
"పద పదవే పంచ కళ్యాణి" అంటూ "పంచ కళ్యాణి-దొంగల రాణి " జయలలిత హీరోయిన్ గా వచ్చిన సినిమా లో పాట.దాదాపు జానపద సినిమాలు కధ లన్నిటిలో హీరో గుర్రం పంచ కళ్యాణి యే .గుర్రం ఒకప్పుడు ప్రధాన వాహనం ,వ్యక్తిగత వాహనం .ఈనాటి BMW,PORSHE కార్లు, హ్యారీ-డేవిడ్ సన్ బైకుల్లాగా ఆనాడు కూడా ప్రత్యేకమైన దాన్ని,ఎవరి వద్దా లేని దాన్ని వాడటం సంపన్నుల ,నాయకుల లక్షణం. గుర్రాలను తెలియజేసే శాస్త్రం ను అశ్వ శాస్త్రం అంటారు భారతంలో నకుల సహదేవులు ఈ శాస్త్రములో ప్రావీణ్యులు అందువల్లే వీరు అజ్ఞాతవాసం లో విరాట రాజు కొలువులో అశ్వ పాలకులుగా ఉండేవారు మేలుజాతి గుర్రాల కోసం రాజులు ఎంతో కష్టపడేవారు చరిత్రలో వీటి గురించి చాలా కధలు ఉన్నాయి విజయనగర విరూపాక్ష రాయలు అరబ్బులు మేలు జాతి గుర్రాలను బహుమనీ సుల్తానులకు అమ్మ జూపారని తెలుసుకొని వారిని ఊచకోత కోయించారుట గుర్రాలకు ఎందుకు అంత ప్రాధాన్యత అంటే పూర్వం రాజుల దగ్గర సైన్యములో అశ్వ దళం చాలా కీలకమైనది రాజులు మేలు జాతి గుర్రాల నెక్కి యుద్ధాలు చేసి వారి సామ్రాజ్యాలు విస్తరింపజేశారు
పూర్వం కాళహస్తి సంస్థానానికి ఒక గుర్రాల వర్తకుడు వచ్చి , ఒక అద్భుతమైన గుర్రాన్ని అమ్మచూపాడు. గుర్రం బాగుంది కానీ, దానికి సుడులు సరైన స్థానంలో లేవు, కొనవద్దు అని నిపుణులు చెప్పారు. కానీ యువరాజు దానిమీద యమ మోజు పడ్డాడు. అతని ముచ్చట తీర్చడానికి ఆస్థాన విద్వాంసుడు శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి రాత్రికి రాత్రి ఒక ఆశ్వ శాస్త్రాన్ని రాశాడు.ఆ శాస్త్రంలో అమ్మకానికి వచ్చిన గుర్రానికి ఉన్న సుడులు శుభప్రదమైన అని శ్లోకాలకి శ్లోకాలు రాశాడు.ఆ కల్పిత శాస్త్రం చూపి గుర్రాన్ని కొన్నారు. కొన్నాళ్ళకి సంస్థానం శ్రీమద్రమారమణ గోవిందో హరి ఆ పండితుడికి పోయేదేమీ లేదు, కాళహస్తి వదిలిపెట్టి పిఠాపురం చేరాడు
కాబట్టి గుర్రం, ఎద్దు, ఆవు లాంటి వాటిని కొనడానికి ముందు వాటి శరీరం పైన ఉండే సుడులు చూస్తారు. ఈ సుడులు కొన్ని ప్రాంతాల్లో ఉంటే యజమానికి జయం. ఎద్దు ఆవు లాంటివి యుద్ధాలలో ఉపయోగించరు కాబట్టి వాటి సుడులు విషయంలో అంతగా పట్టించుకోరు కానీ గుర్రాలు యుద్ధాల్లో నేడు రేసుల్లో వాడుతున్నారు కాబట్టి వాటి విషయంలో ఈ సుడులకు ప్రాధాన్యత ఉంది గుర్రానికి సుడులు ఐదు నిర్దిష్ట స్థానాలలో ఉంటే దాన్ని కలిగి ఉన్న యజమానికి తిరుగే లేదు. అలాంటి ఐదు శుభ సుడులను కలిగి ఉన్న గుర్రమే పంచ కళ్యాణి. అటువంటి గుఱ్ఱము అన్నిటా కలిసివస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వుండే సుడులు యజమాని నష్టం తెస్తాయి. మరణం కూడా సంభవిస్తుంది..
సుడులతో పాటు పంచ కళ్యాణి గుర్రం కు ఉండవలసిన లక్షణాలు 1. నాలుగు కాళ్ళు తెలుపు 2. ముఖంపై తెల్లటి చుక్క 3. తెల్లటి కుచ్చు తోక 4. తెలుపు రంగు వీపు 5. తెలుపు రంగు మెడ జూలు ఈ లక్షణాలు ఉండే గుర్రం దొరకడం అరుదు అసలు చాలా గుర్రాలు గోధుమ రంగులో ఉంటాయి. అందుకే అంత ప్రాముఖ్యత.హిందూ,ముస్లిం,క్రైస్తవ మతాలలో అన్నిటిలో తెల్ల గుర్రాలకు ఒక దైవత్వం ఆపాదించారు.మత ప్రవక్తలు,దేవుళ్ళు,దేవదూతలు తెల్ల గుర్రలనే తమ వాహనాలుగా ఎంచుకున్నారంటే అవి అంత గొప్పవి అని ప్రాచీనుల విశ్వాసం.
సూర్యుడి రథం లో ఏడు గుర్రాలు ఉంటాయి.వాటి పేర్లు వరుసగా గాయత్రి,బృహతి ,ఉష్ణిక్,జగతి,త్రిష్తుభ,అనుష్సుభ ,పంక్తి ఇంద్రుడి గుర్రం "ఉచ్చైశ్రవం " ఏడు తలలు ఉండే ఒక తెల్ల గుర్రం.ఇది సముద్ర మధనం లో బయటకు వచ్చింది కృష్ణుడి రథం లో ఉన్న నాలుగు గుర్రాల పేర్లు శైవ,సుగ్రీవ,మేఘ వాహన,పుష్కర రాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్.రాణా ప్రాణాలు కాపాడిన గుర్రం చేతక్. శివాజీ గుర్రం పేరు విశ్వాస్ అక్బర్ గుర్రం పేరు రాహ్ బర్ అంటే నమ్మకస్తుడని అర్థం. అలెగ్జాండర్ గుర్రం పేరు బుచేపోలస్.(ఇది తెల్ల గుఱ్ఱము కాదు) పవన్, బాదల్,సారంగి అనే గుర్రాలపై జాన్సి లక్ష్మీ బాయి స్వారి చేసింది..మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర పంచ కళ్యాణి ఉండేదట .ఆ విధంగా మన భారత దేశ చరిత్రలో పేరు పొందిన గుర్రాలలో చాలా మటుకు పంచ కళ్యాణిలే ప్రఖ్యాతి గాంచిన అరేబియన్ గుర్రాలు తెల్లవి కావు ప్రపంచం లోనే ఇలా పూర్తి తెలుపు ఆధిక్యత తో జన్యువులు ఉన్న తెల్ల గుర్రాలు అరుదులో అరుదు.