“పోరాటపథం” - డా॥ పి.రమేష్‌నారాయణ

“పోరాటపథం”

వ్యక్తిత్వ వికాసగ్రంథంగా హెచ్‌.ఎన్‌ “పోరాటపథం”

- డా॥ పి.రమేష్‌నారాయణ,

అనంతపురము. సెల్‌: 9441383888

పుస్తకం పేరు ‘‘పోరాటపథం’’. కన్నడ భాషలో ‘‘హోరాటద హాది’’. ఎంత సహజమైన పేరు. వాస్తవికతా చిత్రణతో కూడిన ఒక ఆత్మకథాత్మక రచన. విశాల దృక్ఫథంతో గమనిస్తే, ప్రతి మనిషి జీవితం ఒక పోరాటపథమే. సమాజంలో సగటు జీవులుగా ఉండే, ఎంతోమంది జీవితాల్లో ఉన్నతస్థాయికి ఎదిగిన స్థితికి చేరుకోవడానికి తమ జీవనయానంలో సాధించిన విజయాలన్నీ పోరాటపథంద్వారా సిద్ధించినవే. అలాంటివారిలో చరిత్ర ప్రసిద్ధి చెందిన వ్యక్తుల జీవితాలు తర్వాతి తరాలకు మార్గదర్శకాలుగా రూపొందడం మనం ఎన్నింటినో గమనిస్తూ ఉంటాం. మానవజాతి చరిత్రలో ఒక జీసస్‌, ఒక బుద్ధుడు, ఒక గాంధీ, ఒక లెనిన్‌, ఒక లింకన్‌, ఒక అబ్దుల్‌ కలాం.... ఈ విధంగా నేటి సమాజానికి, ఆదర్శమూర్తులైన వ్యక్తుల జీవితాలన్నీ పోరాటపథంలో పయనించిన విజయగాథలే అనవచ్చును. ఇలాంటి నేపథ్యంలో ప్రశంసనీయంగా ప్రస్తుతకాలంలో వెలువడిన గ్రంథరచన ‘‘పోరాటపథం’’.

ప్రాక్పశ్చిమ సాహిత్య జగత్తులో ఆటోబయోగ్రఫీ అని, బయోగ్రఫీ అని, ఆత్మకథాత్మక రచనలు విస్తారంగా అగుపడతాయి. తెలుగుసాహిత్యంలో ఎందరో ప్రసిద్ధరచయితలు వెలువరించిన జీవనస్మృతులు, యాత్రాగాథలు, వంటివి 150 దాకా ఉన్నాయి. వెన్నలకంటి సుబ్బారావు, కె.ఎన్‌.కేసరి వంటివారితో లేదా అంతకుముందుగానో ప్రారంభమై, చిలకమర్తి, ఆదిభట్ల, కందుకూరి, చలం, ఇంద్రగంటి, భమిడిపాటి, విశ్వనాథ, పొణకా కనకమ్మ, మల్లాది సబ్బమ్మ వంటివారు మొదలుకొని శివశంకరం పిళ్ళై, దాశరథి రంగాచార్య, గిరిధర ప్రసాద్‌రాయ్‌, ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, డా॥ విజయభారతి వంటివారు, ఎందరో ప్రసిద్ధులైన కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు, చలనచిత్ర రంగంలోని ప్రముఖులు విస్తారంగా తమ జీవితగాథలు గ్రంథస్తం చేశారు. అలాంటి వాటిలో ఒకటిగా కోడీహళ్ళి మురళీమోహన్‌ అనువదించిన ప్రస్తుతరచన ‘‘పోరాటపథం’’ ఒకటిగా ఆధునికకాలంలో తెలుగుసాహిత్యంలో నిస్సందేహంగా మిగిలిపోతుందనవచ్చు.

‘‘పోరాటపథం’’ రచన వాస్తవానికి ఒక అనువాద ఆత్మకథాత్మక రచన. కర్ణాటక రాష్ట్రంలో గత శతాబ్దంలో గాంధేయవాదిగా, విద్యావేత్తగా, హేతువాదిగా ప్రసిద్ధిచెందిన పద్మభూషణ్‌ డా॥ హెచ్‌.నరసింహయ్య (1920-2005) జీవితచరిత్ర ఇది. వాస్తవానికి స్వయంగా డా॥హెచ్‌.ఎన్‌ గారే తెలుగులో వ్రాశారా.. అన్నంత సహజంగా కోడీహళ్ళి మురళీమోహన్‌ రూపొందించిన అనువాద రచన ఇది.

డా॥హెచ్‌.నరసింహయ్య జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మారుమూల కుగ్రామంలో జన్మించి ఒకవైపు బీదరికంలో కూడిన కష్టనష్టాలను ఎన్నింటిలో భరిస్తూ, మరొకవైపు ఉన్నత పథానుగామిగా తనను తాను రూపొందించుకొని, ఒక స్థితప్రజ్ఞుడిగా అత్యంత సరళమైన జీవితం గడపడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఆయనలాంటి బాల్యం, తొలిదశల్లో జీవితంలోని కడగండ్లు అనుభవించిన వారు ఎందరో ఉండవచ్చును. కానీ, ఆయనలాగా, వ్యక్తిగతంగా ఆదర్శవంతమైన జీవనశైలీ ధోరణులతో, నిబద్ధతతో తమ జీవితాలను పరిపూర్ణంగా గడిపిన వ్యక్తులు అరుదుగా ఉంటారు.

కోడీహళ్ళి మురళీమోహన్‌గారి ‘‘పోరాటపథం’’ సుమారు 500 పేజీల గ్రంథం. ఇందులో డా॥ హెచ్‌.నరసింహయ్యగారి బాల్యంతో ప్రారంభమై, 20 అధ్యాయాలుగా కొనసాగుతూ, ఆయన జీవితగాథ అగుపడుతుంది. ఒకవిధంగా ఈ గ్రంథం డా॥ హెచ్‌.ఎన్‌ ‘‘తెరదమన’’ అంటే తెరచిన మనస్సు అనే తెలుగు అర్థం సూచించే రచనకు విస్తృత రూపం. తెరదమన తనయొక్క సంక్షిప్త ఆత్మకథ అని, ముఖ్యంగా తను పెరిగిన విద్యాసంస్థల అనుభవాలు పూర్తిస్థాయిలో అందులో లేవని అవన్నీ అప్రస్తుతాలుగా భావించి, అందులో వివరించలేదని, ఆయన అన్నారు. పోరాటపథంలో ఆయన నిజాయితీతనం, ఆత్మవిశ్వాసం, హేతుబద్ధత, సామాజికస్పృహ, అలుపెరుగని జీవనపోరాటం, వాస్తవికతాదృక్ఫథం ఎన్నో సందర్భాల్లో మనం గమనిస్తాం. మొదటినుండీ డా॥హెచ్‌.ఎన్‌ స్వతంత్రభావాలు, ప్రశ్నించే ధోరణి, ఆలోచనాత్మకత వంటి భావజాలంతో తనదైన వ్యక్తిత్వం ప్రకటించిన వ్యక్తి. అత్యంత పేదరికంలో జీవితం ప్రారంభించిన డా॥హెచ్‌.ఎన్‌ జీవనయానాన్ని ఈ గ్రంథంలో మనం గమనిస్తే, అవకాశవాద ధోరణులకు కడు దూరంగా, వాస్తవికతా దృక్ఫథంతో తన జీవితాన్ని, ఒక నిష్టాగరిష్టతో రాజీలేని ధోరణిలో ఒక వ్యక్తి గడపడం ఆధునిక కాలంలో ఒక డా॥హెచ్‌.నరసింహయ్య మాత్రమే అగుపడతారు. విద్యార్థిదశలో క్విట్‌ ఇండియా, మైసూర్‌ ఛలో ఉద్యమ పోరాటాల్లో పాల్గొనడం, నేషనల్‌ కాలేజీలో పలుస్థాయిల్లో ఉద్యోగధర్మం నిర్వర్తించడం, బెంగళూరు యూనివర్సిటీ తొలిదశల్లో ఒక రూపశిల్పిగా, దాన్ని జ్ఞానభారతిగా రూపొందించడం వంటి విశిష్ట సన్నివేశాలు డా॥ నరసింహయ్య జీవితంలో ఎంతో హృద్యంగా, వాస్తవికంగా ఈ గ్రంథంలో చిత్రించారు. వైస్‌ ఛాన్సలర్‌గా, శాసనమండలి సభ్యులుగా, అమెరికాకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా, కన్నడ అభివృద్ధి ప్రాధికార సంస్థ మరియు ప్రముఖ విద్యాసంస్థల ట్రస్ట్‌ అధ్యక్షులుగా ఆయన నిర్వహించిన గురుతర బాధ్యతలు ఎంతో ప్రశంసనీయం.

ప్రస్తుతరచన ‘‘పోరాటపథం’’ కన్నడ మూలానికి నామకరణం, ముందుమాట వ్రాసింది ప్రసిద్ధ కన్నడ సాహితీమూర్తి డా॥ శివరుద్రప్పగారైతే, దానిని ఆవిష్కరించింది మరో ప్రసిద్ద కన్నడ సాహితీమూర్తి యు.ఆర్‌.అనంతమూర్తిగార్లు. పుస్తకప్రచురణ బాధ్యత నిర్వహించింది డా॥ నరసింహయ్య గారి జీవితకార్య క్షేత్రం ‘నేషనల్‌ కాలేజి ట్రస్ట్‌’. అంతేకాదు, ఈ పుస్తకాల అమ్మకాల మొత్తం అంతటినీ ఆయన తన జీవిత కార్యక్షేత్రమైనట్టి నేషనల్‌ కాలేజి స్వర్ణోత్సవనిధికి అందించడం మరోవిశేషం. ప్రస్తుతం ఈ గ్రంథం అనువదించింది కోడీహళ్ళి మురళీమోహన్‌. ఆయన ఉమ్మడి అనంతపురముజిల్లా, కర్నాటక సరిహద్దు గ్రామం అయినట్టి హిందూపురం సమీపంలోని కోడీహళ్ళికి (ప్రస్తుతం శ్రీసత్యసాయిజిల్లా) చెందినవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్‌ నివాసిగా, దక్షిణమధ్య రైల్వే ఇంజనీరింగ్‌ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి. విశేషంగా సాహితీప్రియత్వం గల ఈయన ఇప్పటికే ప్రసిద్ధ గ్రంథరచనలు, ప్రచురణలు గావించిన విశిష్టవ్యక్తి. ఆయనకు కన్నడభాషతో పరిచయం ఉండటం ఈ గ్రంథానువాదానికి ఒక అనుకూలమైన అంశం అయినప్పటికీ, ఈ రచనను నల్లేరు మీద బండి నడకలాగా రూపొందించడం పాఠకులు దీన్ని ఒక ఒరిజినల్‌ తెలుగు గ్రంథంగా చదువుకోగల రీతిగా వ్రాయడం ఎంతో ప్రశంసనీయం. ఈ రచనను నిశితంగా, లోతుగా గమనిస్తే, ఇందులో మూలరచయిత డా॥ హెచ్‌.ఎన్‌ నిక్కచ్చిగా వెల్లడించిన భావాలు మాత్రమే కాదు, ఆయనలోని హాస్యప్రియత్వం, వ్యంగ్యధోరణి, వాస్తవికతాదృక్ఫథం పలుసందర్భాల్లో మనం గమనించవచ్చు.

డా॥ హెచ్‌.ఎన్‌. నరసింహయ్య హేతువాది అయినప్పటికీ, హిందూ మతంలోని కొన్ని అంశాలను నిష్కర్షగా నిరసించినప్పటికీ, ఆయన కులద్వేషం, దైవద్వేషం లేనట్టి మహోన్నత వ్యక్తిత్వం గలవాడు. భగవద్గీతను, భారతీయ ఇతిహాసాలను, ప్రాచీన సాహిత్యాన్ని గౌరవించిన వ్యక్తి. రామకృష్ణమిషన్‌తో సైతం ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఒకదశలో ఆయన శ్రీరామకృష్ణ ఆశ్రమంలో విద్యార్థిదశను, ఉద్యోగజీవితాన్ని గడపడమే కాక, తన అమెరికా యాత్రలో సైతం వీలయినన్ని ఆశ్రమాలను ఆయన సందర్శించారు. ఈ సాన్నిహిత్యం తన మొత్తం జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిందని, స్వామి వివేకానంద రచనలు, ప్రసంగాలు తనకు చాలా స్ఫూర్తిని అందించాయని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఒక వేదాంత ధోరణిలో తన జీవితానుభవాలు వివరిస్తూ, తన జీవితం ఒక మాయ అని సైతం ఆయన భావించారు. అది నిజం కావచ్చు. ఈ మాయామోహిత జగత్తులో ఒక అనాథ బీదబాలుడు ఉన్నత విద్యాభ్యాసం గావించి, అధ్యాపకుడై, ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వైస్‌ఛాన్సలర్‌ కాబడి, భారత ప్రభుత్వంచే పద్మభూషణ్‌ గౌరవాన్ని స్వీకరించడం మాయగాక మరేమవుతుంది? అంతేకాక, తాను నిర్వహించిన సమాజసేవా కార్యక్రమాల్లో, కళాశాలల జాతీయసేవా కార్యక్రమాల్లోనూ ఈ స్ఫూర్తిని ప్రతిబింబించాడు. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో తాను గడిపిన జైలు జీవితం వివరిస్తూ, ఉద్యమకారుల్లో మౌలికమైన విలువల లోపాలు వ్యక్తపరుస్తూ, భారతీయసమాజంలో కర్తవ్యదీక్షకు, విలువలకు మనం ప్రాధాన్యత ఇవ్వనంత కాలం మనకు మనుగడ లేదని అన్నారు. అంతేకాదు, పర్యవేక్షణ లేని పరీక్షలను నిర్వహించడం, తన ప్రవర్తనా ధోరణులపై ఎదుటి వ్యక్తుల భావాలను ఉన్నదున్నట్లుగా స్వీకరించడం, తాను నమ్మిన ఆశయాలను చిత్తశుద్ధితో రాజీలేని ధోరణులతో పాటించడం ఒక పరిపాలనా దక్షుడిగా సంస్థల నిర్వహణలో భావితరాల ఆవశ్యకతను గుర్తించి, నిర్ణయాలను తీసుకోవడం, తన ధ్యేయసాధనకు, జీవితంలో పలు సందర్భాల్లో ఎంతో నిబద్ధతతో వ్యవహరించడం వంటి ఎన్నో అంశాలను డా॥ నరసింహయ్య గారి ‘‘పోరాటపథం’’ గ్రంథంలో మనం గమనిస్తాం.

ఈ ‘‘పోరాటపథం’’ అనువాద రచనల్లో ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రశంసించదగ్గ గ్రంథం. అనువాదకునికి కర్ణాటకాంధ్ర భాషల్లోగల సాధికారత, ప్రతిభాసామర్థ్యం ఈ గ్రంథరచనలో గోచరమవుతుంది. ఎన్నో సందర్భాల్లో ఆయన గావించిన ఆర్థవంతమైన పదప్రయోగాలు ఇందులో పాఠకులకు పరిచయమవుతాయి. వ్యక్తుల జీవిత చరిత్రలు సమకాలీన సమాజ ధోరణులను వెల్లడిస్తూ, చరిత్ర అధ్యయనానికి దోహదం గావిస్తాయన్న సూక్తిని డా॥ హెచ్‌.నరసింహయ్య ‘‘హోరాటద హాది’’, కోడీహళ్ళి ‘‘పోరాటపథం’’ గ్రంథాలు నిరూపిస్తాయి. కన్నడ, తెలుగు సాహిత్య రచనల్లో ఒక మంచి నిదర్శనం అనవచ్చు.

మరొక్క విషయం డా॥ నరసింహయ్య గాంధేయవాదిగా తనతరంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ విద్యావేత్తగా మాత్రమే కాక, ఒక ప్రసిద్ధ హేతువాదిగా పేరు పొందిన వ్యక్తి. డా॥ హెచ్‌.ఎన్‌ ముందునుండీ ప్రతిదీ ప్రశ్నించేధోరణి కలవాడిగా ప్రసిద్ధుడు. ఇలాంటి ధోరణి వలనే బెంగళూరు సైన్స్‌ ఫోరం, సోషల్‌సైన్స్‌ ఫోరం వంటి సంస్థలను సైతం ఆయన రూపొందించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో మహిమలు ప్రదర్శించే వ్యక్తుల మాయలు, బూటక ధోరణులు బహిరంగపరిచి, స్వామీజీలు, బాబాల మహిమల ప్రదర్శనలు నిష్కర్షగా విమర్శిస్తూ, వాటి అసంబద్ధతను శాస్త్రీయ దృక్ఫథంతో నిరూపించడానికి ప్రయత్నించి, జనసామాన్యాన్ని ఈ రంగంలో చైతన్యవంతం చేయడానికి ఎంతో కృషిగావించిన వ్యక్తి డా॥ నరసింహయ్య.

తన సమకాలీనవ్యవస్థలో ఈ రంగంలో ఎంతో రాజకీయపరపతిని కలిగిఉంటూ, అత్యంత ప్రభావశీలుడైన పుట్టపర్తి సత్యసాయిబాబా మహిమలను సైతం ప్రశ్నించడం ద్వారా ఎందరో వ్యతిరేకులను, విరోధులను సైతం కూడగట్టుకొని, స్థిరంగా జీవించిన ధీరోధాత్తుడు ఆయన. ఒక దశలో తన వైస్‌ఛాన్సలర్‌ పదవిని సైతం అర్థాంతరంగా వదలుకొని తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన త్యాగపురుషుడు డా॥హెచ్‌.ఎన్‌. సత్యసాయిబాబా మహిమలను శాస్త్రీయంగా పరిశీలించాలని, ఒక సాధికార కమిటీని రూపొందించి, ఆయన గావించిన ప్రయత్నాలు ఆయనను ఒక వివాదాస్పదవ్యక్తిగా చిత్రీకరించడం ఎంతో దురదృష్టకరం. శాస్త్రీయ దృక్ఫథం, ప్రశ్నించే తత్త్వం చిన్ననాటి నుండే అలవరుచుకున్న డా॥ నరసింహయ్యని, శ్రీ సత్యసాయిబాబా గారి సహచరుల్లో ప్రభావశీలకమైన వ్యక్తులు నకారాత్మక ధోరణిలో ఆయన వ్యక్తిత్వాన్ని చిత్రించడానికి గావించిన ప్రయత్నాలు బాధాకరం. దాని కారణంగా ఆయన తన వైస్‌ఛాన్సలర్‌ పదవీకాలం సైతం పూర్ణత్వాన్ని పొందలేక, అర్థాంతరంగా నిష్క్రమించడం, బెంగళూరు విశ్వవిద్యాలయ ప్రగతికి ఒక అడ్డంకిగా సైతం కాగలిగింది. అంతేకాదు బాణామతి, రాహుకాలం వంటి మూఢనమ్మకాలు అశాస్త్రీయమైనవి అని నిరూపించడానికి కమిటీలను సైతం ఏర్పరిచి జనచైతన్యం సైతం ఆయన పెంపొందించారు. శాస్త్రీయ దృక్ఫథంతో సత్యాన్వేషణలో భాగంగా ఒక సమాజసేవగా విద్యావంతులు విధిగా ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన వెల్లడిరచారు.

డా॥ నరసింహయ్య ఒక పోరాటశీలి. ఒక ఒంటరి యోధుడు. ఒక నికార్సయిన ఆదర్శవాది. విద్యార్థి దశలో పరీక్షల్లో మార్కులు ఎక్కువ రావాలని కష్టపడిన కాలంలోనూ, క్విట్‌ ఇండియా, మైసూర్‌ ఛలో ఉద్యమ కాలాల్లో జైలు శిక్ష అనుభవించిన కాలంలో, నేషనల్‌ కాలేజి అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా కళాశాల ఫలితాలు, పథకాల రూపకల్పనలో పోటీతత్త్వం ఉన్న పరిస్థితుల్లో, మూఢనమ్మకాలు, బాబాల మాయా ప్రదర్శనలు ఎదిరించిన కాలంలో ఆయన గావించిన ఒంటరి పోరాటాలు సామాన్యమైన విషయాలు కావు. కానీ ఆయన ఎన్నడూ నిరాశావాది కాలేదు. సదా ఆశావాదిగానే తన జీవితాన్ని ఉన్నంతలోనే సంతృప్తిగా, అర్థవంతంగా, పరిపూర్ణంగా జీవించిన ఆదర్శవాది.

‘‘మహాత్మనో చిత్తభావన యావా’’ అని భారతీయ ఆధ్యాత్మిక చింతన అంటుంది. ‘‘ఉన్నత వ్యక్తుల జీవితాలను గమనిస్తే, అవి మన జీవితాలను ఫలవంతం గావిస్తాయి’’ అని పాశ్చాత్య సాహిత్య భావన. ఏదిఏమైనా ఆదర్శ పురుషుల జీవితాలు సామాజిక వ్యవస్థలోని వ్యక్తులను మార్గదర్శకాలన్న అభిప్రాయంతోనే ‘‘యదాచరతి శ్రేష్ట:.....’’ అంటూ శ్రేష్టులైన వారు చేసే పనులను గమనించడం ద్వారా సామాన్య ప్రజానీకం ఆ మార్గంలో నడుస్తుందని భావిస్తారు. ఈ కోణంలో గమనిస్తే కోడీహళ్ళి మురళీమోహన్‌ ప్రస్తుతం మనకు అందిస్తున్న డా॥ హెచ్‌. నరసింహయ్య గారి ఆత్మకథాత్మక ‘‘పోరాట పథం’’ రచన నేటి కాలంలోని విద్యార్థిలోకానికి, అధ్యాపకవర్గాలకు, ముఖ్యంగా హాస్టల్‌ జీవితాలు గడిపే విద్యార్థులకు ఇతరులకు ఒక మంచి వ్యక్తిత్వ వికాసగ్రంథంగా ప్రశంసించబడుతుంది. నేటి విద్యారంగంలోని ప్రతివ్యక్తి ఈ రచనను విధిగా చదవాల్సిన గ్రంథంగా పేర్కొనవలసి ఉంటుంది. ఎందుకంటే పేదరికంలో మగ్గుతున్న ఒక అమాయక గ్రామీణ బాలుడు తన స్వగ్రామం నుండి బెంగళూరు నగరానికి 53 మైళ్ళు కాలినడకతో వెళ్ళడం, ఒక కళాశాల అధ్యాపకుడు బీద విద్యార్థుల హాస్టల్లో జీవించడం, ఒక యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఒక సింగిల్‌ రూములో జీవించడం, ఒక శాసనమండలి సభ్యుడు ఆటోరిక్షాల్లో ప్రయాణించడం, ఒక కళాశాల ప్రిన్సిపల్‌ రూటు బస్సుల్లో చీపురు పరకలు మోసుకుంటూ, విద్యార్థుల గ్రామీణ సేవలకు సహాయ సహకారాలు అందించడం వంటి చర్యలు బహుశా ఒక్క డా॥ నరసింహయ్య గారు మాత్రమే చేయగలరేమో. మహాత్మాగాంధీ అంతటి వాడు భూమిపైన నడిచినాడంటే ఒక నమ్మలేని నిజం అంటూ ప్రపంచ ప్రసిద్ధులు ఎందరో ఆయనను కొనియాడిన సందర్భాలు మనకు పరిచితమే. కానీ మన మధ్యలో ఆధునిక కాలంలో డా॥ హెచ్‌.ఎన్‌. లాంటి వ్యక్తి విద్యారంగంలోనూ, సామాజిక వ్యవస్థలోనూ ఉన్నాడంటే నిజంగా నమ్మలేని నిజం ఇది. ఇంతమంచి గ్రంథాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇంతటి స్ఫూర్తివంతమైన రచనను తెలుగు పాఠకలోకానికి అందించిన కోడీహళ్ళి మురళీమోహన్‌కి, ఈ గ్రంథాన్ని ప్రచురించిన ప్రచురణకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. (పుస్తక ప్రాప్తిస్థానం కోడీహళ్ళి మురళీమోహన్‌: 97013 71256)

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం