_1695899572.jpg)
శ్రీరామ
మాతృభాషకు చేయూత
‘ మాతృభాషకు చేయూత ‘ అని -- ఈమధ్యన తరచూ వినిపిస్తోంది.
అలా విన్నప్పుడు చదివినప్పుడు -- మాతృభాషకు చేయూత ఇచ్చేటంతటి వారమా మనం అని నాకు సందేహం వస్తూంటుంది. 'చేయూత' అన్న పెద్ద పదం ఏమీ మనం ఉపయోగించక్కరలేదు.
ఎందుకంటే --
మాతృభాషని మనం తరచుగానే కాక - ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే చాలు.
పరభాషా పద ప్రయోగాలు తగ్గించుకోవడం కాక - మానివేస్తే చాలు.
మిత్రులకు బంధువులకు సందేశాలు పంపేటప్పుడు - అది ఏ మాధ్యమైనా - మాతృభాషలో మాత్రమే పంపితే చాలు.
మనకు సన్నిహితులు - అంటే, మనం కొంచెం చనువుగా మాట్లాడగలిగే వారు - పైన చెప్పినవి పాటించేటట్టు చూస్తే చాలు.
మాతృభాషలో జరిగే కార్యక్రమాలకు తరచుగా వెళ్లడం, ప్రోత్సాహించడం, చురుకుగా పాల్గొనడం చేస్తే చాలు.
ఇక్కడ ఒక ఉదాహరణ తెలియచేయలేక ఉండలేకపోతూ - తెలియచేసేది ఏమిటంటే --
దూరదర్శన్ మాధ్యమంలో ఒక తెలుగు ఛానల్ వారు, పేరుపడిన ‘పాటల పోటీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదృష్టవశాత్తు అది తెలుగు పాటల పోటీయే. అందుకు వారు చాలా అభినందనీయులు. ఆ కార్యక్రమం నడపడానికి ఒక సూత్రధారి, ముగ్గురు న్యాయనిర్ణేతలు ఉన్నారు. ఆ కార్యక్రమంలో కనిపించే వినిపించే దురదృష్టం ఏమిటంటే –
సూత్రధారి, ఇద్దరు న్యాయనిర్ణేతలు పోటీలో పాల్గొనే వారిని ఉద్దేశించి మాట్లాడే మాటలలో 75 శాతం
ఆంగ్లంలోనే మాట్లాడడం. వారికి తెలుగు రాకకాదు. వారికి దశాబ్దాలుగా అలవాటైన పరభాష వారి
మాటల్లో వారి ప్రమేయం లేకుండా వచ్చేస్తూంది అని అనుకుంటాను.
కానీ, ఆ కార్యక్రమంలో వారు మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉండాలి అని వారు నిశ్చయంగా అడుగులు వేస్తే సరి. ఎందుకంటే, వారితో పాటూ వారి పక్కనే ఉన్న మరొక న్యాయనిర్ణేత ఎప్పుడూ నిండైన తెలుగులోనే మాట్లాడతారు. అందుకు వారిని పూర్తిగా అభినందించి తీరాలి.
ఆ విధంగా ఎవరికి వారు గిరి గీసుకున్నట్టుగా -- మాతృభాషలోనే మాట్లాడేది, వ్రాసేది అని నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వ్యవహరిస్తే మాతృభాష మనకే చేయూతనిచ్చి మన అభివృద్ధికి దోహదం చేస్తుంది అని నా ప్రఘాడ విశ్వాసం.
*****
---మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు, Mob: 9164543253, e-mail: [email protected]