నైరాశ్యాన్ని పారద్రోలాలి - సి.హెచ్.ప్రతాప్

Nairasyanni paradrolali

నేటి యాంత్రిక జీవన విధానంలో మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. అలజడి, ఆందోళన, తదితర సమస్యలతో ప్రతివారి జీవితంలో ఓ భాగంగా మారాయి. అవి మానవులను తీవ్ర అనారోగ్యాలకు గురి చెస్తున్నాయి. దీనినే వైద్య పరిభాషలో సైకొసొమాటిక్ వ్యాధులు అని అంటారు. గత రెండు దసాబ్దాలుగా దేశ విదేశాలలో ఈ సైకొసొమాటిక్ వ్యాధులపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. మానసిక సంబంధిత అనారోగ్యం సారీరక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. అందుకు మామూలుగా శారీరక సమస్యలకు చేసే చికిత్సతో పాటు మానసిక సమస్యలకు కూడా తగు విధంగా చికిత్సలు చేయాలి.

ఒకప్పుడు విదేశాలలో మాత్రమే ఒక తీవ్ర సామాజిక సమస్యగా రూపొందిన మానసిక సమసలు ఇప్పుడు మన దేశంలోకి కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా యువతలో మానసిక సమస్యల తీవ్రత ఎక్కువగా వుంటోందని పలు అధ్యయనాలలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరికి మానసిక సమస్యలు ఉంటున్నాయి. అదే పనిగా ఏడవడం, మౌనంగా ఉండిపోవడం, చురుకుదనం లేకపోవడం, భయపడటం, ఏమాత్రం అల్లరే చెయ్యకుండా ఉండిపోవడం ఇలాంటి ఎన్నో మానసిక సమస్యలు ఉంటున్నాయి. చిన్న‌పిల్ల‌లు ఒత్తిడికి గురైతే వారు పెరిగే కొద్ది దాని ప్ర‌భావం ఆరోగ్యం మీద ప‌డుతుంది. దీంతో గుండెపోటు, డ‌యాబెటిస్ వంటి వ్యాధుల బారిన ప‌డుతార‌ని అధ్య‌య‌నంలో తేలింది. అందుకే చిన్న‌పిల్ల‌ల‌ను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల, ఉపాధ్యాయుల మరియు విద్యావేత్తలపై ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

నేటి వేగవంతమైన ప్రపంచంలో నిరంతరం పని, బాధ్యతలు, సంపాదన మీదే దృష్టి పెడుతున్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని, గొప్పగా బ్రతకాలని శ్రమిస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని పక్కనపెట్టి ఇలా ప్రతిరోజూ ఒత్తిడి, ఆందోళనలతో కూడిన జీవితాన్ని అనుభస్తున్నారు. దీని వలన ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ కు లోనవుతూ అరవటం, చిన్న తప్పిదాలకే ఎదుటివారు నొచ్చుకునేలా కోపాలను ప్రదర్శించడం వంటివి చేస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రశాంతత అనేది కోల్పోతున్నారు.ఫలితంగా వారి జీవితాలు నిత్యం అశాంతికి, ఆందోళనకు గురవుతున్నాయి.

 

డిప్రెషన్ ఏ సంవత్సరంలోనైనా 15 మంది పెద్దలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది మరియు ఆరుగురిలో ఒకరు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశను అనుభవిస్తున్నారని ఎన్నో అధ్యయనాలలో తేలింది. తాజా అధ్యయనాల ప్రకారం 22-30 మధ్య వయస్సు గల యూవతలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని అధ్యయనాలు మూడింట ఒక వంతు మంది స్త్రీలు తమ జీవితకాలంలో పెద్ద డిప్రెసివ్ ఎపిసోడ్‌ను అనుభవిస్తారని చూపిస్తున్నాయి .సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక.. భార‌త్‌లో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందగలుగుతున్నారని చెప్పింది.

 

ఇది ఇలాగే కొనసాగితే పదేళ్ల తరువాత ప్రపంచంలో మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. జీవితంలో నిరాశ అనే దానిని ఎదుర్కొంటే ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటపడొచ్చు. చాలామంది ఈ జీవితం వద్దు అనే స్థితికి చేరుకుని వదిలేస్తారు. దాని నుంచి బయటపడేందుకు ఎలాంటి పనులు చేయరు. నైరాశ్యంతో బాధ పడేవారు ఉదయం నిద్రలేచిన వెంటనే, ఈ రోజు ఏమి చేయాలో ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేస్తే రోజును చక్కగా ప్రారంభించవచ్చు. మొత్తం ధ్యాసంతా రోజు చేయాల్సిన పని మీదే పోయినప్పుడు, ఇతర విషయాల గురించి.. చింతించాల్సిన పనిలేదు.

 

ఉన్నది ఒకటే జీవితం.. జీవించి ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. ఎంత బాధనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మన జీవితానికి పరిపూర్ణత.