాళ్ళు ముస్లిమ్స్ అని. మేము ఆవిడ తొ కబుర్లు చెప్తూవుంటే, ఆ అబ్బాయి తన మోటార్ సైకిల్ తీసుకుని పక్క ఊళ్ళో ఉంటున్న ఫ్రెండ్ దగ్గరికివెళ్ళి టైర్ చేంజ్ చేయడానికి కావలసిన టూల్స్ తీసుకొచ్చాడు. తెల్లారి రెండు గంటలు అయింది కార్ కి స్టేఫ్నీ టైర్ వేసేసరికి. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు తీసుకున్నాం. ఇదొక మర్చిపోలేని సంఘటన. ఏంటీ మా ఇద్దరికీ సంబంధం. బంధువులం కాదు, స్నేహితులం అసలే కాదు. కనీసం ఎప్పుడూ మా ముఖాలు చూసెరుగడు. మళ్ళీ కలుస్తామనే ఛాన్స్ కూడా లేదు. మరి ఏ సంబంధం అతని చేత ఒక ముక్కు మొఖం తెలియని మాకు సహాయం చేయించింది. అదే, దానిపేరే "మానవత్వం ". దానికి కులం, మతం, రిచ్, పూర్ అనే తేడా కనపడదు. ఎందుకంటే, ఆ మానవత్వం ఉండేది మనిషి గుండెల్లో కనుక. ఈ మధ్య కాలం లో చాలా గ్రూపుల్లో ఒక కొత్త రకమైన విషాదం తలెత్తుతోంది. అదే పక్క మనిషి మీద విద్వేషం కలిగించేలా పనికిమాలిన మెసేజీ లు, వీడియో క్లిప్పింగ్స్. చదువు సంస్కారం లేని వాళ్ళం అయితే వేరే సంగతి. ఇన్నేళ్లు కలిసిమెలిసి ఉద్యోగాలు చేసి, రిటైర్ అయ్యాక ఒకరి కష్టానికి చేదోడు వాదోడు గా ఉంటుంది అనే ఉదాత్త ఉద్దేశ్యం తొ ఏర్పాటైన గ్రూపుల్లోనూ ఇదే పరిస్థితి. చాలా బాధగా ఉంటోంది నాకు. ఎన్నో పుస్తకాలు చదివేశాం గడిచిన అరవై ఏళ్ళ కాలం లో, ఎన్నో ఉపన్యాసాలు, ఉపదేశాలు విన్నాం, ఇంకా వింటున్నాం. అయినా ఎందుకింత కృత్రిమం గా, కిరాతకం గా ఆలోచనలు చేస్తున్నాం అనిపిస్తుంది. నిజంగా నా మనసు  మీతో షేర్ చేసుకుంటున్నాను మిత్రులారా.   బయట ఒక  చర్చిలో గంట మోగుతోంది అంటే ఎంతో ప్రశాంతం గానో  ఫీల్ అవుతాం. నేను హైదరాబాద్ లో వున్నప్పుడు రంజాన్ కి మసీదుల్లోంచి వచ్చే ప్రవచనం వింటూ వుంటే ఎంతో హయ్ గా అనిపించేది, అర్థం తెలియకపోయినా సరే. ఆల్వాల్ లో గురుద్వారా కి ఫ్రీక్వెంట్ గా వెళ్తూ వుండేవాడ్ని, గురుబానీ వినడానికి. దాని అర్ధమూ తెలియదు. కానీ వింటూ వుంటే అదో తదామ్యత. అలాగే, ఇక బౌద్ధ ఆరమాల సంగతి సరే సరి. తపోముద్ర లో వున్న బుద్దుడు ప్రతిమ చూస్తే చాలు  వచ్చేస్తుంది మనసులో ప్రశాంతత. సికింద్రాబాద్ యూనివర్సల్ బేకరీ వెనకాల ఫైర్ టెంపుల్, లోపలికెళితే అంతులేని ప్రశాంతత. మనిషి చనిపోయాక వదిలిపెట్టే దేహం, ఇతర పక్షులకి పనికొస్తాయనే అల్టిమేట్ సాక్రిఫైస్తొ, మృతదేహాల్ని, పార్శి గుట్ట లోని నూతి లోకి వదిలేసే, పార్సీ మతం, అలా చూస్తూ పోతే, ఎన్నో ఎన్నెన్నో నేర్పుతాయి ఈ మతాలు.  మరణానికి దగ్గరలో వున్న వ్యక్తి కి  తనకి వైద్యం చేసే డాక్టర్ మతం ఏంటో, కులం ఏంటో అక్కర్లేదు. ఆ సమయం లో తనకి వైద్యం చేసే డాక్టరే ఒక దేముడు లా కనిపిస్తాడు. మరి నిజ జీవితం లో ఎందుకు ఇలా మారిపోతున్నాం. కాగ్నిటివ్ సైన్స్ ప్రకారం మనిషి కి నెగటివిటీ అట్ట్రాక్ట్ చేసేంత ఫాస్ట్ గా పోసిటివిటీ అట్ట్రాక్ట్ కాదు కనుక.  ప్రతీ మనిషి లోను పరమాత్ముడు వున్నాడు. అదీ మనం గుర్తించడం లేదు. దీనికి కారణం మనం ఉదయం మన కార్యక్రమాలు ఒక నెగటివ్ వైబ్రేషన్ల తొ మొదలుపెట్టడం. లేచిన వెంటనే, మనం చూసే టీవీ మాధ్యమం, చేతిలో ఎన్నో తెలియని విషయాలు, తెలుసుకోడానికి ఉపయోగపడే స్మార్ట్ ఫోన్లోని సోషల్ మీడియా,  కాఫీ కప్పు చేత్తో పట్టుకొని ఓ పది నిముషాలు కనీసం న్యూస్ పేపర్ చదువుదామని పేపర్ ఓపెన్ చేస్తే, ప్రతీ ఐటమ్, ప్రతీ వార్త ఒక నెగటివ్ వైబ్రేషన్, ఒక మానసిక అలజడి సృష్టించేవే. ఎప్పుడైతే, ఇలా విద్వేషాలు, విధ్వంసాలు, అల్లర్లు, బస్సులు, రైళ్లు తగలెట్టడాలు చూస్తూ మన డే స్టార్ట్ చేస్తామో, ఆ రోజంతా, మైండ్ ఒక తుఫాన్ లో చిక్కుబడ్డ నావ లాగా అలజడి తో ఒడిదుడుకులతో గడుస్తుంది. అలాకాకుండా ఉదయం లేవగానే ఇష్టమైన దైవ ప్రార్ధన చేస్తూ "ఓ భగవంతుడా ఈ అందమైన ప్రపంచంలో ఆనందం గా గడపడానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చావు చాలా కృతజ్ఞతలు " అంటూ ఒక పాజిటివ్ భావం తో డే బిగిన్ చేద్దాం,  చక్కని సంగీతంలో, లేదా మనస్సుని ఊరట పరిచే ఒక వాకింగ్ గానీ చేస్తూ.  స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం నా దృష్టిలో పరిసరాల పరిశుభ్రత కే కాదు, మానసిక పరిశుభ్రత చేసుకోడానికి వాడుకుందాం. ఎప్పుడైతే మనసును, అది రగిలించే ఆలోచనల్ని పరిశుభ్రం గా పెట్టుకుంటామో, మన శరీరం లోని అన్ని ఆర్గాన్స్ ఒక సింక్ లో పనిచేసి ఆరోగ్యం గా ఉంచుతాయి.  మన మైండ్ పాజిటివ్ గా వుంటే వచ్చేవి  మంచి ఆలోచనలు, తద్వారా మంచి ఆరోగ్యం. మనందరం సెల్ఫిష్ గా మారిపోదాం, మన మానసిక ఆరోగ్యం కాపాడుకోడానికి. అందుకే, మనసుకి అలజడి కలిగించే విషయాలు చదవడం, చూడడం, వినడం, మాట్లాడడం మానేద్దాం. మతం అనేది పైన చెప్పిన వాటిని నేర్చుకోడానికి ఉపయోగిద్దాం, మంచి గా మానవత్వం తో గడిపేద్దాం,  మిగిలిన అతి కొద్ది శేష జీవితం నుంచి పేర్మినెంట్ గా లాగ్ అవుట్ అయ్యేలోగా. "Let's keep our minds pure with good thoughts, actions, and live our life with Happiness, bliss, utopia and ultimate Tranquility "