ఆ'రాధ'న - కొడాలి సీతారామా రావు

Aaradhana

“మీ మిసెస్ ని మొన్నటి గెట్ టుగెదర్ కి తీసుకురాకుండా వుండాల్సింది” అన్నారు మిసెస్ సునంద కృష్ణ.నిజమేనేమో అనిపించింది నాకు.సంతాపం కలిగింది. a. $$$ నాడిగ్రీ పూర్తవుతూనే నాకు రైల్వేలో స్టేషన్ మాస్టరుగా వుద్యోగం వచ్చింది.మారుమూల పల్లెలో ఉద్యోగం.వండుకుతినడం. బాగా మారు మూల వుండటం వల్ల స్టేషనులో పనిచేసే వాళ్ళం తప్ప ఎవరూ కనపడరు.స్టేషను కూడా ఊరికి చాలా దూరం.రోజూ చాలా ట్రైన్సే ఆ స్టేషను మీదుగా వెళుతున్నా,రెండు పాసెంజరు రైళ్ళు మాత్రం ఆగుతాయి- పొద్దున్నే ఒకటీ,రాత్రి ఒకటి. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మా నాన్నగారు వచ్చారోసారి.ఈ వంటరితనం చూసి వెంటనే పెళ్ళి చేసుకోవాల్సిందే అని పోరు పెట్టటం మొదలు పెట్టారు. సంబంధాలు చూడటం మొదలుపెట్టారు వద్దన్నా వినకుండా.అలా వచ్చిన సంబంధం రాధ.నిజానికి రాధ మా కాలేజీలో నా బేచే.కానీ తను సైన్సు,నేను కామర్స్.ఆమెనెప్పుడూ చూసిన గుర్తు లేదు.బహుశా ఆమె కూడా అలాగే అనుకుంటుందేమో. కాపురానికి వచ్చిన కొత్తలో కాలేజీ రోజులు గురించి మాట్లాడుకున్నాము.ఆమెకి ఆడపిల్లలు నలుగురి పేర్లు గుర్తున్నాయి.మొగపిల్లలసలు గుర్తులేదు.నన్ను చూసిన గుర్తు లేదని చెప్పింది.నాకు నాతో చదువుకున్న వాళ్ళు చాలా మంది గుర్తున్నారు.వాళ్ళల్లో చాలా మంది హైస్కూల్ లో కూడా క్లాస్ మేట్స్. అలా మా పెళ్ళి జరగటం మా కాపురం మొదలవటం జరిగింది ఆ పల్లెలో.రెండేళ్ళ తరువాత నాకు చిన్న టవునుకి బదిలీ అయింది. ఆ తరువాత సంవత్సరాలలో నాకూ ప్రమోషన్లు ఉద్యోగంలోనూ ,జీవితంలోనూ వచ్చాయి.ఇద్దరు పిల్లలు అమ్మాయి,అబ్బాయి. కాలక్రమంలో వాళ్ళకీ పెళ్ళిళ్ళవటం పిల్లలు పుట్టటం జరిగింది. ఆ సరికి నేనూ రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యినప్పటి నుంచీ ఏడాదికి రెండు సార్లు పదేసి రోజుల చొప్పున టూర్లు వెళుతున్నాం.ముఖ్యంగా ఫిబ్రవరిలో సిమ్లా తప్పనిసరి. $$$ హటాత్తుగా రామకృష్ణ , హై స్కూల్లో నా క్లాస్ మేట్ ఫోన్ చేసాడు.వాడు సింగరేణి కాలరీస్ లో పని చేసి రిటైర్ అయ్యి హైదరాబాదులో వుంటున్నాడు.వాడికీ అబ్బాయి,అమ్మాయి.వాళ్ళూ కాపురాలు చేసుకుంటూ అబ్బాయి హైదారా బాదులో వాడితోనే వుంటాడు.అమ్మాయి పూనాలో సాఫ్టు వేర్ ఇంజినీరు.అల్లుడు డాక్టరు. అప్పటినించీ అప్పుడప్పుడూ ఫోన్ చేస్తే పాత ఙ్నాపకాలు నెమరేసుకుంటాం. ఓ రోజు రాత్రి ఫోన్ చేసి ‘మనకి ఓ వాట్సప్ గ్రూప్ పెడుతున్నా. మొత్తం పది మంది నెంబర్లు పట్టుకున్నా.’అన్నాడు.కాసేపటిలో ఆగ్రూప్ కనపడింది నా ఫోన్ లో.అందరూ గుర్తున్నారు.అలా అరవై మందితో వుందా గ్రూపు. $$$ ఓ రోజు రాత్రి ఫోన్ చేసాడు.’నువ్వు ఖాళీయేనా కాసేపు సొంత సోది వినిపిద్దామని.’ సరే అనగానే చెప్పటం మొదలెట్టాడు. ‘రాధ తెలుసా నీకు.’ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాను. సర్దుకుని ‘ఏ రాధ ’ ‘అదేరా మాతో బి ఎస్సీలో వుండేదిగా.’ ‘తెలియదు’ ‘అవునులే నువ్వు కామర్స్ గాడివిగా.మొదటి రోజునించే పిచ్చి తనంటే.క్లాసులో తను కనపడేలా కూచునేవాడిని.తననే చూస్తూ కూచునే వాడిని.వేరే ఆలోచనేం లేదు.అప్పుడు పెళ్ళి గురించి ఆలోచించలేంగా.ఆరాధన.అంతే.డిగ్రీ పరీక్షలు రాయగానే మా కజిన్ హైదరాబాదు రమ్మన్నాడు.అలా వెళ్ళి చిన్నా చితకా చేస్తుంటే సింగరేణిలో ఆఫీసులో వచ్చింది ఓ ఆర్నెల్లయ్యాక.... ఏరా వింటున్నావా నిద్దరోయావా.బోరు కొడుతుంటే చెప్పు.ఇంకో సారి చెప్తా.(నేను చెప్పమనటంతో మళ్ళీ మొదలెట్టాడు.)బందరెళ్ళా.అప్పటికే తనకి పెళ్ళయ్యిందని తెలిసింది.బేడ్ లక్ అనుకుని వచ్చేసా. ఇప్పుడున్న ఒకే ఒక కోరిక ఎలాగైనా,నా ఊపిరి ఆగే లోగా ఓ సారి తనని చూడాలి.అంతే.వేరే ఏ ఆలోచన లేదు.ఈ విషయం మా ఆవిడకి తెలుసు,మా కోడలు,అల్లుడుతో సహా అందరికీ తెలుసు.నా కూతురు కేకలేసింది.అలాంటి ఆలోచనలు మానెయ్ మని.అదీ నా కథ.నీకు గానీ ఆ అమ్మాయి తెలిస్తే నాకు వివరాలు చెప్పు.’ పక్కనే మంఛి నిద్రలో వున్న రాధ వంకచూసా.ఈ విషయం తనకి చెప్తే ఏమంటుందో. $$$ ఆ రోజు ఉదయం నించీ ధారాపాతంగా వాన కురుస్తోంది.సాయంత్రం పకోడీలు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం.బంధువులూ, కధలూ,సినిమాలూ దొర్లిపోతున్నాయి.అలా చదువుకునే రోజులవిషయం వచ్చింది.చిన్నప్పటినించీ తన చదువులు చెప్తోంది.అప్పుడు కూడా నాకు ధైర్యం చాలలేదు తనకి కృష్ణగాడి గురించి చెప్పటానికి.చెప్పకపోవటమే మంచిదనిపించింది.తనకి ఎవరూ గుర్తులేరనప్పుడు ఈ విషయం తనని బాధ పెడుతుందనిపించింది. $$$ వాట్సప్ గ్రూపులో చాలామంది గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.ఒక్కొక్కరూ ఓ ప్రదేశం చెప్పారు.చివరికి మెజారిటీ సభ్యులు హైదరాబాదుకి ఓటేసారు.అదీ ఫిబ్రవరిలో అనుకున్నారు.నేను నా సిమ్లా యాత్ర గురించి చెప్పాను.మూడు నెలల ముందే అన్నీ బుక్ చేసేసాను మరి.చివరికి నా సిమ్లా ప్రయాణం రోజే పడింది.ఫరవాలేదు.రాత్రికి నా రైలు.సతీ సమేతంగా వస్తే బాగుంటుందనుకున్నాం. ఆ విషయాలన్నీ రాధకి చెప్తూనే వున్నా.తను రావటానికి ఇష్టపడలేదు ముందు.కానీ తనూ ఆ కాలేజిస్టూడెంటే కనుక బాగుంటుంది వస్తే.పైగా పది మంది దాకా సతీసమేతంగా వస్తున్నారు.చివరికి అంగీకరించింది.ఎలాగూ మా సిమ్లా ప్రయాణం హైదరాబాదు నుంచే కనుక.ఐతే రాధని చూడగానే కృష్ణగాడు సీన్ క్రియేట్ చేయకుండా వుండాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా అనుక్షణం. $$$ ఆ రోజు రాధని పరిచయం చేస్తుంటే ఉద్విగ్నతకి లోనయ్యాడనిపించింది.తన పక్కనే వున్న వాళ్ళవిడకి గబగబా చెప్పాడు.’రాధని చెప్తుంటానే ,మా క్లాస్ మేట్.దరిదాపు ఏభై ఏళ్ళ తరువాత చూస్తున్నా వీళ్ళందరిలాగే.’మా ఆవిడ వేపు తిరిగి ‘చాలా సంతోషం అమ్మా.. నిన్ను చూడటం.చాలా సంతోషం.అందులో మా సత్తిగాడి (నేనే) భార్యవి కావటం వాడి అదృష్టం.నువ్వు కూడా చాల పుణ్యం చేసుకున్నావు ఇలాంటి వాడు నీకు భర్తగా దొరకటం.పెద్దవాళ్ళు వాడికి పొరపాటున సత్యనారాయణ అని పేరెట్టారు కాని నిజానికి వాడి లక్షణాలకి శ్రీ రాముడు అని పెట్టాలి.’ వెనక్కి తిరిగి మా మిత్రులందరినీ ఉద్దేశించి ‘ ఈమె మన సత్తిగాడి భార్య రాధగారు.బియస్సీలో మన క్లాస్ మేట్.’ అని వాడే పరిచయం చేసాడు.మళ్ళీ నా వేపు తిరిగి ‘మా ఆవిడ సుధారాణి.సంగీతం,వీణ స్పెషలిస్టు.రేడియోలో ఏ గ్రేడు ఆర్టిస్టు.’ నా మనసు కుదుట పడింది వాడు ఎక్కువ రియాక్టు కానందుకు. ఆ సభలో అందరం మా పరిచయాలు చెప్పుకున్నాం.నవ్వుకున్నాం.సరదాగా సాయంత్రం నాలుగు దాకా గడిపి వీడ్కోలు చెప్పుకుంటున్నాం.ఇంతలో కృష్ణ ,వాళ్ళవిడ చేతిలో ఓ పేకెట్టుతో మా ఇద్దరి ఎదురుగా నిలబడి ‘మా ఇంటి ఆడపడుచుగా ఈ చిరు కానుక’ అంటూ ఆవిడ పేకెట్టు రాధకి ఇచ్చి బొట్టు పెట్టింది. $$$ ఆ రాత్రి బయలుదేరి మరునాడు సాయంత్రం ఢిల్లీలో హోటల్ చేరుకున్నాం.అప్పుడు ఫోన్లో ఓ మెసేజి చూసి ఆశ్ఛర్యపోయా.నమ్మలేక పోయా.రామకృష్ణ ఆ రోజు మధ్యాన్నం చనిపోయాడు. ఈ మాట మా ఆవిడకి చెప్పలేదు సిమ్లా నించీ బందరు తిరిగొచ్చేదాకా.తనూ ఆశ్ఛర్యపోయింది . ‘ఎల్లుండి కృష్ణ పన్నెండో రోజు.రేపు రాత్రికి బయలుదేరి వెళతాను’ చెప్పాను మా ఆవిడతో. $$$ కృష్ణ భార్య,పిల్లలకి సానుభూతి తెలిపి వస్తుంటే కృష్ణ భార్య సునంద అన్నారు ‘ ఆ రోజు రాధగారిని చూడటం ఆయన చిరకాల కోరిక తీరింది.మరునాడు ఆయాసంగా వుంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.అప్పటికే ప్రాణం పోయిందన్నారు.చాలా ఆరోగ్యంగా వున్న మనిషి.ఎప్పుడూ మందులు వాడే వారు కాదు.అవసరం రాలేదు.కానీ ఇలా జరగటంతో అనిపించింది.రాధగారిని చూడటం తన చివరి కోరికని చెప్తుండేవారు ఎప్పుడూ.ఇలా జరగటంతో అనిపించింది ఆ రోజు రాధగారిని మన గెట్ టుగెదర్ కి తీసుకురాకుండా వుండాల్సిందని.’ దుఃఖంతో ఆవిడ గొంతు మూగపోయింది.కూతురు ఆమెని లోపలికి తీసుకువెళ్ళింది. నాకూ అలాగే అనిపించింది వార్త తెలిసినప్పుడే.తలవంచుకుని బయటికి నడిచాను.

మరిన్ని కథలు

Pagavadiki koodaa ee anubhavam vaddu
పగవాడికి కూడా ఈ అనుభవం వద్దు
- మద్దూరి నరసింహమూర్తి
Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ
Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు
Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్