రామ నామ మహిమ - కొమ్మలూరు హరి మధుసూదన రావు

రామ నామ మహిమ

తారకం అని పేరుండేవి రెండు. ఒకటి ప్రణవం. రెండవది రామనామం. ‘తారకం’ అంటే ‘దాటించునది’ అని అర్థం. జనన మరణ చక్రమునకే సంసారమని పేరు. ఈ సంసారం సముద్రము వంటిది ఈ సాగరాన్ని దాటించగల నావ రామనామం. ‘కలౌ నామ సంకీర్తనః’. ఈ కలియుగంలో భగవంతుని నామ సంకీర్తనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రామనామం చెబుతూ ఎవరు ప్రాణం విడిచిపెడతారో వారు సరాసరి మోక్షానికే వెళతారు. మన జాతిపిత గాంధీజీ ‘హే రామ్’ అని ప్రాణం విడిచిపెట్టారట. ఎప్పుడూ రామనామాన్ని జపిస్తూ ఉండేవారు కాబట్టే గాంధీజీ అలా పలకగలిగారు. ముందునుంచే రామనామాన్ని జపించటం చేయకపోతే అంత్యకాలమున చెప్పలేము. నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలునట్లు రామనామాన్ని ఏవిధంగా జపించినా పుణ్యం వస్తుంది. పూర్వం నర్మదా నది తీరంలో ఓంకార క్షేత్రానికి వెళ్లేమార్గంలో పెద్ద అరణ్యం ఉండేది. ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే ఈ అరణ్యం దారిగుండా వెళితే తక్కువ దూరం కాబట్టి తొందరగా వెళ్ళవచ్చు. కనుక ప్రజలు ఈ దారిగుండానే ప్రయాణం సాగించేవారు. ఒక పెద్ద దొంగల ముఠా ఈ అరణ్యంలో కాపు కాచి వచ్చిపోయే ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసి దోచుకొనేవారు. డబ్బులు ఇవ్వకపోతే చంపివేసే వారు. వారి అకృత్యాలను తట్టుకోలేక ప్రజలు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు వద్దకు ఒకరోజు వెళ్లి మొరపెట్టారు. రాజు ‘నాకూ ఈమధ్యనే ఈ విషయం తెలిసింది. సైన్యాన్ని పంపించి ఆ దొంగల ముఠా పనిబడతాను. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళిరండి’ అని వారిని పంపించాడు. ఈ విషయం ఈ నోటా ఆనోటా పడి ఆ దొంగల ముఠాకు కూడా తెలిసింది. ఇక ఈ రాజ్యం లో ఉంటే కారాగార గతి పడుతుంది. కాబట్టి నర్మదా నది దాటి ప్రక్క రాజ్యంలోకి వెళ్ళిపోదామని వారు నిశ్చయించుకున్నారు. అయితే చివరిసారి ఒక పెద్ద దొంగతనం చేసి అవతలి రాజ్యానికి వెళ్లి ఎవరి పని వారు చేసుకుందాం అని అనుకొన్నారు. ఆ నాటి కాలంలో అందరూ సంస్కృతం మాట్లాడేవారు కదా! ‘వనేచరామః, వసుచాహరామః, నదీంతరామః, నభయంస్మరామః’ అని అన్నారు. అంతలోనే చెట్టుపైన ఉన్న ఒకడు పెళ్లివాళ్ళు వస్తున్నారనే సంజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆ దొంగలు వాళ్ళ మీదికు రాగానే పెళ్లి దుస్తుల్లో వచ్చిన సైనికులు ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా అందరినీ చంపివేశారు. యమదూతలు వచ్చి యమపాశాన్ని వేశారు. అంతలోనే గొప్ప కాంతితో వెలుగొందే వారు వచ్చి ఆ యమపాశాన్ని తొలగించేశారు. ‘అయ్యా! వీళ్ళు కిరాతకమైన దొంగలు. వీళ్ళు చేయని అకృత్యాలు లేవు. వీళ్ళ పాపాల్ని లెక్కించి యమధర్మరాజు యమపురికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. మా పని మేం చేసుకుంటూ ఉంటే మీరు ఆడ్డు పడుతున్నారు. అసలు మీరు ఎవరు ? ఎందుకు మా పనిని ఆపుతున్నారు ?’ అని యమదూతలు వారిని అడిగారు. అప్పుడు వారు ‘మేము దేవదూతలము. స్వర్గంనుంచి వచ్చాము. అయినా మీకు ధర్మం తెలుసుగానీ ధర్మసూక్ష్మం తెలియదు. ఈ దొంగలు ఎన్నో పాపాలు చేశారు నిజమే కానీ, మరణకాలము నందు దైవనామ స్మరణ చేశారు.’ అని అన్నారు. ‘ఎప్పుడన్నారయ్యా! వాళ్ళు’ అని యమదూతలు ప్రశ్నించారు. దానికి దేవదూతలు చెబుతూ ‘ఆ దొంగలు ‘వనేచరామః, వసుచాహరామః, నదీంతరామః, నభయంస్మరామః’ అని రామ రామ అని ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు అన్నారు’ అని చెప్పారు. ‘‘అయ్యో వాళ్ళు అన్న మాటలకు అర్థం చూడండి ‘వనే చరామః’ అంటే ఈ అడవిలో తిరుగుదాము. ‘వసుచ ఆహారామః’ అంటే బంగారాన్ని దొంగతనం చేద్దాం. ‘నదీం తరామః’ అంటే ఈ నర్మదా నదిని దాటి పోదాం. ‘న భయం స్మరామః’ అంటే ఆ రాజ్యంలో ఇక ఏ భయం ఉండదు అని అర్థం. కాబట్టి వాళ్ళు దైవ నామ స్మరణ చేయలేదు” అని యమదూతలు అన్నారు. ఆ దొంగలు తెలియక అన్నా రామ అని అన్నారు కాబట్టి మేము తీసుకెళతాం’ అని వారిని స్వర్గానికి పట్టుకెళ్లారు. కాబట్టి అర్థం తెలియకపోతేనే ఇలా అయితే అర్థం తెలిస్తే ఇంకెంత లాభమో గ్రహించండి. అందుకే రామదాసు ‘తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా మీరిన కాలుని దూతలు పాలిటి మృత్యువుయని నమ్మక యున్న’ అని పాడాడు. ఇదే కంచెర్ల గోపన్న ను కారాగారం లో పెట్టి ఉప్పూ, కారం ఎక్కువ వేసిన ఆహారం పెట్టినా ‘శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓ రామ నీ నామ మేమిరుచిరా కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామ మేమిరుచిరా’ అని పారవశ్యంతో పాడుతూ తినగలిగాడు. రామ అంటే : ‘రమ్’ అనే ధాతువు నుండి ఏర్పడింది రామ శబ్దం. ‘రామ్’ అంటే రమించుట, ఆనందపడుట, హాయిని గొల్పుట అని అర్థం. ‘రమయతీతి రామః’ ఎల్లరను రంజింప జేయువాడు రాముడు. ‘రమయతి సర్వాన్ గుణైరితి రామః’ అందరినీ తన గుణములచే రమింపజేయువాడు రాముడు. ‘రమంతే యోగినో నంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదే నాసౌ పరబ్రహ్మాభి ధీయతే’ అని అగస్త్య సంహితలో చెప్పారు. అంటే నిత్యానంద, చిదాత్మ యందు బ్రహ్మ, జ్ఞాన యోగులు రమింతురు. సర్వావస్థల యందు క్రీడింతురు. ఆ పరబ్రహ్మమే రామ అను పేర ఉన్నది. ‘బ్రహ్మ’ అనే అక్షరాలలోని క్రింది ఒత్తులు ‘రామ’ అవుతాయి. ఈ రెండూ బీజాక్షరాలు. అష్టాక్షరీ మంత్రం ‘ఓం నమో నారాయణాయ’ లోని ‘రా’ అనే అక్షరం అగ్ని బీజాక్షరం. పంచాక్షరీ మంత్రం ‘ఓం నమశ్శివాయ’ లోని ‘మ’ అనేది అమృత బీజాక్షరం. ఈ రెండింటినీ కలిపితే ‘రామ’ అయ్యింది. మంత్రాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెబుతున్నామనేనియమం ఉంది. కానీ నామాన్ని ఎల్లవేళలా, సర్వావస్థల యందు మననం చేయవచ్చు. అందుకే తూము నరసింహదాసులు ‘రామనామమే జీవనము భక్తావనము పతిత పావనము’ అని పాడారు. రామనామ వైశిష్ట్యం : భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు ఎప్పుడూ హరినామ సంకీర్తన చేసేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు కన్న కొడుకు అని కూడా చూడకుండా ప్రహ్లాదుడిని అగ్ని గుండంలో వేయమని భటులను ఆదేశించాడు. కొంత సేపటికి నారాయణ మంత్రం చెబుతూ ప్రహ్లాదుడు వచ్చాడు. ‘ప్రహ్లాదా! నిన్ను ఈ భటులు రాజ కుమారుడనే మమకారంతో అగ్ని గుండంలో వేయలేదా?’ అని అడిగాడు. ‘వేశారు తండ్రీ’ అని చెప్పాడు. ‘నీకు భయం వేయలేదా? ఏమీ కాలలేదా?’ అని అడిగాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు తన తండ్రితో ఇలా అన్నాడు. ‘రామ నామ జపతాం కుతో భయం సర్వతాప శమనైక భేషజం పశ్యతాత మమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధున’ అంటే రామ నామాన్ని జపిస్తే ఏ భయం ఉండదు. ఎటువంటి కష్టమైనా ఉపశమనం లభిస్తుంది. కణ కణ లాడే నిప్పు కూడా నీరు అవుతుంది. రాముడు కృతయుగం వాడైనా రామ అనే శబ్దం ఎప్పటినుంచో ఉంది. పరశురాముడు ఉన్నాడుగా. పరశువు ఆయుధం గా ఉన్నవాడు గనుక పరశురాముడయ్యాడు. విష్ణు సహస్ర నామ స్తోత్రం లో ‘రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః’ అని ఉంది. ‘శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే’ అని శంకరుడు పార్వతిదేవితో ఆన్నాడు. రామ రామ రామ అని మూడు మార్లు అంటే వెయ్యి సార్లు జపం చేసినట్లే లెక్క. ఎలాగంటే సంస్కృత బాషలో అక్షరాలను అంకెలుగా మార్చే సాంప్రదాయం ఉంది. ‘య ర ల వ’ లలో ‘ర’ రెండవ అక్షరం. ‘ప ఫ బ భ మ’ లలో ‘మ’ ఐదవ అక్షరం. కపటయాది సంకేతము ప్రకారం ‘రా’ అంటే 2 ‘మ’ అంటే 5. రామ అంటే 2 X 5 = 10 రామ రామ రామ అంటే 10 X 10 X 10 =1000 ‘జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్చేదమంత్రం సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్’ అంతగొప్పది కాబట్టే ‘శ్రీ రామ నామం మరువాం మరువాం సిద్ధము-యమునికి వెరువాం వెరువాం’ అని రామదాసు అన్నాడు. ‘రామ రామ రామ రామ రామ నామ తారకమ్ రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తి దాయకమ్ జానకీ మనోహరమ్ సర్వ లోక నాయకమ్ శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం’ సాక్షాత్తూ పరమశివుడే నేను ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తూ ఉంటానని పార్వతీదేవి తో చెప్పాడు. ప్రాతః స్మరణీయులు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఏ ఊరు వెళ్ళినా అక్కడి పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టుకుని రామనామం వ్రాయమని చెప్పేవారు. ఎవరైతే అక్షరాలు గుండ్రగా, ఎక్కువమార్లు రామ నామం వ్రాస్తారో వారికి రామ మాడలు బహుకరించే వారు. ముక్తి మార్గమునకు రామనామం మూలం అని భద్రాచల రామదాసు చెబుతూ ‘శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీ కరమైయున్నది ఘోరమైన పాతకములు గొట్టే నన్నది మమ్ము చేరకుండ ఆపదలను చెండేనన్నది’ అని పాడాడు. గుంటూరు లో ఒకప్పుడు రాగం పిచ్చయ్య దాసు అనేవారు ఉండేవారు. ఒకసారి వారి అన్నయ్య తో కలిసి భద్రాచలం వెళ్లి వచ్చారు. అప్పటినుంచీ రామ రామ అని అనేవారు. దాసుగారికి భయంకరమైన కలరా వ్యాధి సోకింది. పక్కింటి వాళ్ళు భద్రాచలం వెళ్ళొచ్చి నప్పటి నుండీ రామ రామ అంటున్నావు. దానికి రాముడిచ్చింది నీకు ఈ కలరా వ్యాధినేనా అని హేళన చేశారు. అయినా దాసుగారు ప్రశాంతంగా ‘ఏం పర్లేదు ఈ జన్మకు ఇది చాలు. రాముల దర్శన భాగ్యం లభించింది. ఇంకోసారి చూసే యోగం ఉంటే ఆ స్వామే నన్ను రక్షించు కుంటాడు.’ అని అన్నాడు. కొంత కాలానికి కలరా తగ్గి పోయింది. చిన్నతనంలోనే భార్య బిడ్డలను పోగొట్టుకున్నాడు. అయినా చలించలేదు. రామ నామాన్ని విడిచిపెట్టలేదు. మరో వివాహం చేసుకున్నాక ఒక కూతురు, ఇద్దరు కుమారులు కలిగారు. అటవీ శాఖలో శ్రీశైలం, మంగళగిరి, కోటప్పకొండ ప్రదేశాల్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. కొంతకాలానికి కూతురు చనిపోయింది. అయినా రాముడే ఇచ్చాడు, ఆ రాముడే తెసుకెళ్లాడని అనేవాడు. ఒకావిడ వచ్చి రామకోటి వ్రాయమని చెప్పింది. రోజుకు పదమూడు గంటలపాటు వ్రాసి పూర్తి చేసాడు. ఒక రోజు రాత్రి భద్రాచల రాముడు దర్శనమిచ్చి తనకు రామకోటిని సమర్పించమని చెప్పాడు. తన బంధు జనం తో కలిసి భద్రాచలం వెళ్ళాడు. ఇంకొక రోజు వుంటే శ్రీ రామనవమి వస్తుంది. కాబట్టి రేపు రామకోటిని సమర్పించండి అయినా మీరు బాగా అలసి పోయారు విశ్రాంతి తెసుకోండి అని అక్కడి వారు చెప్పారు. ఈ రోజే ఇస్తాను అని పట్టుదల పట్టారు. రామకోటి వ్రాసినందుకు ఇప్పటికే మీకు పుణ్యం వచ్చింది, ఎందుకు తొందర పడుతున్నారు అని వారు అన్నారు. దానికి దాసుగారు ‘ పాపం ఇనుప గొలుసుల వంటిది, పుణ్యం బంగారు గొలుసుల వంటిది. రెండూ బంధనాలే. కాబట్టి ఆ పుణ్యం కాస్తా స్వామి వారికే అర్పిస్తానని చెప్పి గోదావరిలో స్నాన మాచరించి ఆ సప్తమి తిధి నాడే రామ కోటిని స్వామి వారి పాదాల చెంత చేర్చాడు. ఆరోజు రాత్రి ఊపిరి సరిగా ఆడటం లేనందున తన మంచాన్ని గోపురం కనబడేటట్లుగా వేయమని చెప్పి, స్వామి భజనలు వింటూ రామునిలో ఐక్యం చెందారు. ఇప్పటికీ భద్రాచలంలో చిత్రకూట శాలలో రామదాసు గారి పటం పక్కనే పిచ్చయ్య దాసుగారి పటం ఉంటుంది. త్యాగరాజు, రామదాసు, కబీరు వంటి వారెందరో రామనామాన్ని జపించి, తరించి మోక్షం పొందారు. ‘రామ నామము రామనామము రమ్యమైనది రామనామము’ అని పాడుతూ ‘దారినొంటిగా నడుచు వారికి తోడు నీడే రామనామము’ అని భజన చేస్తారు. ‘రా’ శబ్దోచ్చారణేనైవ ముఖాన్ నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యాత్ర ‘మ’ కార దుఃఖ వాటవతు అంటే ‘రా’ అని అనగానే నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్ని జ్వాలలో పడి దహించుకు పోతాయి. ‘మ’ అనే అక్షరం పలికేసరికి నోరు మూసుకుని బయటి పాపాలు మన లోనికి ప్రవేశించవు. రామ శబ్దం పరబ్రహ్మ వాచకం. అందుకే త్యాగయ్య ‘రామనామమే మేలు - రామ చింతనే చేలు’ అని అంటే, రామదాసు ఇలా అన్నారు ‘శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన పాతకములను కోరనేటికే మనసా’ ప్రతి అమ్మా తన బిడ్డలకు నీళ్ళు పోస్తూ చివరన ‘శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష’ అని ఆశీర్వచనం పలుకుతారు. ‘భద్రం నో భూయాత్’

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి