పిడికిలిలో ప్రపంచం - బాలసుబ్రహ్మణ్యం మోదుగ

పిడికిలిలో ప్రపంచం

పిడికిలిలో ప్రపంచం అని ఒక మొబైల్ కంపెనీ వారు ప్రకటించుకునేవారు. కాని జయదేవ్ గారి ఈ కార్టూన్ చూస్తే మాత్రం వాళ్ళ ప్రకటన వెనక్కి తీసుకోవలసి వుంటుంది.

'పాత వస్తువుల షాపు ' అని పేరుపెట్టిన ఈ కార్టూన్లో మనకు వెదికేకొద్దీ వస్తువులు దొరుకుతూనే వుంటాయి.

ఒకే చెప్పు మిగిలినవారికి రెండో చెప్పు, సీలింగ్ ఫాన్ కి ఒక రెక్క, గృహిణికి పళ్ళాలు, పిల్లలకి ఆటవస్తువులు, లాంటివి అక్కడ ప్రస్తుతం కొంతమంది వెతుక్కుంటున్నారు. అవి కాకుండా లెక్కలేనన్ని సామానులు। అన్నీ అన్ని రకాలు. ఓనరు మాత్రం మొత్తం సామాను పోయినా నష్టం లేదన్నంత తాపీగా ఫోన్ మాట్లాడడంలో మునిగిపోయి వున్నాడు. సామాను అతనికి వూరికే వచ్చినట్లు అనిపిస్తుంది. అతను షాపు పెట్టిన స్థలం కూడా ఎవరిదో ఆక్రమణ చేసుకున్నట్లు కనిపిస్తుంది.

నిజమే కావచ్చు ఎందుకంటే, ఆ వెనకాల పెద్ద నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే ఇతని స్థలానికి మంచి ధర వస్తుంది.

కాని ఈ విషయాన్ని అటుగా స్కూటర్ మీద వెళుతున్న దంపతులలో వెనక కూర్చున్న భార్య చటుక్కున కనిపెట్టేసి భర్తకు తెలియచేస్తోంది.

ఒక చిన్ని కార్టూన్లో ఇన్ని వివరాలు, ఇన్ని విషయాలు ఇమడ్చటం జయదేవ్ గారు ఒక్కరికే సాధ్యమౌతుందంటే అతిశయోక్తి కాదు.

 

వ్యాసకర్త: బాలసుబ్రహ్మణ్యం మోదుగ

ఫోన్: 9849674315 (వాట్సాప్)