మనం - మన(రాజకీయ)నాయకులు - మద్దూరి నరసింహమూర్తి

మనం - మన(రాజకీయ)నాయకులు

 

మనం - మన(రాజకీయ)నాయకులు

 

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కల దేశంగా పేరొందిన మన దేశంలో –

రాజకీయనాయకుడితో పోల్చుకుంటే, సామాన్యుడు ఎన్ని విధాలుగానో చింతించవలసిన పరిస్థితి ద్యోతకమౌతుంది. కొన్ని విషయాలు పరిశీలిద్దాం.

ఉద్యోగి :

ఒక కాల పరిమితి తదుపరి పదవీ విరమణ చేయక తప్పదు. రాజకీయనాయకుడికి మాత్రం ఆ నియమం వర్తించదు. అందుకే, కాటికి కాళ్ళు చెప్పుకున్న నాయకుడికి కూడా ‘కుర్చీ/అధికారం' మీద ఆశ / మక్కువ చావదు.

ఫించను :

నియమిత కాలం ఉద్యోగం చేసిన తరువాత, సామాన్య ఉద్యోగికి ఒక ఫించను పొందడానికి అర్హతయితే ఉంది. కానీ, పదవీ విరమణ తదుపరి ఆ ఫించను అందుకోక ఏళ్ల తరబడి వేచి చూస్తూ తత్సంబంధిత కార్యాలయాల చుట్టూ ఆశతో తిరిగేవారు మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఫించను హక్కుదారుడు నెలలో నియమిత తేదీకి ఫించను అందుకోవాలని నియమం అయితే ఉంది. కానీ, రోజుల తరబడి నెలల తరబడి ఆ ఫించను రూకల కోసం ఎదురు చూస్తూ తత్సంబంధిత కార్యాలయాల చుట్టూ ఆశతో తిరిగేవారు కూడా మనకి కనిపిస్తూనే ఉన్నారు. రాజకీయనాయకుడికి అటువంటి పరిమితులు ఏమీ లేవు. ఎన్ని పదవులు అలంకరిస్తే, అన్ని పదవులకి వేరు వేరుగా పింఛనులు. నెలలో నియమిత తేదీకి ఆయన ఖాతాలో ఫించను జమ అయి తీరవలసినదే. ఎవరూ ఏ విధంగా అడ్డుకోడానికి వీలులేదు. పైగా, ఫించను పొందడానికి పదవీకాలం పూర్తి అవ్వాలనే నియమం కూడా లేదు.

కనీస అర్హత :

ఉద్యోగాన్ని అభ్యర్ధించే వ్యక్తికి కొన్ని కనీస అర్హతలుండాలి, ముఖ్యంగా వయసు/చదువు విషయాలలో. అంతేకాదు, పోలీసు వారి పర్యవేక్షణలో - నేరస్తుడుగా నమోదైన వ్యక్తి కానీ, నేర చరిత్రకు సంబంధించి వ్యాజ్యాలు పరిశీలనలో ఉన్న వ్యక్తి కానీ, ఎటువంటి ఉద్యోగానికి అర్హుడు కాడు. రాజకీయనాయకుడికి కనిష్ట చదువు ఉండవలసిన నియమాలు లేవు. నేర చరిత్రకు సంబంధించి ఎన్ని వ్యాజ్యాలు పరిశీలనలో ఉన్నా ఏ పదవికైనా పోటీ చేయవచ్చు, దర్జాగా పదవిని అలంకరించవచ్చు.

-2-

నేరారోపణ :

ఏ ఉద్యోగి అయినా నేరారోపణ ఎదుర్కొంటే, ఆ విచారణ తేలేవరకూ -- కొన్ని సందర్భాలలో, పూర్తి జీతం/ఫించను కూడా అందుకోవడానికి అర్హత లేని పరిస్థితి. ఆ నేరారోపణ నిర్ధారింపబడితే, నేర పరిధి అనుసరించి, ఉద్యోగం/ఫించను కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకటి అర విషయాలలో మినహాయించి, రాజకీయనాయకుడికి అటువంటి బాదర బందీ ఏమాత్రం లేదు. పదవిలో కొనసాగక పొతే, మరలా ఎన్నికలలో నిలబడి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే పదవి మరలా అలంకరించే అవకాశం కూడా లేక పోలేదు. ఏది ఏమైనా ఆయనకు లభించవలసిన ఫించను పూర్తిగా లభించవలసినదే.

ప్రయాణ సదుపాయాలు :

సామాన్యుడి ప్రయాణానికి పల్లెటూళ్లలో రోడ్డులే ఉండవు. బస్సు సదుపాయాలు అథవా ఉంటే, రోజంతట్లో ఒకటి ఉంటే, అదే మహా ప్రసాదం. సుమారుగా ఏ పల్లెటూరికి రైలు సదుపాయాలుండవు. అథవా ఉంటే, ముక్కుతూ మూలుగుతూ నడిచే పాసెంజర్ రైలు మాత్రమే. ఆ పాసెంజర్ రైలు రాక పోకలకి ఒక నిర్దిష్టమైన సమయం ఉన్నా సాధారణంగా ఆ సమయపాలన ఉండే ఉండదు. పట్టణాలలో రైలు సదుపాయాలైతే ఉంటాయి కానీ, కావలసిన రోజున ప్రయాణానికి టికెట్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అప్పుడు, విధిగా ప్రయాణించవలసిన పని పడితే, తత్కాల్ వ్యవస్థలో అధికంగా డబ్బు ఇచ్చి ప్రయాణం చేయాలి. పండుగలు పర్వాలు అయితే, ప్రత్యేక రైలు అన్న పేరుతో అధికంగా డబ్బు వసూలు చేయబడుతుంది. బస్సులలో ప్రయాణ పరిస్థితి కూడా అంతే. రాజకీయనాయకుడికి ప్రయాణం చింత లేనే లేదు. బస్సుల్లో రైళ్లలో ఆయనకి సీట్/బెర్త్ రిజర్వు చేసి ఉంటాయి. నాయకుడు ప్రయాణం చేసినా మానినా, ఆ సీట్/బెర్త్ ఖాళీగా ఉంచబడతాయి. అయినా, ఈరోజుల్లో నాయకులు కార్లు/విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు.

రోడ్ల పరిస్థితి :

పల్లెటూళ్లలో రోడ్డులే ఉండవు కాబట్టి వాటి గురించి ఆలోచన/చర్చ అనవసరం. అక్కడ ఉండేవి సాధారణ జనం సహనాన్ని బలాన్ని పరీక్షించే గతుకులు గొయ్యలు. దారిలో ఉండే ఏటి మీద వంతెన ఉండదు, ఒకప్పుడు ఉన్నా అది పాతబడిపోయి బాగులకి నోచుకోక దాని మీద వెళ్లే ఏ వాహనమేనా ఎప్పుడు పడిపోతుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. వర్షాకాలంలో తెప్పలు నావలు మాత్రమే గతి. పట్టనాళ్ళలో రోడ్లు ఉంటాయి. కానీ, వాటి మీద ప్రమాణాలకు విరుద్ధంగా వేసిన వేగనిరోధకాలు,

-3-

చిన్న/పెద్ద గోతులు నిండి ఉంటాయి. వేగనిరోధకాలు వేగాన్ని నియంత్రించడంతో బాటూ, ప్రయాణీకుడి ఆరోగ్య పరిస్థితిని అనారోగ్య దిశగా తీసుకొని వెళ్లి - ప్రయాణీకుడికి, ఆతని బండికి మరమ్మత్తులు అందుకయే భారీ ఖర్చులు దిశగా నడిపిస్తాయి.

రాజకీయనాయకుడు అందుకే రోడ్లని నమ్ముకోడు. తప్పనిపరిస్థితిలో రోడ్డు మీద ప్రయాణించవలసివస్తే, ఆతని ప్రయాణానికి ముందుగా రోడ్డు బాగు చేయబడుతుంది, ఆయన ప్రయాణం చేసే సమయంలో చీమ/ఈగ కూడా ఆ రోడ్డు మీద ప్రయాణం చేయడానికి వీలులేకుండా రక్షకభటుల వలయం సమకూర్చబడుతుంది.

కలయిక :

సాధారణ జనం రాజకీయనాయకుడిని కలవాలంటే గతుకుల రోడ్డు మీద నించి ఒళ్ళు హూనం చేసుకొని వెళ్ళాలి. అలా వెళ్లినా, ఆయన దర్శనం లభిస్తుందని చెప్పలేం. దర్శనం దొరకకపోతే, ఈదురోమంటూ వెనుకకు రావలసినదే. రాజకీయనాయకుడు జనాన్ని కలవాలంటే, పైసా కూడా స్వంతంగా ఖర్చు పెట్టకుండా, కారు లేదా హెలికాప్టర్ లో వస్తాడు. అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జనం కళ్ళలో ధూళి (కారు/ హెలికాప్టర్ ద్వారా) జల్లి వెళతాడు.

విద్యుత్ సదుపాయం & త్రాగే నీటి సదుపాయం :

సాధారణ జనానికి ప్రతీరోజూ 24 గంటలూ విద్యుత్ & త్రాగే నీటి సదుపాయం కలగచేయడం కష్టం కాబట్టి, ఒక చోట ఇస్తే, మరో చోట ఇవ్వక, ఒకరికి ఇస్తే మరొకరికి ఇవ్వక సర్కారువారు జాగ్రత్త పడుతూంటారు. రాజకీయనాయకుడు ఎక్కడున్నా వారంలో ఏడూ రోజులూ, రోజులో 24 గంటలూ విద్యుత్ & త్రాగే నీటి సదుపాయం కలగచేయబడుతుంది. లేకపోతే, ఆయన పాపం ప్రజాసేవ ఎలా చేస్తాడు ?

 

మన రాజకీయనాయకుల దగ్గరనుంచి మనం నేర్చుకోదగ్గది - వారి లక్ష్య సాధన. అందుకై వారి అకుంఠిత దీక్ష.

వారి లక్ష్యమంతా ఎన్నిక ఎలాగేనా గెలవాలి, అంతే.

అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు చిత్రం – ‘కథానాయకుడు’ - లో కీ.శే.నాగభూషణంగారు ధరించిన రాజనాయకుడు పాత్రచేత దర్శకుడు చెప్పించిన మాటలు (ప్రతీవాడికీ ఒక రేటు అంటూ ఉంటుంది, అది తెలుసుకొని ఆ వ్యక్తిని కొనేయడమే) ఇప్పటికీ మన రాజకీయనాయకులు తు. చ. తప్పకుండా ఆచరిస్తూ, సులువుగా అమ్ముడుపోయే ఓటర్లని కొనేస్తుంటారు.

-4-

ఎవరేనా అలా అమ్ముడు పడకపోతే, బతిమాలో బెదిరించో ఓటు వేయించుకుంటూంటారు.

 

ఇక్కడ ఎవరికైనా వచ్చే సందేహం - సామాన్య ఓటరు తెలిసి తెలిసి ఎందుకు అమ్ముడు పోతున్నాడు?

తిరుగుబాటు చేసి, ప్రాణహానీ మానహానీ తెచ్చుకొనేదెవరు? ఎన్నికలలో నిలబడే ప్రతీ నాయకుడు ధనం కానీ ధనేతరం కానీ ఇచ్చేవాడే. ఆ విధంగా ప్రతీ నాయకుడు ఇచ్చేది పుచ్చుకొని, కొద్దీ రోజులైనా కాలం గడుపుకోవొచ్చు అని ఆలోచించే సామాన్య జనం మన రాజకీయనాయకులకు పెట్టని కోటలాంటివారు.

 

అంతో ఇంతో చదువుకున్న జనం - 'ఏ వెధవ కి ఓటి వేసినా ఒకటే కాబట్టి, మనం ఎందుకు ఎండలో పడిగాపులు గాచి క్యూలో నిలబడి ఓటు వేయాలి, సెలవురోజు కుటుంబంతో హాయిగా గడపక' అని ఆలోచిస్తూ ఎన్నికలరోజు (ప్రభుత్వం ఇచ్చే సెలవు దినం) నాడు ఓటు వేయకుండా గైరు హాజరు అవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

 

ఎన్నికలప్పుడే రాజకీయనాయకుడికి జనం గుర్తు వచ్చేది, ఆ జనంకి వంగి వంగి దండాలు పెట్టేది.

ఎన్నికలు గెలిచిన తరువాత, తమ పార్టీ కార్యకర్తలు మరికొంతమంది సన్నిహితులకు తప్ప ఆ నాయకుడి దర్శనం కూడా సామాన్య ఓటరుకి లభించదు.

 

ఇవన్నీ కలిపి మనల్ని శాసించేవాడెవడు అంటే - మనల్ని కొనుక్కున్న ఆ నాయకుడు.

జనం ఎప్పుడేనా కాస్త సాహసించి, 'అదెందుకు కాలేదు/చేయలేదు ఇదెందుకు కాలేదు/చేయలేదు' అని నిలదీస్తే - పాపం ఆ శాల్తీ గల్లంతైపోతాడు. అక్కడితో, అడిగే మరొకడు ముందుకు రాడు.

 

ఇంకా మనం విచారించవలసినదేమిటంటే – పైన చెప్పిన విధంగా ఎన్నికయిన వారిలో --

వేలిముద్ర ప్రబుద్ధుడు విద్యాశాఖ మంత్రి, ఎన్నో కరుడుకట్టిన నేరాలు చేసినవాడు గృహమంత్రి, ఆర్ధిక నేరాలు అధికంగా చేసినవాడు ఆర్ధికమంత్రి –

గా మనల్ని శాసించడానికి నియమింపబడే పరిస్థితి కూడా లేకపోలేదు.

వీరు చేసే చట్టాలు పాటించవలసినది, పాటించకపోతే శిక్ష అనుభవించేది సామాన్య జనం మాత్రమే.

రాజకీయనాయకులు వారి అనుయాయులకు ఆ చట్టాలు నియమాలు వర్తించవు, వారు పాటించరు.

-5-

ఒకరిద్దరు రాజకీయనాయకుల మీద నిఘా విభాగాల వారి విచారణ, కోర్టులలో వ్యాజ్యాలు దాఖలా అవుతాయి.

కానీ, అవి సామాన్యంగా ఒక దశాబ్ద / పుష్కర కాలం వరకూ ఎటూ తేలవు. ఆ నాయకులకు ప్రతికూలంగా కోర్టు వారు ఇచ్చిన తీర్పు మీద పై కోర్టులో అప్పీల్ వేయబడుతుంది. అది మరొక దశాబ్ద / పుష్కర కాలం నడుస్తుంది. కోర్టులలో వాదించే న్యాయవాది ఖర్చుతో బాటూ, రాజకీయనాయకుల కోర్టులకు తిరిగే ఖర్చు ప్రభుత్వ ఖాతాలోంచే (సామాన్యుడు ప్రభుత్వానికి కట్టే శిస్తు, రుసుములు, ఇత్యాది) వెళ్తుంది.

 

అంతే కాక --

రాజకీయనాయకులు కోట్ల ఆస్తి మాత్రమే ఉంటున్న బీద జనం కాబట్టి, అన్ని రకాల రాయితీలు వారికి, వారి కుటుంబాలకు మరియు వారి పల్లకీలు మోస్తున్న అనుయాయులకు మాత్రమే. సామాన్యుడు అన్ని రకాల రుసుములు శిస్తులు వగైరా - ఎటువంటి రాయితీలు లేకుండా - చెల్లించవలసినదే. అలా చెల్లించకపోతే, అందులకై నాయకుల చేత నిర్ణయింపబడిన అపరాధరుసుము/శిక్ష అనుభవించవలసినదే.

 

పైన ఉదహరించినవి కొన్ని మాత్రమే.

ఆతా వాతా, నా విచారం ఏమిటంటే - మనం తెలిసి తెలిసి ఈ విష వలయంలో ఎందుకు చిక్కుకుంటున్నాము. మనకి ముక్తి లేదా? ఎందుకు లేదు?

 

ఓటరు అన్న వాడు అమ్ముడు పోక, ఓటు వేయవలసిన రోజుని సెలవు దినంగా పాటించక, ధైర్యంతో, వివేకంతో తప్పనిసరిగా ఓటు వేసిననాడు - మనం కోరుకొనే మార్పు వస్తుందని నా ఆశ / విశ్వాసం.

*****

(దేశంలో ఎన్నికల వాతావరణం ఆరంభం అయిన ప్రస్తుత సమయాన - ఈ వ్యాసం వ్రాయాలనిపించింది)

*****

--- మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు