హొయసల సామ్రాజ్యం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

హొయసల  సామ్రాజ్యం .


హొయసల సామ్రాజ్యం .
భారతీయ శిల్పకళాప్రతిభకు నిదర్శనం వీరునిర్మించిన దేవాలయాలు . భారత ఉపఖండం నుండి ఉద్భవించిన కన్నడ రాచరిక సామ్రాజ్యం. ఇది 10-14 వ శతాబ్దాల మధ్య ఆధునిక కర్ణాటక లోని చాలా ప్రాంతాన్ని పరిపాలించింది. హొయసల రాజధాని మొదట్లో బేలూరు వద్ద ఉండేది, కాని తరువాత హళేబీడుకు తరలించారు.
ఈ వంశం బహు విస్తృతమైనది.ఈ వంశమే అనేక శాఖలుగా చీలి రాష్ట్రకూటులు, కాకతీయులు, చోళులు, చాళుక్యులు, పల్లవులు, పల్నాడు వంశీకులు, దుర్జయులు, వడయార్లు, యాదవరాయలు చంద్రగిరి ప్రాంత పాలకులు, కార్వేటి నగర రాజులూ, విజయం నగర రాజులూ హంపి మొదలైన విస్తృత రాజవంశాలుగా పాలించింది.
హొయసల పాలకులు మొదట పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతం మాలెనాడుకు చెందిన వారు. 12 వ శతాబ్దంలో, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం, కల్యాణికి చెందిన కాలచుర్యుల మధ్య జరుగుతూండే పరస్పర వినాశకర యుద్ధాలను సద్వినియోగం చేసుకొని, వారు ప్రస్తుత కర్ణాటక ప్రాంతాలను, ప్రస్తుత తమిళనాడులోని కావేరి డెల్టాకు ఉత్తరాన ఉన్న సారవంతమైన ప్రాంతాలనూ స్వాధీనం చేసుకున్నారు. 13 వ శతాబ్దం నాటికి, వారు కర్ణాటకలో ఎక్కువ భాగం, తమిళనాడులోని చిన్న భాగాలు, పశ్చిమ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలనూ పరిపాలించారు.
దక్షిణ భారతదేశంలో కళ, వాస్తుశిల్పం, మతం అభివృద్ధిలో హొయసల శకం ఒక ముఖ్యమైన కాలం. ఈ సామ్రాజ్యం ఈ రోజు ప్రధానంగా హొయసల వాస్తుశైలికి గుర్తుండిపోతుంది. ప్రస్తుతం వందకు పైగా హొయసల కాలానికి చెందిన దేవాలయాలు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నాయి.
"అద్భుత శిల్పకళను ప్రదర్శించే ప్రసిద్ధ దేవాలయాలు" చెన్నకేశవ ఆలయం, బేలూర్, హొయసలేశ్వర ఆలయం, హళేబీడు సోమనాథపురలోని చెన్నకేశవ ఆలయం. హొయసల పాలకులు లలిత కళలను పోషించారు, కన్నడ, సంస్కృత భాషల్లో సాహిత్య పోషణ చేసారు.
కన్నడ జానపద కథలు సాలా అనే యువకుడి కథను చెబుతాయి. ఈ యువకుడు, అంగడి అనే గ్రామం వద్ద ఉన్న వాసంతిక దేవాలయం సమీపంలో, ఒక పులిని కొట్టి చంపి, తన జైన గురువు సుదత్తను రక్షించాడు. ప్రాచీన కన్నడలో "హాయ్" అంటే కొట్టడం అని. అందుకే ఆ పులిని సాలా అనే యువకుడు కొట్టి చంపిన ఈ స్థలానికి "హొయ్-సాలా" అని పేరు వచ్చింది. ఈ గాథ మొదట విష్ణువర్ధనుడి (1117) బేలూరు శాసనంలో కనిపించింది. కాని సాలా కథలోని అనేక అసంబద్ధతల కారణంగా ఇది జానపదాలకే పరిమితమైంది. హొయసల రాజ చిహ్నంలో పౌరాణిక యోధుడు సాలా పులితో చేస్తున్న పోరాటాన్ని వర్ణించడాన్ని బట్టి చూస్తే, తాలక్కాడు వద్ద చోళులపై విష్ణువర్ధనుడు విజయం సాధించిన తరువాత ఈ పురాణం ఉనికిలోకి వచ్చి ఉండవచ్చు లేదా ప్రజాదరణ పొంది ఉండవచ్చునని భావించవచ్చు.
1078, 1090 నాటి శాసనాల్లో యాదవ వంశాన్ని "హొయసల వంశం" గా సూచించడం ద్వారా హొయసలులు యాదవుల వారసులు అని సూచించాయి. కానీ హొయసలను ఉత్తర భారతదేశంలోని యాదవులతో నేరుగా అనుసంధానించే ప్రారంభ రికార్డులేమీ లేవు.
అనేక శాసనాల్లో హొయసలులను మలేపరోల్‌గండ (అంటే "మలే రాజాధిరాజులు") అని పేర్కొన్నాయి. వీటి ఆధారంగా చరిత్రకారులు రాజవంశం స్థాపకులను మలేనాడుకు చెందినవారని పేర్కొంటారు. కన్నడ భాషలో ఈ బిరుదును హొయసల రాజులు తమ శాసనాల్లో తమ రాజ సంతకంగా సగర్వంగా ఉపయోగించారు. ఆనాటి కన్నడ (జాతకతిలక), సంస్కృత (గద్యకర్ణామృత) సాహిత్య మూలాలు కూడా, హొయసలులు ఈ రోజు కర్ణాటకగా పిలువబడే ప్రాంతానికి చెందినవారని నిర్ధారించడానికి సహాయపడ్డాయి.
మొట్టమొదటి హొయసల కుటుంబ రికార్డు 950 నాటిది. తొలుత అరేకాల్లా ఈ వంశాధిపతిగా పేర్కొంది. తరువాత మరుగ, నృపకామ I (976) వచ్చారు. తరువాతి పాలకుడు, ముండా (1006-1026), అతడి తరువాత నృపకామ II వచ్చారు. ఇతడికి పశ్చిమ గంగా రాజవంశంతో పొత్తును సూచించే పెర్మానడి అనే బిరుదు ఉంది. అలా చిన్నస్థాయిలో మొదలయ్యాక హొయసల రాజవంశం, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యానికి బలమైన సామంతులుగా రూపాంతరం చెందింది. విష్ణువర్ధనుడి విస్తారమైన సైనిక విజయాల ద్వారా, హొయసలులు మొదటిసారి నిజమైన సామ్రాజ్య హోదాను సాధించారు. అతను 1116 లో చోళుల నుండి గంగావాడిని పట్టుకుని, రాజధానిని బేలూరు నుండి హళేబీడు (ద్వారసముద్రం) కు తరలించాడు. ఇతడు క్రీస్తు శకం 1131 నాటికి రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది వరకూ విస్తరింపజేశాడు.
స్వతంత్ర సామ్రాజ్యాన్ని సృష్టించాలనే విష్ణువర్ధనుడి ఆశయం అతని మనవడు రెండవ వీర బల్లాలుడు నెరవేర్చాడు. అతను 1187–1193లో హొయసలను సామంతుల స్థాయి నుండి విడిపించాడు. ఆ విధంగా పశ్చిమ చాళుక్య సామ్రాజ్యానికి సామంతులుగా మొదలై, క్రమంగా విష్ణువర్ధన, రెండవ వీర బల్లాలుడు, తరువాత మూడవ వీర బల్లాలుడు వంటి బలమైన హొయసల రాజులతో తమ సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకుని, పాలించారు. - ఈ సమయంలో, దక్కన్ పీఠభూమిపై పెత్తనం కోసం హొయసలులు, పాండ్యులు, కాకతీయులు, సెవునుల (దేవగిరి యాదవులు) మధ్య చతుర్ముఖ పోరాటం జరిగింది.. పాండ్యులు చోళ రాజ్యంపై దాడి చేసినప్పుడు వారిని వీర బల్లాలుడు II ఓడించాడు. అతను "చోళరాజ్యప్రతిష్టాచార్య", "దక్షిణ చక్రవర్తి ", "హొయసల చక్రవర్తి" అనే బిరుదులు పొందాడు. కన్నడ జానపద కథల ప్రకారం బెంగళూరు నగరాన్ని స్థాపించారు.
1225 లో ఆధునిక తమిళనాడు ప్రాంతంలోకి హొయసలులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. శ్రీరంగం సమీపంలోని కన్ననూర్ కుప్పం నగరాన్ని ప్రాంతీయ రాజధానిగా మార్చుకున్నారు. దక్షిణ దక్కన్‌లో హొయసల ఆధిపత్య కాలం ప్రారంభమై, దక్షిణ భారత రాజకీయాలపై పట్టు తెచ్చుకున్నారు. వీర నరసింహ II కుమారుడు వీర సోమేశ్వర పాండ్యులు, చోళుల నుండి గౌరవప్రదమైన "మామ" (మామాడి) అనే బిరుదు తెచ్చుకున్నాడు. హొయసల ప్రభావం పాండ్య రాజ్యంలో కూడా వ్యాపించింది. సోమేశ్వరుడు మరణించాక, ఇతని కుమారులు రాజ్యాన్ని పంచుకున్నారు. 13 వ శతాబ్దం చివరినాటికి, మూడవ వీర బల్లాలుడు తమిళ దేశంలో పాండ్యుల తిరుగుబాటులో పోగొట్టుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తద్వారా రాజ్యపు ఉత్తర, దక్షిణ భాగాలను మళ్ళీ ఏకం చేసాడు.
14 వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలు ముస్లిం పాలనలో ఉన్నప్పుడు, దక్కన్ ప్రాంతంలో పెద్ద రాజకీయ పరివర్తనలు జరుగుతున్నాయి. ఢిల్లీ సుల్తానైన అల్లాఉద్దీన్ ఖిల్జీ, దక్షిణ భారతదేశాన్ని తన ఆధిపత్యంకిందకు తెచ్చుకునేందుకు, సెవున రాజధాని దేవగిరిని దోచుకోవడానికి, 1311 లో తన సేనాధిపతి మాలిక్ కాఫుర్ ను పంపించాడు. 1318 నాటికి సెవున సామ్రాజ్యాన్ని అణచివేసాడు. 1311, 1327 లలో రెండుసార్లు హొయసల రాజధాని హళేబీడును కొల్లగొట్టారు.
1336 నాటికి, సుల్తాన్ మదురై పాండ్యులను, ఓరుగల్లు కాకతీయులను, చిన్న రాజ్యమైన కంపిలినీ స్వాధీనం చేసుకున్నాడు. సుల్తాను సైన్యాలను ప్రతిఘటించిన హిందూ సామ్రాజ్యం హొయసలులు మాత్రమే. మూడవ వీరబల్లాలుడు స్వయంగా తానే తిరువణ్ణామలై వద్ద నిలబడి, ఉత్తరం నుండీ, దక్షిణాన మదురై సుల్తానుల నుండీ వచ్చే దండయాత్రలను గట్టిగా ప్రతిఘటించాడు. దాదాపు మూడు దశాబ్దాల ప్రతిఘటన తరువాత, 1343 లో మదురై యుద్ధంలో మూడవ వీరబల్లాలుడు మరణించాడు. హొయసల సామ్రాజ్యపు భూభాగాలు తుంగభద్రా నది ప్రాంతంలో హరిహర I పరిపాలించిన ప్రాంతాలతో విలీనం అయ్యాయి. ఈ కొత్త హిందూ రాజ్యం ఉత్తర దండయాత్రలను ప్రతిఘటించింది. తరువాతి కాలంలో ఇదే విజయనగర సామ్రాజ్యంగా ఖ్యాతిగాంచింది.
వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుండి వచ్చే ఆదాయాలే హొయసల పరిపాలనకు ఆధారం. లబ్ధిదారుల సేవలకు బహుమతులుగా రాజులు భూమిని మంజూరు చేసేవారు. వ్యవసాయ వస్తువులు, అటవీ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే అద్దెదారులకు వీళ్ళు భూస్వాములుగా మారేవారు. రెండు రకాల భూస్వాములు (గవుండలు) ఉండేవారు; ప్రజా గవుండలు, ప్రభు గవుండలు. ఈ రెండో తరగతి కంటే ప్రజా గవుండలు తక్కువ స్థాయిలో ఉండేవారు. సమశీతోష్ణ వాతావరణంతో ఉన్న ఎత్తైన ప్రాంతాలు (మల్నాడు ప్రాంతాలు) పశువుల పెంపకానికీ, తోటలకు, సుగంధ ద్రవ్యాలకూ అనుకూలంగా ఉంటాయి. వరి, మొక్కజొన్న ఉష్ణమండల మైదానాలలో (బెయిల్నాడు) పండించే ప్రధాన పంటలు. హొయసలులు తూములుండే చెరువులు, జలాశయాలు, కాలువల పైనా, స్థానిక గ్రామస్థుల ఖర్చుతో నిర్మించి, నిర్వహిస్తున్న బావులపైనా పన్నులు వసూలు చేసేవారు. విష్ణుసాగర, శాంతిసాగర, బల్లాలరాయసాగర వంటి సాగునీటి చెరువులను ప్రభుత్వ వ్యయంతో తవ్వించారు.
సాధారణ రవాణా కోసమూ, వివిధ భారతీయ రాజ్యాల సైన్యంలోని అశ్వికదళాల కోసమూ గుర్రాలను దిగుమతి చేసుకోవడం పశ్చిమ సముద్ర తీరంలో అభివృద్ధి
చెందుతున్న వ్యాపారం. టేకు వంటి గొప్ప అడవులను పెంచి, ఆ కలపను నేటి కేరళ ప్రాంతంలో ఉన్న ఓడరేవుల ద్వారా ఎగుమతి చేసారు. దక్షిణ చైనా నౌకాశ్రయాలలో భారతీయ వ్యాపారులు ఉండేవారని చైనా లోని సాంగ్ రాజవంశం రికార్డులు పేర్కొంటాయి. విదేశీ రాజ్యాలతో వారు చురుగ్గా వాణిజ్యం జరిపేవారని ఇది సూచిస్తుంది. దక్షిణ భారతదేశం నుండి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, విలువైన రాళ్ళు, కుండలు, ఉప్పు, ఆభరణాలు, బంగారం, దంతాలు, ఖడ్గమృగం, ఎబోనీ, కలబంద కలప, పరిమళ ద్రవ్యాలు, గంధపు చెక్క, కర్పూరం, మసాలా దినుసులు తదితర వస్తువులను చైనా, ధోఫర్, ఏడెన్, సిరాఫ్ (ఈజిప్ట్, అరేబియా. పర్షియా ప్రవేశ ద్వారం) లకు ఎగుమతి చేసేవారు. దేవాలయ నిర్మాణాలు విరివిగా జరుగుతూండేవి కాబట్టి, ఆ నిర్మాణ కార్యకలాపాలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న విశ్వకర్మలు, శిల్పులు, క్వారీ కార్మికులు, స్వర్ణకారులు, ఇతర నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు కూడా సుసంపన్నంగా ఉండేవారు.
భూమి శిస్తు వసూలు చేయాల్సిన బాధ్యత గ్రామ అసెంబ్లీది. భూమి ఆదాయాన్ని సిద్ధయ అని పిలుస్తారు. అసలు శిస్తు (కులా) తో పాటు వివిధ సెస్సులు ఉండేవి. వృత్తులు, వివాహాలు, రథాలు లేదా బండ్లపై రవాణా చేసే వస్తువుల పైన, పెంపుడు జంతువులపైనా పన్ను విధించేవారు. వస్తువులపైన (బంగారం, విలువైన రాళ్ళు, పరిమళ ద్రవ్యాలు, గంధపు చెక్క, తాడులు, నూలు, గృహ, పొయ్యి, దుకాణాలు, పశువుల చిప్పలు, చెరకు ప్రెస్‌లు) అలాగే ఉత్పత్తుల పైనా (నల్ల మిరియాలు, బెట్టు ఆకులు, నెయ్యి, వరి, సుగంధ ద్రవ్యాలు, తాటి ఆకులు, కొబ్బరికాయలు, చక్కెర) వేసే పన్నుల వివరాలను గ్రామ రికార్డులలో రాసేవారు. చెరువుల నిర్మాణం వంటి నిర్దుష్టమైన పనుల కోసం గ్రామ అసెంబ్లీ ప్రత్యేక పన్ను వసూలు చేసేవారు.
పరిపాలనా పద్ధతులలో, హొయసల సామ్రాజ్యం క్యాబినెట్ వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ, స్థానిక పాలక సంస్థల నిర్మాణం, భూభాగాల విభజన వంటి పూర్వీకులు స్థాపించి, పాటించిన వ్యవస్థలనే అనుసరించింది. నేరుగా రాజు అధీనంలో పనిచేసే అనేక ఉన్నత పదవుల పేర్లను రికార్డులు చూపుతాయి. సీనియర్ మంత్రులను పంచ ప్రధానులు అనేవారు. విదేశ వ్యవహారాల బాధ్యత కలిగిన మంత్రులను సంధివిగ్రహి అనేవారు. ముఖ్య కోశాధికారిని మహాభండారి అనీ, హిరణ్యభండారి అనీ పిలిచేవారు. దండనాయకులు సేనాధిపతులుగా ఉండేవారు. హొయసల న్యాయాలయంలో ప్రధాన న్యాయమూర్తిని ధర్మాధికారి అనేవారు.
హొయసల రాజ్యం నాడు, విషయ, కంపన, దేశ అనే విభాగాలు, ఉపవిభాగాలుగా విభజించారు. ప్రతి ప్రాంతంలో ఒక స్థానిక పాలకమండలి ఉంది, ఇందులో ఒక మంత్రి (మహాప్రధాన), ఒక కోశాధికారి (భండారి) ఉంటారు. ఈ మండలి ఆ ప్రాంత పాలకుడి (దండనాయక) కింద పనిచేస్తుంది. ఈ స్థానిక పాలకుడి క్రింద హెగ్గడ్డె లు, గవుండ లు అని పిలువబడే అధికారులు ఉంటారు. వారు స్థానికంగా రైతులను కూలీలనూ నియమించుకుని, సాగు చేయిస్తారు. అలూపుల వంటి సామంత పాలక వంశాలు సామ్రాజ్యం నిర్దేశించిన విధానాలను అనుసరిస్తూ తమ భూభాగాలను పరిపాలించడం కొనసాగించాయి.
గరుడులు అని పిలువబడే ఉన్నత శిక్షణ పొందిన అంగరక్షక దళం రాజ కుటుంబ సభ్యులను అన్ని సమయాల్లో రక్షిస్తూ ఉండేది. ఈ సేవకులు తమ యజమానికి చాలా దగ్గరలోనే ఉంటూ వారిని రక్షిస్తూండేవారు. అయితే ఎవరికీ కనబడకుండా ఉండేవారు. తమ యజమాని పట్ల వారి విధేయత ఎంత సంపూర్ణంగా ఉండేదంటే, యజమాని మరణిస్తే, వీరూ ఆత్మహత్య చేసుకునేవారు. ఈ అంగరక్షకుల జ్ఞాపకార్థం నిర్మించిన వీర స్థూపాలను (వీరగల్లు) గరుడ స్తంభాలు అంటారు. హళేబీడులోని హొయసలేశ్వర ఆలయంలో గరుడ స్తంభం, వీర బల్లాలుడు II కు మంత్రి, అంగరక్షకుడుగా ఉన్న కువర లక్ష్మణ గౌరవార్థం నిర్మించారు.
విష్ణువర్ధనుడి నాణేలపై "నోలంబవాడివిజేత" (నోలంబవాడిగొండ), "తాలకాడు విజేత" (తాలకాడుగొండ), "మలేపాల ప్రభువు" (మలేపారోలగండ), "మలేపా వీర" హొయసల శైలి కన్నడ లిపిలో ఉండేవి. వారి బంగారు నాణేన్ని హొణ్ణు లేదా గడ్యాన అని పిలుస్తారు. దాని బరువు 62 ధాన్యపు గింజల్ బరువుండేది. హొణ్ణు లో పదో వంతు పాణ, లేదా హాణ. పాణ లో నాలుగో వంతు హాగ. హాగలో నాలుగో వంతు వీశ..ఇవి కాకుండా బేళె, కాణి అనే ఇతర నాణేలు కూడా ఉండేవి.
11 వ శతాబ్దం ప్రారంభంలో చోళులు, జైన మతస్థులైన పశ్చిమ గాంగులను ఓడించడం, 12 వ శతాబ్దంలో వైష్ణవుల, లింగాయతుల సంఖ్య పెరగడం వల్ల జైన మతం పట్ల ఆసక్తి తగ్గింది. హొయసల భూభాగంలో రెండు ముఖ్యమైన జైన తీర్థ స్థలాలు శ్రావణబెళగొళ, కంబడహళ్లిలోని పంచకూట బాసాడి. దక్షిణ భారతదేశంలో బౌద్ధమతం క్షీణించడం, ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకర యొక్క అద్వైత వేదాంత వ్యాప్తితో ప్రారంభమైంది. హొయసల సమయంలో బౌద్ధ ప్రార్థనా స్థలాలు దంబల్, బల్లిగావి వద్ద మాత్రమే ఉండేవి. విష్ణువర్ధనుడీ రాణి శాంతల దేవి జైనమతావలంబి. అయినా బెలూరులోని హిందూ దేవాలయం కప్పే చెన్నిగరాయ ఆలయాన్ని ప్రారంభించారు. దీన్ని బట్టి రాజ కుటుంబం అన్ని మతాల పట్ల సహిష్ణుతతో ఉండేదని తెలుస్తోంది.
బసవ, మధ్వాచార్య, రామానుజ అనే ముగ్గురు తత్వవేత్తలచే ప్రేరణ పొందిన మూడు ముఖ్యమైన మత పరిణామాలు హొయసల పాలనలోనే జరిగాయి.
లింగాయతవాదానికి మూలం ఎక్కడ అనేది చర్చనీయాంశం గానే ఉంది. అయితే, 12 వ శతాబ్దంలో బసవ ద్వారా ఈ ఉద్యమం పెరిగింది. మధ్వాచార్యుడు ఆది శంకర బోధలను విమర్శించాడు. ప్రపంచం వాస్తవమైనదనీ, భ్రమ కాదనీ అతడు వాదించాడు. అతని ద్వైత సిద్ధాంతం బాగా వ్యాపించింది. ఉడుపిలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేసాడు. శ్రీరంగంలోని వైష్ణవ మఠం అధిపతి రామానుజుడు భక్తి మార్గాన్ని బోధించాడు. ఆదిశంకరుడి అద్వైతంపై విమర్శ అయిన శ్రీభాష్యం రాశాడు.
దక్షిణ భారతదేశంలో సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, వాస్తుశిల్పంపై ఈ మత పరిణామాల ప్రభావం చాలా లోతుగా ఉంది. ఈ తత్వవేత్తల బోధనల ఆధారంగానే ఆ తరువాతి శతాబ్దాల్లో ముఖ్యమైన సాహిత్య, కవిత్వ సృష్టి జరిగింది. విజయనగర సామ్రాజ్యంలోని సాళువ, తుళువ, ఆరవీడు రాజవంశాలు వైష్ణవ మతాన్ని అనుసరించేవారు. రామానుజ విగ్రహంతో ఉన్న ఒక వైష్ణవ ఆలయం విజయనగరంలోని విఠలపుర ప్రాంతంలో ఉంది. తరువాతి మైసూరు రాజ్యంలోని పండితులు రామానుజ బోధలను విస్తరిస్తూ వైష్ణవ రచనలు రాశారు. విష్ణువర్ధనుడు జైన మతం నుండి వైష్ణవ మతంలోకి మారిన తరువాత అనేక దేవాలయాలను నిర్మించాడు. మధ్వాచార్యుడి పరంపర లోని తరువాతి గురువులైన, జయతీర్థ, వ్యాసతీర్థ, శ్రీపాదరాజ, వడిరాజా తీర్థ వంటి వారితో పాటు, కర్ణాటక ప్రాంతానికి చెందిన విజయ దాస, గోపాలదాస వంటి భక్తులు (దాసులు) ఆయన బోధలను చాలా దూరం వ్యాపించారు. అతని బోధనలు గుజరాత్ లోని వల్లభ, బెంగాల్లో చైతన్య మహాప్రభు వంటి తత్వవేత్తలకు స్ఫూర్తినిచ్చాయి. 17 వ శతాబ్దం -18 వ శతాబ్దంలో భక్తి మార్గానికి చెందిన మరో తరంగం, అతని బోధనల నుండి ప్రేరణ పొందింది.
హొయసల సమాజం, ఆ కాలంలో అభివృద్ధి చెందుతున్న మత, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను అనేక విధాలుగా ప్రతిబింబిస్తుంది. ఈ కాలంలో, సమాజం మరింత అధునాతనంగా ఉండేది. మహిళల స్థితి వైవిధ్యంగా ఉండేది. కొంతమంది రాజ మహిళలు పరిపాలనా విషయాలలో పాల్గొన్నారు. రెండవ వీర బల్లాలుడు ఉత్తర భూభాగాల్లో సుదీర్ఘ సైనిక దండయాత్రల్లో మునిగు ఉండగా, రాణి ఉమాదేవి హళేబీడు పరిపాలనను చూసుకునేదని సమకాలీన రికార్డులలో ఉంది. ఆమె కొంతమంది భూస్వామ్య తిరుగుబాటుదారులతో పోరాడి ఓడించింది కూడా. మహిళలు లలిత కళలలో పాల్గొనేవారు. రాణి శాంతలా దేవి నృత్యం, సంగీతంలో నైపుణ్యం, 12 వ శతాబ్దపు కవయిత్రి, లింగాయతు యోగిని అక్కా మహాదేవి పేసిద్ధి చెందింది. ఆలయ నృత్యకారులైన దేవదాసీలసంస్కృతి ఉండేది. వారిలో కొందరు బాగా చదువుకొని కళలలో నిష్ణాతులై ఉండేవారు. ఈ అర్హతల వలన, రోజువారీ ప్రాపంచిక పనులకు పరిమితమైన ఇతర పట్టణ, గ్రామీణ మహిళల కంటే వారికి ఎక్కువ స్వేచ్ఛ ఉండేది. స్వచ్ఛంద సతి ఆచారం ప్రబలంగా ఉండేది. వ్యభిచారం సామాజికంగా ఆమోదం పొందింది. భారతదేశమంతా ఉన్నట్లే, కుల వ్యవస్థ స్పష్టంగా ఉండేది.
పశ్చిమ తీరంలో జరిగిన వాణిజ్యం అరబ్బులు, యూదులు, పర్షియన్లు, హాన్ చైనీస్, మలయ్ ద్వీపకల్పంలోని ప్రజలతో సహా అనేక మంది విదేశీయులను భారతదేశానికి తీసుకువచ్చింది. దక్షిణ భారతదేశంలో సామ్రాజ్య విస్తరణ ఫలితంగా అంతర్గతంగా ప్రజల వలసలు జరిగి కొత్త సంస్కృతులు, నైపుణ్యాలూ సమాజం లోకి వచ్చిచేరాయి. దక్షిణ భారతదేశంలో మార్కెట్లను నగరం అనేవారు. ఒక నగరం యొక్క కేంద్రకం గా పనిచేస్తున్న మార్కెట్ పిలిచారు. శ్రావణబెళగొళ వంటి కొన్ని పట్టణాలు 7 వ శతాబ్దంలో ఒక మతపరమైన స్థావరం నుండి 12 వ శతాబ్దం నాటికి గొప్ప వర్తకుల రాకతో ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందాయి. అయితే విష్ణువర్ధనుడు అక్కడ చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించినప్పుడు బేలూరు వంటి పట్టణాలు ఒక రాచ నగర వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పెద్ద దేవాలయాలు మత, సామాజిక, న్యాయవ్యవస్థ ప్రయోజనాలకు ఉపయోగపడ్డాయి. రాజును "భూమిపై వెలసిన దేవుడు" స్థాయికి ఎత్తి నిలిపాయి.
దేవాలయ భవనం వాణిజ్యపరంగాను, మతపరమైన కార్యక్రమాలకూ ఉపయోగపడింది. హిందూ మతం యొక్క ఏ ప్రత్యేక విభాగానికి మాత్రమే పరిమితం కాలేదు. హళేబీడుకు చెందిన శైవ వ్యాపారులు బేలూరులో నిర్మించిన చెన్నకేశవ ఆలయానికి పోటీగా హొయసలేశ్వర ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి, హళేబీడును కూడా ఒక ముఖ్యమైన నగరంగా రూపొందేలా చేసారు. హొయసల దేవాలయాలు లౌకిక భావనకు చెందినవి. హిందూ మతం లోని అన్ని శాఖల యాత్రికులను స్వాగతించాయి. కేవలం వైష్ణవ శిల్ప చిత్రణలతో కూడిన సోమనాథపురలోని కేశవ ఆలయం దీనికి మినహాయింపు మినహాయింపు. గ్రామీణ ప్రాంతాల్లో ధనిక భూస్వాములు నిర్మించిన దేవాలయాలు వ్యవసాయ వర్గాల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన అవసరాలను తీర్చాయి. పెద్ద దేవాలయాలన్నీ, ఎవరి ప్రాపకంలో ఉన్నాయనేదానితో సంబంధం లేకుండా, వివిధ వృత్తులకు చెందిన వందలాది మందికి ఉపాధి కల్పించే సంస్థలుగా మారాయి.
హొయసల పాలనలో సంస్కృత సాహిత్యం ప్రాచుర్యం పొందినప్పటికీ, స్థానిక కన్నడ పండితులకు కూడా రాజ ప్రోత్సాహం పెరిగింది. 12 వ శతాబ్దంలో కొన్ని రచనలు చంపూ శైలిలో రాసారు. కానీ కన్నడ ఛందస్సు మరింత విస్తృతంగా ఆమోదం పొందింది. కంపోజిషన్లలో ఉపయోగించే సాంగత్య ఛందం. పద్యాల్లో షట్పాది (ఆరు పాదాలు), త్రిపాది (మూడు పాదాలు) ఛందాలు, రాగాలే (గేయ కవితలు) ప్రజల, కవుల ఆదరణ పొందాయి. తీర్థంకరుల సద్గుణాలను ఉగ్గడించే జైన రచనలు కొనసాగాయి.
జన్నా, రుద్రభట్ట, హరిహర అతని మేనల్లుడు రాఘవంక వంటి పండితులకు హొయసల రాజాస్థానం పోషించింది. రాఘవంక కన్నడలో కళాఖండాల స్రష్ట. 1209 లో, జైన విద్వాంసుడు జన్న, యశోధరచరితె రాసాడు. ఇద్దరు కుర్రాళ్ళను స్థానిక దేవత మరియమ్మకు బలి ఇవ్వ బోయిన రాజు కథ అది. ఆ అబ్బాయిలపై జాలి కలిగిన రాజు, వారిని విడుదల చేసి, నరబలిని విసర్జిస్తాడు. ఈ రచనను పురస్కరించుకుని, రెండవ వీర బల్లాలుడు జన్నాకు "కవిచక్రవర్తి: అనే బిరుదును ప్రసాదించాడు.
రుద్రభట్ట అనే స్మార్త బ్రాహ్మణుడు తొలి ప్రసిద్ధ బ్రాహ్మణ రచయిత. రెండవ వీర బల్లాలుడి మంత్రి చంద్రమౌళి పోషణలో ఉండేవాడు. అంతకు ముందరి రచన విష్ణు పురాణంపై ఆధారపడి, అతను చంపూ శైలిలో జగన్నాథ విజయ రాశాడు. కృష్ణుడు బాణాసురుడిపై సాధించిన విజయ గాథ ఈ కావ్యం.
లింగాయతు రచయిత, మొదటి నరసింహ పోషణలో ఉన్న హరిహర (హరీశ్వర అని కూడా పిలుస్తారు), గిరిజాకళ్యాణ ను పాత జైన చంపూ శైలిలో రాశాడు. ఇది శివ పార్వతుల వివాహాన్ని పది విభాగాలలో వివరిస్తుంది. వచన సాహిత్య సంప్రదాయంలో భాగం కాని తొలి వీరశైవ రచయితలలో అతడు ఒకడు. అతడు హళేబీడుకు చెందిన కరణీకుల కుటుంబానికి చెందినవాడు. చాలా సంవత్సరాలు హంపీలో విరుపాక్షుని (శివుని యొక్క ఒక రూపం) స్తుతిస్తూ వందకు పైగా రాగళేలు రాశాడు . రాఘవంక తన హరిశ్చంద్ర కావ్య రచన ద్వారా కన్నడ సాహిత్యం షట్పాది ఛందాన్ని పరిచయం చేసాడు. ఈ రచనలో అక్కడక్కడా కన్నడ వ్యాకరణపు కఠినమైన నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ దీన్ని ఒక క్లాసిక్ రచనగా పరిగణిస్తారు .
తత్వవేత్త మధ్వాచార్యులు సంస్కృతంలో బ్రహ్మసూత్రాలపై ఋగ్భాష్య (వేదాలపై వ్యాఖ్య) రాశాడు. అతను తన తత్వశాస్త్రానికి తార్కిక రుజువు కోసం వేదాల కంటే పురాణాలపై ఎక్కువ ఆధారపడ్డాడు. మరో ప్రసిద్ధ రచన విద్యాతీర్థ రాసిన రుద్రప్రశ్నభాష్య.
హొయసల పట్ల ఆధునికుల ఆసక్తి, వారి సైనిక విజయాల కంటే కళ వాస్తుశిల్పానికి వారిచ్చిన ప్రోత్సాహమే కారణంగా ఉంది. దక్షిణాన పాండ్యులు, ఉత్తరాన దేవగిరి యాదవుల నుండి నిరంతరం బెదిరింపులు ఉన్నప్పటికీ రాజ్య మంతటా ఆలయాల నిర్మాణం చురుగ్గా జరిగింది. వారి నిర్మాణ శైలి, పశ్చిమ చాళుక్య శైలి యొక్క శాఖ. ప్రత్యేకమైన ద్రవిడ ప్రభావం ఇందులో కనిపిస్తుంది. హొయసల నిర్మాణ శైలిని సాంప్రదాయిక ద్రావిడ కంటే విభిన్నంగా, కర్ణాట ద్రావిడగా వర్ణించారు. ఇది అనేక ప్రత్యేక లక్షణాలతో ఉన్న దీన్ని స్వతంత్ర నిర్మాణ సంప్రదాయంగా పరిగణిస్తారు.
సూక్ష్మ వివరాలపై కూడా నిశితమైన దృష్టి పెట్టడం, నైపుణ్యం కలిగిన హస్తకళ వంటివి, హొయసల ఆలయ వాస్తు శైలిలోని విశిష్టతలు. ఆలయ మందిరం పై ఉన్న విమానం సంక్లిష్టమైన శిల్పాలతో అల్ంకరించారు. గోపుర రూపం, ఎత్తుల కంటే అలంకారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. దేవాలయ పీఠంలో ఒక క్రమాకృతిలో ఉన్న ఆరోహణ అవరోహణలు, గోపుర నిర్మాణంలో వివిధ అంతస్థుల్లో కూడా ఒక క్రమపద్ధతిలో కనిపిస్తాయి.. హొయసల ఆలయ శిల్పం కూడా స్త్రీ సౌందర్యం, హొయలు, శరీరాన్ని వర్ణించడంలో ఇదే విధమైన కుశలతను, హస్తకళా నైపుణ్యాన్నీ ప్రదర్శస్తుంది. హొయసల కళాకారులు భవనానికీ, శిల్పాలకూ మృదువైన రాయి సోప్‌స్టోన్ (క్లోరైటిక్ షిస్ట్) ను ప్రధాన ఉపయోగించారు.
బేలూరు వద్ద ఉన్న చెన్నకేశవ ఆలయం, హళేబీడు వద్ద ఉన్న హొయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని చెన్నకేశవఆలయం, అరసికేరె అమృతాపుర , బెలవాడి, నుగ్గహళ్ళి , హోసహోలలు, అరలగుప్పే, కోరవంగళ, హరన్‌హల్లి, మోసలే , బసరాలు హొయసల కళకు ఎన్నదగిన ఉదాహరణలు. బేలూరు, హళేబీడు దేవాలయాలు వాటి శిల్పా సౌందర్యానికి బాగా ప్రసిద్ది చెందాయి. హొయసల కళ చిన్న దేవాలయాల్లో, తక్కువ ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో మరింత స్ఫుటంగా వెల్లివిరుస్తుంది. ఈ దేవాలయాల వెలుపలి గోడలలో హిందూ ఇతిహాసాలను వర్ణించే శిల్పాలు, క్షితిజ సమాంతరంగా ఉండే చిత్రఫలకాలూ ఉన్నాయి. ఈ వర్ణనలు సాధారణంగా ప్రదక్షిణ చేసే దిశలో (సవ్యదిశలో) ఉంటాయి. హళేబీడు ఆలయం హిందూ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా వర్ణించారు. భారతీయ నిర్మాణ శైలిలో ఇదొక ముఖ్యమైన మైలురాయి. బేలూరు హళేబీడు
హొయసల పాలకులు కన్నడ భాషను పోషించారు. ఇది వారి శాసనాల్లో కూడా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా గద్యంలో కాకుండా మేలైన కవిత్వ రూపంలో ఉంటుంది. ఈ శాసనాలు అంచులలో పూలతో అలంకరించి ఉంటాయి .
చరిత్రకారుడు షెల్డన్ పొల్లాక్ ప్రకారం, హొయసల శకంలో సంస్కృతం పూర్తిగా స్థానభ్రంశం చెంది, దాని స్థానంలో కన్నడ అధికార భాషగా ఆధిపత్యం చెలాయించింది. దేవాలయాలు స్థానిక పాఠశాలలుగా పనిచేసాయి. ఇక్కడ బ్రాహ్మణ పండితులు సంస్కృతంలో బోధించారు. జైన, బౌద్ధ మఠాలు కొత్త సన్యాసులకు విద్యను అందించాయి. ఉన్నత విద్యాభ్యాసం చేసే పాఠశాలలను ఘటికలు అనేవారు. స్థానిక కన్నడ భాష దేవుడికి (వచనాలు, దేవరనామాలు) సాన్నిహిత్యం యొక్క పారవశ్య అనుభవాన్ని వ్యక్తీకరించడానికి, పెరుగుతున్న భక్తి ఉద్యమాలలో విస్తృతంగా ఉపయోగించారు. సాహిత్య రచనలు కన్నడంలో తాటి యాకులపై రాసారు. హొయసలకు ముందరి శతాబ్దాలలో జైన రచనలు కన్నడ సాహిత్యంలో ఆధిపత్యం చెలాయించగా, హొయసల పాలనలో శైవ, తొలి బ్రాహ్మణ రచనలు ప్రాచుర్యం పొందాయి. సంస్కృతం లోని రచనా ప్రక్రియల్లో కవిత్వం, వ్యాకరణం, నిఘంటువు, మాన్యువల్లు, వర్ణనలు, పాత రచనలకు వ్యాఖ్యానాలు, గద్య కల్పన, నాటకం ఉన్నాయి. శిలాశాసనాలు, తామ్రశాసనాలూ కన్నడలో ఎక్కువగా రాసారు. కొన్ని సంస్కృతంలో గాని, రెండు భాషల్లో గానీ ఉన్నాయి. ద్విభాషా శాసనాల్లో శీర్షిక, వంశవృక్షం, రాజు మూలానికి సంబంధించిన గాథలు, లబ్ధిదారుల వివరాలు సంస్కృతంలో ఉండేవి. భూమి వివరం, దాని సరిహద్దులు, స్థానిక అధికారుల భాగస్వామ్యం, దానగ్రహీత హక్కులూ బాధ్యతలు, పన్నులు, బకాయిలు, సాక్షులతో సహా దాన వివరాలన్నీ కన్నడ భాషలో ఉండేవి. ఈ విధంగా చెయ్యడంలో ఇది శాసనాంశాలు అస్పష్టత లేకుండా స్థానిక ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకునే వీలు కలిగిస్తుంది.
వీర భల్లాలుడి వంశస్తుడైన ఝల్లిగడ్డ గంగరాజు హైదరాబాద్ నవాబు కొలువులో సర్దార్ గా పరాక్రమం చూపించాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో చెలరేగిన పితూరీలను, అలజడులను అణచివేయడానికి గంగరాజును కొంత సైన్యంతో పంపాడు నవాబు. తర్వాత గంగరాజు కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకొని క్రమేణా 1608 లో మొగల్తూరు సంస్థానాన్ని స్థాపించాడు.
హొయసల శకంలో దక్షిణ భారతదేశంలో కళలు, శిల్ప కళాశైలి, సంస్కృతి చాలా అభివృద్ధి చెందాయి. ఈ సామ్రాజ్యము నేటికీ అద్భుతమైన హొయసల శిల్పానికి చిరస్మరణీయం. బేలూరులోని చెన్నకేశవాలయం, హళిబేడులోని హొయసలేశ్వరాలయం, సోమనాథపురంలో చెన్నకేశవాలయం వంటి ప్రసిద్ధ ఆలయాలతో పాటు కర్ణాటకంతటా విస్తరించి నేటికీ నిలిచి ఉన్న వందకు పైగా దేవాలయాలు హొయసల శిల్పకళకు తార్కాణం. హొయసల రాజులు లలిత కళలను కూడా ప్రోత్సహించి చేయూతనిచ్చారు. వీరి ఆదరణ వలన కన్నడ, సంస్కృత సాహిత్యాలు వెల్లివిరిశాయి.
సేకరణ .

మరిన్ని వ్యాసాలు

మాతృభాషకు చేయూత
మాతృభాషకు చేయూత
- మద్దూరి నరసింహమూర్తి
Nerchukovaali
నేర్చుకోవాలి
- మద్దూరి నరసింహమూర్తి
నకుల సహదేవులు
నకుల సహదేవులు
- ambadipudi syamasundar rao
సావర్కర్ .
సావర్కర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణపతికి పలు పేర్లు .
గణపతికి పలు పేర్లు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు