సాయంకాలం సాగర తీరం - M chitti venkata subba Rao

Sayamkalam sagarateeram

సాయంకాలం సాగర తీరం ఆ ప్రదేశంలో అంత ఆకర్షణ శక్తి ఏముంది? సాయంకాలం అయిందంటే చాలు అందరికి వయోభేదం లేకుండా ఆ ప్రదేశానికి వెళ్లాలని మనసు పీకుతుంది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందో తెలిసిపోతుంది కానీ మాటిమాటికి అదే ప్రదేశం వెళ్లాలని అనుకుంటారు. అంత సమ్మోహన శక్తి ఏముంది అక్కడకు మనము వెళ్లి చూద్దాం. నడుచుకుంటూ వెళితే కాళ్లు కూరుకుపోయే ఇసుక, తీరానికి అలుపు సొలుపు లేకుండా కొట్టుకొచ్చే కెరటాలు ,ఏది తనలో దాచుకోకుండా ఒడ్డు మీదకి విసిరేసే ఆ సముద్రుడు , అది మంచి సరుకో తెలియదు మాయ సరుకో తెలియదు అయినా ఎక్కడినుంచో విదేశాల నుంచి సరుకు మోసుకుని నాలుగు రోజులపాటు ఆ బరువు బాధ్యతలు దింపుకోవడానికి అక్కడ సముద్రంలో రెస్ట్ తీసుకునే పెద్ద పెద్ద పడవలు, మన సరుకు విదేశాలకు రుచి చూపించడానికి తీసుకుపోయే పెద్ద పెద్ద పడవలు ,నిండుగా పదేళ్లు కూడా ఉండవు అయినా బ్రతుకు సమరంలో పాట్లు పడే పిల్లవాడు చిన్న పడవ నడుపుతూ వలలో చిక్కే చేప కోసం కెరటాలకు ఎదురు తిరుగుతున్న దృశ్యం, కొంతమంది ఆ నీళ్లలో జలకాలాడే సన్నివేశం. అరుపులు గోలలు ఈలలు కేకలు ఒకటేమిటి అది ఒక పెద్ద మార్కెట్ లా ఉంటుంది .ఎవరి మాట ఎవరికీ వినపడదు. భూభాగంలో మూడు వంతులు జలమే ఆక్రమించుకుందిట. అయినా మనిషికి దాహం తీరటం లేదు ఎందుకు? .పోనీ అన్ని నీళ్లు ఉన్నాయి కదా దోసెడునీళ్లతో దాహం తీర్చుకుందాం అంటే అబ్బా ఉప్పు కషాయం. ఉప్పు నీళ్లు ఉంటేనేo ఆ సముద్రుడు మనకు ఒక దేవత. పంచభూతాల్లో నీ రు ఒకటి కదా. పంచభూతాలన్నీ పరోపకారార్ధం ఇదం శరీరం అంటూ మనకి ఆదర్శం నేర్పిన మహామూర్తులు. పుణ్యతిధులలో నాలో మూడుమునకలు వేస్తే పుణ్యం ఇస్తాను కానీ నీళ్లుతో మీరు గొంతు తడుపుకోలేరు అంటాడు సముద్రుడు. ఇంకా అక్కడికి వచ్చేవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్లు , వయసు ఎంతో తమకు తెలియని వాళ్ళు ,కారు మీద దిగిన వాళ్ళు, కాలినడకన వచ్చిన వాళ్ళు, రెండు చక్రాల బళ్ళ మీద వచ్చిన వాళ్ళు, అన్ని రకాల వాళ్లు ఉంటారు. ఇక్కడేమీ టిక్కెట్ వసూలు చేయరుగా. అందుకే అక్కడికి పరిగెడుతుంటారు సాయంకాలం పూట సేద తీరుతుంటారు అక్కడికి వెళ్లిన తర్వాత ఏం చేయాలి? కొంతమందికి అది వాకింగ్ చేయడానికి అడ్డా. వయసు మళ్ళిన వాళ్ళకి ఆ బెంచ్ మీద కూర్చుని గత స్మృతులు నెమరు వేసుకోవడానికి ఒక సుందర ప్రదేశం.వయసులో ఉన్నవాళ్లు ఇసుకలో పరిగెడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ గాలిలో తేలిపోతూ ఆనందంగా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ కాలక్షేపం చేసే ప్రదేశం. ప్రేమ పుట్టేది అక్కడే, వికటించిన ప్రేమకు దారి వెతుక్కునేది అక్కడే. తమకు తెలిసిందల్లా ఒకటే ఆ వయసు వారికి, కనబడిందల్లా కొనమని అడగడం ,ఇసుకలో పరుగులెత్తడం, సముద్రంలో స్నానం చేస్తానని పేచీ పెట్టడం అయినా అమ్మ చెయ్యి వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుని నాలుగు కళ్ళతో పిల్లను చూసుకుంటూ కాలక్షేపం చేసే ప్రదేశం. ఆ ఇసుకలో అందంగా కట్టుకున్న ఇళ్ళు ఒక్కసారి సముద్ర కెరటాల తాకిడికి కూలిపోయినప్పుడు ఆ పిల్లల కళ్ళలో కన్నీళ్లు చూసి తల్లడిల్లిపోయే తల్లితండ్రులు తిరిగే ప్రదేశం. కుంభవృష్టి కురిస్తే తప్పితే అన్ని కాలాల్లోనూ ఆ తీరానికి తప్పనిసరిగా చేరుతుంటారు.మరి మనుషులకి సముద్ర తీరం ఆనందం ఇస్తోందని చెప్పుకుంటూ వస్తున్నా o మరి దేవుడికి కూడా నేను సహాయం చేశాను అంటూ గర్వంగా చెప్పుకుంటూ వస్తాడు సముద్రుడు. మరి ఏమిటని ప్రశ్నించకుండానే రావణుడు ఎత్తుకుపోయిన సీతాదేవి నీ అన్వేషించే సమయంలో హనుమంతుడికి రాముడికి కూడా నేను ఎంతో సహాయం చేశాను అంటాడు. అసలు ప్రతి పురాణం సముద్రుడు లేకుండా ఎలా ఉంటుంది. అయితే సముద్రతీరం ఒక ఆహ్లాదం ఇచ్చే ప్రదేశమేనా కాదు మా బ్రతుకుకి కూడా అదే ఆధారం అని చాలామంది గర్వంగా చెప్పుకుంటారు. సముద్రo ఇన్ని ఉప్పునీళ్లను తన గర్భంలో దాచుకుని మనం తినే ఆహార పదార్థాలు చప్పగా లేకుండా నాలుగు ఉప్పు రాళ్ళను తయారుచేసి ఇస్తోంది మరి ఉప్పు రాళ్లనే కాకుండా జల సంపద ఎంతో తన గర్భంలో దాచుకుని మాంసాహారులకి ఆహారాన్ని, ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది. బెస్త వారికి నేస్తమై ఆనందాన్నిస్తోంది. ఆ అగాధంలో జల నిధులు ఎన్నో. మేధస్సు పెరిగిన మానవుడు సముద్రం అడుగు నుంచి ఇంధనం తీసి అన్ని రకాల వాహనాలకి ప్రాణం తెచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఆ ఇంధనమే మాకు ధనం అంటోంది ప్రభుత్వం. సముద్రంలో ఎగిసిపడే కెరటాలని చూసి అందరికీ ఉత్సాహం వచ్చిన అందులో ఎంతో జీవిత సత్యం ఉంది. ఎంతో ఉధృతంగా ముందుకు వచ్చే కెరటాలు మళ్లీ అలాగే వెనకకు వెళ్ళిపోతాయి. అవి మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలతో సమానం. తన కడుపులో ఎన్ని బడబాగ్నిలున్న సముద్రం తరతరాలుగా అలా సాగిపోతూనే ఉంది. అంటే మనిషి ఎన్ని కష్టనష్టాలు ఉన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి. అధైర్యపడి ఆ సముద్రమే దిక్కని అనుకోకూడదు. ఎప్పుడూ కెరటాల హోరుతో చాలా హుషారుగా ఉండే సాగరపు ఘోష బూడిదలో పోసిన పన్నీరు. ఆర్చేవారు కానీ తీర్చేవారు కానీ ఉండరు. అయినా కానీ సాగరం తన ప్రయత్నం ఆపదు .ఇదే మానవజాతికి మంచి స్ఫూర్తి. అయినా సాగర ఘోష ఒక స్వర కారుడికి స్వరమై నంది పతకం సంపాదించి పెట్టింది. ఒక మహాకవి కావ్యానికి పేరుగా నిలిచి పద్మశ్రీ అవార్డు సంపాదించి పెట్టింది. తన జీవిత చరిత్ర కాకపోయినా ఒక గొప్ప దర్శకుడు తీసిన సాంఘిక చిత్రానికి పేరుగా నిలిచింది. విదేశాల నుండి సరుకులు మోసుకొచ్చి, మళ్ళీ మన దేశం నుండి సరుకు తీసుకుపోయే పెద్దపెద్ద పడవలకు ఈ సముద్రం ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా దేశ రక్షణకి యుద్ధ నౌకలను కూడా నడిపించి దేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తోంది. ఎక్కే సరుకు దిగే సరుకులతో విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రభుత్వానికి సంపాదించి పెట్టడమే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర వహిస్తోంది ఆ నీలిరంగు సముద్రం. విదేశాలకు వెళ్లాలంటే అందరికి ఇష్టమే. అలాగే విహారయాత్రలు కూడా వెళ్లాలంటే అందరికీ సరదా. సుదూర తీరాలలో ఉన్న విహారయాత్రలకు విదేశాలకి వెళ్లాలంటే గాల్లో నడిచే విమానం ఎక్క వచ్చు. విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. మరి కొంతమందికి విమాన ప్రయాణం అంటే భయం. నీటిపై నడిచే నౌకలలో కూడా ప్రయాణం చేసి గమ్యం చేరవచ్చు. ప్రయాణపు ఖర్చు తక్కువ. అందుకే విదేశస్థుడైన వాస్కోడిగామా కి ప్రతిరోజు మనం చేసుకోవాలి ఒక నమస్కారం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏమిటబ్బా అక్కడ ఏదో సందడిగా ఉంది. చుట్టూ జనం కూడా ఉన్నారు. రక్షకబటులు చాలామంది ఉన్నారు. ఆ ఇసుకలో ఒక జంట అటు నుంచి ఇటు పరిగెడుతున్నారు. ముందు ఏదో ఒక యంత్రాన్ని తోసుకొని కొంతమంది ముందుకు వెళ్తున్నారు. ఇంతకీ ఏమిటా సందడి. అందరికీ తెలుసు. ప్రతి సినిమాలోను ఈ సముద్ర తీరం మీద ఒక దృశ్యం చేయకుండా ఉండరు. తరతరాలుగా సినిమా షూటింగ్ లకి సాగర్ తీరం ఒక అడ్డా. ఆ నీలిరంగు సముద్రాన్ని వివిధ ఫ్రేములలో బంధించి అందమైన చిత్రాన్ని తీయడం ఆ కెమెరామెన్ ప్రతిభకు నిదర్శనం. రోజు చూసే సముద్రమే అయినా ఆ అందమైన కెమెరాలో దృశ్యం చిత్రీకరిస్తే సరికొత్త అందం తో సముద్ర తీరం కనిపిస్తుంది. ఒక అందమైన షాట్ తీసి మన హార్ట్ దోచేసే దర్శకులు చాలామంది ఉన్నారు.ఎంతమంది దర్శకులు ఎన్ని రకాల సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారో లెక్కలేదు. చూడ్డానికి చాలా అందంగా కనిపించే ఈ సముద్రం మనసు కూడా చాలా విశాలం. ఎంతోమందినీ తన ఒడ్డున చోటు ఇచ్చి ఇంత ఉపాధి కల్పిస్తోంది. పట్టుమని పదిహేళ్లు ఉండవు. పంచ కళ్యాణి మీద స్వారీ చేయిస్తానంటాడు. వయసు అయిపోయిన ఈ గుర్రాన్ని యజమాని దగ్గర అయిన కాడికి కొనుక్కుని సముద్ర తీరంలో ఈ చివరి నుంచి ఆ చివరికి గుర్రం మీద స్వారీ చేయించి ఆ సవారీకి డబ్బు వసూలు చేసుకుని పొట్ట పోసుకునే ఈ బుడతడికి ఇంత బువ్వ పెడుతోంది ఆ సాగర తీరం. వయసు అయిపోయిన తర్వాత హాయిగా యజమాని చేతుల్లో కన్నుమూయి వలసిన గుర్రం తలరాత కారణంగా ఈ విధంగా కాళ్లు ముందుకు సాగకున్న ఇసకలో అడుగు వేయలేక వేస్తూ తన బ్రతుకు గడుపుకుంటూ వస్తూ ఉంది. నీటి బుడగ లాంటిది జీవితం అంటారు. అయినా జీవితం గడవాలంటే ఏదో ఒక ఉపాధి ఉండాలి కదా. ఆ బుడగ లాంటి జీవితాన్ని గడపడం కోసం రంగురంగుల బుడగలు అమ్మే పోరడు ఆ తీరంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అందరికీ సాగర తీరం ఆనందాన్ని ఇస్తుంటే ఈ బుడతడికి సాగర తీరం ఉపాధికి దారి చూపిస్తోంది. షావుకారు దగ్గర సరుకు అప్పు తీసుకుని సాయంకాలానికి అప్పు తీర్చకపోతే బ్రతుకు బుడగలా పేలిపోతుంది. ఇది వాడి బ్రతుకు విచిత్రం. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తూ సముద్రుడు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉరకలు వేస్తూనే ఉంటాడు. అదే మనకు ఆదర్శం. టైంపాస్ కి బఠానీ అంటూ ఒక తట్టలో బఠానీలు పెట్టుకుని 60 ఏళ్ళు వచ్చిన తల పండిపోయిన ఆ సాగర తీరంలో బ్రతుకు వెళ్ల తీసే ముసలమ్మకి కూడా అది బ్రతుకుతెరువు అడ్డా. గుప్పెడు బఠానీలు అమ్మితే లాభం ఎంత వస్తుందో తెలియదు గానీ ఆ బ్రతుకుతెరువునే నమ్ముకుంది ఆ ముసలమ్మ. మరి ఆ సాగర తీరమే ఎందుకు ఎంచుకుంది. దానికి ఒక కారణం కూడా ఉంటుంది రోజు సాయంకాలం పూట ఎక్కువ జనం అక్కడికే వస్తారు అంతేకాదు బయట రోడ్డు పక్కన కూర్చుంటే మామూళ్ల బెడద. నిజానికి ఆకలేసి కాదు ఆ ముసలమ్మ చెప్పినట్లుగా ఆ ఇ సు కలో నడుస్తూ చేతిలోని పొట్లంలోని బఠానీలు కానీ వేరుశనగ గుళ్ళు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియదు. అది ఒక అలవాటు. ఏది ఏమైనా ముసలమ్మ లాంటి వాళ్ళకి కడుపు నింపుతోంది. ఆ మూలగా ఉన్న అద్దాల బండి దగ్గర జోరుగా సాగుతోంది పిడత కందిపప్పు వ్యాపారం. బండి చుట్టూ జనం. జనం లేకపోతే వాడి బ్రతుకు బేజారు. రంగురంగుల అద్దాల నుంచి ముడిసరుకు అంతా తొంగి చూస్తూ, తయారైన సరుకు అందరికీ నోరు ఊరిస్తూ అయస్కాంతoల్లా తన చుట్టూ తిప్పుకుంటుంది. పాలు తాగే పసి పిల్లవాడు తప్ప అన్ని వయసుల వారిని ఆకర్షిస్తోంది. ఎప్పుడూ తన సరుకు రుచి చూడకపోయినా అందరికీ ఆ బండి వాడు చకచకా పది రూపాయలకే ప్లేట్లో అమృతాన్ని పంచి ఇస్తాడు. ఆ బండి వాడి బ్రతుకు చక్రం అంతా ఈ చాట్ బండి చక్రాలు ముందుకు సాగితేనే. ఇలా సాగర తీరంలో బ్రతుకు చిత్రవిచిత్రాలు ఎన్నో. ఎంతోమందిని దగ్గర చేసుకుని బ్రతుకు బండి సాగడానికి సహాయపడుతున్న సాగరాన్ని అన్నపూర్ణ అంటే తప్పేముంది. ఇంతవరకు బ్రతుకుతెరువు దారి చూపించే కోణoల్లో సముద్రాన్ని చూసిన అమ్మాయికి మరింత అందం తెచ్చే ముత్యాలు మన సముద్రగర్భంలోనే దొరుకుతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మధ్య ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అంటే భాగ్యనగర్ లోని చార్మినార్ దగ్గర దొరుకుతాయని సమాధానం విని నవ్వుకున్నాము. ఇసుకలో నడుస్తుంటే కాలికి తగిలిన సముద్ర అపురూప సంపద గవ్వలు ఆల్చిప్పలు ఇంటికి మోసుకొచ్చి గవ్వలతో గుమ్మాలకు అందమైన దండలు తయారు చేసి మురిసిపోతుంది అమ్మ. మరి ఎంత పెద్ద మామిడికాయ తొక్కనైన ఒలిచి గర్వపడుతుంది ఆల్చిప్ప. ఇలా సాగర తీర విహారం జనాలకి కలగచేస్తోంది మానసిక ఉల్లాసం. ప్రస్తుతం మనవాళ్ళకి కావలసిన ఇంధనం అదే. ఉప్పు నీళ్లు అయితే నేo పదిమందికి సాగరం చేస్తోంది మహోపకారం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి