జర్నీ ఆఫ్ ఏ టీచర్ - చెన్నూరి సుదర్శన్

జర్నీ ఆఫ్ ఏ టీచర్

చెన్నూరి సుదర్శన్ గారు జూనియర్ కళాశాల గణితశాస్త్ర అధ్యాపకులుగా 30ఏళ్లు పనిచేశారు. ఈ నేపథ్యంలో" జర్నీ ఆఫ్ ఏ టీచర్" అనే పేరుతో తన అనుభవాలను వివరిస్తూ ఈ నవలను రాశారు.

సూర్య ప్రకాష్ కు మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాన్ లోకల్ కోటాలో, శ్రీకాకుళం జిల్లాలో గణిత శాస్త్ర జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. అక్కడ విద్యార్థులను ఆకర్షించే మరో గణిత అధ్యాపకుడు విజయ్ కుమార్, ఇంటికి వెళ్లి బోధనా విధానంలోని రహస్యాలను తెలుసుకుంటాడు. ప్రతిరోజు ఇంటిదగ్గర ముందు ప్రిపేర్ అయి మరీ క్లాస్ కు వెళ్లేవాడు .ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగమణి ,తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తుంది .ఆమె ఆ ప్రాంతానికి వెళ్లడం, సూర్యప్రకాష్ తెలంగాణ ప్రాంతానికి రావడంతో నవల మలుపు తిరుగుతుంది. సూర్యప్రకాశ్ ఉద్యోగరీత్యా చాలా ప్రాంతాలలో పనిచేశాడు. ఆయనతో సహా అధ్యాపకుల పాత్రల ద్వారా జూనియర్ కళాశాలలోని విద్యావ్యవస్థను వివరించాడు. స్త్రీ పురుష అధ్యాపకుల మధ్య ఉద్యోగేతర సంబంధాలను సున్నితంగా స్పృశించారు .ప్రభుత్వ ధనాన్ని దోచుకునే దోపిడి విధానాన్ని ఎత్తి చూపారు. కొంతమంది విద్యార్థి విద్యార్థినుల పాత్రలను తీర్చిదిద్ది వారు ప్రయోజకులుగా ఎదిగిన తీరును ప్రదర్శించారు కళాశాల పరీక్ష విధానంలోనూ సమయపాలన విధానంలోనూ క్రమశిక్షణలోనూ వారు తీసుకొచ్చిన మార్పుల గురించి తెలియజేశారు. అలాగే తాను ప్రిన్సిపాల్ గా పనిచేసిన కళాశాలలో తన ఉద్యోగ జీవితంలోని క్లిష్ట సమస్యలను వివరించాడు .జూనియర్ కళాశాలలో అధ్యాపకులు ప్రవర్తించే తీరును వారి వ్యవహార దక్షతను వివరించారు . ప్రైవేట్ కళాశాలల ఆదిపత్యాన్ని ధిక్కరించాడు.సుధాకర్ అధ్యాపకులను బెదిరించే విప్లవ విద్యార్థి. అలాంటి విద్యార్థిని మంచి మాటలతో మార్చి, ఆ కళాశాల అభివృద్ధికి తోడ్పడే విధంగా తీర్చిదిద్దిన వైనం అభినందనీయం. తోటి అధ్యాపకులైన ఫణీంద్ర, జోగయ్యలు దుష్ట బుద్ధితో సూర్యప్రకాష్ కెరీర్ ను పాడు చేయాలని ప్రయత్నించి విఫలమవుతారు .తర్వాత కాలంలో దానికి మూల్యం చెల్లించుకుంటారు.

ఈ నవల ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ ఔన్నత్యాన్ని వివరిస్తుంది. కొన్ని లోపాలను ,లొసుగులను అధ్యాపకుల - విద్యార్థుల దృక్పథాన్ని ఈ నవలలో సున్నితంగా విమర్శిస్తూనే, వానిని సరిదిద్దున వైనం ఇంకా సరిదిద్దుకోవాల్సిన విషయాలను కూలంకుషంగా విశదీకరించారు. ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ పై వచ్చిన తొలి నవలగా దీన్ని గుర్తించవచ్చు.

కె.పి అశోక్ కుమార్

"జర్నీ ఆఫ్ ఏ టీచర్"( నవల) చెన్నూరి సుదర్శన్. శోభ సాహితీ ప్రచురణలు., హైదరాబాద్ -85. వెల 150 రూ పేజీలు 168 ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు మరియు 944 055 87 48

***