
నా హృదయానికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలలో మూడు చోట్ల పూడికలు ఉన్నాయని, వాటిని తొలగించి రక్తప్రసారం సవ్యంగా సాగేటట్టు చేసే ప్రక్రియను చేపట్టడానికి నన్ను ఈ రోజు ఫలహారం చేసి ఉదయం 8 గంటల సరికి ఆసుపత్రికి వచ్చేయమన్నారు.
అలా నేను ఆసుపత్రికి వచ్చేసరికి - “ప్రస్తుతం గదులేవీ ఖాళీగా లేవు. మిమ్మల్ని ఓటిలోకి తీసుకొని వెళ్ళేవరకూ ఇక్కడ ఈ బెడ్ మీద పడుకోండి” అని నన్ను ఒక బెడ్ మీద పడుకోపెట్టేరు. ఈ స్థలం ఏమిటా అని ఆరా తీస్తే అది ‘అత్యవసర చికిత్సా కేంద్రం’ అని తెలిసి, ‘నన్ను ఇక్కడ ఎందుకు పడుకోపెట్టేరు’ అని అక్కడ ఉన్న వారితో కొంచెం గట్టిగానే మాట్లాడేసరికి-
“మిమ్మల్ని ఒక గంటలో ఓటి లోకి తీసుకొని వెళ్తారు, కాస్తా ప్రశాంతంగా ఉండాలి మీరు” అని నన్ను శాంత పరచేరు.
సమయం మెల్లగా పది అవడానికి దగ్గర పడుతోంది.
చూస్తూ ఉండగానే మధ్యాహ్నం రెండు కూడా దాటింది.
నేను నా సహనాన్ని కోల్పోయి అక్కడ ఉన్నవారి మీద “నన్ను ఇప్పుడే ఓటి లోకి తీసుకొని వెళ్ళండి లేకపోతే నేను ఇంటికి పోతాను” అని కేకలు పెట్టసాగేను.
పది నిమిషాల్లో ఒకతను వచ్చి “సర్, మీరు వాష్ రూమ్ కి వెళ్ళి వస్తే, ఓటి లోకి తీసుకొని వెళ్తాను” అన్నాడు.
అతను చెప్పినట్టు చేసిన నన్ను అరగంట తరువాత తీసుకొని వెళ్ళి ఓటి కి పక్కన గదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక బెడ్ మీద పడుకోపెట్టి “మీరు ఇక్కడే ఉండండి, ఓటి లోంచి పిలుపు వస్తే, వేరే వారు మీకు ఓటీ లోకి తీసుకొని వెళ్తారు” అని వెళ్లిపోయేడు.
మరో గంట తరువాత నన్ను ఓటి లోకి తీసుకొని వెళ్ళి ఏ ప్రక్రియకు నేను వచ్చేనో అది ఒక గంటలో ముగించి ఈవలకు తీసుకొని వచ్చి “ఇక్కడ అరగంట విశ్రామంగా ఉండండి” అని చెప్పి నన్ను తీసుకొని వచ్చిన వారు వెళ్లిపోయేరు.
మరొక గంటకు ఒకతను వచ్చి “సర్, మిమ్మల్ని ఇప్పుడు ICU లోనికి తీసుకొని వెళ్తున్నాము, అక్కడ ఈ రాత్రి మిమ్మల్ని ఉంచి మీకు చేసిన ప్రక్రియకు మీ శరీరం ఎలా ప్రతిస్పందిస్తున్నదో గమనిస్తూ, రేపు ఉదయం డాక్టరుగారు వచ్చి చూసిన తరువాత మిమ్మల్ని మీకు కేటాయించిన గదిలోనికి మారుస్తారు” అని చెప్పి నన్ను ICU లోనికి తీసుకొని వెళ్ళేడు.
ఇక నా అగచాట్లు ఆరంభమయేయి.
ICU లోనికి వస్తూనే నా శరీరానికి ఒక్కసారిగా తగిలిన అతిశీతల వాయు ప్రసారాన్ని నేను భరించలేక ‘చలి చలి’ అని కేకలు వేయనారంభించేను. ఆగని నా కేకలు భరించలేని అక్కడున్న ఉద్దరు నర్సులు వెళ్ళి ఒక హీటర్ తెచ్చి నా ఎదురుగుండా పెట్టేరు. పైగా, రెండు దళసరి దుప్పట్లు కూడా నా పైన కప్పెరు. ఆ సరంజామాతో, ఒక అరగంట గడిచిన తదుపరి నాకు తగిలే చల్లటి గాలి దూరమవడం ఆరంభించింది. మరో అరగంటకు, నేను ఆ వాతావారణానికి అలవాటుపడిన తదుపరి ఆ హీటర్ తీసి నాకు కప్పిన రెండో దుప్పటి కూడా తీసివేసేరు.
నేను చుట్టూ చూసేసరికి, ఎక్కడా ఒక్క మంచం కూడా ఖాళీ లేకుండా ఆ గది అంతా రోగుల మయం. నాతో సహా ప్రతీ రోగి దగ్గర ఒక విధమైన శబ్దం చేస్తున్న ఏవేవో మెషిన్స్ అమర్చి ఉన్నారు.
రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత ఆ గదిలోకే తినడానికి ఏవో తెచ్చి ఇచ్చేరు. కానీ, ఆ గదిలో చుట్టూ ఉన్న రోగుల మధ్యన పెద్దగా తినాలనిపించక ఏదో ఇంత కతికి తిన్నాననిపించేను.
మరో అర గంటకు ముగ్గురు వైద్యులు వచ్చి నన్ను నాకు అమర్చిన మెషిన్స్ ను పరికించి చూసి, నాకు ఆరోగ్యపరమైన కొన్ని ప్రశ్నలు అడిగి “రేపు ఉదయం ఇదే పరిస్తితి కొనసాగితే మిమ్మల్ని మీ రూమ్ కి మారుస్తాము. అంతవరకూ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ నిద్ర వస్తే పడుకోండి” అని సూచించేరు.
“నాకు ఇప్పుడే నా రూమ్ కి మారుస్తే బాగుంటుందండీ” అన్న నా అబ్యర్ధనను విని నవ్వి వెళ్లిపోయేరు ఆ వైద్యులు.
ఆ వైద్యులలో ఒకామే కొంచెం ఆగి, “ఉదయం ఈ బెడ్ మీదుండే రోగిని రూమ్ కి మార్చేరా” అని అక్కడున్న నర్సుని అడిగింది.
“లేదు డాక్టర్, ఆ రోగి మధ్యాహ్నం చనిపోయి ఖాళీ అయిన బెడ్ మీదనే ఈయనను పడుకోపెట్టేము”
“ఆహా” అని అది సర్వసాధారణ విషయం అన్నట్టుగా ఆ వైద్యురాలు తలాడిస్తూ వెళ్లిపోయింది.
ఆ సంభాషణ విన్న నేను నా బెడ్ మీద సౌకర్యంగా పడుకోలేక – అక్కడున్న నర్సుతో –
“నన్ను మరో బెడ్ మీదకు మార్చకూడదా, ప్లీజ్” అని అడిగేను.
“మరే బెడ్ ఖాళీ లేవు సర్, ఈ ఒక్క రాత్రికే కదా. రేపు మీరు పొదురుగానీ లెండి” అంది.
నాకు ఆమె మాటల్లో గల శ్లేషతో మరునాడు ఉదయం నేను ఎక్కడికి పోతానో – నా గదికా లేక పైకా --అన్న భయం ఆవరించింది.
మరో గంట గడిచేసరికి, ఒక ఆడ రోగి పెద్దగా ‘అమ్మా’ అని కేకలు వేయనారంభించింది.
“ఎందుకమ్మా అలా కేకలు వేస్తావు, అలా కేకలేస్తే మిగతా రోగులకు ఇబ్బందిగా ఉంటుండు, నోర్మూసుకొని పండుకో” అని నర్సు ఆ ఆడ రోగోకి చెప్పిందో లేక కసిరిందో ఆ నర్సుకి ఆ రోగికే తెలియాలి.
కొంతసేపటికి, నా పక్క కాక ఆ పక్కనున్న మరో రోగి – సుమారు 70 ఏళ్ల పైనే ఉంటాయి – “ఖళ్ళు ఖళ్ళు” అంటూ దగ్గడం ఆరంభించేడు. అతను నాకు దూరంగా ఉన్నా ఆ దగ్గు తీవ్రత ఎంతగా ఉందంటే నా చెవిలో దగ్గుతున్నట్టనిపిస్తోంది.
నాకు ఇటు పక్కన ఉన్న మరో రోగి – సుమారు 50 ఏళ్ల పైన ఉండొచ్చు – వింతగా మూలుగుతూ ఆ మూలుగు పరిమాణాలు పెంచుతూ తగ్గిస్తూ, ఆయన మూలుగుతున్నాడా లేక ఏదైనా వాద్య పరికరం కర్ణ కఠోరంగా వాయిస్తున్నాడా అనిపిస్తున్నాడు.
కొంతసేపు చూసిన నర్సులలో ఒకామే ఆ రోగి దగ్గరకు వచ్చి –
“ఏంటయ్యా అలా మూలుగుతుండావు, సప్పుడు సేయకుండా తొంగో. లేకుంటే, మిగతా రోగులకు ఇబ్బిడిగా ఉంటాది, ఇంత వయసొచ్చింది తెల్వదా” అని ఘాటుగా చెప్పి వెళ్లిపోయింది.
ఆమె వెళ్ళిన పది నిమిషాలకు – ‘నేను ఎవరి మాట ఖాతరు చేయను, అట్టే మాటాడితే నా మాటే నేను వినను గాక వినను’ అన్నట్టు మరలా ఆ రోగి మూలగడం ఆరంభించేడు.
మరో నర్సు, దగ్గుతున్న రోగి దగ్గరకు వెళ్ళి – “ఏటా దగ్గడం, కఫం వస్తే ఉమ్మేసి, నీళ్ళు తాగేసి నిశ్శబ్దంగా పండుకో” అని చెప్పింది.
“దగ్గలేకపోతున్నాను” అన్నాడు అతను ఆయాసంగా.
“దగ్గలేకపోతున్నాను అంటూనే ఇంతలా దగ్గుతూ ఉండావు, మరి దగ్గ గలిగితే, ఇంకా ఎంత గట్టిగా దగ్గుతావో బాబూ నువ్వు” అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది ఆ నర్సు.
మరో కొంతసేపటికి, ఆ మూల నుంచి మరో రోగి అదే పనిగా తుమ్మడం ఆరంభించేడు.
“ఏందయ్యా అంతగా తుమ్ముతావు, రొంపగా ఉంటే, బాగా కప్పుకొని పడుకో, రేపు ఉదయానికి రొంప పోతుందిలే” అని చెప్పిన నర్సు కదలగానే మరలా ఆయన తుమ్మడం ఆరంభించేడు.
“ఏమే రస్మీ, ఇక్కడ ఉన్నాళ్ళంతా మనం చెప్పింది ఇలా ఒక చెవితో విని, అలా మరొక చెవితో వదిలేస్తున్నారు కదే” అంది నవ్వుతూ.
“ఆళ్ళు వినరని తెలిసీ చెప్పడమెందుకే, హాయిగా మొబైల్ చూసుకోక”
“నిజమే, బాగా చెప్పేవు”
మరో గంటకు, ఒక రోగి మంచం మీద లేచి కూర్చొని – “నర్సు, నాకేదో అయిపోతుంది మా అబ్బాయిని పిలుస్తావా ఒకసారి”
“నీకేదో అయితే, డాక్టర్ ని పిలవమనాలి కానీ మీ అబ్బాయి వచ్చి ఏమి చేస్తాడు, అయినా మీ అబ్బాయిని రేపు ఉదయం రమ్మని నువ్వే ఇంటికి వెళ్లిపోమన్నావుగా”
“బుద్ధి గడ్డి తిని వాడిని పంపించేసేను, పోనీ డాక్టరుగారిని పిలు”
“అలాగే”
“రస్మీ, డాక్టరుని పిలిచేందుకు పోతున్నాను, నువ్వు చూసుకో ఈళ్లని” అంటూ ఆమె బయటకు వెళ్లిపోయింది – రస్మీ జవాబుకి ఎదురుచూడకుండా.
“ఈ నర్సు చెప్పినది ఆ రస్మీ విన్నదో లేదో వాళ్ళ ఇద్దరికే తెలియాలి.
డాక్టరుని పిలవడానికి వెళ్ళిన నర్సు అరగంట తరువాత వచ్చి ఆ రోగితో “డాక్టరుకి సెప్పేను వస్తారు” అని వెళ్ళి రస్మీ దగ్గర కూర్చుంది.
“ఇంతసేపు సేసేవేమిటీ”
“డాక్టరుని లేపి, చాయి కావాలంటే ఇప్పించి నేను కూడా తాగి వస్తున్నాను. నువ్వు కూడా వెళ్ళి తాగి రా”
“సరే, నేను పోయి చాయి తాగి వస్తాను” అంటూ రస్మీ చాయి తాగేందుకు వెళ్లిపోయింది.
రస్మీ పిలిచిన డాక్టరు వచ్చి రోగిని చూసి “మీకు అమర్చిన మెషిన్స్ అన్నీ మీ ఆరోగ్యం సవ్యంగానే ఉంది అని చూపిస్తున్నాయి. మీరు అనవసరంగా ఆలోచించక, హాయిగా నిదరపొండి. ఉదయానికి మీ పరిస్థ్తితి ఇలాగే ఉంటే, మిమ్మల్ని మీ గదికి చేర్చడం జరుగుతుంది” అని చెప్పి వెళ్లిపోతూంటే –
“డాక్టరుగారు, మీరేమో ఇలా అంటున్నారు, కానీ నాకు లోపల ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కాస్తా నా నాడి గుండె చూసి వెళ్లకూడదూ”
“అవేమీ చూడక్కరలేకుండా ఉండడానికే ఈ మెషిన్స్ మీకు అమరుస్తున్నాము” అని చెప్పి ఆయన వెళ్లిపోయేడు.
ఇంతలో, ఒక ఆడ రోగి “నాను ఇక్కడే హరీ మంటే ఆడు మరో పెళ్లి చేసుకొని కులుకుదామని సూస్తున్నాడు” అని కేకలు వేయనారంభించింది.
నర్సు ఆమె దగ్గరకు వెళ్ళి --
“ఇగో అమ్మీ, మీ ఇంటి విషయాలు ఇక్కడ కేకలు వేయకూడదు, మిగతా రోగులకు ఇబ్బిడి కలుగుతాది. నోరు మూసుకొని పడుకో”
“నీకేటి నువ్వలానే సెప్తావు. కానీ, కూలిపోయేది నా సంసారం కదా”
“అవన్నీ నువ్వు ఇంటికెళ్ళిన తరువాత చూసుకుందువుగాని, ఇప్పుడు పడుకో”
“ఆడు నేను సావడానికే ఇక్కడ సేర్పించినాడు కదా, మరి ఇంటికి ఏటి ఏళ్ళేది, నా సంసారం ఎలా సక్కపెట్టుకొనేది”
“ఇగో సెప్పేనా అలా కేకలు వేయకూడదని. పెద్ద డాక్టరుగారిని పిలిచేనంటే ఆయన కొట్టినంత సేస్తారు. అందుకే నింపాదిగా పండుకో”
ఇలాంటి దృశ్యాలు చూస్తూ మాటలు వింటూ --
ఎంత త్వరగా తెల్లవారుతుందిరా బాబూ అని ఎదురుచూస్తూ గడియారం చూస్తే, తెల్లగా తెల్లవారడానికి ఇంకా రెండు గంటలు గడవాలి అని సూచిస్తోంది.
మరో గంటకు నర్సులు హడావిడిగా రోగులు అందరి మెషిన్స్ ఎలా పని చేస్తున్నాయో చూడడం, రక్త పరీక్షలకు రక్త సేకరణలు చేయడం, అవసరమైన రోగులకు దంతధావన చేయించడం, నడవగలిగిన రోగులను మలమూత్ర విసర్జనాలకై తీసుకొని వెళ్ళడం తదితర కార్యక్రమాలకు ఉపక్రమించేరు.
హమ్మయ్య, ఇంకాసేపట్లో ఇక్కడ నుంచి విముక్తి లభిస్తుంది అనిపించింది.
అయినా, ఇక్కడనుంచి కదిలి నా గదికి నేను చేరుకొనేసరికి చూస్తూండగానే ఉదయం పదకొండు గంటలు దాటింది.
ICU లోంచి బయటకు వచ్చి నాకు కేటాయించిన గదిలోకి వచ్చిన దగ్గరనుంచీ ఈ ఆసుపత్రినుంచి ఎప్పుడు విముక్తిరా బాబూ అని ఎదురుచూస్తూ – ఇన్సురెన్స్ విషయాలు అన్నీ తెముల్చుకొని, ఆసుపత్రివారికి చెల్లించవలసిన సొమ్ము చెల్లించి ఇంటికి చేరేసరికి రాత్రి ఎనిమిది దాటింది.
ఆ రాత్రి అయినా సుఖంగా నిద్ర పోదామంటే, కళ్ళు మూస్తే చాలు ముందురోజు ICU లోని దృశ్యాలు కంటికి కట్టినట్టు కనపడుతూ అక్కడ జరిగిన సంభాషణలు చెవిలో గింగురు మంటూంటే –
‘పగవాడికి కూడా ఆసుపత్రి - అందునా ICU - అనుభవం కలగనివ్వకు భగవంతుడా’ – అని ప్రార్ధిస్తూన్న నాకు ఏ తెల్లవారో నిద్రా సుఖం కాస్తంత కలిగిన అనుభవం కలిగింది.