చిత్తూరు నాగయ్య గారి జయంతి.
బహుముఖ ప్రజ్ఞాశిలి సినీ నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత.
చిత్తూరు నాగయ్య (మార్చి 28, 1904 - డిసెంబరు 30, 1973) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. అతను
ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య. 336 కి పైగా సినిమాల్లో నటించాడు. 1938 లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో అతను సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. 1939లో స్థాపించబడిన వాహినీ స్టూడియోస్ తరపున నాగయ్య పలు సినిమాలకు వివిధ విభాగాల్లో పనిచేశాడు. తర్వాత తానే రేణుకా ఫిల్మ్స్ అనే పేరుతో స్వంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరు గాంచాడు. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి.
చిత్తూరు నాగయ్య 1904, మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. నాగయ్య అసలు పేరు ఉప్పలదడియం నాగయ్య. తండ్రి ఉప్పలదడియం రామలింగేశ్వర శర్మ రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా వుండేవాడు. తల్లి వేంకట లక్ష్మాంబ. వీరికి నాగయ్య కంటే ముందు నలుగురు పిల్లలు పుట్టి వెంటనే మరణించారు. దాంతో వీరికి జీవితంలో నిరాశ, దిగులు ఏర్పడ్డాయి. ఎవరో ఒకాయన కుటుంబంలో నాగదోషం ఉందని చెప్పగా దోష పరిహారార్థం ఆ దంపతులు సత్తెనపల్లి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి పూజలు సలిపారు. ఆ తర్వాత జన్మించన కొడుకుకు నాగేశ్వరం అని పేరు పెట్టుకున్నారు. నాగయ్య పూర్వీకులు ఒకప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఆస్తిపాస్తులు కలిగిఉండేవారైనా రామలింగ శర్మ తరం వచ్చేటప్పటికి అవన్నీ కరిగిపోయాయి. దాంతో అతను చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. నాగయ్య రెండేళ్ళ వయసులో ఉండగా చిత్తూరు జిల్లా, కుప్పం సమీపంలోని గోగునూరుకు చెందిన అతని అమ్మమ్మ అతన్ని చూడ్డానికి వెళ్ళింది. అప్పటికే నాగయ్యకు ఒక తమ్ముడు జన్మించి ఉన్నాడు. అప్పటికే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు. ఆమె కూతురు కుటుంబం మొత్తం తనతో వచ్చి ఉండమంది. నాగయ్య తండ్రి ఉద్యోగం వదిలి వెళ్ళడానికి అంగీకరించలేదు. దాంతో ఆమె పెద్ద కొడుకైన నాగయ్యను తీసుకు వెళ్ళి పెంచి పెద్ద చేస్తానంది. అయిష్టంగానేనైనా రెండో కొడుకు తమ దగ్గరే ఉండటం వలనా, తమ కొడుకు క్షేమం కోరి అందుకు అంగీకరించారా దంపతులు. దారిలో వస్తున్నపుడే నాగయ్యకు నాగుపాము పడగ పట్టడం చూసిన కొంతమంది అతను మహర్జాతకుడు అవుతాడు అని ఊహించి చెప్పారు. అలా నాగయ్య అమ్మమ్మతో పాటు గోగునూరుకి వచ్చాడు. నాగయ్య అవ్వ దగ్గర ఆస్తి పాస్తులు, డబ్బు ఉండేవి. భర్త మరణం తర్వాత ఆమె అమాయకత్వం వల్ల సంపదంతా పరుల పాలైంది. ఆస్తి కోసం తమను బంధువులు ఏమైనా చేస్తారేమోనని భయపడి మనవడిని తీసుకుని కుప్పం వచ్చేసింది. కుప్పంలో ఒక ఇల్లు కొనుక్కుని అందులోనే నివసించసాగింది.
అదే సమయానికి నాగయ్య తల్లిదండ్రులు కూడా రేపల్లె నుంచి ఆమె దగ్గర ఉండటానికి వచ్చేశారు. నాగయ్య కుప్పం వీధిబడిలో చేరి 8-9 ఏళ్ళ వరకు అక్కడే చదువుకున్నాడు. దీని తర్వాత కుప్పంలో లోయర్ సెకండరీ స్కూలులో చేరాడు. ఇది జమీందారీ పాఠశాల. తండ్రి దగ్గర పురుష సూక్తం, కొన్ని దేవతార్చన మంత్రాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. వేదాధ్యయనంతో బాటు వ్యాయామం కూడా చేసేవాడు. తండ్రి హరికథలు చెప్పేవాడు. సంగీతంలో ప్రవేశం ఉండేది. వయొలిన్ వాయించేవాడు. ఐదో తరగతి దాకా వీరి కుటుంబం కుప్పంలో ఉంది. 1911 లో జీవనోపాధి కోసం వీరి కుటుంబం చిత్తూరుకు తరలి వెళ్ళింది. అప్పుడే చిత్తూరును తమిళ ప్రాంతాలనుండి విడదీసి మండలకేంద్రంగా మార్చారు. చిత్తూరులో వెంకట మునిరెడ్డి అనే ఆసామి ఇంట్లో ఉండేవారు. బోడదేవర పల్లికి చెందిన చెంగమనాయుడు అనే అతను కూడా వీరి కుటుంబానికి ఆసరగా ఉండేవాడు. చిత్తూరులో వీరిరువురే కాక మరికొంతమంది పరిచయస్తుల ద్వారా కొన్ని ఇళ్ళలో సంగీత పాఠాలు సాధించగలిగాడు నాగయ్య తండ్రి. ఫస్ట్ ఫారం (ఆరో తరగతి) కోసం చిత్తూరులో బంగారుపాళెం జమీందారు పాఠశాలలో చేరాడు నాగయ్య. పాఠశాల రోజుల నుంచీ నాటకాలు, పాటలు పద్యాలలోనే కాక ఆటల్లో ముఖ్యంగా హాకీ క్రీడలో ఆసక్తి చూపేవాడు.
మూడో ఫారంలో ఉండగా సి. ఎం. దొరై అనే హార్మోనియం రిపేరు చేసే అతను పరిచయం ఏర్పడి నెమ్మదిగా వాయించడం ప్రారంభించాడు. నాలుగో ఫారం కోసం బోర్డు హైస్కూలులో చేరాడు. అప్పటికి అతను వయస్సు పదమూడేళ్ళు. సంగీతంలో, నాటకాల్లో శ్రద్ధ ఎక్కువైంది. చదువు మీద శ్రద్ధ తగ్గింది. తెలుగు, తమిళ నాటకాలు దొంగతనంగా అయినా సరే వెళ్ళి చూసేవాడు. ఫలితంగా నాలుగో ఫారం తప్పాడు. చదువుకోసం అష్టకష్టాలు పడ్డ తండ్రి చాలా బాధ పడ్డాడు. అది చూసిన నాగయ్యలో కొద్దిగా పరివర్తన వచ్చింది. తర్వాత వెంకట మునిరెడ్డి సిఫారసుతో తిరుమల తిరుపతి దేవస్థానం మహంతు ప్రయాగదాసు ద్వారా దేవస్థానం ఉపకారవేతనం దక్కింది. అలా నాగయ్య నివాసం తిరుపతికి మారింది. చదువుకుంటూ అప్పుడప్పుడూ మిత్రులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేవాడు. అక్కడ కూడా యాత్రీకుల దగ్గర భక్తి పాటలు పాడేవాడు. తిరుపతిలోని సరస్వతీ విలాస సభ వారు ఇతన్ని వారి సమాజంలో చేర్చుకుని వారు ప్రదర్శించే నాటకాల్లో ఇతనుచేత వేషాలు వేయించేవారు. తిరుపతిలోనే నాలుగో ఫారం ఉత్తీర్ణుడై అయిదో ఫారంలో చేరాడు. తిరుపతి పక్కన వడ్డేపల్లి గ్రామంలో నాగయ్య తండ్రికి మొదటి భార్య కూతురు ఉండేది. ఆమె వితంతువు. ఆమెకు బాగా ఆస్తిపాస్తులు ఉండేవి. తండ్రిని ఆమె ఆహ్వానించినా అతను వెళ్ళలేదు. ఆమె నాగయ్యను ఆమె గ్రామానికి ఆహ్వానించేది. నాటకాలు, పాటల్లో పడి చదువు మీద శ్రద్ధ సన్నగిల్లడంతో ఐదో ఫారం తప్పాడు. దాంతో దేవస్థానం ఇస్తున్న ఉపకార వేతనం రద్దై పోయింది. మధ్యలో ఉపాధ్యాయ ఉద్యోగం చేసి అధికారుల మెప్పు సంపాదించి మదనపల్లె స్కూల్లో ఐదో ఫారం ఉత్తీర్ణుడయ్యాడు. సంగీతం, నాటకాల మీద శ్రద్ధ వల్ల ఆరో ఫారం ఫెయిలయ్యాడు. తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు, వివాహం జరిగింది. నాటకాల్లో పాల్గొంటూ ఉన్నాడు.
1929 ప్రాంతాల్లో అతనికి ఉన్నత విద్య మీద ఆసక్తి కలిగింది. తన చుట్టూ ఉన్న నాటక సమాజంలో కొంతమంది ఉన్నత విద్యావంతులు కావడం, వారు చక్కటి ఆంగ్లంలో సంభాషించగలగడం ఇందుకు ప్రధాన కారణం. సి. ఆర్. రెడ్డి సలహాతో ప్రైవేటుగా బి. ఎ. చదవాలనుకున్నాడు. కానీ దానికి కూడా ఆర్థిక సాయం అవసరం. తనకు ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కుటుంబ పోషణ, ఇతర ఖర్చులకే సరిపోయేది. రామవిలాస సభ రంగాచార్యులు ఆర్థిక సాయం అందించడానికి ఒప్పుకున్నాడు. పచ్చయప్ప కళాశాలలో సుబ్రహ్మణ్యం అనే ప్రొఫెసరు సహకారంతో బి. ఎ చదవడానికి నమోదు చేయించుకున్నాడు. ఇతను బి. ఎ పాసయ్యే నాటికి స్వాతంత్ర్యోద్యమం ముమ్మరమయింది. ఆంగ్ల భాషాభ్యాసాన్ని కూడా విసర్జించడం మొదలు పెట్టారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నాగయ్య స్నాతకోత్సవానికి హాజరు కాలేదు. అతను డిగ్రీ మళ్ళీ పోస్టులో వచ్చంది.
అయిదో ఫారం తప్పేసరికి నాగయ్య తండ్రి అతన్ని అంతటితో చదువు మానిపించేసి బడి పంతులు ఉద్యోగం కోసం ట్రెయినింగ్ స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్నాడు. నాగయ్యకు ఆ నిర్ణయం అంతగా నచ్చలేదు. అయిష్టంగానే చిత్తూరులో ఉన్న ప్రభుత్వ ట్రెయినింగ్ స్కూలులో చేరాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత చిత్తూరులోని దివ్యజ్ఞాన సమాజం వారితో నాగయ్యకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ సమాజం ట్రస్టీలలో ఒకరైన జేమ్స్ కజిన్స్ పై చదువుల కోసం మదనపల్లె వస్తే మళ్ళీ ఉపకార వేతనం ఇప్పిస్తానని అన్నాడు. కానీ నాగయ్య తండ్రి అందుకు అంగీకరించలేదు. దాంతో పాకాలలో బడి పంతులు ఉద్యోగంలో చేరాడు. బడిలో చిన్నపిల్లలతో నాటకాలు ఆడించి స్కూలు అధికారుల మెప్పు పొంది చదువు కోసం సెలవు సంపాదించాడు. మదనపల్లె లోని స్కూల్ ప్రిన్సిపల్ త్రిలోకికర్ సహకారంతో అక్కడ ఐదో ఫారంలో చేరాడు. ఉద్యోగానికి సెలవు ఇచ్చినందుకు తండ్రి మొదట కోప్పడ్డా తర్వాత ఒప్పుకున్నాడు. అక్కడే ఐదో ఫారం ఉత్తీర్ణుడయ్యాడు.
సంగీతం, నాటకాల పిచ్చితో మళ్ళీ ఆరో ఫారం ఫెయిలవడంతో కుటుంబ సభ్యుల చేత చీవాట్లు తిన్నాడు. తంబళ్ళపల్లి నారాయణ రెడ్డి ఇతన్ని సి.ఆర్. రెడ్డికి పరిచయం చేశాడు. నాగయ్య తన పాటలు, పద్యాలతో అతన్ని మెప్పించాడు. కొన్ని రోజుల తర్వాత నారాయణ రెడ్డి రామ విలాస సభ అధ్యక్షుడు టి. వి. రంగాచార్యుల దగ్గరకు వెళ్ళి నాగయ్యకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని సిఫారసు చేశాడు. జిల్లా కలెక్టరు హెచ్.టి. రైలీ సహకారంతో అతనికి ఫారెస్టు ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం లభించింది. రెండు నెలల తర్వాత అతన్ని జిల్లా కలెక్టరు ఆఫీసుకు బదిలీ చేశారు. అందులో ఐదు మాసాల పాటు పనిచేశాడు. తర్వాత రైలీకి అక్కడి నుంచి బదిలీ కావడంతో ఆ ఉద్యోగం పోయింది. కొన్నాళ్ళకు పేపరులో పోలీసు ఉద్యోగ ప్రకటన చూసి అందులో చేరడానికి ఏలూరు వెళ్ళాడు. శిక్షణలో గుర్రపు స్వారీ చేస్తుండగా గాయాల పాలై మళ్ళీ ఇంటికి చేరుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టాడు.
కొద్ది రోజులకు త్రిలోకికర్ సహకారంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం కోసం ఊరు వదిలి వెళ్ళాల్సి రావడంతో తమ బృందంలో కీలక సభ్యుడు అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేని రామ విలాస సభ వారు అతనికి చిత్తూరులోనే జిల్లా బోర్డు ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం ఇప్పించారు. జీతం నెలకు 35 రూపాయలు. కుమారుడు ఉద్యోగంలో కుదురుకోవడంతో తండ్రి కూడా సంతోషించాడు. ఈ ఉద్యోగం ఖాళీ సమయాల్లో కూడా నాటకాలు, సంగీతం మానలేదు. కొన్నాళ్ళకు అకౌంట్స్ పరీక్ష పాసై అకౌంటెంట్ ఉద్యోగానికి మారాడు.
1930-31 మధ్యలో చిత్తూరుల్ళో రామవిలాస సభ వారు కట్టిన థియేటరు ప్రారంభోత్సవానికి కాశీనాథుని నాగేశ్వరరావు అక్కడికి వచ్చాడు. అక్కడ నాగయ్య ప్రతిభను గుర్తించి అతను నిర్వహిస్తున్న ఆంధ్రపత్రికకు వార్తలు పంపిస్తూ ఉండమన్నాడు. అప్పటి నుంచి అతను ఆంధ్రపత్రిక విలేకరిగా కూడా పనిచేసేవాడు. ఇందుకోసం అతను ప్రత్యేకంగా జీతం కేటాయించక పోయినా అప్పుడప్పుడూ ఎంతో కొంత సొమ్ము ఇతనికి ముట్టజెపుతూ ఉండేవాడు. అయితే నాగయ్య ఇలా వచ్చిన డబ్బంతా స్నేహితులకోసం ఖర్చు పెట్టేసేవాడు.
చిన్నతనం నుంచే తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. సంగీత కచేరీలంటే ఎలాగైన సరే చూసి రావాలని ఆరాట పడేవాడు. ఒకసారి మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళే గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యాడు. కచ్చేరి పూర్తి అయిన తర్వాత ప్రహ్లాదుని పద్యాలను పాడి వారి దగ్గర ఆశీర్వాదం పొందాడు.
చదువులో సరిగా ఉత్తీర్ణుడు కాకపోవడం, మంచి ఉద్యోగంలో కుదురుకోకపోవడంతో సంగీతం నేర్చుకుంటే కచేరీలు చేసి బ్రతుకు తెరువు చూసుకుంటాడని భావించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత శిక్షణ కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళే వద్దకు పంపాడు. ఉద్యోగాలు చేస్తూనే సంగీతం నేర్చుకోవడం కొనసాగించాడు. చిత్తూరు సుబ్రహ్మణ్యం దగ్గర వర్ణాలు, కృతులు నేర్చుకున్నాడు. రామ విలాస సభలో హార్మోనిస్టుగా పని చేసేవాడు.
కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభకోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించాడు నాగయ్య. ఎక్కువగా కర్ణాటక సంగీతాన్నే అభ్యసించినా హమీద్ ఖాన్ దగ్గర హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నాడు. సినిమాలకు సంగీతం అందించడం ప్రారంభించిన రోజుల్లో ఎక్కువగా కర్ణాటక, హిందుస్థానీ రాగాలు కలిపి వరసలు కట్టేవాడు. తర్వాత సినిమాల కోసం హిందీ, విదేశీ భాషల సంగీతాన్ని అభ్యసించి సరళమైన పద్ధతిలో వరసలు కట్టడం నేర్చుకున్నాడు.
మదనపల్లె సబ్ కలెక్టర్ బోల్డన్ అనే దొర చిత్తూరులో కొన్నాళ్ళ పాటు తాత్కాలికంగా సర్వే ఆఫీసరుగా ఉన్నాడు. అతనుకు తెలుగు, భారతీయ సంగీతం నేర్పి అతను దగ్గర ఓ రెండు నెలల పాటు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. తర్వాత అతనుకు బదిలీ అయి వెళ్ళిపోయాడు. ఇలా నేర్చుకున్న పాశ్చాత్య సంగీతం అతను సినీ రంగంలో ప్రవేశించినపుడు ఉపయోగపడింది.
నాగయ్య చిత్తూరులో ఉండగా సురభి నాటక మండలి వారు భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించడానికి వచ్చారు. అయితే ఆ నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేయవలసిన అబ్బాయికి జ్వరం రావడంతో నాగయ్య తొలిసారిగా నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేశాడు. ఆ అర్థరాత్రి నాటకంలో మొదట వేదిక ముందున్న జనవాహినిని చూసి భయపడి ఏడ్చేసినా తర్వాత సర్దుకుని మళ్ళీ పద్యాలు, పాటలు ఆలపించాడు. ప్రేక్షకులు, బంధువులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు. ఇది విన్న పాఠశాల పంతుళ్ళు కూడా నాగయ్యను ప్రత్యేకంగా స్కూల్లో కూడా ప్రహ్లాదుడి వేషం వేసి పాఠలు, పద్యాలు పాడించి ఆనందించారు. తర్వాత స్కూల్లోనూ, ఉత్సవాల్లోనూ అప్పుడప్పుడూ వేదికలెక్కి పాటలు పాడుతుండటంతో నటన భాగా అనుభవంలోకి వచ్చింది.
ఒకసారి చిత్తూరులో రామ విలాస సభ భవన నిర్మాణం కోసం సారంగధర నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు. అందులో నాగయ్యను చిత్రాంగి వేషం వేయమన్నారు. నాగయ్య ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి మరీ ఈ నాటకం రిహార్సల్ కి వచ్చేవాడు. దానికే హార్మోనియం కూడా వాయించేవాడు. ఈ నాటక ప్రదర్శనలో అపశృతి దొల్లి చీర ఊడిన చిత్రాంగి అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఈ విషయంం తెలిసి తండ్రి దగ్గర చీవాట్లు కూడా తిన్నాడు. ఈ నాటకం ద్వారా 850 రూపాయలు మిగిలాయి. ఆ సొమ్ముతో సభ వారు ఒక మందిరం నిర్మించారు. మదనపల్లెలో తంబళ్ళపల్లి నారాయణ రెడ్డి ఆధర్యంలో జరిగే నాటకాల్లో పాల్గొన్నాడు. అప్పుడే బెంగుళూరు అమెచ్యూర్స్ అనే బృందం ఒథెల్లో అనే ఆంగ్ల నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవను చూసి అతనుతో పరిచయం చేసుకున్నాడు. అతనుకు తన గానాన్ని కూడా వినిపించి అతను ఆశీర్వాదం అందుకున్నాడు. తంబళ్ళపల్లి నారాయణ రెడ్డి స్వస్థలం తంబళ్ళపల్లిలో కూడా పాటలు పాడుతూ అంతో ఇంతో సంపాదించి ఇంటికి పంపేవాడు.
వివాహం జరిగిన తర్వాత భార్య తరపు వారు పిలవడంతో నెల్లూరు వెళ్ళాడు. అక్కడ సారంగధర నాటకంలో స్థానం నరసింహారావు పోషించిన చిత్రాంగి పాత్రను చూసి స్ఫూర్తి పొందాడు. ఎలాగైనా గట్టిగా కృషి చేసి అతను లాగా మంచి నటుడవ్వాలనుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు రామ విలాస సభ తరపున తిరుత్తణిలో జరిగిన సారంగధర నాటకంలో నాగయ్య వేసిన చిత్రాంగి వేషానికి స్వర్ణ పతకం లభించింది. శ్రీకాళహస్తి, తిరుపతి మొదలైన ప్రాంతాలకు వెళ్ళి నాటక ప్రదర్శనలు ఇచ్చేవాడు. మద్రాసులో బి. ఎ చదువుతున్న సమయంలో అతను మార్గదర్శి ప్రొఫెసరు సుబ్రహ్మణ్యం అతను్ను సుగుణ విలాస సభ వారికి పరిచయం చేశాడు. వీరు మద్రాసులో తెలుగు, తమిళంలో నాటకాలు వేసేవారు. నాగయ్య ఆ నాటకాల్లో పాల్గొనేవాడు. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ సభకు వెళ్ళినపుడు అతనుకు బి. ఎన్. రెడ్డితో పరిచయం కలిగింది.
బెంగుళూరులో గ్రాం ఫోను రికార్డులు పాడడానికి వెళ్ళినపుడు అక్కడ కొంతమంది అమెచ్యూర్స్ తో కలిసి నాటకాలు వేసేవాడు. సారంగధర, రామదాసు, సుభద్రా పరిణయం, తప్పెవరిది మొదలైనని నాగయ్య పాల్గొన్న నాటకాలు. బెంగుళూరులో హెచ్. ఎం. వి తెలుగు విభాగానికి కొప్పరపు సుబ్బారావు నిర్వాహకుడిగా ఉండేవాడు.నాగయ్యకు అతనుతో ఉన్న పరిచయం దృష్ట్యా అతను్ను నాటకాల రికార్డింగుల్లో పాల్గొనమని ఆహ్వానించాడు. అక్కడ సుభద్ర పరిణయం, విశ్వామిత్ర, గరుడ గర్వభంగం మొదలైన నాటకాల్లో పాల్గొన్నాడు.
ఇంకా లక్ష్మీ విలాస సభ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంస లందుకొన్నాడు.
నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్ నామ్ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.
నాగయ్య మొదటి భార్య ప్రసవంలో ఇబ్బంది వల్ల మరణించింది. ఒక పాప జన్మించింది. కుటుంబ సభ్యుల సలహాతో రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళకు మొదటి భార్యకు పుట్టిన బిడ్డ మరణించింది. రెండో భార్యకు ఒకటి రెండు సార్లు గర్భ విచ్ఛిత్తి జరిగింది. మూడోసారి కానుపు సమయంలో ఆమె మరణించింది. ఆ దిగులుతూ నాగయ్య తండ్రికి కొన్నాళ్ళు మతిభ్రమించింది. కొన్నాళ్ళకు అతను కూడా మరణించాడు. నాగయ్యకు జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్నేహితులు వారించారు. మనస్సు మళ్ళించడానికి బలవంతంగా తీసుకు వెళ్ళి పాటలు పాడించేవారు. అవేమీ అతనుకు మనశ్శాంతి కలిగించలేక పోయాయి. ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా నాగయ్య రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతనుకు ప్రశాంతంగా అనిపించింది. పాల్ బ్రంటన్ అనే జర్మనీ తత్వవేత్తతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు గడిచాక చిత్తూరుకు చెందిన దొరై అతను ఇతను్ను గుర్తు పట్టి ఇంట్లో వాళ్ళు అతను కోసం తీవ్రంగా బెంగ పెట్టుకున్నారని చెప్పాడు. దొరై ఇతనుకు గ్రాముఫోన్ రికార్డులు పాడే అవకాశమిప్పిస్తాననీ అప్పటిదాకా చిత్తూరులో ఉండమన్నాడు. అప్పటికే ఆశ్రమంలో ఒకడిగా మెలుగుతుండడం వల్ల రమణ మహర్షి అనుమతి కోసం వెళ్ళాడు. అతను కూడా నీవు జీవితంలో చేయవలసిన కర్మ ఇంకా ఉన్నదనీ, ఊరికి వెళ్ళమని చెప్పడంతో మరలా చిత్తూరు చేరాడు. ఇంట్లో వాళ్ళు సంతోషించారు.
రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత బెంగుళూరులోని హెచ్. ఎం. వి గ్రామఫోన్ కంపెనీ నుంచి ఆహ్వానం అందింది. అప్పటికి టాకీలు రాకపోవడం వల్ల గ్రామఫోను రికార్డులకు మంచి ఆదరణ ఉండేది. నాటకాలు చూడడం, రికార్డులు వినడం అప్పటి జనాలకు ఇష్టమైన వ్యాపకాలు. ఎన్నో తెలుగు నాటకాలు, పాటలు రికార్డులుగా వచ్చాయి. నాగయ్య ఉద్యోగానికి నాలుగు నెలలు సెలవు పెట్టి బెంగుళూరు వెళ్ళాడు. అక్కడ అతనుకు గొప్ప నటీనటులు, సంగీత విద్వాంసులతో పరిచయం కలిగింది. తర్వాతి కాలంలో భారతరత్న అందుకున్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కూడా ఆ రికార్డుల్లో పాడేది. అప్పటికి ఆమె వయసు పదకొండేళ్ళు.
మద్రాసులో సినిమా అవకాశాల వేటలో ఉన్నపుడు అచ్యుత నాయుడు ప్రోత్సాహంతో నాగయ్య ఎన్నో గ్రామఫోను రికార్డులిచ్చాడు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు బాగా అమ్ముడుపోయాయి.
1920వ దశకంలో నాగయ్య మద్రాసులో ప్రైవేటుగా బి. ఎ. చదువుతున్నప్పటి నుంచి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం మొదలు పెట్టాడు. న్యాయవాది ఎస్. శ్రీనివాస అయ్యంగార్ అనే న్యాయవాది నాగయ్య పాటలు విని అతను్ను 1926లో గౌహతిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి అలహాబాదుకు వచ్చి మోతీలాల్ నెహ్రూకు సంబంధించిన ఆనందభవన్ లో పది రోజుల పాటు ఉన్నాడు. ఇక్కడ అతను ఎంతోమంది జాతీయ నాయకులను కలిశాడు. అక్కడ ఇతను తెలుగు, తమిళంలో దేశభక్తి గీతాలు గానం చేసేవాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. నాగయ్యకు పలు విషయాల్లో అండగా ఉంటున్న రంగాచార్యులు నీకెందుకు ఈ ఉద్యమాలు, త్యాగాలు? అని మందలించినా సి. ఆర్. రెడ్డి మాత్రం ఇతను్ను ప్రోత్సహించాడు.
రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జాతీయోద్యమం ఊపందుకుంది. గాంధీజీ ప్రారంభించిన మద్యపాన నిషేధ ఉద్యమంలో ఇతను పాల్గొన్నాడు. మద్యం దుకాణాల వద్దకు వెళ్ళి తాగేవారికి నచ్చజెప్పేవాడు. అప్పుడప్పుడూ వారి చేత దెబ్బలు కూడా తినేవాడు. అయినా ఉద్యమంలో పాల్గొనడం మాత్రం మానలేదు.
1932 లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడుగా చేరి మద్రాసు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా యిచ్చాడు. లాఠీ చార్జీలు, లాకప్ లు చవిచూశాడు. వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించాడు. తిరిగి మద్రాసు వచ్చాడు. రాజకీయరంగం వదలి మరలా కళారంగంలో అడుగు పెట్టాడు.
1932 నుంచి నాగయ్య సినీరంగంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు ఆరంభించాడు. హిందూ పత్రిక సంపాదకుడైన శ్రీనివాసన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి, దాని ఆధ్వర్యంలో కౌసల్య అనే చిత్రం ప్రారంభించాడు. చిత్తూరుకు చెందిన బి. మునుస్వామి నాయుడు ఎం. ఎల్. సిగా ఎన్నికై ఆ తర్వాత మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన నాగయ్యను శ్రీనివాసన్ కు పరిచయం చేశాడు. ఆలోపే నటీనటుల నిర్ణయం జరిగిపోయింది. దాంతో నాగయ్యను సంగీత విభాగంలో పనిచేయమన్నాడు. సినిమా నిర్మాణంలో మెలకువలు తెలుస్తాయి కదా అని అందులో పనిచేశాడు. తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ఆయనుకున్న దూరపు చుట్టరికాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగుళూరు వెళ్ళి ఆయనును కలిశాడు. ఆయన దాదా ఫాల్కే తనకు పరిచయమని చెప్పి ఒక లేఖ ఇచ్చి వెళ్ళి ఆయనను కలవమన్నాడు. అప్పట్లో ఆయన పూనా కేంద్రంగా సినిమాలు తీసేవాడు. ఆయన సలహాతో కొద్ది రోజులు ఎడిటింగ్ విభాగంలో పనిచేశాడు. కానీ నాగయ్యకు నటించాలని, పాడాలని ఉత్సాహంగా ఉండటంతో ఆ పని ఆయనుకు అంతగా ఉత్సాహాన్నివ్వలేదు. అక్కడే సీతాకల్యాణం అనే సినిమా నిర్మాణం జరుగుతున్నదని అందులో నటుడిగా అవకాశం వస్తుందేమోనని కొంతకాలం ఎదురు చూశాడు. ఆ వాతావరణం ఆయనుకు సరిపడక విశ్వేశ్వరయ్యకు, ఫాల్కేకు తెలియజేసి తిరిగి మద్రాసుకు వచ్చేశాడు.
మద్రాసులో మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రముఖ కవి దువ్వూరి రామిరెడ్డి సహకారంతో చిత్రపు నరసింహారావును కలిశాడు. అప్పుడు ఆయన సతీ తులసి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కానీ అప్పటికే ఆ చిత్రం ఆరంభమై ఉండటం వల్ల ఆయనుకు అవకాశం రాలేదు. అప్పటికే ఉద్యోగం మానేసినా ఆంధ్ర పత్రికలో చేసిన పనికి కాశీనాథుని నాగేశ్వరరావు కొంత సొమ్ము ఇస్తుండేవాడు. అలాగే హెచ్. ఎం. వి రికార్డింగ్ వారు కూడా కొంత సొమ్ము పంపించేవారు. అందులో కొంత ఇంటికి పంపి, కొంత కాంగ్రెస్ కు ఇచ్చి, కొంత సొంత ఖర్చులకు వాడుకునే వాడు. అప్పుడే తండ్రి మరణించినందుకు జీవిత బీమా సొమ్ము చేతికి వచ్చింది. ఆ సొమ్ము ఖర్చు పెట్టుకుంటూ సినిమా ప్రయత్నాలు చేద్దామనుకున్నాడు నాగయ్య. అయితే రంగస్వామి పిళ్ళై అనే వ్యక్తి సినిమా నిర్మిస్తాననీ, అందులో ఆయనుకు కచ్చితంగా అవకాశం ఇస్తానని నమ్మించి మోసం చేశాడు. నాగయ్య తన దగ్గరున్న సొమ్మంతా అతని చేతిలో పెట్టి మోసపోయాడు.
నిర్మాణ ప్రయత్నాలన్నీ విరమించుకుని చేతిలో మిగిలిన సొమ్ముతో నుంగంబాకంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని అందులోనే ఉండేవాడు. బయటికి రాకుండా గదిలోనే సంగీతం సాధన చేస్తూ కూర్చునేవాడు. తిండికి బట్టకు కూడా డబ్బుల్లేవు. కొళాయిలో నీళ్ళు తాగుతూ, చేతిలో మిగిలిన కాని, అర్ధణాలతో వేరుశనగ గింజలు తింటూ పన్నెండు రోజులు గడిచిపోయాయి. కానీ సంగీత సాధన మాత్రం మానలేదు. అప్పుడే అచ్యుత నాయుడనే గ్రామఫోన్ కంపెనీ యజమాని ఈయన పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆయన బ్రాడ్వేలో ఉన్న తన హచ్చిన్స్ దుకాణానికి తీసుకెళ్ళి పాటలు వింటూ, పత్రికలు చదువుతూ కాలక్షేపం చేయమన్నాడు. అతని అభిమానంతో నాగయ్య మళ్ళీ మామూలు మనిషయ్యాడు.
నాగయ్యతో పరిచయం ఉన్న రామకృష్ణారావు అనే ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ద్రౌపది మాన సంరక్షణ అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టాడు. అందులో నాగయ్యకు అవకాశం కల్పిస్తానన్నాడు. అంతకు మునుపే శ్రీకృష్ణ లీలలు చిత్రం తీసిన పి. వి. దాసు మాయాబజారు అనే సినిమాకు సన్నాహాలు ప్రారంభించాడు. నాగయ్య ఇతనుతో కూడా పరిచయం పెంచుకుని ఆ సినిమాలో అవకాశం ఇమ్మన్నాడు. వీటి కోసం ఎదురు చూస్తుండగా హెచ్. ఎం. వి కంపెనీ వారు రికార్డింగు కోసం బెంగుళూరు రమ్మన్నారు. నాగయ్య అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఈ రెండు అవకాశాలు చేయి జారిపోయాయి.
నాగయ్యకు పి. పుల్లయ్యతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆయన సురాజ్ మల్ లల్లు భాయ్ అండ్ కంపెనీ అనే గ్రాం ఫోన్ సంస్థ ప్రతినిథిగా ఉండేవాడు. అంతకు ముందు నుంచీ సినిమాలతో ఆయనుకు పరిచయం ఉంది. దాంతో ఆయనుకు స్టార్ కంబైన్స్ అనే సంస్థ సారంగధర చిత్రానికి దర్శకత్వ అవకాశం ఇచ్చారు. అందులో అవకాశం కోసం పుల్లయ్య దగ్గర మాట తీసుకున్నాడు నాగయ్య. ఇంతలోనే నాగయ్యను చిన్నప్పుడు పెంచి పెద్దచేసిన అమ్మమ్మ మరణించడంతో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చేలోపు సారంగధరలో అవకాశం చేజారిపోయింది. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతున్నా ఎలాగైనా సినిమాలో స్థానం సంపాదించాలని పట్టుదలగా నాటకాలు వేస్తూ ఇంటికి డబ్బు పంపిస్తూ ఎదురు చూడసాగాడు.
ద్రౌపది వస్త్రాపహరణం సినిమా తీసిన తర్వాత హెచ్. ఎం. రెడ్డి మద్రాసుకు వచ్చాడు. బళ్ళారి రాఘవ సాయంతో ఆయన్ను కలుసుకున్న నాగయ్య గారికి ఆయన తర్వాతి చిత్రంలో అవకాశమివ్వమన్నాడు. హెచ్. ఎం. రెడ్డి కూడా అందుకు అంగీకరించాడు. ఈలోపు జి. వి. రామన్ అనే వ్యాపారి తమిళంలో సినిమా తీస్తామనీ అందులో ఆయనుకు అవకాశమిస్తానని చెప్పాడు. నాగయ్య ఆ చిత్రం కోసం ఎదురు చూస్తుండగా కలకత్తాలో కె. సుబ్రహ్మణ్యం తీస్తున్న చిత్రంలో ఓ మంచి పాత్ర కోసం నాగయ్యను అడిగారు. అక్కడికి వెళితే రంభా ఫిలిమ్సు వారి చిత్రం చేజారిపోతుందనే ఉద్దేశంతో నాగయ్య అక్కడికి వెళ్ళలేదు. ఎన్ని రోజులు ఎదురు చూసినా సంస్థ భాగస్వాము మధ్య ఏదో సమస్యల వల్ల రంభా ఫిలింస్ వారి చిత్రం ప్రారంభం కాలేదు. నాగయ్యకు మళ్ళీ నిరాశే ఎదురయ్యింది.
1936లో హెచ్. ఎం. రెడ్డి, బి. ఎన్. రెడ్డి, రామనాథ్, శేఖర్, పారుపల్లి శేషయ్య, కన్నాంబ మొదలైన వారంతా కలిసి రోహిణి పిక్చర్స్ అనే పేరుతో సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ గృహలక్ష్మి అనే సినిమా తీయడానికి నిశ్చయించుకున్నారు. ఈ సినిమాలో కథానాయిక కన్నాంబ. నాయకి సోదరుడు గోపీనాథ్ పాత్ర నాగయ్యకు దక్కింది. ఇది ఒక దేశభక్తుడి పాత్ర. కె.వి. రెడ్డి అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చి సంస్థ నిర్వహణ భారాన్ని తలకెత్తుకున్నాడు. నాగిరెడ్డి చిత్ర ప్రచార బాధ్యతలు చూసుకునేవాడు.
1938 నాటి గృహలక్ష్మి సినిమాలో నాగయ్య పాడిన కల్లు మానండోయ్ పాట
గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు ప్రాచుర్యం పొందాయి. నాగయ్య పాడిన "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రాచుర్యం పొందింది. తొలిచిత్రంతోనే నాగయ్య మంచినటుడు అనిపించుకున్నాడు. ఈ చిత్రంలోనే సినీసంగీతానికి కావలసిన మెళకువలు వంట పట్టించుకున్నాడు. ఈ చిత్రానికి ఆయనుకు లభించిన పారితోషికం 750 రూపాయలు. ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం అయింది.
రోహిణి సంస్థ నుంచి బి. ఎన్. రెడ్డి, కె. వి. రెడ్డి మొదలైన వారంతా విడిపోయి వాహినీ సంస్థ స్థాపించారు. మూలా నారాయణ స్వామి, నాగిరెడ్డి, సముద్రాల, శేఖర్, రామనాథ్, బి. ఎం. దాసు మొదలైన వారు కూడా ఈ సంస్థలో సభ్యులు. నాగయ్యను కూడా వారిలో ఒకడిగా చేర్చుకున్నారు. వారి చిత్రాల్లో ముఖ్య పాత్రలు ధరించడం, సంగీతం అందించడం అతను ముఖ్య బాధ్యతలు. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం పల్నాటి యుద్ధం చిత్రం ప్రారంభిస్తూ అందులో బ్రహ్మనాయుడి వేషాన్ని నాగయ్యకు ఇవ్వజూపినా వాహినీ సంస్థలో ఉండటంవల్ల ఆయన అంగీకరించలేదు. ఆ పాత్రను గోవిందరాజు సుబ్బారావు పోషించాడు.
1939లో వాహిని సంస్థ నిర్మించిన వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కథానాయక పాత్ర పోషించాడు. కాంచనమాల కథానాయిక. అదే చిత్రానికి నాగయ్య సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఆంధ్రదేశంలో పలు చోట్ల రజతోత్సవాలు జరుపుకుంది. తమిళనాడు, కేరళ, మైసూరు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం తర్వాత నాగయ్యకు మంచి గుర్తింపు వచ్చింది.
వందేమాతరం చిత్ర విజయోత్సవాలకు వెళ్ళినపుడు అక్కడ మాలతిని చూసి ఆమెను తమ తర్వాతి సినిమాకు నాయికగా ఎన్నుకున్నారు వాహినీ సంస్థ వారు. ఈ సినిమా సుమంగళి (1940). ఈ సినిమాలో కూడా తానే కథానాయకుడిని అనుకున్న నాగయ్యకు వృద్ధపాత్ర ధరించమన్నారు. నాగయ్య మొదట్లో సందేహించినా తర్వాత బి. ఎన్. రెడ్డి తదితరులు ఆ పాత్ర చాలా ప్రధానమైన పాత్ర అనీ, నటనకు ఆస్కారమున్న పాత్ర అనీ నచ్చజెప్పడంతో అందుకు ఒప్పుకున్నాడు. ఈ చిత్రం విడుదలయ్యాక కూడా నాగయ్యకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో నటనను చూసి బాబురావు పటేల్ అనే సినీ విలేకరి నాగయ్యను ఫిల్మ్ ఇండియా అనే పత్రికలో పాల్ ముని ఆఫ్ ఇండియా అని కీర్తించాడు. అలాగే ఆయన అందించిన సంగీతం కూడా ఆదరణ పొందింది. సుమంగళి తర్వాత వై. వి. రావు తీసిన విశ్వమోహిని అనే సినిమాలో నాగయ్య ఒక హాస్య ప్రధానమైన సినిమా దర్శకుడి పాత్ర పోషించాడు.
త్యాగరాజ భాగవతార్ తో అశోక్ కుమార్ అనే తమిళ సినిమా తీస్తే అందులో నాగయ్యకు ఒక ప్రధాన పాత్ర లభించింది. ఇదే సినిమాలో కన్నాంబ తమిళం రాకపోయినా నేర్చుకుని కథానాయికగా నటించింది. ఈ సినిమాతో నాగయ్యకు, కన్నాంబకు తమిళంలో కూడా మంచి పేరు వచ్చింది. విశ్వమోహిని, అశోక్ కుమార్ వాహినీ వారి చిత్రాలు కాకపోయినా వారి అనుమతితో నాగయ్య ఈ సినిమాల్లో నటించాడు.
తర్వాతి చిత్రం దేవత (1941) లో కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా కూడా విడుదలై మంచి పేరు, ధనం సంపాదించింది. చాలా చోట్ల రజతోత్సవాలు జరుపుకున్నది. దేవత చిత్రం తర్వాత వాహినీ వారు భక్తపోతన జీవితాన్ని సినిమాగా తీయడానికి నిశ్చయించుకుని అందులో పోతన పాత్రను నాగయ్యను వెయ్యమన్నారు. ఈ వేషానికి కూడా నాగయ్య మొదట సందేహించినా బి.ఎన్. రెడ్డి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాడు. ఈ చిత్రం విడుదల సమయంలో మద్రాసులో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వాహినీ వారు చిత్రం నెగటివ్ ను తాడిపత్రికి పంపించి అభివృద్ధి చేయించారు. ఈ చిత్రం విడుదల కావడంతోనే మంచి పేరు, ధనమూ సంపాదించింది. నాగయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి.
ఈ చిత్రం తర్వాత తమిళ చిత్రం మీరాలో ఆయనుకు భక్తుడికి వ్యతిరేకమైన పాత్ర లభించింది. ఇందులో ఎం. ఎస్. సుబ్బులక్ష్మి కథానాయిక. నాగయ్యది ఆమె భర్త పాత్ర. వైవిధ్యభరితమైన పాత్రలు దక్కుతుండటంతో నాగయ్య ఎలాంటి పాత్రనైనా పోషించగలడని మంచి పేరు వచ్చింది.
పోతన చిత్రంలో వేషం కోసం అతను గుండు కొట్టుకుని నటించాల్సి వచ్చింది. ఈలోగా కొంతమంది స్నేహితులు వాహినీ సంస్థలో ముసలి పాత్రలు, గుండు వేషాలు వేయడం ఎందుకనీ తానే స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించమని రెచ్చగొట్టారు. వాహినీ సంస్థ వారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారని గూడూరుకి చెందిన మైకా వ్యాపారి దువ్వూరు నారాయణ రెడ్డి సహాయంతో రేణుకా పిక్చర్స్ పేరుతో స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. భాగ్యలక్ష్మి అనే చిత్రాన్ని ప్రారంభించి ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతలు పి. పుల్లయ్యకు అప్పజెప్పాడు. సంగీతం భీమవరపు నరసింహారావుకు ఇచ్చాడు. కథానాయకుడు ఆయనే. బి. ఎన్. రెడ్డి ఈ సంగతికి తెలిసి స్వంతంగా సినీ నిర్మాణం ఎందుకు? తమ సంస్థ ఉందిగా అన్నాడు. అందుకు నాగయ్య, స్నేహితుల ప్రోద్బలంతో అలా జరిగిపోయిందనీ తమని ఆశీర్వదించమనీ అడిగాడు.బి. ఎన్. రెడ్డి కూడా అందుకు అంగీకరించాడు.
పోతన చిత్రం చూసిన తర్వాత పూర్ణా పిక్చర్స్ అధినేత జి. కె. మంగరాజు అతన్ని త్యాగయ్యపై సినిమా తీయమని ప్రోత్సహించాడు. ఈ సినిమా కోసం నాగయ్య త్యాగరాజు జీవిత చరిత్రలన్నీ చదివాడు. తంజావూరు గ్రంథాలయంలో త్యాగరాజు జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయని అక్కడికీ వెళ్ళి చదివాడు. కానీ ఎక్కడా పుస్తకాలలో సినిమాకు కావలసిన రూపంలో కథ దొరకలేదు. మూలకథకు భంగం కలగకుండా అతను జీవిత సంఘటనలనే ఆధారంగా తీసుకుని స్క్రీన్ ప్లే రాయడం కోసం తిరువాయూర్ లోని త్యాగరాజు సమాధి వద్దకు వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉపవాస వ్రతం సలిపి వచ్చాడు.[6] కథ రాయడం పూర్తయిన తర్వాత విద్వాంసులకూ, త్యాగరాజు జీవితం ఎరిగున్నవారికీ చూపించి కథను స్థిరపరుచుకున్నాడు. సముద్రాల రాఘవాచార్య కూడా స్క్రిప్టు విని అభినందించాడు. సముద్రాల, లింగమూర్తి, నాగయ్య కలిసి స్క్రీన్ ప్లే తయారు చేశారు. మధ్యలో అప్పుడప్పుడూ బి. ఎన్. రెడ్డి సలహాలు కూడా స్వీకరిస్తూ ఉండేవారు. నాగయ్య త్యాగయ్య పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద పెద్ద విద్వాంసులంతా ఈ చిత్రం చూస్తారు కాబట్టి వారందరినీ ఆహ్వానించి వారితో కీర్తనలు పాడిస్తూ తాను కూడా సాధన చేశాడు. మహారాజపురం విశ్వనాథయ్యర్, ద్వారం వెంకటస్వామి నాయుడు, పారుపల్లి రామకృష్ణయ్య, చౌడయ్య, మణి అయ్యర్, బెంగుళూరు నాగరత్నమ్మ మొదలైన వారు రేణుకా ఆఫీసుకు వచ్చి నిత్యం కీర్తనలు గానం చేసేవారు. ఇలా రెండేళ్ళ పాటు సాగింది. దర్శకత్వం గురించి ఆలోచిస్తుంటే రేణుకా పిక్చర్స్ మొదటి చిత్రం భాగ్యలక్ష్మికి పుల్లయ్య దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన చెంగయ్య మొదటి నుంచి ఆ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తుండటం గమనించి అతనునే దర్శకత్వ బాధ్యతలు తీసుకోమన్నాడు. అలా నాగయ్య మొదటి సారిగా త్యాగయ్య సినిమాతో దర్శకుడిగా మారాడు. అదే సమయంలో వాహిని వారి స్వర్గ సీమ చిత్రంలో కూడా నటించి సంగీతాన్నందించాడు.
త్యాగయ్య సినిమా కూడా విడుదలై ఘన విజయం సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. నాగిరెడ్డి, చక్రపాణి తమ ఆంధ్రజ్యోతి పత్రికను త్యాగయ్య ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. తిరువాంకూర్, మైసూర్ సంస్థానాల్లో నాగయ్యకు ఘన సన్మానాలు జరిగాయి. తిరువాన్కూరు మహారాజు అతనుకు అభినవ త్యాగరాజు అనే బిరుదు ప్రధానం చేశాడు. మైసూరు మహారాజు వెండి పళ్ళెంలో 101 బంగారు కాసులు కానుక ఇచ్చాడు. బెంగుళూరులో ఓ థియేటర్ యజమాని కనకాభిషేకం చేశాడు.
త్యాగయ్య చిత్రం తర్వాత పూర్ణా పిక్చర్స్ మంగరాజు శంకరాచార్య మీద కూడా సినిమా తీయమని సలహా ఇచ్చాడు. కానీ అతను వయసు ఆ పాత్రకు సరిపోదని ఎవరైనా దొరికితే తీద్దామనుకున్నారు గానీ అది నెరవేరలేదు. వాహినీ వారు తర్వాతి ప్రయత్నంగా యోగి వేమన తీస్తూ అందులో వేమనగా నాగయ్యకు నటించమన్నారు. ఈ చిత్రంలో నటిస్తుంటే నాగయ్యపై కూడా ఆ ప్రభావం పడింది. వేదాంత ధోరణి అలవడింది. ఈ చిత్రం వాహిని వారికి ఎంత మంచి పేరు తెచ్చి పెట్టిందో నాగయ్యకు కూడా అంతే పేరు తీసుకు వచ్చింది.
త్యాగయ్య సినిమా తర్వాత నాగయ్య కోడంబాకంలో 52 ఎకరాల తోట కొన్నాడు. అప్పటికే చిత్ర పరిశ్రమలో అతను కథానాయకుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా నిరూపించుకుని ఉన్నాడు. కొంతమంది స్నేహితులు అతన్ని ఆ తోటలో స్టూడియో నిర్మించమని సలహా ఇచ్చారు. ఆర్థిక సహాయం కోసం ఓ జమీందారు సహాయం కోరాడు. అదే సమయంలో దాని పక్కనే వాహినీ వారు కూడా స్టూడియో నిర్మించదలచారు. పరికరాల కోసం అడ్వాన్సు కూడా ఇచ్చాడు. కానీ సహాయం చేస్తానన్న జమీందారు చేతులెత్తేయడంతో నాగయ్యకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది. స్టూడియో నిర్మాణ విషయంలో రెండు లక్షల రూపాయలు నష్టపోయాడు. ఇబ్బందుల్లో ఉన్న మరో స్నేహితుడికి సాయం చేయబోయి యాభై వేలు నష్టపోయాడు. కొన్నాళ్ళకి ఆ తోట కూడా అమ్మేయాల్సి వచ్చింది.
నా ఇల్లు అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించి అందులో నాయక పాత్రతో పాటు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. చిత్రం బాగా ఆడింది కానీ భాగస్వామి మోసం చేయడంతో అతనుకు రావలసిన సొమ్ము దక్కలేదు.
కొందరు సినిమా పెద్దల ప్రకారం సినిమా నటనకు విశిష్టత ఆపాదించిన వాడు నాగయ్య. సినిమా నటుడు ఎక్కువ పారితోషికం తీసుకోవడం అతనితోనే ఆరంభమైంది. తమిళ సినిమాల్లో నటించడానికి 50 వేల నుంచి 75 వేల రూపాయల వరకు తీసుకునే వాడు. ముమ్మిడివరం బాలయోగి వేమన చిత్రం చూసిన తర్వాతనే ఆధ్యాత్మిక పరివర్తన కలిగిందని అతను బంధువులు ఉత్తరాలు రాశారు. నాగయ్య కూడా వెళ్ళి అతన్ని కలిశాడు. తర్వాత ఎన్నో చిత్రాల్లో ప్రధాన పాత్రలు ధరించాడు. ఆంధ్ర, తమిళ, కన్నడ మలయాళ రాష్ట్రాల్లో పలు చోట్ల సన్మానాలు, కనకాభిషేకాలు జరిగాయి. నటరాజు, నట సార్వభౌమ, నటశేఖర, నట పితామహ మొదలైన బిరుదులు అందజేశారు.
జెమిని సంస్థ వారు మహారాష్ట్ర భక్తుడు గోరకుంభుడు జీవితాన్ని సినిమాగా తీస్తూ నాగయ్యను ప్రధాన పాత్ర పోషించమన్నాడు. ఈ సినిమా తమిళంలోనే కాక, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ బాగా ఆడింది. ఈ చిత్రం తర్వాత జెమిని అధినేత వాసన్ నాగయ్యను తన ఇంటికి ఆహ్వానించి పదిహేను వేల రూపాయలు (పారితోషికానికి అదనంగా) బహుమానంగా ఇచ్చాడు.
నైజాం ప్రాంతంలో రజాకార్ ఉద్యమం ప్రభలంగా ఉన్న రోజుల్లో హిందూ ముస్లిం ఐక్యత కోసం రామదాసు కథను సినిమాగా తీయమని నైజాం నవాబు దగ్గర ఉద్యోగిగా ఉన్న పత్రికాధిపతి ఈశ్వరదత్ నాగయ్యను ప్రోత్సహించాడు. నైజాం కూడా నాగయ్యను నిర్మాణానికి సారథ్యం, దర్శకత్వం వహించమనీ కోరాడు. ఇందుకోసం అతన్ని హైదరాబాదుకు ఆహ్వానించారు. బంధుమిత్రులు అతన్ని వారించినా ఈశ్వరదత్తు సహకారంతో హైదరాబాదుకు వెళ్ళి గోల్కొండ, భద్రాచలం, నల్గొండ, నిజామాబాదు తదితర ప్రాంతాల్లో తిరిగి బూర్గుల రామకృష్ణారావు, ఈశ్వరదత్తులతో కలిసి కథను రూపొందించాడు. నైజాం ప్రధాన మంత్రి, పుర ప్రముఖులు చూసి బాగుందన్నారు. అందరూ చిత్ర నిర్మాణానికి కావలసిన సొమ్మును నిజాం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. తిరిగి మద్రాసుకు వచ్చాడు. కథను సముద్రాల రాఘవాచార్యకు చూపించి సంభాషణలు రాయిస్తున్న సమయంలోనే హైదరాబాదులో పోలీసుచర్య జరిగింది. దాంతో వారి ప్రయత్నం తాత్కలికంగా ఆగిపోయింది. ఎలాగూ కథ సిద్ధం చేసుకున్నాము కథా అని నాగయ్యే స్వయంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. 1959 లో చిత్ర నిర్మాణం ఆరంభమైంది. ప్రధాన పాత్ర ధారులైన కన్నాంబ, గౌరీనాథ శాస్త్రి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, గోవిందరాజు వెంకటసుబ్బారావు చిత్ర నిర్మాణ సమయంలోనే మరణించారు. నాగయ్య ఆర్థికంగా నష్ట పోయాడు. అప్పులు చేయవలసి వచ్చింది. చిత్రం పూర్తి కావడానికి ఐదేళ్ళు పట్టింది. రామారావు, నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, అంజలీ దేవి వంటి నటులు ఈ సినిమాలో అతిథి నటులుగా దేవతల పాత్రలు పోషించారు. ఈ చిత్రం 1964 లో విడుదల అయ్యింది. ప్రజలు బాగా ఆదరించారు. ధనం కూడా సంపాదించి పెట్టింది కానీ అతను చేతికి మాత్రం ఏదీ అందలేదు.
స్వర్గసీమ సినిమాకు నేపథ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు.
అతను మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. అందరూ కళాకారులను సమానంగా చూసేవాడు. పోతన - తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, - నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. నాగయ్య మంచి నటుడే కాదు, దాత. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో, నాగయ్య 20 వేల రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరాళంగా సమర్పించాడు.
అవుట్ డోర్ షూటింగులకి వెళ్తే, మధ్యాహ్నం భోజనసమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో అతను రాసిచ్చే సిఫారసు లేఖల కోసం జనం అతను ఇంటిముందు గుమిగూడేవారు.
చంద్రగిరి దగ్గర్లోని వనపాకం గ్రామానికి చెందిన రామశేషయ్య కుమార్తె విజయలక్ష్మితో వధువు స్వగృహంలో అతను వివాహం జరిగింది. ఈ వివాహానికి ముఖ్య కారకుడు అప్పటి మదనపల్లె సబ్ కలెక్టర్ బోల్డన్ దొర. రామశేషయ్య ఒకసారి ఇతను దగ్గరకు వచ్చినపుడు అదే సమయానికి నాగయ్య కూడా అక్కడే ఉన్నాడు. రామశేషయ్య నాగయ్యకు దూరపు బంధుత్వం కూడా ఉందని తెలుసుకున్నాడు. రామశేషయ్యకు కుమార్తె ఉంటే నాగయ్యకిచ్చి వివాహం జరిపించమని అతను సలహా ఇచ్చాడు. విజయలక్ష్మి ఒక పాపకు జన్మనిచ్చిన వెంటనే మరణించింది. ఇంట్లో వాళ్ళందరూ నచ్చజెప్పి అతనుకు రెండో పెళ్ళి జరిపించారు. ఈమె పేరు గిరిజ, నాగయ్య అక్కగారికి దాయాది. ఈ పెళ్ళి పాకాలలో జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు మొదటి భార్య కూతురు మరణించింది. రెండో భార్య గిరిజ నాగయ్య తండ్రికి ఆప్తురాలుగా ఉండేది. అతను ఆమె చేత రామాయణ భారతాది గ్రంథాలు చదివింపజేసి వింటుండేవాడు. ఈమె కూడా కానుపు కష్టమై పిల్ల, తల్లి ఇద్దరూ మరణించారు. ఇది చూసిన నాగయ్య చాలా బాధపడ్డాడు. నాగయ్య తండ్రికి కూడా ఒక నెల రోజులు పాటు మతి చలించి కొద్ది రోజులకు కోలుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతను మరణించాడు.
నాగయ్య తమ్ముడు వయొలిన్ బాగా నేర్చుకున్నాడు. తిరుపతిలో స్థిరపడ్డాడు. పెద్ద చెల్లెలు నివాసం చంద్రగిరి. ఆఖరి చెల్లెలు హరనాథ్ బాబా భక్తురాలు.
పద్మశ్రీ పురస్కారం
1965 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో పద్మశ్రీ అందుకొన్న మొదటి నటుడు నాగయ్య. "ఫిల్మ్ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని గురించి చెబుతూ, నాగయ్యను ఆంధ్రా పాల్‌మునిగా కీర్తించాడు. నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించాడు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు.
నాగయ్య మరణానంతరం ఇంటూరి వెంకటేశ్వరరావు, మిత్రులు, అభిమానులు మున్నగు వారి సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్ లోని పానగల్ పార్కులో, ఈశాన్య భాగంలో నటయోగి నాగయ్య కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయగా రాష్ట్రపతి వి.వి.గిరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటేటా ఆ విగ్రహం వద్ద డిసెంబరు 30వ తేదీన నాగయ్య వర్ధంతి జరుపుకుంటూ ఆ మహానటునికి జోహార్లు అర్పిస్తున్నారు.నాగయ్యకు చిత్తూరుతో కొన్ని సంవత్సరాలు పాటు ఉన్న అనుబంధానికి గుర్తుగా నగరంలోని మహతి కళాక్షేత్రాన్ని నాగయ్య పేరు మీదుగా పిలుస్తున్నారు.
సేకరణ.