
నేను, మైలు బెంచీని , మళ్ళీ గుర్తుకు చేసుకుంటాను అని కానీ, చేసుకోవాల్సిన అవసరం వస్తుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు.
అది, నా చిన్నప్పటి సంగతి . ఇంటి పేరు తో , చుట్టాలు లో, ఎవరు చని పోయినా , పధ్నాలుగు
రోజులు, మైలు పట్టాలి . అంటే , ఇంట్లో ఏదీ , ముట్టుకోకూడదు. వేరే వుండాలి . ఏదీ ముట్టుకోకూడదు కాబట్టీ , ఎవరి సాయమయినా తీసుకుని , కొన్ని బట్టలు , కొంత వంట సామాగ్రి వేరే పెట్టుకుని, ఒక గదిలో , వేరే వుండాలి. పధ్నాలుగు రోజులయిన తర్వాత , తలస్నానం చేసి , వాడిన వన్నీ , శుద్ధి చేసుకున్నాక కానీ , ఇంట్లో మామూలుగా తిరగ కూడదు. అది పద్ధతి . ఆ రోజుల్లో , ఇప్పటిలాగా , ఎక్కువ రోజులు బతికే వారు కాదేమో ! ఎప్పుడూ ,ఎవరో ఒకరు , మా ఇంటి పేరు తో వున్న వాళ్ళు , చనిపోవడం తో, సంవత్స రానికి ఆరునెలలు మైలు లో నే వుండేవాళ్ళం. ఇంక , బడిలోకూడా , కాలానుగుణం గా, ఒక ప్రత్యేకమయిన ఏర్పాటు వుండేది . క్లాసు లో , చివరలో అందరికీ దూరం గా, మైలు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి , ఒక రెండు బెంచీలు , ఎర్పాటు చేసే వారు. ఎప్పుడూ ఆబెంచీలలో, ఇద్దరికి తగ్గకుండా , వుంటునే వుండేవారు. ఎవరినీ ముట్టుకోకూడదు కాబట్టి, ఆడుకోడానికి లేక, ఆ పిల్లలు బిక్క మొహాలు వేసుకుని , అందరి కేసి , చూస్తూండే వారు. .
ఈ మైలు బంచీతో , విడదీయలేనంతగా , ముడి వేసుకున్న ఇంకో జ్ఞాపకం, కాండూరి సూర్య కుమారి. . మైలు బెంచీ, గుర్తుకు వచ్చినప్పుడల్లా, తను గుర్తుకు రాక తప్పదు. ఆ రోజుల్లో అందరిని, ఇంటిపేరు తో సహా , గుర్తు పెట్టుకునే వాళ్ళం . నేను , కాండూరి సూర్య కుమారి , ఎక్కువగా ఆ మైలు బెంచీ మీద వుండే వాళ్ళం. అది ఎక్కువగా దెయ్యం కధలు చెప్పేది . ఏ కధ చెప్పినా, దెయ్యాలు ఎవరయినా , చివరకు , రక్తం కక్కుకుని , చచ్చిపోవడం మాత్రం కామన్ గా వుండేది . చివరకు , దేవుళ్ళ కధలు కూడా , అలానే భయం వేసే టట్లు చెప్పేది. ముఖ్యం గా, విజయవాడ కనక దుర్గమ్మ గురించి. "ఆవిడ , రాత్రులు బయటకి వస్తుంది. ఆవిడని , ఎవరయినా చూసారంటే రక్తం కక్కుకుని చచ్చిపోతారు, " అంటూ , అదో కధలా చెప్పేది. భయం కలిగించే , కధలు చెప్పే విషయం లో , దానికి , అదే సాటి అని చెప్పొచ్చు.
ఏ సబ్జెక్ట్ టిచర్ రాకపోయినా , అందరమూ , దాని చుట్టూ కూర్చుని , అది చెప్పే కధలు , భయపడుతూ వినడం, ఆ తర్వత కూడా , చాలా సేపు భయ పడుతూ నే వుండడం , మాకు అలవాటు అయిపోయింది . అలా అని , దానిచేత, కధలు చెప్పించుకోడం ,మానే వాళ్ళం కాదు.
ఆ భయం , వేరే వాళ్ళ సంగతి తెలియదు కానీ , నాకు మాత్రం, చాలా ఏళ్ళు , వుండిపోయింది . అందుకే , ఎప్పుడు మైలు బెంచి , గుర్తుకు వచ్చినా, కాండూరి సూర్య కుమారి , గుర్తుకు రాక మానదు. . దానిటో పాటు దెయ్యం కధలు .
ఇలా నా చిన్నప్పుడు అంతా, మైలు అనే ఆచారం తో , చాలా కష్ట పడే వాళ్ళం . ఆ బాధ పడలేక , " ఎవరు చనిపోయినా, ఆ వార్త చెప్పకండి మాకు !" అని అందరికీ చెప్పుకుంటూ వుండే వారు.
ముఖ్యం గా పాల వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు , ఏమి జరిగినా ఆ వార్త , పొద్దున్న పాలు వేస్తూ , చేర వేస్తారు. " ఏవార్త అయినా పర్వాలేదు కానీ , ఎవరయినా చనిపోతే మాత్రం మాకు చెప్పకు " , అని పాల వాళ్ళకి , బాగా శిక్షణ ఇచ్చే వాళ్ళు. అయితే మాత్రం ఏమయింది, ఏదొ ఒక రకం గా , వార్తలు వచ్చి చేరుతూ నే , వుండేవి. మైలు పట్టకా , తప్పేది కాదు.
తర్వాత , తర్వాత , నాన్న కి, ఉద్యోగం లో, బదిలీ అవడం వల్ల , మా స్వంత ఊరికి , చాలా దూరం లో ఉండడం తో , ఈ మైలు వార్తలు , మా వరకూ వచ్చేవి కావు. ఆ విధం గా మైలు ని క్రమేణా మర్చిపోయాం. గుర్తు చేసుకునే, సందర్భాలు కూడా, తారస పడలేదు.
అలాంటిది, నేను పెద్దదాని అయ్యాక , నా కూతురి దగ్గరకి ఒక నెల రోజులకని అమెరికా కి వెళ్ళాను. నాకూతురు వుండే వూరిలో, తెలుగు వాళ్ళు ఎక్కువ. నా కూతురు , వుండే ఇంటికి , దగ్గర లోనే, ఒక తెలుగు ఫేమిలీ వుంది. ఆ ఆమ్మాయి పేరు సంధ్య.
అప్పుడప్పుడు వచ్చి, హలో చెప్తూ వుంటుంది. వున్నాట్లుండి ఒక రోజు సంధ్య ఇంటికి వచ్చి ,
" ఆంటీ ! కొంచెం హెల్ప్ చేస్తారా ? ..." అంది.
" ఏమిటమ్మా ?.. " అన్నా .
" ఏమీ లేదు, మాకు మైలు వచ్చింది. అన్నీ ముట్టు కోకూడదు. కొంచెం , మీరు మాఇంటికి వస్తే, నాకు కావాల్సినవి చెప్తాను. అవి, ఇద్దురు గాని !" అంది .
నాకు అర్ధం కాలేదు .
"ఏమయిందమ్మా? .." అన్నా కంగారుగా
" మా వూరిలో, ...మా చుట్టం , ...మా ఇంటి పేరు వున్న వాళ్ళు పోయారు . మరి మైలు పట్టాలి కదండీ ? ! " అంది
" ఏ వూరమ్మా , మీ వూరు ? " అడిగాను నేను
" ఇరుసు మండ అండి ! " అంది
" అక్కడే , మా ఊరు కూడా ! ఏమవుతారు ఆ చనిపోయిన వారు ?? "
" చాలా దూరం చుట్టంట అండి. నాకు తెలియదు. మా అమ్మ చెప్పింది . "
నాకు షాక్ కొట్టినంత పని అయింది.
ఎక్కడ ఇరుసు మండ.? ఎక్కడ అమెరికా ? .. వేల మైళ్ళ దూరం అయినా , ...వదలని ఈ మైలు ఏమిటొ ?
చాలా ఫ్రస్ట్రేషన్ గా అనిపించింది . " ఈరోజుల్లో కూడా ఏమిటమ్మా ?... పైగా ఎవరో కూడా తెలియదంటున్నావు ?? "
" అంటే, మాది , చాలా , సాం ప్ర దాయ కుటుంబమండి ! .. ఆచారాలు అవి ఎక్కువ అన్నీ పాటిస్తామండీ ! "
" చాలా సంతోషం అమ్మా ! మరి మీ ఆయన ? నేను నా మాటలు పూర్తి చెయ కుండానే
" వారిది కూడా, చాలా సంప్రదాయ మయిన కుటుంబమండీ ..వాళ్ళు , ఆచార వ్యవహారాలు చాలా శ్రద్ధగా పాటిస్తారు . "
" మా అమ్మే ! మైలు పట్టడం లో, అంత విషయం వుందా తల్లీ ? ! ఎక్కడొ సముద్రాల అవతల ఎవరో చనిపోయారుట . తెలియను కూడా తెలియదుట . ఈ అమ్మాయి తల్లి ,ఎంత గొప్ప వ్యక్తో . ఆవిడ ఫోన్ చేసి, మరీ అదే పనిగా మైలు
పట్టమనిచెప్పడం , ఈవిడ , ఇక్కడ ఎంతో శ్రద్ధతో పాటించడం . ఇదేమి సాంప్రదాయమో! ఇదేమి ఆచారమో ! ... అమ్మకి ,బుద్ధి లేకపోతే మాత్రం , ఈ పిల్లకి వుండొద్దు ?! ... మేము చిన్నప్పుడు , మైలు ని తప్పించుకోడానికి , ఎంతబాధ పడే వాళ్ళం ?! ..ఇప్పుడు, అదేదో , గొప్ప సాంప్రదాయం , ఆచారంలాను , అది ఏదో , పుణ్య కార్యం లా పాటించడం ఎంత మూర్ఘత్వం ? ఎంత హాస్యా స్పదం ? “ మనసులో అనుకుంటూ మళ్ళీ అన్నాను,
" ఈ రోజుల్లో కూడా ఏమిటమ్మా ? ఎక్కడో సముద్రాల అవతల... ఎవరో తెలియదు ... ఏమిటమ్మా ఈ చాదస్తం ? ... చాదస్తం ఎక్కువ వుంటే నెత్తి మీద కాస్త నీళ్ళు వేసుకోవాలి గానీ ... "
" లేదు ఆంటీ ! ..... మైలు పట్టక పోతే, పాపం అండీ ! అలా ఇంట్లో కలుపుకోకూడదు .. "
" అసలు పాపం అంటే ఏమిటమ్మా ??... "
సంధ్య సమాధానం ఏమి చెప్పాలో తెలియక తటపటాయిస్తూ నాకేసి కాస్త అసహనం గా చూసింది .
ఈ లొపులో నా కూతురు వచ్చింది " ఎవరు వచ్చారు ?..ఎవరితో మాట్లాడుతున్నావు ?? " అంటూ.
సంధ్య ని చూసి చిరు నవ్వు నవ్వుతూ " ఏమిటి సంధ్యా ? .." అంది .
" అంజలీ ! మాకు మైలు వచ్చింది . కాస్త మా ఇంటికి వచ్చి, కొన్ని సామానులు , పధ్నాలుగు రోజులకీ సరిపడేవి , నాకు వాడుకోడానికి వీలు గా , వెరు పెట్టి ఇస్తావా ?? "
" అలాగే , నువ్వు వెళ్ళు ! నాకు , ఒక మీటింగ్ వుంది. అది అయ్యాక , వస్తాను. " అంది నా కూతురు.
" నువ్వు బిజీ గా వున్నావు కదా ! ఆంటీని పంపు పోనీ ! .."
" అమ్మ పెద్దది కదా . అవన్నీ , తనకి తీయడం అది ...కష్టం . "
" సరే అవుతే ! ..." అంటూ సంధ్యవెళ్ళిపోయింది.
" నేను వెళ్దును కదే ! అదెం పెద్ద పని ? ..."
" చాల్లే ! అసలే, నీకు బాడీ పైన్స్ అవీను ! అయినా , ఆమెతో, అంత సేపు, ఏమి మాట్లాడుతున్నావ్ ? ..."
నాకూతురికి, నామీద ప్రేమ ఎక్కువ అయి ,నన్ను కదలనివ్వదు . నడిస్తే , కాళ్ళు అరిగి పోతాయి అంటుంది. ఏదైనా, పని చేస్తే , చేతులు అరిగి పోతాయి అంటుంది. . ఎవరితో నైనా , మాట్లాడితే గొంతు అరిగి పోతుంది ,బిపి ఎక్కవయి పోతుంది , అంటుంది.
చేతులు కాళ్ళు, కదప కుండా, నోరు మెదపకుండా, వుం డాలంటే కష్టమే ! అయినా, చూడకుండా వుండలేక , అప్పుడప్పుడు , వచ్చి పోతుంటా. ఎక్కువ రోజులు, వుండకుండా, జాగ్రత్త పడుతూంటా.
"ఏమిటే ! ఆ అమ్మాయి చూస్తే చిన్న పిల్ల . అంత చాదస్తం, ఏమిటే బాబు ? ఎవరో తెలియదట! వాళ్ళ ఊరు ట ! ఎవరో తెలియని వాళ్ళు , వాళ్ళ ఊరిలో చనిపోతే , ఇక్కడ , ఇంత దూరంలో , అమెరికా లో వుంటూ, మైలు పడుతుందట . ఏమైనా అర్ధం వుందా ?. పూర్వం అంటే , ఏ జబ్బో ఏమిటో, తెలియక , అంటుకుంటుందేమో అనే అనుమానం తో, మైలు పేరుతో, పధ్నాలుగు రోజులు దూరం గా పెట్టేవారేమో ?!
ఆ పద్ధతిని, ఇన్నేళ్ళు అయినా, ఇలా పాటించడం , ఎంత సబబు ?... అవసరమా ? అంటూ ఏమీ ఆలోచించకుండా ఏమిటి ఆ మూర్ఖత్వం ? .." అంటూ నేను ఇంకా పూర్తి చేయ లేదు నా మాటలు.
నా కూతురు మొదలు పెట్టింది .." నాకు , ఇది అలవాటేలే ! ఎవరి ఇష్టం వాళ్ళది. అయినా, ఎవరు ఏమి చెసుకుంటే నీకెందుకు ? ఏమిటొ, ప్రపంచం లో ఎక్కడ , ఏది జరిగినా , దాని గురించి ఆలోచించడం , మనసు పాడు చేసు కోవడం, ....బీ పీ పెంచుకోడానికి , కాకబోతే ......ఎవరు ఎలా పోతే , ఏమిటి ? ఏమి చేస్తే ఏమిటి ??... నీకేం అవసరం ? .." అంటూ లోపలకి, తన ఆఫీసు రూం లోకి వెళ్ళి పోయింది.
తర్వాత, నా కూతురు , సంధ్య ఇంటికి వెళ్ళి , ఆమె కి కావాల్సినట్లు, ఆమె చెప్పినట్లు , ఏర్పాటు చేసి వచ్చింది.
****
ఆ తర్వత ఇరవై రోజులకి లా వుంది , సంధ్య మా ఇంటికి మళ్ళీ వచ్చింది . ఈ సారి " మా అమ్మగారండి ! .." అంటూ ఒక వ్యక్తి ని , తీసుకు వచ్చింది .
" ఈవిడ , అంజలి అమ్మ గారు . " అంటూ నన్ను, పరిచయం చేసింది.
ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని
" ఏమే ! నువ్వు గరిమెళ్ళ మణి వి కాదూ ? "
" నువ్వూ. ?.... కాండూరి సూర్య కుమారి. .... అవునా ..?..."
మా ఇద్దరి మొహాలు ఒక సారి ట్యుబ్ లైట్స్ లా గ వెలిగాయి.
" ఎలా గుర్తు పట్టావు " అంటే , " ఎలా గుర్తు పట్టావు ? " అని , ఒకళ్ళని ఒకళ్ళం , అనుకుని ,
ఇద్దరం ఒకరిని , ఒకరం , కౌగలించుకున్నాం , సంతోషం తో.
" ఎప్పుడో. చిన్నప్పుడు చూడడమే . మళ్ళీ ఇప్పుడు ఇలాగ ఇన్నేళ్ళు తర్వాత ?? ఆ ! "
" అవునే ! ఎలా వున్నావు ? .."
" నువ్వు ఎలా వున్నావు చెప్పు "
మా ఇద్దరి లోనూ ,సంతోష భావోద్వేగానికి , సంధ్య , ఆశ్చర్యం తో కాస్సేపు అయోమయం గా మమ్మల్ని చూస్తూ వుంటే,
సూర్య కుమారి మొహం చేటంత చేసుకుని , అంది " మేము చిన్నప్పుడు క్లాస్ మేట్స్ ... ఎనిమిదో క్లాస్ వరకూ కలిసి చదువుకున్నాం. ఇది గరిమెళ్ళ మణి ... "
నాకూతురు బయటకి వెళ్ళిందని తెలిసి " మీరు మాట్లాడుకోండి . మళ్ళీవచ్చి తీసుకు వెళ్తాను. " అని వాళ్ళ అమ్మకి చెప్తూంటే
" కాఫీ తాగి వెళ్దువు , వుండు " అన్నాను .
" ఇప్పుడే తాగి వచ్చాము ఆంటీ " అంటూ, వెళ్ళిపోయింది సంధ్య.
" అంజలి , మీ అమ్మ ని దింపుతుందిలే ! వర్రీ అవకు " అన్నాను వెళ్తున్న సంధ్య తో .
" కూర్చో..! " అంటూ కాండురి సూర్య కుమారిని సోఫా లో కూర్చోబెట్టి , నేను పక్కనే కూర్చున్నా.
" అవునే , అందరూ ఎలావున్నారే ? నాన్నకి బదిలీ, అవడం తో మేము ఆ ఊరుని , వది లేసాం . తరవాత ఊరికి వస్తూ పోతున్నా , ఎవరినీ కలవడానికి కుదిరేది కాదు. . మన క్లాస్ వాళ్ళు, ఎవరెవరు ఎలా వున్నారు ?? ..
గంటి సూర్య కాంతం , భమిడిపాటి భద్రం. కందుల సావిత్రి , ...పప్పు దేవి. ... గొర్తి సూర్య ప్రభ.... ఆ .."
" గంటి సూర్య కాంతానికి , తొమ్మిది క్లాస్ లో , పెళ్ళీ అయింది . మళ్ళీ , దానిని చూడ లేదు. కందుల సావిత్రి కి అంతే ! తొమ్మిదో కాస్ లో నే పెళ్ళి చేసేసారు. . పప్పు దేవి మాత్రం , ఎసెసెల్సి పరిక్షలు రాసింది కానీ, పాస్ అవలేదు. నాకూ పదో క్లాస్ లో పెళ్ళీ అయింది. .. గొర్తి సూర్య ప్రభ ఒక్కర్తే డిగ్రీ చేసింది. "
" కందుల సావిత్రి. బాగా చదివేది . దానికి ,ఎప్పుడూ లెక్కల్లో ,వంద కి వంద వచ్చేవి. పాపం ,అలా పెళ్ళి చేసేసారు. "
" అవును !... అవును ! . వాళ్ళ బావకే , ఇచ్చి చేసారు లే . అదేమో , పెళ్ళీకి వచ్చిన వాళ్ళందరికీ , " నేను చదువుకుంటాను, పెళ్లీ చేసుకోను , మీరైనా మా అమ్మా నాన్న కి చెప్పండి " , ... అంటూ ఒకటే ఏడుపు. ..."
" అవునా పాపం. ! బాగా చదువుకునేది. చదివిస్తే , ఇంకో అబ్దుల్ కలాం అయ్యేది ... అయినా , తల్లి తండ్రులే , ఆ విధం గా అన్యాయం చేస్తే , ఎవరికి చెప్పుకుంటారు . .." అన్నాను కోపంగా బాధగా.
" పెళ్ళి చేయడం అన్యాయం అంటావేమిటి. .." సుర్య కుమారి కాస్త కోప్పడుతూ అంది.
" ఇష్టం లేకపోయినా ఆ విధం గా పెళ్ళి చేయడం తప్పు కదా ! ..."
"ఇష్టం లేక పోవడం ఏమిటి , వాళ్ళ బావే గా ! .. కాకపోతే దానికి బాగా చదువు కోవాలని చాలా వుండేది. .."
" అదే మరి . బాగా చదువుకునేది. డిగ్రీ వరకు అయినా చదివించాల్సింది ..."
" మంచి కుటుంబాలంటే. అంతే మరి . పదహారేళ్ళు వచ్చేసరికి పెళ్ళి చేసేస్తారు. నాకూ పదో క్లాస్ లో పెళ్ళి చేసేసారు. ..నేనూ మా అమ్మయికి అలానే పదహారేళ్ళకే పెళ్ళి చేసేసా. "
" అవునా ! అవుతే , నువ్వో పెద్ద క్రిమినల్ అన్న మాట ! "
" అదేమి మాట ? .."
" అవునే ! పిల్లలు , మేజర్స్ కాకుండా పెళ్ళి చేయకూడదు. " కాస్త ఆవేశపడుతూ , మళ్ళీ అన్నాను,
" మన కి ఎలానూ. చదువుకునే అవకాశం రాలేదు . కనీసం పిల్లలని చదివించాలి అనుకోవాలి కానీ, అదేమిటే నీ కూతురికి పదహారేళ్ళకే పెళ్ళి చేసేసావా ? . "
" ఏం బాగానే వుందిగా నాకూతురు. .."
" బాగుందిలే ! సంతోషమే! .... కానీ , నీ చాదస్తాలన్నీ , దానికి బాగా నేర్పినట్లున్నావుగా ! మీఇంటి పేరు తో ,ఎవరు పోయినా, ఫోన్ చేసి మరీ , మైల్ పట్టిస్తున్నావు ! ఎవరా , మహా తల్లి అనుకున్నా , ... నువ్వే అన్న మాట . "
" అదేమిటే, మనమంతా ,పట్టేవాళ్ళం కాదూ? ....మైల్ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి, క్లాస్ లో ఒక బెంచ్ వుండెది కూడా .
నువ్వూ , నేనూ , గంటిసూర్య కాంతం , ఎక్కువ గా కూర్చునే వాళ్ళం . .."
" అవును ! నువ్వు దెయ్యం కధలు చెప్పి , బాగా భయ పెట్టే దానివి. ఆ భయం పోగొట్టు కోడానికి, నేను చాలా కష్ట పడ్డాను. .."
నవ్వింది .. సూర్య కుమారి .
" నువ్వుంటే , మైలు బెంచీ మీద బాగా కాలక్షే పం అయ్యేది. ఒక్కళ్ళం వున్నా , వేరే వాళ్ళు వున్నా , బిక్క మొహాలు వేసుకుని, అందరికేసి చూస్తూండే వాళ్ళం . .." అంటూ నవ్వాను .
కాస్సేపుండి మళ్ళీ అన్నాను " ఆ రోజులు వేరు . మనం చిన్న వాళ్ళం . ఎమీ తెలియదు . ఇప్పుడు పెద్ద వాళ్ళం అయ్యాం . ఇంత చాదస్తం అవసరమా అనుకోవద్దూ . అక్కడ నుంచి ఫోన్ చేసి, మరీ మైలు పట్టిస్తావా ! కాస్తయినా, బుర్ర ఉపయోగించవా ఏమిటే ?..."
" చాదస్తం ఏమిటి ?.. అది ఆచారం . మన ఆచార వ్యవహారాలు, పాటించద్దా ఏమిటి ? .... ."
" అదేమి ఆచారమే , బాబూ?....."
" అలా అంటావేమిటి ? మన హిందూ సాంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు ఎంత గొప్పవి. ... మనది సనాతన ధర్మం...మనవి మనం గౌరవించు కోక పోతే ఎలా ?? .."
" ఏడ్చినట్లే వుంది. . సనాతన ధర్మం అంటే, ఎప్పుడూ వుండేది, కాలం తో మారనిది . అది, పంచ భూతాలని గౌరవించడం , గాలి, నీరు , ఆకాశం , నిప్పు , భూమి ... వీటిని గౌరవించడం. కలుషితం చేయక పోవడం ... అన్ని ప్రాణులకీ ,మనతో పాటు , ప్రకృతి లో ,భాగ స్వామ్యం వుందనే, నిజాన్ని గుర్తించడం , ఆ నిజాన్ని గౌరవించడం , అన్నిటినీ, అందరినీ, గౌరవించడం , అది నా ఉద్దేశ్యం లో సనాతన ధర్మం, ...అంతే కానీ ... "
నా మాటలు పూర్తి. కాకుండానే అంది , ". నువ్వు అనుకుంటున్నావు, అంతే . మనకేం తెలుసని ?
మా గురువు గారు ఏమి చెప్పారో తెలుసా ?...
" .... ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు , మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు . అవి పాటించకపోతే, మన సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లుతుంది ."
" నీకో గురువు గారు కూడా వున్నారేమిటి. ?..." విస్తుపోతూ అన్నా .
" ఆ ! వారి పేరు కులానంద స్వామి .. "
"........" ఏమి మాట్లాడాలో తెలియక నేను విస్మయం గా చూస్తున్నా , దాన్ని.
" వారు భూత భవిషత్ లు చెప్పగల మహాను భావుడు. "
"....."
" వారు శిష్యులందరికీ , ఏవిధమయిన దిన చర్య వుండాలి అనేది వివరం గా చెప్తారు. ఆ విధం గా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి , ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారి ఆశ .. ఆకాంక్ష . ముఖ్యంగా వారి శిష్యులు .. అంటే మాలాంటి వారు. "
సూర్యకుమారి చెప్తూ ట్రాన్స్ లోకి, వెళ్ళిపోతోంది.
" ఏమిటి , ఈ మైలు లాంటివి కూడా .? ..." చాలా అసహనం గా అన్నాను .
"ఆ ! ఆ! ..." అంటూ అర్ధనిమిలత నేత్రాలతో, ట్రాన్స్ లోంచే మాట్లాడుతోంది.
" అంటే ... పదహారేళ్ళకే , అమ్మాయికి పెళ్ళి చేయడం లాంటివి... .."కాస్త వెటకారం గా నే అన్నా, నాకు కోపం ఆగక .
" ఆహా ! వారి అనుమతి తీసుకోకుండా మేం ఏ పనీ చెయ్యం . ఏదయినా వారి ఆజ్ఞ అవుతే నే ! ..."
" కొంపదీసి , పతివ్రతా ధర్మాలు కూడా వున్నాయా ఏమిటే, వారు చెప్పిన దైనిందిక కార్య క్రమం లో ? ..".
" ఉండవా ఏమిటి ?...."
". అదే లే, నేను ఎక్కడొ విన్నాను. భర్త , డ్రాయర్లని. భార్యేఉతకాలని...... అది కూడా... ఆ.. " అంటూనే వున్నాను
అది అందుకుంది ,
" ఖచ్చితంగా ."... అంటూ... .. " అదెంత పుణ్యం . ...... అలా చేస్తేనే మరి , చచ్చిపోయాక మంచి జన్మ వచ్చేది . "
" చూస్టూంటే , కాల చక్రాన్ని వెనక్కి తిప్పి. మళ్ళీ బాల్య వివాహాలు , సతీ సహ గమనాలు , కన్యా శుల్కాలు. వర కట్నాలు ...ఇవన్నీ , వెనక్కి తెచ్చే టట్లు వున్నారు . .."
" దానిలో తప్పేముందే ? ..."
" ఏమిటి ?!... సతీ సహగమనం కూడానా ...." నాకు కోపం ఆగటం లేదు.
" అవునే ! .. మొగుడు పోయాక, ఏ పెళ్ళాం అయినా , సాధ్వీమణి అవుతే బతుకుతుందా ఏమిటి ??.. అదీ ఒక బతుకే ? .."
నాకు కోపం తోపాటు , కంగారు కూడా వచ్చింది.
" అయినా నాకు తెలియక అడుగుతాను . నీ మొగుడి. డ్రాయర్ నువ్వు ఉతకవా ? .." కోపంగా అడిగింది.
అది అమాయకత్వమో, మూర్ఖత్వమో , తెలియ లేదు నాకు.
దానిని. అయోమయం గా చూస్తూ అన్నాను " అటువంటి పని కి , నేను, పూనుకుంటే, నా మొగుడు డ్రాయర్లు అన్నీ లాకర్ లో పెట్టుకుంటాడు. .."
" అవునా. అదేం పాపం ? .. నీ మొగుడు , సాంప్రదాయం తెలిసిన వాడు కాదు అన్నమాట . అవుతే, నీకు కష్టమే ! .. .. .."
"అదేమిటి ...? .....
" అదేనే మరి , నీకు పుణ్యం ఎలా వస్తుంది ??? ... మగ వాళ్ళు. కలిసి రాకపోతే ఏమీ చెయ్యలేము మరి ! .."
నాకు దాని మాటలు వింటున్న కొద్దీ , వెన్నులోంచి భయంపుట్టుకు రా సాగింది.
అది చెప్పే గురువుగారు , శిష్యులు కలిసి సనాతన ధర్మం పేరుతో కాల చక్రాన్ని తిప్పి, వెనక్కీ తీసుకు వెళతారేమో అని భయం .. అలాంటి స్వాములు ఎంత మంది వున్నారో , ఒక్కొక్కరికి ఎంత మంది శిష్యులు , నేను మనసులో రిస్క్ ఎస్సెస్స్ మెంట్ చేసు కోవడం మొదలుపెట్టాను.
ఆడవాళ్ళు , ఎంత కష్ట పడ్తే ఈ స్థితి కి వచ్చారు ? !! ఎంత మంది , ఆడవాళ్ళ పరిస్థితి ని మెరుగు
పరచ డానికి కృషి చేసారు !!!
ఏదో , టెక్నాలజీ ధర్మమా అని , ఉద్యోగావకాశాలు ఎక్కువ అయి ఆడపిల్లలు కూడ , ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్ని రకాలుగా , స్వతంత్రం గా వుండడం అలవాటు చేసుకుంటున్నారు . ఇప్పుడు వీళ్ళు సనాతన ధర్మం అని, అన్నీ. మళ్ళీ రివైవ్ చేస్తారా ? చేయగలరా ? ... ఆలోచిస్తున్న నన్ను , సూర్య కుమారి మాటలు బయట పడేసాయి.
" ఈ మధ్య గొర్తి సూర్య ప్రభ కలిసింది. వాళ్ళ చుట్టాలింట్లో పెళ్ళని , ఊరికి వచ్చిందిట . "బెంగలూర్ లో కొడుకు దగ్గర వుంటున్నా ," అని చెప్పింది . .పాపం దాని మొగుడు కాన్సెర్ తో పోయాడని చెప్పింది. ఏమిటొ , ఈ మధ్య కాన్సెర్లు ఎక్కువయి పోతున్నాయి అనుకో ! .."
'సతీ సహగమనం ఎందుకు చేయలేదో ?! " ...అని అంటుందనుకున్నా. అనలేదు! నన్ను బతికించింది. అంటే , గుండె ఆగి, పోయేదాన్నే .
అది అలా చాలా సేపు , మా చిన్నప్పటి విషయాలు మాట్లాడుతూనే వుంది , హుషారుగా. దానిని హర్ట్ చేయడం ఇష్టం లేక , హుషారుగా మాట్లాడడానికి , ప్రయత్నిస్తూనె వున్నాను. కానీ శరిరం అంతా, ఏదో తెలియని భయం , వ్యాపించి , బిగుసుకుపోయింది.
తర్వత నా కూతురు వచ్చింది . సూర్య కుమారిని, వాళ్ళ ఇంట్లో , దింపేసింది.
సూర్య కుమారి వెళ్ళ గానే , నేను గది లోకి వెళ్ళి మంచం మీద పడుక్కుని , దుప్పటి కప్పేసుకున్నాను. నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరని తెలుసు . ఎందుకంటే, నేను చాలా సేపు మాట్లాడి వుంటాను, అలిసిపోయాను, అని నా కూతురు నన్ను డిస్టర్బ్ చేయదు. అంచేత, చాలా సేపు అలానే పడుక్కుని వున్నా . ఒక అరగంట అయ్యాక ,
" మమ్మీ ! ఎలా వుంది , నీకు పడుక్కున్నావేం.? " అంటూ నా కూతురు దగ్గరకి వచ్చి తట్టి లేపింది.
ఇదంతా చెప్తే నన్ను కోప్పడుతుంది. 'ఎందుకు అన్నీ ఆలోచిస్తావు ' అని .
అంచేత ఏమీ చెప్పకుండా " కాస్త చలి అనిపించి, కాస్సేపు నడుం వాల్చానే ! లెస్తాను ! బాగానే వున్నాను ! " అన్నాను. దానితో , నా కూతురు , వెళ్ళిపోయింది.
కాస్సేపటికి, కొంచెం తేరు కున్నాను . కాండూరి సూర్య కుమారి, చిన్నప్పుడు దెయ్యం కధలతో భయపెట్టింది . ఇప్పుడు మరో రకం గా . రాని నవ్వు నవ్వుకున్నాను , కాస్త తేలిక అవుతుందని.
రాత్రి భోజనం చేస్తూ , నా కూతురు అడిగింది " మమ్మీ , సంధ్య అమ్మ గారు , నీ క్లాస్ మేట్, ఏమంది.? అంటూ.
దాని గురించి , చెపుతూ, దాని మాటలకి భయమేసిందే 'మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతాం ఏమో ' అని .. అందుకే దుప్పటి కప్పుకుని మరీ పడుక్కున్నా కాస్సేపు. ." అంటూ నవ్వాను.
నా కూతురు కూడా , నా మాటలకి నవ్వింది.
" ఇవన్నీ , పొలిటికల్లీ మోటివేటడ్ మమ్మీ . ప్రభుత్వం మారితే అన్నీ మారుతాయి. ఎవరికి ఇష్టమయిన , వాల్ పేపర్ , వాళ్ళు పెట్టుకుంటారు . ఇదీ అంతే ! " దాని భాషలో అది చెప్పింది నవ్వుతూ.
నా కూతురు , తేలికగా కొట్టి పడేదింది గానీ , నాకు మాత్రం , రాత్రి పడుక్కో బోయే ముందు, మళ్ళీ మైలు బెంచి , కాండూరి సూర్య కుమారి , దాని గురువు గారు, గుర్తుకు వచ్చి మళ్ళీ భయం వేసింది. ఒకసారి , గురుజాడ , రాజా రామ మోహన్ రాయ్ , వీరేశ లింగం పంతులు , గుడిపాటి వెంకట చలం , ఆ మహాను భావులని .. అందరినీ తలుచుకున్నా . 'మళ్ళీ మీరు రావాల్సిన అవసరం కలగకుండా చూడండి ' .. అని కాస్సేపు ప్రార్ధించాను . గట్టిగా ఊపిరి పీల్చుకుని , 'ఏమీ భయం లేదు !' .. అని వెన్ను మీద ఒక సారి తట్టుకున్నాను. మైలు బెంచి గురించి , పొరపాటున కూడా , గుర్తు చేసుకోకూడదు అని గట్టిగా అనుకున్నా .
******