రంజాన్ - P v kumaraswamy Reddy

రంజాన్

రంజాన్ ____ పిళ్లా కుమారస్వామి

పండుగ అంటే శుభవేళ, ఉత్సాహం అని అర్థం. పండుగలు మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అది ఏ మతమైనా భారతీయులు కలిసిమెలిసి చేసుకుంటారు. ఒకరి పండుగను ఇంకొకరు గౌరవించుకుంటారు.

పండుగ మనుషుల జీవితాల్లో వెలుగు తెచ్చేదిగా, ఆనందాన్నిచ్చేదిగా భావిస్తారు. పండుగ రోజు ఆనందంగా ఉండటం సహజం. ఒక్కో పండుగ ఒక్కో కారణంగా ఏర్పడింది. కాకపోతే ఎక్కువ భాగం రుతువులను బట్టి ఏర్పడినాయి. దీనికి ప్రధాన కారణం పూర్వం ప్రజలు ప్రకృతిని ఆరాధించటమే.

తరువాత కాలక్రమంలో దైవభావన తోడై ప్రతిపండుగకు దేవున్ని స్మరించడం ఒక అలవాటుగా మారిపోయింది. రంజాన్ పండుగ ముస్లింలు అత్యంత పవిత్రగంగా జరుపుకొనే పండుగ. ముస్లింలు చంద్రమాన కాలపట్టికను అనుసరిస్తారు. చంద్రమానం ప్రకారం వచ్చే తొమ్మిదవనెల రంజాన్.

దీనిని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. 'ఖురాన్' గ్రంథం ఈనెలలో ఆవిర్భవించడం వల్ల ఈనెలను పవిత్రమాసంగా పరిగణిస్తారు. అయితే, ఖురాన్ రాతప్రతుల రూపంలో మౌఖిక సంప్రదాయాల ద్వారా సంకలనం చేయబడిందని చారిత్రక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కాబట్టి, ఖురాన్ ఏ నెలలో ప్రాచుర్యంలోకి వచ్చిందో స్పష్టమైన ఆధారాలు లేవు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికచింతనల కలయికే 'రంజాన్ మాసం'. రంజాను 'రమదాన్' అని కూడాపిలుస్తారు. రమీదా లేదా అద్రమద్ అనే అరబ్ మూలపదం నుంచి రమదాన్ అనే పదం వచ్చింది. రంజాన్ అనేది రోమన్ పదం.

ఈనెల 29 నుండి 30రోజుల పాటు ఉంటుంది. చివరిరోజు అమావాస్యముగిసి నెలవంక కనిపించగానే పండుగ జరుపుతారు. మక్కా నుండి మదీనాకు ముస్లింలు వలసవెళ్ళిన రెండో సంవత్సరంలో షాబాన్నెలలో 'రమదాన్' ను తప్పనిసరి చేసినారు. రంజాన్ నెలలో ఉపవాసం (రోజా) ఉంటారు. రోజాను ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పాటిస్తారు.

రోజా (ఉపవాసదీక్ష)లో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాన్నిగాని, పానీయాలుగాని, పొగతాగడంకాని చేయరాదు. కనీసం ఉమ్మికూడా మింగరాదు. ఎలాంటి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనరాదు. అలాగే ఇతరులను అవమానపరచడంగాని శాపనార్థాలు పెట్టడంగాని, చాడీలు చెప్పడంగాని, అబద్దాలు చెప్పడంగాని చేయరాదు. ఆత్మరక్షణకు తప్ప ఇతరులతో పోట్లాడరాదు.

అయితే జబ్బుతో బాధపడేవారు, వృద్ధులు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, చక్కెర వ్యాధిగ్రస్తులు, బహిస్టు అయినవారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఈ ఉపవాసదీక్ష ఉంచి మినహాయించబడినారు. కాకపోతే రోజాలో ఉండటం ఐచ్చికం. తప్పనిసరేమీకాదు.

రంజాన్ మాసంలో ప్రపంచంలోని ముస్లింలంతా ఉపవాస దీక్షలు ఉంటారు. ఇది ముస్లింల మధ్య ఐక్యతను పెంపొందిస్తున్నది. ఉపవాసం ఉండటం వల్ల సహనశక్తి, మానసిక ఏకాగ్రత, ఆకలి గురించి తెలియటం, ముఖ్యంగా ధనికులకు పేదల ఆకలిగురించి తెలియటం, వారిపట్ల సహానుభూతి ఏర్పడుతాయని భావిస్తారు. మనవ శరీర ఆరోగ్య సూత్రాల రీత్యా , నీరు త్రాగకపోవడం ఆరోగ్యానికి హానికరం. దీర్ఘకాలం నిర్జలీకరణ శరీరానికి మానసిక, శారీరక ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి, ఉపవాసం పాటించే వారు కనీసం తగినంత నీరు తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిది. ఉపవాసం వల్ల ఆకలి బాధ అనుభవించడం ద్వారా పేదల స్థితిగతులను అర్థం చేసుకోవచ్చనే నమ్మకం ఉంది.

అయితే, పేదల సమస్యలు ఆకలి బాధకు మాత్రమే పరిమితం కావు. ఉపవాసం ద్వారా పేదల సమస్యలపై అవగాహన పెరుగుతుందన్న విషయం లో ఎలాంటి హేతుబద్ధత లేదు. అదే నిజమైతే ముస్లిం మైనారిటీలలో పేదరికం ఈ వేళకు అంతరించిఉండాలి. పేదరికానికి కారణం దోపిడీ. అది రద్దు కాకుండా పేదరికం పోదు.

ప్రాత:కాలంలో ఉపవాస దీక్ష(రోజా) ప్రారంభానికి ముందు చేసే భోజనాన్ని 'సుహూర్' లేదా 'సెహరి' అని, సూర్యాస్తమయ మయ్యాక ఉపవాస దీక్ష ముగించిన తరువాత చేసే భోజనాన్ని 'ఇఫ్తార్' అని అంటారు. రోజాలో మొదటచేసే ప్రార్ధనను 'ఫజర్' అంటారు. రంజాన్ మాసంలో ఉపవాసంతోపాటు ప్రార్థనలు(సలాత్), ఖురాన్ చదవడం, దాతృత్వం, మంచిపనులు చేయటం కూడా ఆచరించాల్సి ఉంటుంది. ఇస్లాం మతాన్ని అనుసరించేవారు ఐదు విధులు తప్పనిసరిగా చేయాలని చెపుతారు. ఇవి ఈమతానికి మూల స్తంభాల్లాంటివి. అవి: 1. కలీమా (విశ్వాసంతో ప్రార్ధన) 2. నమాజు(ప్రార్ధన) 3. రోజా(ఉపవాసం) 4. జకాత్ (దానం చేయడం) 5. హజ్యాత్ర (మక్కాను సందర్శించడం). 1. కలిమా: "లా ఇలా:హా ఇల్లల్లా: మహమ్మదుర్ రసూలల్లా" అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు. మహమ్మదును ఆదేవుని ప్రవక్తగా పంపినాడు (There is no God. But God is one and Mohammad is his Prophet) అని విశ్వసించి రోజూ జపించాలి. విశ్వాసంతో ప్రార్థన చేయడం మానసిక శాంతి పొందే అవకాశం కొంత మేర ఉంటుంది.

మానవుల నమ్మకాలు మనిషి సాంస్కృతిక అభివృద్ధిని బట్టి ఉంటాయి. 2. నమాజు (ప్రార్థన): మసీదు నుంచి అజా యిస్తారు. అజా నమాజుచేయటానికి పిలుపు. వచ్చినవారంతా పేదగొప్ప తారతమ్యాలు లేకుండా అందరూ వరుసగా నిలబడతారు. ఇమామ్ (పూజారి) వారి ముందు నిలబడి నమాజ్ చేయిస్తారు. నమాజ్ చేసేటప్పుడు ఖురాన్లోని సూరా:లె (పంక్తులను) చదువుతారు. మక్కా దిక్కుకు అభిముఖులై నమాజు చేస్తారు. ఇదొక సామూహిక ప్రార్థన. మహిళలు మాత్రం ఇళ్ళలోనే నమాజు చేస్తారు.మహిళలకు పురుషుల తో సమానంగా అవకాశం లేదనే విమర్శలున్నాయి ఈ విషయం లో. ప్రార్థనలు చేయని వారు నైతికంగా లేదా మానసికంగా పతనం చెందుతారని ఛాందస వాదులు చెప్పే వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదు. 3. రోజా (సౌమ్) : రంజాన్ మాసంలో చేసే ఉపవాసాన్ని రోజా అంటారు. దీనిని విధిగా ఆచరించాలని ఖురాన్ చెపుతుంది. ఉపవాసాన్ని పార్సీభాషలో రోజా అని, అరబ్బీ భాషలో 'సౌమ్' అని పిలుస్తారు.

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉపవాసాన్ని పాటించకపోవడం ఉత్తమం. 4. జకాత్ : ఇస్లాంలో దాతృత్వం చాలాముఖ్యమైనది. ముఖ్యంగా రంజాన్ మాసంలో. దీనిని 'జకాత్' అంటారు. తాను సంపాదించి పొదుపు చేసుకున్నమొత్తంలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వాలి. ధనికులు తమ సంపద నుండి 30శాతం మొత్తాన్ని, ధనవస్తుకనకాలను ఏమైనా నిరుపేదలకు దానం చేస్తారు. పేదలు కూడా అందరితో పాటు పండుగచేసుకోవడానికి ఈ 'జకాత్' పద్దతి ఉ పయోగపడుతుంది. 7.5తులాల బంగారం లేదా 32.5 తులాల వెండి లేదా దానికి సమానమైన ధనంలో 2.5% జకాత్ పేదలకు దానం చేయాలని పూర్వులు చెప్పినారు. 7.5 తులం బంగారంకు ప్రస్తుతం ఉన్న విలువ ప్రకారం (తులం రూ.30,000) రూ.2,25,000లు అవుతుంది. దీని ప్రకారం రూ.2,25,000లో 2.5% అనగా రూ.5,625లు చొప్పున తమ ఆదాయాన్ని లెక్కించి పేదలకు దానం చేయాల్సి ఉంటుంది.

జకాత్ తో పాటు ఉపవాసాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడిపట్ల కృతజ్ఞతగా పేదలకు ధనికులు విధిగా దానం చేస్తారు. దీనినే ఫిత్రాదానం అంటారు. ఈ ఫిత్రాదానంలో 50గ్రాములు తక్కువ రెండు కిలోల గోధుమలుగాని, ఇతర ఆహార ధాన్యాలుగానీ, దానికి సమానమైన ధనాన్నిగాని దానం చేయాలి. ఈదానం కుటుంబ సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి.సంపదను పేదలతో పంచుకోవడం సమాజ హితానికి మంచిది. కానీ, ఇది కేవలం మతపరమైన ఆదేశంగా కాకుండా సామాజిక సమానత్వాన్ని పెంపొందించే విధంగా ప్రోత్సహించాలి. 5. హజ్ యాత్ర: అరేబియా దేశంలో ఉన్న మక్కామసీదును సందర్శించటం జీవితకాలంలో ఒకసారైనా చేయాలి.

అప్పులు చేసి వెళ్ళరాదు. అప్పులుంటే తీర్చివెళ్లాలి. ఇది మతపరమైన నిబంధన. దీనికన్నా ఆర్థికంగా వెనుకబడినవారికి సహాయపడడం సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గతంలో హజ్ యాత్రికులకు విమాన టికెట్లపై సబ్సిడీ ఇచ్చేది. కానీ 2012లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు, 2018 నాటికి ఈ సబ్సిడీ పూర్తిగా తొలగించబడింది. ప్రస్తుతం, ప్రభుత్వం హజ్ యాత్రకు నేరుగా ఆర్థిక సహాయం చేయకపోయినా, భారత హజ్ కమిటీ ద్వారా యాత్రికుల రిజిస్ట్రేషన్, వీసా, సౌదీలో ఉండే వసతి ఏర్పాట్లు, వైద్య సదుపాయాల వంటి సాంకేతిక సహాయాలను అందిస్తోంది. ఖురాన్ ప్రకారం రంజాన్ మాసం మానవాళికి ఒక దిక్సూచిలాగా తోడ్పాటు లాగా ఉంటుంది. అల్లా మనిషిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని, ఎలాంటి కష్టాలకు గురి చెయ్యడని ఈనెలను దీక్షతో ముగించాలి. అల్లాతోడునీడగా దారిదీపంలాగా ఉన్నందుకు మనిషి కృతజ్ఞతను చాటుకోవాలని ఖురాన్ చెపుతుంది.

రంజాన్ నెలంతా ఇలా ఉపవాసాలతో దాన ధర్మాలతో (జకాత్) ముగుస్తుంది. ముగిసేరోజున 'షవ్వాల్' లేదా హిలాల్జున నెలవంక కనిపిస్తుంది. ఈ నెలవంక దర్శనంకాగానే ఉపవాసదీక్షను విరమించి, మరుసటిరోజు రంజాన్ పండుగను జరుపుకొంటారు. షవ్వాల్నెల మొదటిరోజున జరుపుకొనే రంజాన్ పండుగను 'ఈదుల్ ఫితర్' అని అంటారు.

రంజాన్ పండుగరోజు సేమ్యాతో ఖీర్(పాయసం), బిరియానీ చేసుకుంటారు. కొత్తబట్టలు ధరించి ఈద్గాలలో మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేస్తారు. మహిళలు తమ ఇళ్ళలోనే నమాజు చేస్తారు. ప్రతి ఒక్కరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) చెప్పుకుంటారు. తల్లిదండ్రులు లేదా బంధువుల సమాదుల దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు కూడా చేస్తారు. నమాజ్ కోసం వెళ్ళినపుడు ఒకదారిలో వెళ్ళి వచ్చేటప్పుడు మరొకదారిలో వస్తారు. రంజాన్ పండుగ మరుసటిరోజుల్లో వనభోజనానికి వెళుతూ ఉంటారు.

మరిన్ని వ్యాసాలు