తెలుగు సినిమా తొలి ఆడబడుచు - ambadipudi syamasundar rao

తెలుగు సినిమా తొలి ఆడబడుచు

పాత తరము సినిమా హీరోయిన్లలో శ్రీమతి పసుపులేటి కన్నాంబ బాగా ప్రేక్షక ఆదరణ పొందిన నటి . క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్ర సీమలో వెలుగు వెలిగిన నటి కన్నాంబ గారు. రంగస్థల నటి, గాయని, చిత్ర నిర్మాత అయిన శ్రీమతి పసుపులేటి కన్నాంబ తెలుగు చిత్ర సీమ లో అగ్రశ్రేణి కళాకారిణి గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణిగా పేరు సంపాదించుకున్న నటి కన్నాంబ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1911,అక్టోబర్ 5న జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటక రంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణం లో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది .హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలు ఆమె నటించిన వాటిలో ముఖ్యమైనవి.
ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళ భాషల్లో 22 చిత్రాలు నిర్మింప జేశారామె.జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాక ముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది.ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా.కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారు మ్రోగుతుండేవి.చండిక సినిమాలో "నేనె రాణినైతే ,ఏలనే ఈ ధర ఏక ధాటిగా"అనే పాటలో కన్నాంబ చేతిలో కత్తి పట్టుకొని వీరావేశముతో కళ్ళెర్ర చేస్తూ పాడిన పాట గురించి ఆరోజుల్లో విపరీతముగా చెప్పుకొనేవారు.ఇంకో పాట," ఏమే ఓ కోకిలా ఏమో పాడెదవు ,ఎవరే నేర్పినది ఈ అట పాట" లో ఆమె నవ్వులు రువ్వుతూ పాడిన పాట ఆవిడ తప్ప మరెవ్వరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని ఆ రోజుల్లో జనము చెప్పుకొనేవారు.
ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’టైటానిక్‌ చీరలు‘ అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి.
కన్నాంబ తమిళములో చిన్నప్ప తో కణ్ణగి అనే సినిమాలో హీరోయిన్ గాను, గాయకురాలు నాగమ్మ పాత్రలో పల్నాటి యుద్ధము సినిమాలోనూ, గోవిందరాజుల సుబ్బారావు తోనూ, నాగయ్య తో రాణీ గా అశోక్ కుమార్ అనే చిత్రములో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తన స్వంత బ్యానర్ లో 1949 లో నిర్మించిన నవజీవనము అనే సినిమాకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రము నుండి ఉత్తమ చిత్రము గా బహుమతి అందుకుంది. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారుసుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964లో మే 7 వ తేదీన తుదిశ్వాస విడిచారు. కన్నాంబ మరణముతో అస్తీ అంతా హరించుకు పోయింది కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.ఆమె మరణము తరువాత భర్త నాగభూషణము గారు ఒక చిన్న గదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉండేదిట. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం ఉండేవి కావట. ఆయన చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటు ఉండేవారట ఆ విధముగా అయన సిరి సంపదలు కన్నాంబ గారితోనే పోయినాయి. తెలుగు చలన చిత్ర సీమలో కన్నాంబ గారిది చాలా ప్రత్యేకమైన స్థానము. ఎవరు ఆ తరువాత నటీమణులు ఆవిడ స్థానాన్ని భర్తీ చేయలేదు.


’.