అభినవ వ్యభిచారం - మద్దూరి నరసింహమూర్తి

Abhinava vyabhicharam

వ్యభిచారం అన్నమాట వినగానే -- పడుపు వృత్తి చేసుకొని బ్రతికే ఆడది మనోనేత్రం ఎదుట నిలబడక మానదు. ఎటువంటి ఆధారం లేని కారణంతో కాలే కడుపు నింపుకోవడానికో ; ఇతరుల బలవంతంతోనో ; లేక మరేదో కారణంతోనో మనసా ఇష్టం లేకపోయినా, పడుపువృత్తి సాగించే అభాగినులను చూసి ఏమాత్రం జాలిపడని మన సమాజం వారిని సమాజానికి పట్టిన చీడ పురుగులుగా చీదరించుకుంటూ, వీలైనప్పుడల్లా వారిని రక్షక భటుల చేత పట్టించి దోషులుగా న్యాయస్థానంలో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తుంది.

కానీ -- ప్రస్తుతం నూతనంగా -- మన యువత కొన్నేళ్ళై విదేశాలనుంచి గొప్పగా దిగుమతి చేసుకున్న అభ్యంతకరమైన సంసృతి - ' డేటింగ్ '. క్లుప్తంగా చెప్పుకోవాలంటే – ‘ అభినవ వ్యభిచారం ’.

డేటింగ్ అన్న ముసుగులో స్నేహితులమని చెప్పుకుంటూ, ఒకరినొకరు అర్ధం చేసుకుందికి ప్రయత్నిస్తున్నామంటూ, ఎవరిని వారే మోసపుచ్చుకుంటూ, విచ్చల విడిగా తిరుగుతూ, ముఖ్యంగా అనైతిక లైంగిక సంబంధాలు పెంచుకుంటూ, నిర్లజ్జగా ధైర్యంగా జనంలో అవివాహిత యువత తిరుగుతుంటారు.

ఆ విధంగా తిరగడం గురించి చట్ట పరంగా ఆలోచిస్తే :

అలా తిరిగే యువతీ యువకులు 18 సంవత్సరాల పైబడిన వయసు వారైతే చట్ట పరంగా ఎటువంటి అభ్యంతరం లేదు. అలా తిరిగే యువత తల్లితండ్రులు కానీ, ఇతర జనం కానీ, రక్షక వ్యవస్థ కానీ - ఆఖరికి న్యాయ వ్యవస్థ కానీ - వారిని ఏమీ అభ్యంతర పెట్టలేరు.

ఆరోగ్యపరంగా ఆలోచిస్తే :

అవివాహిత స్త్రీ ఎన్ని విధాలుగా ఎంత మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నా – గర్భం రాకుండా చూసుకుందుకి కొన్ని సంవత్సరాలుగా బోలెడు సదుపాయాలున్నాయి. అథవా గర్భం వస్తే, పోగొట్టుకుందికి కూడా అంతకంటే మించిన వైద్య సదుపాయాలున్నాయి - అన్న ధైర్యంతో స్త్రీలు డేటింగ్ లో గడపడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ముందుకు అడుగు వేస్తున్నారు.

అవివాహిత పురుషులకైతే ఆ చింతే అవసరం లేదు.

డేటింగ్ అన్న పేరుతో కొంతకాలం తిరిగిన అవివాహిత యువతీ యువకులు -- ఒకరినొకరు అర్ధం చేసుకొని తదుపరి వివాహబంధంలోకి ఇమిడితే కొంత నయం.

కానీ, అలా కనిపించే యువతని బహుశా వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.

డేటింగ్ అన్న ముసుగులో యువతీ యువకులు ఒకసారి తిరిగినవారిని నచ్చుకోక, నూతన సాంగత్యం పెట్టుకొని, వారితో కొంతకాలం తిరిగి వారిని కూడా నచ్చుకోక, మరో కొత్త సాంగత్యం పెట్టుకొని తిరిగే యువతే అధికంగా కనిపిస్తున్నారు.

డేటింగ్ పేరుతో వివిధ వ్యక్తుల తిరుగుడు, అందులో ఇముడ్చుకున్న లైంగిక సంబంధాన్ని -- క్లుప్తంగా చెప్పాలంటే ' అభినవ వ్యభిచారం ' అని కాక ఇంకేమనగలం.

మన యువతీ యువకులు అనైతిక లైంగిక సంబంధాలకోసమే ఈ డేటింగ్ సంస్కృతిని దిగుమతి చేసుకున్నారు అని నిర్వివాదంగా గ్రహించాలి.

కనుక, ఈ డేటింగ్ ఎంతవరకూ మన యువతకి అవసరం అని స్థిరచిత్తులుగా సావధానంగా ఆలోచించి ఎలా దిగుమతి చేసుకున్నారో, అలాగే త్వరలో వెనక్కి ఎగుమతి చేసేయడం ఆరోగ్యకర సమాజ స్థాపనకు అత్యావశ్యకం.

ఇంతకీ డేటింగ్ పేరుతో సాగుతున్న అభినవ వ్యభిచారాన్ని మన సభ్య సమాజం చూసీ చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది అన్న ప్రశ్నకు ఎంత ఆలోచించినా నాకైతే సమాధానం దొరకడంలేదు.

*****