శ్రీసాయి లీలామృతం - సి.హెచ్.ప్రతాప్

శ్రీసాయి లీలామృతం

శ్రీ సాయినాధులు తరచుగా తన భక్తులతో తనకు, తన ఫొటొ కూ భేధమేమీ లేదని అంటుండేవారు. మన: పూర్వకం గా , భక్తి శ్రద్ధలతో పవిత్రమైన మనస్సుతో శ్రీ సాయి ఫొటొ కు పూజ చేస్తే సాక్షాత్తూ శ్రీ సాయికి పూజ చేసినట్లేనని, తాను వెంటనే అనుగ్రహిస్తానని శ్రీ సాయి స్వయం గా తన భక్తులకు చెప్పడమే కాక ఆచరణ పూర్వకం గా ఎన్నో సార్లు చూపించారు.

బొంబాయిలో ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్న అప్పా సాహెబ్ కులకర్ణి అను నతనికి ఒకసారి అతని స్నేహితుడు బాలాసాహెబ్ భాటే బాబా ఫొటోను కానుకగా ఇచ్చాడు. కులకర్ణి ఆ ఫొటోను తన పూజా మందిరం లో ప్రతిష్టించుకొని నిత్యం షోడశోపచారాలతో పూజాది కార్యక్రమాలను నిర్వర్తిస్తుండేవాడు. ఒక్క సారైనా శిరిడీ వెళ్ళి శ్రీ సాయి దర్శనం చేసుకుందామని అనుకున్నాడు కాని ఉద్యోగ భాద్యతల వలన అది సాధ్యం కాలేదు.

1917 వ సంవత్సరం లో కులకర్ణి కి ఠాణే కు బదిలీ అయ్యింది. ఠాణే లో వుండగా భివండీ కి ఆఫీసు పర్యటన మీద వారం రోజుల కోసం కులకర్ణి వెళ్ళాడు. మూడవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు అచ్చం శ్రీ సాయిలా వున్న ఒక ఫకీరు కులకర్ణి ఇంటికి వచ్చి దక్షిణ అడిగాడు. ఆయన ముఖ కవళికలు సాయితో సరిపోవడం వలన “ మీరు శ్రీ సాయి బాబా గారా ?” అని కులకర్ణి భార్య అడిగింది. “లేదు, నేను భగవంతుడి సేవకుడను. ఆయన ఆదేశానుసారం మీ యోగక్షేమాలను కనుక్కోవడానికి వచ్చాను” అని అన్నారు. కులకర్ణి భార్య ఇచ్చిన రూపాయిని తీసుకొని ఒక ఊదీ పొట్లాం ఇచ్చి నిత్యం బాబా ఫొతొ తో పాటు పూజ చేస్తే మంచి జరుగుతుందని చెప్పి ఆ ఫకీరు వెళ్ళిపోయాడు.

భివండీ లో తన గుర్రానికి తీవ్రమైన సుస్తీ చేయడం తో కులకర్ణి తన పర్యటనను అర్ధాం తరం గా రద్దు చెసుకొని ఆ రోజు సాయంత్రమే ఇల్లు చేరుకున్నాడు. ఫకీరు గురించి భార్య ద్వారా విని , ఆయన దర్శనం తనకు లభించనందుకు బాధ పడ్దాడు. తానే గనక ఇంట్లో వుంటే రూపాయికి బదులు పది రూపాయలను దక్షిణగా ఇచ్చి వుండేవాడినని అనుకున్నాడు. ఆతనికి మనసులో బలం గా తమ ఇంటికి వచ్చిన వారు శ్రీ సాయే అయివుంటారని అనిపించింది. వెంటనే భోజనం కూడా మానేసి ఆ ఊరిలో వున్న అన్ని ప్రదేశాలను వెదికాడు కానీ ప్రయోజనం లేకపోయింది. నిరాశతో ఇంటికి వచ్చి భోజనం చెసి విశ్రాంతి తీసుకుమ్మాడు.ఖాళీ కడుపుతో భగవంతుడిని వెదకరాదన్న శ్రీ సాయి ఉపదేశం ఇక్కడ మనమందరం గుర్తుంచుకోవాలి. కొద్ది సేపట్లో అతని స్నేహితుడు వచ్చి వ్యాహ్యాళికి రమ్మని అహ్వానించాడు. మధ్య మార్గం లో వారికి ఒక ఫకీరు కనిపించాడు. ఆయనను చూడగానే మధ్యాహ్నం తమ ఇంటికి వచ్చిన ఫకీరు లాగే అనిపించింది కులకర్ణి కి. ఆ ఫకీరు వెంటనే చేయి చాచి దక్షిణ అడుగగా కులకర్ణి ఒక రూపాయి ఇచ్చేడు. ఫకీరు మళ్ళీ దక్షిణ అడగడం తో తన వద్ద మిగిలిన రెండు రూపాయలను ఇచ్చేడు. ఫకీరు సంతృప్తి చెందకపోవడం తో స్నేహితుని వద్ద నుండి మూడు రూపాయలు అప్పు తీసుకొని ఇచ్చాడు.ఫకీరు ఇంకా దక్షిణ అడగడం తో వారిని తన ఇంటికి మర్యాదపూర్వకం గా తీసుకు వెళ్ళి మూడు రూపాయలు దక్షిణ గా (మొత్తం తొమ్మిది రూపాయలు) ఇచ్చాడు. ఫకీరు మళ్ళీ దక్షిణ అడగడం తో కులకర్ణి తన వద్ద వున్న పది రూపాయల నొటును ఇచ్చి వేసాడు. ఆ ఫకీరు చిరునవ్వుతో తొమ్మిది రూపాయలను ఆశీర్వదించి వారికి తిరిగి ఇచ్చివేసాడు. ఓక ఊదీ పొట్లాన్ని అప్పా కులకర్ణి కి ఇచ్చి నిత్యం పూజించుకొమ్మని చెప్పి , ఏ చీకు చింతా , దిగులు లేకుండా ఆనందం గా వుండమని చెప్పి వెళ్ళిపోయాడు.

ఈ విధం గా శ్రీ సాయి ఫకీరు రూపం లో వచ్చి అప్పా కులకర్ణి ని ఆశీర్వదించారు. ఇస్తామన్న పది రూపాయల దక్షిణ ను ముక్కు పిండి వసూలు చేసి , తొమ్మిది రూపాయలను పవిత్ర పరచి తిరిగి ఇచ్చివేసారు. తొమ్మిది నాణాలు నవ విధ భక్తికి సంకేతం. శ్రీ సాయి తన సమాధి సమయం లో లక్ష్మీ బాయి శిందే కు తొమ్మిది నాణాలను ఇచ్చి నవ విధ భక్తి గూర్చి విపులం గా తెలియజేసారు. భక్తుడు తన వద్దకు ఉద్యోగ భధ్యతల దృష్ట్యా రాలెకపోతే , తానే స్వయం గా భక్తుని వద్దకు వచ్చి ఆశీర్వదించారు శ్రీ సాయి.

అప్పాసాహెబ్ కులకర్ణి త్వరలోనే శిరిడీ దర్శనం చేసాడు. అప్పుడు శ్రీ సాయి యొక్క తల వెంట్రుక ఒకటి అతనికి చిక్కింది. ఆ తల వెంట్రుక, ఫకీరు ఇచ్చిన ఊదీ పొట్లాన్ని ఒక తాయొత్తులో పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. నాటి నుండి శ్రీ సాయి అనుగ్రహం వలన అతని జీవన గతి మారిపోయింది. అప్పా సాహెబ్ కులకర్ణి స్వతాహాగా చాలా తెలివైన వాడు. కాని అతనికి జీతం నలభై రూపాయలు మాత్రమే దొరుకుతూ వుందేది. శ్రీ సాయి ఊదీ, తల వెంట్రుకలను తాయొత్తు క్రింద చేతికి కట్టుకున్ననాటి నుండి లక్ష్మీ దేవి కరుణ అపూర్వం గా లభించింది. ఆతని అదాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. మంచి పలుకు బడి, అధికారం, హోదా లభించాయి. దైవ భక్తి కూడా ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. శ్రీ సాయి పూజ, నామ స్మరణ, సంకీర్తన, ఆరతి పాడడం, అభాగ్యులకు సేవ వంటి సత్కార్యాలతో మనస్పూర్తిగా పాల్గొని శ్రీ సాయినాధుని సంపూర్ణ అనుగ్రహ, కరుణా కటాక్షాలకు పాత్రుడు అయ్యాడు. శ్రీ సాయి సేవ చేసుకునేవారికి ఇహపర కానుకలే కాక అధ్యాత్మిక సిద్ధి కూడా పరిపూర్ణంగా లభిస్తుందన్న నగ్న సత్యానికి ఈ లీల ఒక చక్కని ఉదాహరణ.

మరిన్ని వ్యాసాలు