భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం శ్రీ పాద వల్లభ స్వామి - సి.హెచ్.ప్రతాప్

భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం శ్రీ పాద వల్లభ స్వామి

కలియుగంలో మానవాళికి జ్ఞాన బోధ చేసి వారిని సన్మార్గం లో నడిపితూ శ్రీఘ్రంగా గమ్యం చెసే సద్గురు తత్వమైన శ్రీ దత్తాత్రేయుని అవతారాలలో తొలి అవతారం 1323 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం గ్రామం లో అప్పలరాజు శర్మ, సుమతి అనే నిష్టాగరిష్టులైన బ్రాహ్మణ దంపతులకు శ్రీపాద శ్రీ వల్లభులుగా జన్మించారు. శుక్ల పక్ష చంద్రునిలా పుట్టిన వెంటనే దిన దిన ప్రవర్ధమానమవుతూ ఎనిమిదేళ్ళ వయస్సు లోనే ఉపనయనం అయిన వెంటనే ఏ గురువు అవసరం లేకుండానే సకల వేద, వేదాంగాలను పఠించి అందరినీ ఆశ్చర్య చకితులను చేసారు శ్రీపాద శ్రీ వల్లభులు. పదహారు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులకు బ్రహ్మొపదేశం చేసి, వారి అనుమతితో సన్యాసం స్వీకరించి , దేశ సంచారం ప్రారంభించారు. దారిలో ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, తన తప:శక్తితో వాటి యొక్క అధ్యాత్మిక వైభవాన్ని పునరుజ్జీవింపజెసి, ఎందరో భక్తులను సన్మార్గులను గావించిన అపర యోగీశ్వరులు శ్రీపాద శ్రీ వల్లభులు. ఆ స్వామి చేసిన లీలలు అసంఖ్యాకములు. సర్వశ్య శరణాగతి చెసిన భక్తులకు భక్తి,ముక్తులు కరతలామలకములు.

శ్రీపాద శ్రీ వల్లభస్వామి సాధకులకు సన్మార్గం చూపడం కోసం మూడు వేళలా కృష్ణా నదిలో స్నానం చేసి అర్ఘ్యాది విధులు నిర్వర్తించి, అయిదు వేల సార్లు గాయత్రి మంత్ర జపం చేసి అనంతరం కురువపురం లో తన ఆశ్రమనికి వస్తుండేవారు. ఆ స్వామి స్నానానికి పోయి వచ్చేటప్పుడు ఒక చాకలి ఆయనను అనునిత్యం దర్శించేవాడు. ఆ స్వామి పట్ల భక్తి శ్రద్ధలు ఎక్కువై ఆ చాకలి వాడు ప్రతీ ఉదయం ఆయన ఆశ్రమం అంతా శుభ్రంగా ఊడ్చి, కల్లాపి జల్లి పూజకు అంతా సిద్ధం చెసి ఆ తర్వాతే తన చాకలి పనులకు పోయేవాడు.ఏదో నామమాత్రంగా కాక అత్యంత భక్తి శ్రద్ధలతో అతను చేసే ఈ సేవను గుర్తించిన శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఒక రొజు ఆ చాకలి వానితో “ నువ్వు వచ్చే జన్మలో రాజువై రాజ్యమేలుతావు” అని నవ్వుతూ ఆశీర్వదించారు. స్వామి సేవలో మునిగి వున్న ఆ చాకలి వాడు ఈ మాటలను పట్టించుకోలేదు.

ఒక రోజు కృష్ణా నదీ తీరం లో ఆ చాకలి వాడు బట్టలు ఉతుకుతుండగా ఒక ముస్లిం రాజు తన పరివారంతో ఆ నదిలో విహారార్ధం వచ్చాడు. ఆ రాజు గారి వైభవం చూసి ఆశ్చర్య చకితుడై ఆ చాకలి వాడు తాను చేస్తున్న ఫనిని ఆపివేసి ఆ దృశ్యాన్నే చూడసాగాడు. అప్పుడే శ్రీపాద శ్రీ వల్లభస్వామి తన అర్ఘ్యాది విధుల నిమిత్తం నదీ తీరానికి వచ్చి ఆ చాకలి వాని మనసులోని కోరికను కనిపెట్టి”ఏరా! నీకు ఆ రాజు వలె రాజ్య భోగాలు అనుభవించాలని వుంది కదా ! నువ్వు ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో చేసిన సేవకు సంతృప్తి చెంది ఆ రాజ్య భోగాలను నీకు ప్రసాదింప సంకల్పించాను. అయితే ఆ రాజ్య భోగాలు ఇప్పుడే కావాలా లేక వచ్చే జన్మలో కావాలా ?” అని అడిగారు.

కోరకుండానే కోరికలను తీర్చే కల్పతరువు లాంటి ఆ స్వామి మాటలకు ఆశ్చర్యపోయిన ఆ చాకలి వాడు కొంచెం సేపు ఆలోచించి “స్వామీ ! ఇప్పుడు నా వయస్సు నలభై ఏళ్ళు దాటింది. మీరు ఆ రాజ్య భోగాలను ఇప్పుడు ప్రసాదించినా పైబడిన వయస్సు కారణంగా అనుభవించలేను. కనుక వచ్చే జన్మలో ఆ సంపదలను నాకు ప్రసాదించండి,తనివితీరా అనుభవిస్తాను, కాని వచ్చే జన్మలో మీ సేవకు, భక్తికి మాత్రం నన్ను దూరం చెయ్యకండి” అని ప్రార్ధిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

శ్రీపాద స్వామి ఆ చాకలి వాని సద్భుద్ధికి సంతోషించి “తధాస్తు” అని దీవించారు.మరుక్షణమే ఆ చాకలి వాడు కిందపడి ప్రాణాలు విడిచాడు. శ్రీపాద స్వామి వాక్కు అంటే బ్రహ్మ వాక్కుతో సమానం. చాకలి వానిగా నానా కష్టాలు పడుతూ అత్తెసరు జీతంతో పేదరికం అనుభవిస్తున్న ఆ రజకుడు స్వామి దయకు పాత్రుడై మరు జన్మలో బీదర్ అనే రాజ్యానికి ముస్లిం రాజుగా జన్మించాడు. స్వామి ఆశీర్వాదం వలన పరమతస్థుడైనా హిందూ మతాన్ని మిగితా మతాలతో సమానంగా ఆదరిస్తూ, మత ద్వేషం లేకుండా ప్రజల సంక్షేమమే తన ఆశయంగా పరిపాలన గావించాడు.

భక్తుల పాలిట కల్పతరువు, ఆశ్రిత కల్పవృక్షం అయిన శ్రీ పాద శ్రీవల్లభ స్వామి 1344 వ సంవత్సరం లో తన 21 వ వయస్సులో ఆశ్వీయుజ మాసం, బహుళ ద్వాదశి హస్తా నక్షత్రం నాడు కృష్ణా నదిలో అంతర్హితమై తన అవతారం చాలించారు. అయినప్పటికీ భక్తుల కోర్కెలు తీర్చడానికి, వారిని అన్ని వేళలా వెన్నంటి వుండి రక్షించడానికి కురువపురం లో సూక్ష్మ రూపం లో ఇప్పటికీ వుంటున్నారు.

కురుపురం అనబడే ప్రముఖ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో వుంది. కురుపురం ఒక ద్వీపంలో వుంది. చుట్టూ కృష్ణానది. ఆనది దాటితే ఆలయం. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరములు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పీఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరములు తల్లితండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు. ఈ ప్రదేశం అంతా మహిమాన్వితం . ఈ తీర్ధంలో చేసిన దాన ధర్మాలు, తపస్సు, మంత్ర జపం వంటి సాధనలు వెయ్యి రెట్ల ఫలాన్ని ఇస్తాయని భక్తుల అచంచల విశ్వాసం