అహల్య బిటెక్ చదువుతోంది. ఫైనల్ సెమ్ జరుగుతుంది.. అది అవ్వగానే తనకు పెళ్లి చేసెయ్యాలని ఇంట్లో చూస్తున్నారు. అహల్యకేమో ఉద్యోగం చేయాలని.. ఇలా ఉండగా వాళ్ల నాన్న గారికి తెల్సిన వాళ్ళు ఒక్క సంబంధం తీసుకొచ్చారు.. అబ్బాయి పేరు వినయ్.. అటువైపు వాళ్లకి ఇటువైపు వాళ్లకీ ఈ సంబంధం నచ్చింది. పెళ్లి చూపులకు వచ్చారు.. అహల్యకి కోపం ఎక్కువ.
ఏ చిన్న మాట కూడా పడదు. అహల్య అమ్మగారి కేమో అత్తా రింట్లో ఎలా మసులుతుందో అని ఒక్కటే కంగారు.. పెళ్లి చూపులలో వినయ్ కి అహల్య నచ్చింది.. వినయ్ తల్లి తండ్రులకి అహల్య నచ్చింది. అహల్యకి అసలు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు..వాళ్ళ ఇంట్లో అందరికీ వినయ్ నచ్చాడు.తను అభ్యంతరం చెప్పడానికి ఏమి కనిపించలేదు.. అందుకే తను ఒకే చెప్పింది.. అంతాబానే ఉంది కానీ పెళ్లయ్యాక తను ఉండాల్సింది జాయింట్ ఫ్యామిలీలో.. అహల్య తన ఫ్రెండ్స్ ద్వారా విన్న వాటివల్ల తెగ కంగారుగా ఉంది.వినయ్ చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు.. అర్దం చేసుకునే మనస్తత్వం.. అహల్య కంగారు చూసి ఏం భయపడవద్దనీ కొన్ని రోజులకి తనకే అర్దం అవుతుందని చెప్పేవాడు.
అహల్య వినయ్ ల పెళ్లి చాలా బాగా జరిగింది.. అత్తగారింట్లో మొదటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం. అహల్య అత్తగారు అన్నపూర్ణమ్మ తనని బాగా చూసుకునేవారు.. ప్రేమతో మాట్లాడేవారు.. రోజులు గడుస్తున్నా అహల్య ఏపని చేసేది కాదు.. అయినా ఏం అనేవారు కాదు
అన్నపూర్ణమ్మగారు. తనకీ ఏం తెలియట్లేదు.. అహల్య అమ్మ గారు ఎప్పటికప్పుడు చెప్పుతూనే ఉండేవారు అలా ఉండకూడదు అంటూ.. అహల్య పెద్ద వినిపించుకునేది కాదు.. అహల్య తల్లిదండ్రులకి అహల్య, భార్గవ ఇద్దరే సంతానం. భార్గవ పెద్దవాడు.. అహల్య పెళ్లి జరిగిన రెండు ఏళ్ల కి భార్గవ పెళ్లి జరిగింది.. వాళ్ళు ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో కాపురం.. ఇద్దరు ఉద్యోగస్తులు.. భార్గవ పెళ్ళి జరిగేనాటికి అహల్య కి ఒక్క పాప. పేరు మానస.. ఒక్క రోజు అహల్య స్నేహితురాలు తనని చూడదానికి వచ్చింది.. మాటల్లో వాళ్లు వేరు కాపురం అని. వాళ్లకు నచ్చినట్లు ఉంటున్నారని చెప్పింది. లేవడం దగ్గర నుండి బయటకు వెళ్లడం, ఇంటికి ఏం కావాలో వాళ్లే కొనుక్కోవడం ఇవ్వనీ వాళ్లకు నచ్చినట్లు చేసుకుంటారనీ ఎవ్వరి ప్రమేయం ఉండదనీ చెప్పింది.. పాప పుట్టిన సంవత్సరం తర్వాత అహల్య ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వినయ్ వాళ్ళ అమ్మ గారు కూడా తనని ప్రోత్సహించారు.
పాపని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా నువ్వు ఉద్యోగానికి వెళ్లు అని ధైర్యం చెప్పారు.వినయ్ కి అహల్య ఇష్టం కన్నా ఇంకేది ఎక్కువ కాదు. అహల్య కి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతంతో పాపకి వినయ్కి వాళ్ల అత్త గారికి,మావయ్యగారికీ బట్టలు కొంది.. ఇంటికి స్వీట్స్ పట్టుకెళ్లింది. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఇంటికి ఫర్నిచర్ మారుద్దామనుకుంది.
కాని వాళ్ల అత్తగారు వద్దన్నారు వినయ్ వాళ్ల నాన్న గారి ఇష్టం మీద కొన్నవి అని ఆవిడ వాళ్ల తదనంతరం వరకు అలానే ఉంచమని కోరారు. పోని వంట ఇంట్లోవి ఏమైనా ముచ్చట పడి కొంటే ఎందుకు మనీ అనవసరంగా ఖర్చు పెట్టారు అనేవారు. ఏది చేద్దామన్నా అవసరం లేదు కదా వద్దులే అనేవారు. అహల్యకి విరక్తి వచ్చేసేది.ఏం చేద్దామన్నా వద్దు వద్దు అంటున్నారని చిరాకు పడేది. తన కొలిగ్స్ అందరూ వాళ్ల జీవితాన్ని వాళ్ల కు నచ్చినట్లు గడుపుతున్నారు.. కనీసం వీళ్ళు సినిమాకి వెళ్లాలన్నా వాళ్ల అత్త మావయ్య గార్లకి చెప్పి వెళ్లాలి.. ఒక్కోసారి వాళ్లు చూసే సినిమా ఐతే వాళ్లు వీళ్ల కూడా వెళ్లే వారు.అహల్య కి వేరు కాపురం పెట్టాలన్న కోరిక ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. అదే విషయాన్ని వినయ్ కి చాలా సార్లు చెప్పింది.వినయ్ ఒప్పుకునేవాడు కాదు. అమ్మ వాళ్లు ఎలా ఉండగలరు. ఇప్పటి వరకూ ఒంటరిగా లేరు. నేను ఒక్కడినే కదా వాళ్లకు నన్ను వదిలి ఎందుకు ఉంటారు అదీ ఇదే ఊరిలో నా ఉద్యోగం ఐనప్పుడూ.అదీగాక ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ పాపని చూసుకోవడం కష్టం కదా అని చెప్పినా వినిపించుకునేది కాదు. ఈ విషయంలో భార్యభర్తల కి విపరీతంగా వాదనలు జరిగేవి. చూచాయగా వీటి గురించి వినయ్ అమ్మ గారికీ తెల్సింది. ఆవిడ బాధ పడేవారు.
ఒక్కరోజు వినయ్ వాళ్ల కు తెల్సిన వాళ్లు తీర్థయాత్రలకు వెళ్తున్నారు అంటే వినయ్ తల్లిదండ్రులు మేమూ వెళ్తున్నాం అన్నారు. వినయ్ అహల్య వాళ్లకు అన్నీ సమకూర్చి రైలు ఎక్కే వరకు ఉండి బయలుదేరారు. అహల్య కొన్ని రోజులకే కదా అని కేర్ టేకర్ ని పెట్టుకుంది.ఐనా రోజూ ఇంటిపని వంట పని పాపని చూసుకుని ఆఫీస్కు వెళ్లేటప్పటికి ఆలస్యం ఐపోయేది. ఎంత కేర్ టేకర్ని పెట్టుకున్నా వాళ్ల అత్తగారు చూసుకున్నంత సేపు గానీ ఆవిడలా గాని చూసుకుంటారా. వినయ్ తల్లిదండ్రులు మానసను కంటికి రెప్పలా పెంచేవారు. రిటైర్మెంట్ అనంతరం వినయ్ నాన్నగారికి పాప వల్ల సమయం తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్లు యాత్రలకి వెళ్లడం వల్ల అహల్యకి పాప దగ్గర చాలా సమయం గడపాల్సి వచ్చేది. ఇప్పటి వరకూ ఇంటి పనులు ముట్టుకోకపోవడం వల్లన ఏవి చేతనయ్యేవి కాదు. మొదటి కొన్ని రోజులైతే అన్నమే సరిగ్గా వండటం చేతనయ్యేది కాదు. ఎప్పుడూ పెద్దగా విసుగుక్కోని వినయ్ ఈ మధ్య విసుక్కోవడం చిరాకు పడడం ఎక్కువ ఐపోయింది. తనకీ పాపని చూసుకోవాల్సి రావడం తో కష్టమైపోయేది.
ఇదివరకంటే అన్నీ చూసుకోవడానికి అన్నపూర్ణమ్మ గారు ఉండేవారు కాబట్టి వీళ్లకు ఏం తెలిసేది కాదు. అహల్య వాళ్ల అమ్మను రమ్మని ఎన్నో సార్లు అడిగింది. కానీ వాళ్ల కోడలు గర్భవతి కావడం వల్ల వాళ్ల దగ్గరకు వెళ్లారు. అంతేగాక కూతురికి ఈ విధంగానైనా అన్ని తెలిసి వస్తాయి అని వెళ్లకూడదు అనుకున్నారు.. ఇంక అన్నపూర్ణమ్మ గారు రావడానికి పది రోజులు ఉందనగా మానసకి విపరీతంగా జ్వరం వచ్చింది..అర్దరాత్రి ఒక్కటే వాంతులు..
ఒళ్లు కాలిపోతుంది.. దంపతులు ఇద్దరికీ కంగారు మొదలయింది.. వెంటనే హస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. కంగారు పడాల్సిన పని లేదని సరైన ఆహరం అందకపోవడం వల్ల అలానే కొంచెం శుభ్రంగా ఉండకపోవడం వల్ల ఇలా జరిగింది అని జాగ్రత్తగా చూసుకోమని మందులు రాసిచ్చి పంపించారు డాక్టర్లు. అహల్య కి చెప్పలేనంత కోపం వచ్చింది కేర్ టేకర్ మీద. మర్నాడు గట్టిగా నిలదీస్తే నన్నేం చేయమంటారు మీ పాప ఎంతలా పెట్టినా తినకపోతే అని వాదించేటప్పటికి విసుగు చెంది మాన్పించేసి తనే సెలవు పెట్టుకుని మానసను చూసుకునేది.. అన్నపూర్ణమ్మ గారు ఇంటికి వచ్చాక కొడుకు కోడలు వేరు కాపురం పెడతాం అంటే ఒప్పుకోవాలి మీరు మా గురించి ఆలోచించద్దు అని చెప్పాలనుకుంది.. ఎందుకంటే తన కూడా వచ్చిన చాలా మంది పిల్లలకు దూరంగానే ఉంటున్నారు..
భార్య గాని భర్త గానీ తోడు లేని వారు కూడా పిల్లలకు దూరంగా ఉన్న వాళ్లని చాలామందిని చూసింది. తమ వల్ల పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు అని నిశ్చయించుకొన్నారు. అన్నపూర్ణమ్మ దంపతులు ఇంటికి తిరిగి వెళ్లేటప్పటికి కొడుకు కోడలు ఆనందంగా ఎదురు వచ్చారు.. అహల్య ఐతే మీరు లేకపోతే మాకు గడవలేదనీ.. మీ విలువ తెల్సుకున్నాం అని వేరు కాపురం పెడదాం అని అన్నందుకు పశ్చాత్తాపం చెందుతున్నాం అని క్షమాపణలు కోరింది. ఇందతా ఊహించని అన్నపూర్ణమ్మ గారు ఆనందం చెంది కొడుకుకీ కోడల్కి ఇష్టమైనవి అన్నీ వండిపెట్టారు.. వాటిని ఆస్వాదిస్తూ తింటూ అహల్య వినయ్ లు అమ్మ వంటనే కాదు అమ్మ ప్రేమను కూడా ఎంతగా మిస్ ఐయ్యామో కదా అనుకుంటూ తృప్తి గా భోజనం ముగించారు.. ఇటువైపు హాలులో చూస్తే మానస నాయనమ్మతో కబుర్లు చెప్తూ కేరింతలు కొడుతూ నాయనమ్మ పెట్టె గోరుముద్దలు తింటుంది.
తాతయ్య బొమ్మలతో ఆడిస్తున్నారు. ఈ దృశ్యం చూసిన అహల్య అనుకుంది ఎంత మందికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం. ఎదుటి వాళ్ల మాటలు విన్ని ఎంత ప్రలోభ పడ్డాను.. ఇంత ప్రేమగా చూసుకునే అత్తగారు మావయ్య గారు అందరికీ దొరుకుతారా.. ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటామో కదా మనం తల్లిదండ్రుల ప్రేమను.. అది దొరకనప్పుడు మాత్రమే మనకు దాని విలువ తెలిసేది.. ఎంతమంది అత్తగార్లు కోడల్లను భాధ పెట్టకుండా ఉంటున్నారు.. అలాంటి వారి నుండి దూరంగా వెళ్లినా బాధపడం ఏమో కానీ నేను తొందర పాటుతనంతో వేరు కాపురం పెట్టి ఉంటే జీవితాంతం బాధ పడేదాన్ని అని ఆలోచనలో ఉండగా అత్తగారి పిలుపు కి ఏంటండీ అత్తగారు అనుకుంటూ వెళ్లింది.. నీకు ఇష్టమని పెసర పునుకులు వేసాను ప్లేట్ లో పెట్టాను తీస్కోమ్మ అన్నారు అన్నపూర్ణమ్మగారు.. పెసర పునుకులు తింటున్న అహల్య కు అవి ఎప్పటి మీద ఇప్పుడు ఇంకా రుచికరంగా అనిపించాయి... *****

