
అది విజయవాడలోని సూర్యారావుపేట నర్సింగ్ హోములు, క్లినిక్కులు ఎక్కువగా ఉంటాయా పేటలో. శకుంతలమ్మకు ఆ పేటలో ఒక ఇల్లు ఉంది. శకుంతలమ్మ బెంగళూరులో పిల్లల దగ్గర ఉంటుంది. ఆ ఇంటిని బాడుగకు ఇచ్చింది. ఆరొందల గజాల్లో కట్టబడిన ఇంటిని మూడు భాగాలుగా చేసింది.రెండు పెద్ద పోర్షన్లు,ఒక చిన్న పోర్షను. మొదటి పెద్ద పోర్షనులో రాజారావు అనే డాక్టర్ క్లినిక్కు నడుపుకుంటున్నాడు. రెండో పెద్ద పోర్షనులో శ్రీపతి అనే డాక్టర్ క్లినిక్కు నడుపుకుంటున్నాడు. ఇద్దరు డాక్టర్లు ధనవంతులే. మిగిలిన చిన్నపోర్షనులో కృష్ణమూర్తి, వనజలు వుంటారు. కృష్ణమూర్తి వన్ టౌనులో స్టీలు సామాను షాపులో సేల్సుమానుగా పనిచేస్తున్నాడు. వనజ సూర్యరావుపేటలోని చరితశ్రీ హాస్పిటలులో నర్సుగా పనిచేస్తోంది. వాళ్ళ కిద్దరు మగపిల్లలు.వీళ్లందరికీ ఇల్లు అద్దెకిచ్చి మూడేళ్లవుతోంది.
రాజారావు శకుంతలమ్మతో ఎప్పుడూ మాట్లాడుతుంటాడు.
ఆవిడకు ఆరోగ్యం బాగా లేకపోతే ఫోనులోనే కనుక్కొని మందులు చెప్తుంటాడు. ఇంటికి సంబంధించిన చిన్నాచితకా రిపేర్లు చేయించి పెద్దావిడకు శ్రమ లేకుండా చేస్తుంటాడు. కలుపుగోలుగా ఉండే రాజారావంటే శకుంతలమ్మకు ఒకింత అభిమానం ఎక్కువ. రాజారావు ఆలోచనాపరుడు. తనకు కావలసిన దాన్ని ఏదో రకంగా సాధించుకునే పట్టుదల ఉందడతనిలో. ప్రక్కన ఉన్న అద్దెల వాళ్ళను వెళ్ళగొట్టి,తనే మొత్తం ఇంటిని నర్సింగుహోములాగా మార్చుకుందామని అతని ఆలోచన....ఆ తర్వాత మెల్లగా అతి చౌకగా శకుంతలమ్మ దగ్గర నుండి ఇంటిని కొనుక్కుందామని ఆశ.
శకుంతలమ్మ అమాయకురాలని, ఆవిడ తన మాట నమ్ముతుందని రాజారావుకు నమ్మకం.
ఇంతలో ఒకరోజు కృష్ణమూర్తికి యాక్సిడెంట్ అయింది. ఆరోజు అతడు షాపు నుండి వస్తుంటే లారీ గుద్దేసింది. అక్కడికక్కడే మరణించాడతడు. హుటాహుటిని బెంగుళూరు నుండి విజయవాడ వచ్చింది శకుంతలమ్మ. వనజ,పిల్లలు దిక్కులేనివాళ్లయ్యారు. పెద్దావిడను పట్టుకొని భోరుమంది వనజ.
ఏదో వేదాంతం చెప్పి ఓదార్చింది శకుంతలమ్మ.
"నువ్వు సర్దుకునేదాకా అద్దె కట్టొద్దులే వనజా!ముందు పిల్లలు, నువ్వూ ధైర్యం తెచ్చుకోండి!"అంటూ ధైర్యం చెప్పింది.
నివ్వెరపోయాడు రాజారావు.
అద్దె కట్టకుండా వనజ ఇక్కడే పాతుకుపోతుందా? ఏదైనా చెయ్యాలి!....
ఓ నాలుగు నెలల తర్వాత శకుంతలమ్మకు ఫోను చేశాడు రాజారావు.
"పిన్నిగారూ! మీకో విషయం చెప్పాలండి!... చాలా రోజులుగా నాకెందుకులే అనుకున్నాను..కానీ కళ్లెదురుగ్గా ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక మీతో చెప్పడమే మంచిదనుకున్నానండి!"
"విషయం ఏమిటి రాజారావూ!"అడిగింది శకుంతలమ్మ.
"అదే! ఆ కృష్ణమూర్తి భార్య వనజ లేదండీ!.. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదండి!"
"ఏమైంది? "
"రాత్రిపూట నేను, శ్రీపతి క్లినిక్కులు కట్టేసి వెళ్ళిపోతాము కదండీ!..మన వాచ్ మాను దాసు ఇక్కడే పడుకుంటాడు కదండీ!.. వాడు చెప్పాడండి!.. రాత్రిపూట వనజ కోసం మగవాళ్ళు వస్తున్నారటండి! మీరు ఎంతో నిష్ఠాగరిష్ఠులు కదండీ!.. మీ ఇంట్లో ఇలాంటి పనులు చేయ్యొచ్చాండి? ఆ అమ్మాయికి భర్త లేడు....అడిగేవాడు లేడు... అలాంటి వాళ్ళను ఇంట్లో ఉంచుకోకూడదండి! తక్షణమే ఖాళీ చేయిద్దాం!..ఏమంటారు?"
శకుంతలమ్మ ఆలోచిస్తోంది.
" ఏమంటారు పిన్నిగారు!"రెట్టించాడు రాజారావు.
"ఆలోచించి చెప్తాను రాజారావు! నువ్వేమీ కంగారు పడకు!" అంది శకుంతలమ్మ.
సంతోషించాడు రాజారావు.
శకుంతలమ్మ ఇంటికి ఎదురుగ్గా రామారావుగారుంటారు. ఆయన రిటైర్డ్ లెక్చరర్. శకుంతలమ్మ భర్త సుదర్శనరావుకు, రామారావుకు దాదాపు ముప్పైయేళ్ల స్నేహం. వాళ్ళ పిల్లలు, వీళ్ళపిల్లలు ఒకే స్కూల్లో చదువుకొన్నారు.
రామారావుకు ఫోను చేసి విషయం చెప్పింది శకుంతలమ్మ.
"నేను ఆ అమ్మాయిని గమనిస్తానక్కయ్యా!కంగారు పడొద్దు!"అన్నాడు రామారావు.
పదిహేను రోజుల తర్వాత రామారావు శకుంతలమ్మకు ఫోన్ చేశాడు.
"నేను గమనిస్తున్నానక్కయ్యా!అలా ఎవ్వరూ వచ్చి పోవటం లేదు.. వనజ పనిచేసే హాస్పిటల్ లో కూడా ఆ అమ్మాయి గురించి వాకబు చేశాను. ఆ అమ్మాయికి చాలా మంచి పేరుంది.భర్త పోవటంతో కుంగిపోయి ఉంది పాపం!పేదరాలు కావచ్చు కానీ గుణవంతురాలు. రాజారావునే మనం అనుమానించలి. అతడు వనజ మీద ఎందుకు బురద చల్లుతున్నాడో?.."
శకుంతలమ్మకు విషయం అర్థం అయింది.
వారం తర్వాత రాజారావు శకుంతలమ్మకు ఫోన్ చేశాడు.
"వనజ విషయం ఏం చేద్దాము పిన్నిగారూ!"అంటూ మొదలు పెట్టాడు.
"నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కొంతకాలం నేనే అక్కడ వచ్చి ఉందామనుకుంటున్నాను.. ఇప్పుడు మీరుండే పోర్షనులో వచ్చి ఉంటాను. ఇంటి యజమానిని అక్కడ నేనుంటే ఆ అమ్మాయి కాస్త దారిలోకి వస్తుంది. ఏదైనా శృతి మించి ప్రవర్తిస్తే అప్పుడే ఖాళీ చేయిస్తాను!ఒక నెలరోజుల్లో నీ పోర్షన్ ఖాళీ చేసి పెట్టు!వస్తున్నాను!" అంది శకుంతలమ్మ. ఆమె గొంతులో 'నేను ఆ ఇంటికి యజమానురాలిని'అనే దర్పం తొంగి చూస్తోంది.
"ఇలా అయ్యిందేమిటి?"అని తల పట్టుకున్నాడు రాజారావు.
రెండునెలల తర్వాత రాజారావును ఖాళీ చేయించి, రామారావు సలహాతో ఒక మధ్యతరగతి కుటుంబానికి ఆ పోర్షనును అద్దె కిచ్చింది శకుంతలమ్మ.
**** **** **** **** ***** **** **** ****