రాహుల్ సాంకృత్యాయన్ జీవన తాత్వికత - పిళ్లా కుమారస్వామి

రాహుల్ సాంకృత్యాయన్ జీవన తాత్వికత

18వ శతాబ్దం లో బెంగాల్ లో మొదలైన సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రభావం భారతదేశం మొత్తంగా ప్రసరించింది. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం రాజా రామ్మోహన్ రాయ్ (1775-1833) తో మొదలైంది.అది రాహుల్ సాంకృత్యాయన్ తో శిఖరాగ్రానికి చేరింది. రాహుల్ భారతదేశం తాత్వికత కు వేసిన ముద్ర ప్రగాడమైంది. ఆయన జీవించిన విధానమే ఆయన తాత్వికత. కులవంతి దేవి, గోవర్ధన్ పాండే దంపతులకు, ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని కనైలా గ్రామంలో జన్మించిన రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 – 1963 ఏప్రిల్ 14) బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి. వైవిధ్యభరితమైన జీవితాన్ని గడిపి, 70 ఏళ్ల వయసులో డార్జిలింగ్‌లో తుదిశ్వాస వదిలారు. రాహుల్ జీ ఇండాలజిస్ట్. మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, బౌద్ధ పండితుడు, ప్రయాణ రచయిత , సృజనాత్మక రచయిత. అతని రచనలలో సామాజిక శాస్త్రం,చరిత్ర, తత్వశాస్త్రం , బౌద్ధం, టిబెటాలజీ , లెక్సికోగ్రఫీ వరకు ఉన్నాయి. ఆయన హిందీ యాత్రాసాహిత్య పితామహుడు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రల లోనే గడిపి లోకసంచారి. ఏక సంధాగ్రాహి. టిబెట్ భాష నుండి సంస్కృతానికి అత్యంత వేగంగా అనువాదం చెయ్యగలిగిన దిట్ట.అతనికి 30 భాషలు తెలుసు. ఆయన 140 పుస్తకాల రచయిత కూడా.ఆయన చేసిన రచనలలో, అనువాదాలలో చాలాభాగం ఇంకా ప్రచురించాల్సి ఉంది.రాహుల్ సాంకృత్యాయన్ కోల్ కతా, కాశీ, డార్జిలింగ్, టిబెట్, నేపాల్, చైనా, శ్రీలంక, సోవియట్ యూనియన్ సహా అనేక దేశాలను సందర్శించారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి సంస్కృతిలో ఇమిడిపోయే వాడు. ."హిమాలయాల ప్రేమికుడు, హిమాలయాలు దాటి వెళ్లి ఆ శ్రేణులతో ఒకటిగా మారాడు"అని సాహిత్య కారులు కీర్తించారు. సాంకృత్యాయన్ 25ఏళ్ల ప్రాయంలో మొదట ఆర్యసామాజికుడయ్యాడు. వేదాలను అధ్యయనం చేశాడు. తరువాత 30ఏళ్ల వయసులో బౌద్ధ భిక్షువుగా మారాడు. త్రిపీటకాలను పాళీ నుంచి హిందీలో కి అనువదించారు.1917 లో సోవియట్ లో విప్లవం విజయవంత మయ్యాక ఆయన తన 47 ఏళ్లప్పుడు మార్క్సిస్టు గా పరివర్తన చెందారు. 1940వ దశకం ప్రారంభంలో ఆయన పూర్తిగా భౌతికవాదిగా మారి కమ్యూనిస్ట్‌ పార్టీలో సభ్యునిగా చేరాడు. జీవితాంతం కమ్యూనిస్టు గా ఉన్నారు. రైతు సంఘం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. భారతీయ తత్వశాస్త్రంలో మొదట కేదార్ పాండే పేరుతో విద్యార్థిగా ప్రారంభించి, రాహుల్ సాంకృత్యాయన్ పేరుతో తాత్వికునిగా పరిణామం చెందాడు. వేదాంతిగా, బౌద్ధునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, రైతు సంఘం జాతీయ నాయకునిగా, కమ్యూనిస్టు నాయకునిగా, మార్క్సిస్ట్ మేధావిగా ఇలా జీవితం లో ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితానికి దాన్ని అధిరోహించాడు. ఆయన జీవిత ప్రస్థానం పరిణామాత్మకంగానే గాక గుణాత్మకంగా అభివృద్ధి చెందింది. సాంకృత్యాయన్ భారత జాతీయోద్యమం లో కూడా పాల్గొన్నారు. జాతీయోద్యమానికి అనుకూలంగా, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3సంవత్సరాల జైలు శిక్షను అనుభవించారు. జైలులో ఉన్నప్పుడు అరబ్బీ ఖురాన్ ను సంస్కృతం లోకి అనువదించారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్ లో ఓ రైతు ఉద్యమంలో జరిగిన లాఠీఛార్జిలో ఆయనకు తలపై బలమైన దెబ్బ తగిలిగింది. కాలి నడకన వేల మైళ్లు ప్రయాణిస్తూ, మూడు బౌద్ధ పిటకాలను జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. బుద్దచర్య అనే గ్రంథాన్ని వెలువరించారు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి, వాటిని అనువాదం చేసి, వాటిని వెలుగులోకి తీసుకొచ్చిన రాహుల్జీ అపారమైన కృషిని బౌద్ధ లోకం గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే కాక యావత్‌ ప్రపంచ చరిత్రలోనే అంత ప్రతిభాశీలి, స్వయంకృషితో మహాపండితుడైన వ్యక్తి మరొకరులేరని అనేకులు వ్యాఖ్యానించారు. ఆయన రచనాశైలి సరళంగానూ, సామాన్య పాఠకులకు తాను చెప్పదలచుకున్నది సుళువుగా అర్ధం అయ్యేటట్లుగా ఉంటుంది. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియెట్ రష్యాలు పర్యటిస్తూ, ఎక్కడికి వెళితే అక్కడి భాష నేర్చుకుంటూ వచ్చారు. ఆ విధంగా అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలీ, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళ, తమిళం, ఉర్దూ వంటి ముప్పయికి పైగా భాషలు నేర్చుకున్నారు. అంతేకాదు వాటి యాసల్ని కూడా పట్టుకోగలిగాడు. "ఏదీ స్థిరం కాదు. ప్రతిదీ క్షణికమే. (సబ్బం కనికం)’’ అన్న బుద్ధుని బోధనను, ‘‘ఏదీ చివరిది కాదు. ఏ మనిషీ సంపూర్ణుడు కాదు. ఏదీ సంపూర్ణ సత్యం కాదు. నేను చేయవలసింది చేస్తాను. ముందు తరాలు దాన్ని మెరుగుపరుచు కోవాలి.’’ అన్న లెనిన్‌ వాక్యాన్ని రాహుల్‌ తన జీవిత వాస్తవికతగా చేసుకున్నాడు. లోకసంచారిగా మారి నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఆయన చిట్టచివరి వరకూ కూడా తన జీవితం మొత్తాన్ని సమాజానికే ధార పోసాడు. అణగారిన వర్గాల ప్రజల కోసమే అంకితం చేశాడు! శ్రీలంక చేరుకుని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు.బుద్ధిజం రాహుల్ జీవితాన్ని మార్చింది. దేవునిపై నమ్మకం కోల్పోయినా పునర్జన్మను నమ్మేవారు. గౌతముని కుమారుని పేరు రాహుల్ కు తన గోత్రం సాంకృత్యను జోడించి రాహుల్ సాంకృత్యాయన్‌గా పేరు మార్చుకున్నారు.ఆవిధంగా దామోదర్ సన్యాసి 'రాహుల్ సాంకృత్యాయన్' అయ్యాడు. రాహుల్ సాంకృత్యాయన్ శాస్త్రీయ దృష్టితో, గతితార్కిక భౌతికవాద కోణంలో వేదాలను అధ్యయనం చేశారు. అర్థం తెలుసుకోకుండా గుడ్డిగా వేదాలను వల్లె వేయడం కాక, ఒక ప్రాచీన చారిత్రక సంపదగా భావించి వేదాలను అధ్యయనం చేసినాడు. హరప్పా మొహంజదారోలు బైట పడకపోతే మన నాగరికత ఎంత ప్రాచీనమైనదో ప్రపంచానికి తెలిసేదే కాదు. దాన్ని అధ్యయనం చేసిన రాహుల్ సాంకృత్యాయన్ మన నాగరికత"ఓల్గా నుండి గంగదాకా" సాగిందని తన వోల్గా సే గంగా ద్వారా నిరూపించారు. ఆయన రాసిన దిమగి గులామి(మానసిక బానిసత్వం),తుమ్హారీ క్షయా,సమ్యవద్ హి క్యోం(సామ్యవాదం ఎందుకు), గ్రంథాలలో కుల వ్యవస్థకు సంబంధించిన విప్లవాత్మక ఆలోచనలను సాంకృత్యాయన్ వ్యక్తం చేశారు. కొంతమంది కులతత్వాన్ని కొనసాగించడం ద్వారా పొందే భౌతిక ప్రయోజనాలను వెల్లడించాడు. లోసమ్యవద్ హి క్యోం లో కులాధిపత్య ప్రతిపాదకులు సంపన్నులే నన్నాడు. సామాజిక వివక్షను పటిష్టం చేయడంలో వారికి చేకూరే ఆర్థిక ప్రయోజనాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పాడు. అదేవిధంగా, లోతుమ్హారీ క్షయా లో అంటరానివారు అవమానించబడటమే కాకుండా ఆర్థిక స్వేచ్ఛను కూడా కోల్పోతారని ఆయన చెప్పారు. దిమగి గులామి లో అంటరానివారు కిరాణా దుకాణం, కూరగాయల దుకాణం లేదా రెస్టారెంట్‌ను మాత్రమే కాకుండా, దుస్తులు లేదా రసాయనాల దుకాణాలను కూడా నిర్వహించలేరు. ఒకవేళ, వారు ధైర్యం చేసి నిర్వహిస్తే వారు త్వరలో దివాళా తీయవలసి ఉంటుంది.ఎందుకంటే చాలా కొద్ది మంది కష్టమర్లు మాత్రమే వారి దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని ఆయన సామాజిక వాస్తవికతను ఆనాడే బయట పెట్టారు. దేవాలయాలను, మతపరమైన గ్రంథాల సంకెళ్లను వదిలేసి వారు స్వేచ్ఛగా వ్యాపారాన్ని, నచ్చిన వృత్తిని నిర్వహించినప్పుడు మాత్రమే వారికి నిజమైన విముక్తి సాధ్యమవుతుందని అతను బలంగా చెప్పినాడు. ఆర్థిక స్వాతంత్ర్యం అన్ని స్వేచ్ఛలకు మూలమని ఆయన దృఢమైన అభిప్రాయం.కులానికి సంబంధించి మార్క్సిస్టు దృక్పథంతో అధ్యయనం చేసి వాటిని తన రచనల్లో వ్యక్తం చేశారు.సమ్యవద్ హి క్యోం లో కుల వ్యవస్థ, కుల వివక్ష , ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఏకైక మార్గం కమ్యూనిజమని స్పష్టం చేశారు.అతను సామాజిక రుగ్మతలను బయట పెట్టడమే గాక వాటి పరిష్కారానికి సమగ్ర దృక్పథాన్ని వ్యక్తం చేశాడు.అతని లాగా మరే ఇతర రచయితా రాయలేక పోయాడు. లోకసంచారి లో మహిళలు కూడా పురుషుల్లాగే సంచారం జీవనం గడిప వచ్చన్నాడు. అయితే వారికి పురుషులు, ప్రకృతి శత్రువులని చెప్పాడు. అప్పటికి ఇంకా గర్భనిరోధక పద్దతులు లేవు కాబట్టి ప్రకృతి శత్రువన్న విషయాన్ని చెప్పినట్లు గా మనం భావించాలి. ఎవరైనా సంచారి గా బిక్ష అడుక్కోకుండా, ఏదైనా పని చేసే తనకు అవసరమైనంత మాత్రమే ప్రతిఫలం గా తీసుకొని జీవికి సాగించాలన్నాడు. 1929 మరియు 1938 మధ్య టిబెట్‌కు నాలుగుసార్లు పర్యటన చేసి బౌద్ధ గ్రంథాలు, పెయింటింగ్‌లు, కళాఖండాలను గాడిదల పై తీసుకొని వచ్చి , వాటిని పాట్నా మ్యూజియమ్‌కు విరాళంగా ఇచ్చారు. "మేరీ జీవన్ యాత్ర' పేరుతో తన ఆత్మకథలో, ఒక కవితను ఉదహరించాడు: "సైర్ కర్ దునియా కి గాఫిల్ జింద్గానీ ఫిర్ కహాన్/జిందగీ గర్ కుచ్ రహీ తౌ నౌజవానీ ఫిర్ కహాన్?" (అయ్యో! అజ్ఞానుడా, వెళ్ళి ప్రపంచమంతా పర్యటించు. నీకు మళ్లీ ఈ జీవితం లభించదు. దీర్ఘకాలం జీవించినా యవ్వనం తిరిగి రాదు.అని దాని అర్థం). ఈ కవిత ప్రభావం తోనే తాను లోకసంచారిగా మారినట్లు చెప్పుకున్నాడు. శ్రామికవర్గం పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ కారణంగా అతని రచనలలో, రైతులకు గిట్టుబాటు,కూలీలకు సరైన వేతనం అందాలనే అంశం ప్రముఖంగా కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు వచ్చింది కాబట్టి, వారు రాజకీయ పార్టీల మంచి చెడ్డలు తెలుసుకోవడం అవసరమన్నాడు. రాజకీయ ప్రపంచంలో బెట్టింగ్‌లు ఎలా ఆడతారో వారు తెలుసుకోవడం అవసరమన్నాడు. ఆయన హేతుబద్ధమైన , మానవతా దృక్పథాలను ప్రతిపాదిస్తూ , భాగో నహీ దునియా కో బద్లో (పారిపోకండి , ప్రపంచాన్ని మార్చండి!)లో మన మానసిక బానిసత్వం ఉన్న ప్రతి ఆలోచనను నిర్దాక్షిణ్యంగా వదిలివేయాలన్నాడు. మానసిక విప్లవం అవసరం అవసరమన్నారు. అందుకే తన పుస్తకానికి - పరుగెత్తకండి - ప్రపంచాన్ని మార్చండి అనే పేరు పెట్టి సామాన్యులు కూడా చదివే లాగున రాశారు. రాహుల్ జీ ప్రకారం భాష , శైలి సాహిత్య రూపాన్ని నిర్ణయిస్తాయి. అందుకే అతను తన రచనల్లో సరళమైన శైలిని ఆశ్రయించాడు. ఆయన రచన సాధారణ పాఠకులకు కూడా అర్థమయ్యేలా ఉంటుంది . అతను సనాతన ధర్మం పేరిట జరిగే ఆచార వ్యవహారాలను, కుల వ్యవస్థను, మూఢనమ్మకాలను తీవ్రంగా విమర్శించాడు. ఎలాంటి భావజాల బంధానికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఆలోచించడం ఆయన ప్రత్యేకత. తన జీవిత ప్రయాణంలోని వివిధ కోణాలను వివరిస్తూ, మజ్జిమ నికాయ(బుద్దుని ఉపన్యాసాలు)లో బుద్ధుని చెప్పిన దాన్ని ఉటంకిస్తూ, "ఒక పెద్దవాడిలా, నేను మీకు నేర్పించాను , జ్ఞానం తలపై మోయడం కాదు. జ్ఞానం నావ లాగా ఉపయోగం పొడి అవతలి ఒడ్డుకు చేరాలి"అని అన్నాడు. ప్రస్తుత రాజకీయాల్లో మతం కేంద్ర బిందువుగా మారడం మనం చూస్తున్నాం. మతం పేరుతో రాజకీయ విమర్శలు కూడా ఆయన అభిప్రాయాలలో ఒక భాగం. అతని దృష్టిలో పేదరికం , నిరక్షరాస్యత , నిరుద్యోగం వంటి వాటికి మతం లేదు. మానవత్వం కంటే మించిన గొప్ప మతం ఏదీ లేదన్నాడు. మతం ఒకరినొకరు శత్రుత్వం పెంచుకోవాలని బోధించదన్నారు. భారతీయుల ఐక్యత మతాల కలయికపై ఆధారపడి ఉండదన్నారు . కాకిని కడిగి హంసగా మార్చలేము. కమలాన్ని కడిగి రంగు వేయలేరు. మతాల రోగం సహజం. వాటికి మరణం తప్ప చికిత్స లేదన్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం రావాలన్నది తన కల అని, ఈ కలను సాకారం చేసుకోవాలని నిర్భయంగా సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకారు రాహుల్. అమరవీరుల త్యాగం ఆయనను కదిలించింది. చౌరీ-చౌరా ఘటనలో వీరమరణం పొందిన వారి రక్తమే దేశమాత చందనం అవుతుందని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు.గతాన్ని తెలుసుకుని అందులోకి ప్రవేశించడం, వర్తమాన సవాళ్లను అర్థం చేసుకోవడం, సమస్యలతో పోరాడడం, భవిష్యత్తు కలలను రూపుమాపడం - ఇదీ రాహుల్‌జీ జీవన తాత్వకత.. మొదటి గాంధీని పెట్టుబడిదారుల ప్రతినిధి అని విమర్శించేవారు.గాంధీని గాడ్సే హత్య చేసిన తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నారు.మత విద్వేషాలను ఎదిరిస్తూ మతసామరస్యం కోసం బుద్దుని బాటలో నడిచిన అపూర్వ అహింసా వాదిగా ఆయన్ను కీర్తించారు. గాంధీజీ సమస్త మానవులకు చెందినవాడు. ఆయన జీవన పర్యంతం బహుజనుల హితం కోసం పోరాడారు. వారి శ్రేయస్సే కోరేవాడు కాబట్టి, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆయన బుద్ధుని కంటే కూడా ఎక్కువగా కష్టాలు సహించవలసి వచ్చిందన్నాడు. గృహస్థులను మోసం చేసే కపట సాధువులపై రాహుల్ విమర్శించారు. తాగే పూజారులు, యోగినుల మధ్య లైంగిక వ్యవహారాలను ఎగతాళి చేశారు. రాహుల్ రచించిన ‘మధ్య ఆసియా చరిత్ర’ పుస్తకానికి 1958 లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించినా,.1963లో భారత ప్రభుత్వం రాహుల్‌ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించినా ఆయన తాత్వికత ముందు అవి చాలా చిన్నవి. హిందీలోనే గాక సంస్కృతం, పాళీ, భోజపురి భాషలలో తన రచనలు సాగించారు. రాహుల్ హిందీలో 10 నవలలు, 4 లఘు కథలు, 3 సంపుటాల్లో స్వీయ చరిత్ర, 17 జీవిత చరిత్రలు, 10 ఇతర పుస్తకాలు రచించారు. వాటిలో సింహ సేనాపతి, నా జీవన యాత్ర, కార్ల్ మార్క్, లెనిన్, స్టాలిన్, మావో సె టుంగ్, మహామానవ బుద్ధ, అక్బర్, రుగ్వేద ఆర్యులు, దర్శన్ దిగ్దర్శన్, మానవ సమాజం ప్రధానమైనవి. రాహుల్ సాంకృత్యాయన్ శ్రీ లంక విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసరుగా వారి ఆహ్వానం మేరకు చేరారు. అక్కడ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు బారినపడ్డారు. జ్ఞాపకశక్తి కోల్పోయారు. ___ పిళ్లా కుమారస్వామి, 9490122229 References: The wire డిజిటల్ మాగజైన్ సంగిరెడ్డి హనుమంత రెడ్డి రాసిన 'మహాపండిత మేధావి రాహుల్ సాంకృత్యాయన్' వ్యాసం కైలాష్ జీంగర్ (ఢిల్లీ యూనివర్సిటీలోని లా ఫ్యాకల్టీ) రాసిన వ్యాసం బౌద్ధ భిక్షువు రాహుల్ సాంకృత్యాయన్ పై "కట్టిన దుస్తులు పసుపు ! పట్టిన జెండా ఎరుపు" పేరుతో రాసిన వ్యాసం Open magazineలో కీర్తిక్ శశిధరన్ రాసిన వ్యాసం Wikipedia Naatikindia.in బుద్దుడు -గాంధీ పై నాగసూరి వేణుగోపాల్ రాసిన వ్యాసం (తెలంగాణ మాస పత్రిక)