
నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి సాధనంగా మారింది. సమాచార విప్లవం మన జీవితాన్ని సులభతరం చేసినా, అదే డిజిటల్ ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద వ్యసనంగా మారి సమాజానికి కొత్త సమస్యగా ఎదిరిస్తోంది. దీనిని డిజిటల్ వ్యసనం అంటారు. పిల్లలు, యువత మాత్రమే కాదు పెద్దలు కూడా దీని బారిన పడుతున్నారు. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడటం, రాత్రి నిద్ర పోయే వరకు సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయడం, ఆన్‌లైన్ గేమ్స్‌లో గంటల తరబడి మునిగిపోవడం — ఇవన్నీ రోజువారీ దృశ్యాలుగా మారిపోయాయి. ఈ అలవాటు వలన చదువు, పని, కుటుంబ సంబంధాలు, మానసిక ఆరోగ్యం అన్నీ దెబ్బతింటున్నాయి.
నిరంతరం స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల కంటి సమస్యలు, తలనొప్పులు, నిద్రలేమి, మెడ–వెన్నునొప్పులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలలో దృష్టి లోపాలు, ఆందోళన, చిరాకు ఎక్కువవుతున్నాయి. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో మునిగిపోవడం వలన సంభాషణలు తగ్గిపోతున్నాయి. బంధాలు బలహీనమవుతున్నాయి. చిన్నతరగతి పిల్లలు బహిరంగ క్రీడలకు దూరమై, వర్చువల్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి అవసరం అయినా, వాటి ద్వారా వచ్చిన అదనపు స్క్రీన్ టైమ్ వల్ల దృష్టి చెదిరిపోతోంది. దాంతో విద్యార్ధులలో చదువుపై ఆసక్తి తగ్గిపోతోంది.
ఈ సమస్యకు పరిష్కారం కష్టమైనదే అయినా అసాధ్యమేమీ కాదు. తల్లిదండ్రులు పిల్లలకు గాడ్జెట్ వాడకంపై సమయ పరిమితులు పెట్టాలి. కుటుంబంతో కలిసి గడిపే సమయం పెంచాలి. పుస్తకాలు చదవడం, క్రీడలు ఆడడం, హాబీలను పెంపొందించడం ద్వారా స్క్రీన్ నుండి దృష్టి మళ్లించాలి. పాఠశాలలు కూడా విద్యార్థులకు డిజిటల్ శిక్షణతో పాటు డిజిటల్ నియంత్రణపై అవగాహన కల్పించాలి.
డిజిటల్ టెక్నాలజీ మన జీవితంలో అవసరం అయినా, దాని మీద ఆధారపడిపోవడం ప్రమాదకరం. టెక్నాలజీని నియంత్రించడం మన చేతిలోనే ఉంది. దానిని సమయోచితంగా వాడితే అది వరం, లేకపోతే శాపంగా మారుతుంది. కాబట్టి డిజిటల్ వ్యసనం అనే కొత్త సవాలను సమాజం జాగ్రత్తగా ఎదుర్కోవాలి.