దేవుడు గురించి తెలుసుకోవటం ఎలా? - ambadipudi syamasundar rao

దేవుడు గురించి తెలుసుకోవటం ఎలా?
దేవుడు అంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? లాంటి ప్రశ్నలకు పెద్ద పెద్ద వేదాంతులు పండితులు కూడా సరి అయిన సమాధానం మనకు తృప్తి కరముగా చెప్పలేరు ఇలాంటి వేదాంత పరమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఓ చిన్న కధ వినండి ఈ కదా ద్వారా అన్ని ప్రశ్నలకు కాకపోయినా కొన్ని చిన్న ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇంకా కథ లోకి వద్దాము
ఒక దేశాన్ని పాలించే రాజుకు చాలా రోజుల నుంచి మూడు అర్థం కానీ ప్రశ్నలు మెదడును తొలి చేస్తుంటే వాటికి సమాధానాలు రాబట్టాలని నిర్ణయానికి వచ్చి సభలో ఆ ప్రశ్నలను ప్రకటించి జవాబులు చెప్పిన వారికి వారు కోరింది ఇస్తానని ,తృప్తికరంగా సమాధానం ఇవ్వలేని వారిని శిక్షిస్తానని ప్రకటిస్తాడు దేశమంతా చాటింపు కూడా వేయిస్తాడు పండితులు శాస్త్రకారులు బహుమతుల పట్ల ఆకర్షితులైన శిక్షలకు భయపడి జవాబు చెప్పడానికి ముందుకు రాలేదు రాజుగారి ప్రశ్నలు ప్రశ్నలు గానే ఉండిపోయినాయి జవాబులు దొరకలేదు ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటో తెలుసుకోవాలని లేదా?
ఆ ప్రశ్నలు :1.దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు ?
2. దేవుడు ఎక్కడ ఉంటాడు?
3. దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు?
ఈ ప్రశ్నలకు సరియైన జవాబులు చెప్పలేక చాలా మంది జైలు పాలయ్యారు మిగిలిన వాళ్ళు శిక్షలకు భయపడి ముందుకు రాలేదు ఇలా కొంత కాలం గడిచాక ఒక రోజు ఒక పశువుల కాపరి ఓ కుగ్రామం నుండి ఆ ప్రశ్నలకు జవాబులు చెబుతానని రాజు సభకు వచ్చాడు ఆ పశువుల కాపరిని చూచిన సభలోని మేధావులు పండితులు రాజు ఆశ్చర్య పోయారు రాజు మటుకు అతనికి అవకాశం ఇచ్చారు ఆ పశువుల కాపరి ,"ఓ రాజా మీ ప్రశ్నలు అడగండి ప్రశ్నలు అడగబోయే ముందు నాదొక మనవి చెప్పేవాడు గురువు, అడిగేవాడు శిష్యుడు కాబట్టి మీరు నాకు మీ స్థానాన్ని ఇచ్చి మీరు నిలబడి ప్రశ్నలు అడగండి " అని వినయంగా రాజుతో అన్నాడు రాజుకు కూడా ఆ పశువుల కాపరి చెప్పిన విషయం నచ్చి తానూ సింహాసనాన్ని దిగి ఆ పశువుల కాపరిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి తాను నిలబడి శిష్యుడి మాదిరిగా చేతులు కట్టుకొని తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు సభికులంతా ఆశ్చర్యముగా చూడటం ఆరంభించారు.
రాజు తన మొదటి ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు ? అని అడిగాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు పశువుల కాపరి ఒక సేవకుడిని ఒక దీపము తెమ్మని చెప్పాడు ఆ సేవకుడు దీపము తెచ్చినాక ,"రాజా ఆ దీపం కాంతి ఎటు వైపు ప్రసరిస్తుంది తూర్పా పడమరా ,ఉత్తరమా ,దక్షిణమా పైకా, క్రిందాకా పక్కలకా ?"అని ప్రశ్నించాడు రాజు అన్ని "అన్ని వైపులకు" అని సమాధానము ఇచ్చాడు ,"రాజా అలాగే దేవుడు అన్ని వైపులా చూస్తూ ఉంటాడు ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే. అని మొదటి ప్రశ్నకు జవాబు చెప్పాడు రాజు ,సభికులు అందరుజవాబుకు తృప్తి చెందారు. రెండవ ప్రశ్న అడగండి మహారాజా అని పశువుల కాపరి రాజును అడుగుతాడు.
"దేవుడు ఎక్కడ ఉంటాడు అని రాజు అడుగుతాడు . పశువుల కాపరి,"రాజా ఒక పాత్రలో పాలు తెప్పించండి అని అడుగుతాడు రాజు అలాగే ఒక పాత్రలో పాలు తెప్పిస్తాడు." రాజా పాలనుండి నెయ్యి వస్తుందని అందరికి తెలిసిన విషయమే కదా మరి ఈ పాలలో నెయ్యి ఎక్కడా ఉందొ చెప్పగలరా? "అని రాజును ప్రశ్నిస్తాడు. "పాలను కాచి గోరువెచ్చటిపాలకు కొద్దిగా మజ్జిగ కలిపితే పెరుగు తయారు అవుతుంది ఆ పెరుగుపై మీగడను తీసి కవ్వం తో చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్నను ను కాచితే నెయ్యి వస్తుంది . అంతే గాని నెయ్యి పాలలో కనిపించదు" అని రాజు సమాధానం ఇస్తాడు. మహారాజ సరిగ్గా చెప్పారు. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అని కాపరి చెప్పగా ఆ జవాబు విన్న సభికులు ఆనందముతో హర్షద్వానాలు చేశారు
ఇంక చివరి ప్రశ్న అని రాజు పశువుల కాపరిని అడిగాడు "దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు ?" దానికి చిరునవ్వుతో పశువుల కాపరి ,"నేను పశువుల కాపరిని క్రింద ఉన్న నన్ను పైన కూర్చోబెట్టాడు ,పైన ఉండాల్సిన మహారాజైన మిమ్మల్ని క్రింద నిలబెట్టాడు. ఇదే పరమాత్ముని లీల అంటే. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ .అని జవాబిచ్చాడు సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.
 
 

మరిన్ని వ్యాసాలు

పంచ ప్రయాగ.
పంచ ప్రయాగ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు