కన్యాశుల్కంలో వాడుక మాటలు - సిరాశ్రీ

Book Review - kanyasulkam lo vaduka matalu

పుస్తకం: కన్యాశుల్కంలో వాడుక మాటలు
రచన: జి ఎస్ చలం (9490106390)
రచయిత చిరునామా: జి ఎస్ చలం, తెలుగు పండిట్, జెడ్ పీ హెచ్ స్కూల్, బొండపల్లి, విజయనగరం జిల్లా- 535260
ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ

విల్ఫ్రెడ్ ఫంక్ రాసిన "వర్డ్ ఆరిజిన్స్ అండ్ దెయిర్ రొమాంటిక్ స్టొరీస్", నార్మన్ లెవిస్ రాసిన "వర్డ్ పవర్ మేడ్ ఈజి" ల్లో వేరు వేరు భాషల్లోంచి ఇంగ్లీషు భాషలోకి పలు పదాలు చేరిన తీరు, వాటి వ్యుత్పత్తులు, అర్థాలు అద్భుతంగా పొందు పరచబడ్డాయి. ఆ రెండు గ్రంథాలు ఔపోసన పడితే చాలు... 70 శాతం ఆంగ్ల పదకోశం పట్టు చిక్కినట్టే.

అయితే తెలుగులో కూడా నిఘంటువులతో పాటు పారిభాషక పదకోశాలు, మాండలిక పదకోశాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యనే అన్నమయ్య పదకోశం, ఆ మధ్య నన్నయ పదకోశం... ఇలా ఎన్నో జనం ముందుకొస్తున్నాయి. అంటే ఆయా కవులు తమ రచనల్లో వాడిన పదాలు, వాటి వ్యుత్పత్యర్థాలు అందులో ఉంటాయి.

ఇప్పుడు కొత్తగా "కన్యాశుల్కంలో వాడుక మాటలు" పేరుతో 48 పేజీల చిన్న పుస్తకం ఒకటి వచ్చింది. మహాకవి గురజాడ అప్పారవు రాసిన "కన్యాశుల్కం" నాటకంలోని పదాలు, వాటి అర్థాలు ఇందులో విపులంగా ఇచ్చారు. అంతోటి దానికి పుస్తకం వేయడం ఎందుకు? ఆ పదాలన్నీ నిఘంటువుల్లో దొరుకుతాయి కదా అనుకోవచ్చు. కానీ అలా దొరికే వెసులుబాటు లేదు. ఎందుకంటే ఈ నాటకంలోని పదాలు చాలా వరకు 100 ఏళ్ల నాటి విజయనగరం మాండలికానికి చెందిన వాడుక మాటలు.

ఆబోరు, కునిష్టి, ఠస్సా, రవ్వ, బేహబ్బీ, పస్తాయించి, గొట్టికాయలు, అగ్ఘురారం, చప్పన్న భాషలు, గళగ్రాహి, గొట్టాలమ్మ, కొర్రెక్కడం, త్వాష్ట్రం, భరువాస, గణియం, చెవికదపాయించు, మందడి గోడ, బర్లో, నేరవి పిల్ల, ఫొక్తు పరచు, సంగోరు... ఇలాంటి పదాలు చదవగానే అర్థం తట్టదు. ఇవన్నీ కన్యాశుల్కంలోనివే. నిఘంటువుల్లో ఈ పదాలన్నీ దొరక్క పోవచ్చు. కారణం వీటిల్లో కొన్ని మాండలిక పదాలు, కొన్ని దేశ్యాలు, కొన్ని పాత్రోచిత ఉచ్చారణ వల్ల రూపం మారిన పదాలు కావడం. పైగా తెలుగైజ్ చేసి పలికిన ఇంగ్లీషు, ఉర్దు పదాలు ఈ నాటకంలో కోకొల్లలు. వాటి అర్థాలు ఏ నిఘంటువులోనూ బూతద్దం వేసినా దొరకవు. ఇప్పుడింకా ఆ బాధలన్నీ తీర్చేసారు శ్రీ జి ఎస్ చలం. ఆయన కృషి అభినందనీయం.

గత వారం రవీంద్రభారతిలో 8 గంటల సుదీర్ఘ "కన్యాశుల్కం" నాటక ప్రదర్శన నిర్వహించారు భాషా - సాంస్కృతిక శాఖ వారు. ఆ సందర్భంగా ఈ పుస్తకాన్ని ఐదు రోజుల్లో అచ్చు వేయించడం, విడుదల చేయడం జరిగిపోయాయి.

ఆసక్తి గల భాషాభిమానుల వద్ద ఈ పుస్తకం ఉండి తీరాలి.