రష్మిని చూడడానికి వచ్చిన రమేష్ కి అతని తండ్రి కాంతారావుగారికి తల్లి కామేశ్వరిగారికి స్వాగతం పలికిన రంగారావుగారు వారికి ముందుగా భార్య రుక్మిణిగారిని పరిచయం చేసేరు. రుక్మిణిగారు లోపలికి వెళ్ళి రష్మితో కలిసి వచ్చిన తరువాత వీరూ వారూ ఎదురెదురుగుండా కూర్చున్నారు.
ఇరు పక్షాల పెద్దలు అబ్బాయి అమ్మాయి జాతకాలు సిద్ధాంతి గార్లకు చూపించి, వారు కూడా పచ్చ జెండా ఊపిన తరువాత, లాంఛనప్రాయంగా ఈరోజు ఆడపిల్లవారి ఇంట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేసేరు.
రష్మి రమేష్ లు అంతకు ముందే ఒకరికొకరు పరిచయస్టులే కాక మనసులు విప్పి మాట్లాడుకున్నవారే. ఆ విషయాలు వారి పెద్దవారికి తెలియదు అనేకంటే, తెలియకుండా వారు జాగ్రత్త పడ్డారు అనడం సబబు.
ఇంతవరకూ ఏదో కారణాలతో పెళ్లి వాయిదా వేస్తూ 35 ఏళ్ల వయసులోకి అడుగిడిన రమేష్ కి ఈ సంబంధం అయినా కుదిరితే చాలు అన్న ఆతృత అతని తల్లితండ్రుల అంతరంగంలో నిండుగా నిభిడీకృతమై ఉంది.
అదే విధంగా, 32 ఏళ్ల వయసు వచ్చిన రష్మి కి ఇవే ఆఖరి పెళ్ళిచూపులవాలన్న కోరిక రంగారావుగారి దంపతులలో కూడా నిండి ఉంది.
“అంకుల్ ఆంటీ, నేను మీ ముగ్గురితో ఏక కాలంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి” -- రష్మి తన కోరికను బయటపెట్టింది.
“ముందు మీరిద్దరూ మాట్లాడుకొని ఒకరినొకరు అర్ధం చేసుకోవడం నచ్చుకోవడం అవనీ. ఆ తరువాత మాతో తప్పకుండా మాట్లాడుదువు గాని” అని కాంతారావుగారు రష్మికి బోధపరచే ప్రయత్నం చేసేరు.
“లేదు అంకుల్, నన్ను మీ ముగ్గురితో ఇప్పుడే మాట్లాడనివ్వండి”
“నువ్వేమంటావు రమేష్”
“మీరెలాగంటే అలాగే నాన్నా”
“సరే అమ్మా, మాట్లాడు”
అమ్మాయిని ‘తాను ఆడిందే ఆట పాడిండే పాట’ అన్నట్టుగా పెంచడంతో, ఇప్పుడు ఏమి మాట్లాడుతుందో – అని మన్సులో కంగారు పడసాగేరు రష్మి తల్లితండ్రులు.
అన్నీ తెలిసిన రమేష్, ఏమీ తెలియనట్టుగా ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్టు కూర్చొని ఉన్నాడు.
“మా నాన్నగారు తనకున్నదంతా ఖర్చుపెట్టి నన్ను చదివించి మంచి ఉద్యోగం వచ్చే వరకూ నాకు అన్నివిధాలా అండగా ఉన్నారు. వారికి నేను ఒక్కర్తినే సంతానం అని మీకు తెలుసు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే, వృద్ధాప్యంలో వారికి పెన్షన్ తప్ప వేరే ఆదాయం ఉండదు. కనుక, నాకు వచ్చే జీతంలో వారికి సగభాగం ప్రతీ నెలా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను”
“అమ్మా నువ్వు మాకు ఏమీ ఇవ్వనక్కరలేదు. మేము ఇద్దరం బ్రతకడానికి నా పెన్షన్ డబ్బులు చాలు”
“మీరుండండి నాన్నగారూ, నేను నాకు కాబోయే అత్తమామలతో భర్తతో మాట్లాడుతున్నాను” అన్న --రష్మి తన సంభాషణ కొనసాగిస్తూ --
“అలా నేను ప్రతీ నెలా ఇచ్చేందుకు అంగీకరించిన వారే నా భర్త అత్త మామలు. అలా ఎవరూ అంగీకరించని పక్షాన నేను కన్యాగానే ఉండిపోవాలని నిర్ణయించుకునాను. ఇప్పుడు నా ఈ నిర్ణయానికి మీ ఆమోదం ఉందో లేదో తెలుస్తే, మిగతా మిషయాలు మాట్లాడతాను”
“మా కోడలుగా నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం లేనప్పుడు ఈ ప్రసక్తే ఉండదు కదా. మీరిద్దరి సమ్మతితో నువ్వు ఒకప్పుడు ఉద్యోగం చేసినా, అలా ఇవ్వడం ఎలా కుదురుతుంది? ఇదెక్కడ విడ్డూరం?” కామేశ్వరిగారి గొంతు ఖంగుమంది.
“ఎవరు అంగీకరించినా లేకున్నా నేను ఉద్యోగం చేయడం మానను”
రమేష్ కలగచేసుకొని, “అమ్మా, నా భార్య ఉద్యోగం చేయడం నాకు సమ్మతమే. పైగా అంకుల్ ఆంటీ గురించి రష్మి చెప్పినది కూడా సమంజసంగానే ఉందని నాకనిపిస్తోంది. కాబట్టి దయచేసి ఆమె నిర్ణయానికి అభ్యంతరం పెట్టకండి. ఏమంటారు నాన్నగారూ”
“నేను నీతో ఏకీభవిస్తున్నాను బాబూ. మీ అమ్మ పాతకాలం మనిషి. ఆమె మాటలను పట్టించుకోకు”
“అలా కాదు అంకుల్, ఆంటీ కూడా ఒప్పుకుంటేనే మనం ముందుకు ఆలోచిద్దాం. లేకపోతే, అనవసరమైన గొడవలతో కాపరాలు ఛిన్నాభిన్నం అవుతాయి” ముందుచూపుతో చెప్పింది రష్మి.
“నేను సర్వసాధారణమైనది మాట్లాడేను. అయినా, ‘అబ్బా అబ్బాయిలకు’ ఇష్టమైతే నాకెందుకు అభ్యంతరం. అమ్మాయి జీతంలో నాకేమీ ‘చిల్లి గవ్వ’ కూడా అక్కరలేదు” అని, కామేశ్వరిగారు తేల్చేసేరు.
“నా ఈ ఆలోచనకు మేరు అంగీకరించేరు కాబట్టి, నా నిర్ణయం ఇంకొకటి వివరిస్తాను ఇప్పుడు. రెండేసి పడకగడులుండే మూడు ఫ్లాట్లు ఒకే అపార్ట్మెంట్ లో ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుందాం”
రమేష్ కలగచేసుకొని “మాకు స్వంతంగా ఇప్పటికే ఉన్న పెద్ద ఫ్లాట్ లో నేను, నువ్వు, మా అమ్మా, నాన్నా అందరం కలిసి సులువుగా ఉండవచ్చు. అలాగే మీ అమ్మానాన్నలకి కూడా ఇది స్వంత ఫ్లాట్ కదా. ఇంకా మరి మూడు ఫ్లాట్ లు ఎందుకు”
“ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటికి ఈ మా ఇంటికి దూరం బాగానే ఉంది. మా అమ్మా నాన్నలలో ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, అదీ ఏదైనా అర్ధరాత్రి వస్తే, వారిని ఆదుకునేందుకు అప్పుడు ఎవరొస్తారు? అదే నేను వారికి అందుబాటులో ఉంటే, వారి అవసరానికి నేను వెంటనే పనికొస్తాను కదా”
“అలాంటప్పుడైనా, మరొక్క ఫ్లాట్ మాత్రమే మనం ఉండేచోట చూసుకుంటే సరి”
“మీకెవరికీ, కనీసం నీకు కూడా బోధపడలేదు కాబట్టి, నేనే సిగ్గు విడిచి చెప్తున్నాను. ఒక ఇంట్లో వయసులో ఉన్న భార్తాభర్తలు వారిద్దరు మాత్రమే ఉంటేనే కదా సమయాసమయాలలో సరసాలాడుకునేందుకు వారికి సౌలభ్యం కలిగేది. అలా కాకుండా పెద్దవారితో కలిసి ఉంటే, రాత్రి పూట మాత్రమే చేసే కాపురం కూడా ఏదో దొంగతనంగా చేసేటట్టుగా ఉంటుంది, అది నాకు అసహ్యం, చిరాకు. నేను అలాంటి కాపురం చేయలేను”
“అంటే అమ్మాయీ, నువ్వు రమేష్ తో వేరు కాపరం ఉండాలంటావు”
“మీరు చాలా తెలివిగలవారు ఆంటీ”
“పెళ్లి చూపులలోనే వేరు కుంపటి పెట్టే నీ తెలివి ముందర నా తెలివి ఏమాత్రం” కామేశ్వరిగారు కాస్తా వ్యంగ్యం జోడించేరు.
పరిస్థితి శృతి మించేటట్టుంది అనుకున్న కాంతారావుగారు కలగచేసుకొని రమేష్ తో ---
“బాబూ, అమ్మాయి ప్రస్తావనకు నీ సమాధానం ఏమిటి”
రెండు నిమిషాలక్కడ నిశ్శబ్దం తాండవించింది.
త్వరగా తేరుకున్న రమేష్ “నువ్వు కోరుకున్నట్టుగా మూడు ఫ్లాట్ లు ఒకే అపార్ట్మెంట్ లో దొరకొద్దూ?”
“ప్రయత్నం చేస్తే దొరక్కపోవు”
“అంటే, నీకు అమ్మాయి చెప్పినది ఇష్టమే ఏమిటిరా” కామేశ్వరిగారి ఆరా.
“అంతే కదా ఆంటీ” రష్మి విపులీకరించింది.
“ఇప్పటికే ఉన్న ఇంటిని ఏమి చేయాలి” రమేష్ సందేహం.
“ఉంచుకోగలిగితే అద్దెకిచ్చుకోవాలి, లేకపోతే అమ్మేయాలి” విశదీకరించింది రష్మి.
రష్మి సూచనలకు తమ అబ్బాయి రమేష్ కి పూర్తిగా సమ్మతం అని తెలిసొచ్చిన కాంతారావు కామేశ్వరి గార్లు కూడా ఆమోదం తెలిపి తమ పెద్దతనం నిలుపుకున్నారు.
“ఇంకా ఏమైనా మాట్లాడాలా అమ్మా?” కాంతారావు గారు అడిగేరు.
“అవును అంకుల్. ఇప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పాలి. అది కూడా మీకు అంగీకారమైతే, మనమంతా ఒక్కటే”
“అదే ముందు చెప్పవలసింది నువ్వు. పోనీలే ఇప్పుడైనా నీకు చెప్పాలనిపించింది, నయం. పూర్తిగా చెప్పు” కామేశ్వరిగారు మరొకసారి తన మనోగతం వ్యంగ్యంగా వెలిగక్కేరు.
“నాకు ఉదయం ఏడు గంటలకు ముందు లేవడం ఇష్టం ఉండదు. ఇంటినుంచే ఉద్యోగం చేస్తాను కాబట్టి నాకు సౌలభ్యంగా ఉండే బట్టలు మాత్రమే నేను ధరిస్తాను. పండగలు, పెళ్లిళ్ళు, పేరంటాలకు తప్పితే నేను చీరలు కట్టను, బంగారు ఆభరణాలు పెట్టుకోను. పాపిట్లో సింధూరం తప్పితే, బొట్టు కాటుక ధరించను. జుట్టు విరబోసుకొని ఉండడమే నాకిష్టం. జట అందులో పువ్వులు అవన్నీ పాతకాలం పద్దతులు, నాకు నచ్చవు. మెడలో మంగళసూత్రం తప్పితే, నా శరీరం మీద మరే బంగారు ఆభరణం ఉంచుకోను. చేతులకు ఎటువంటి గాజులు వేసుకోను. భర్తను పేరు పెట్టి పిలుస్తాను తప్పితే, ‘ఏమండీ’ అంటూ పిలవను. వంట మనిషిని పెట్టుకుంటాను తప్పించి, వంట చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నాకు ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను. ఎవరూ నాకు అందుకు అడ్డు చెప్పకూడదు. ఇందుకు మీ ముగ్గురిలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదంటే, రమేష్ కి భార్యగా రావడం నాకు ఇష్టమే. మీ సమాధానం ఇప్పుడు చెప్పినా సరే, లేక ఆలోచించుకొని ఒక వారం లోపల తెలియచేసీనా సరే”
“నువ్వేదో తెలివైనదానివి అనుకున్నాను కానీ, నీకు సామాన్య జ్ఞానం శూన్యం అమ్మా”
“అదేంటి అంకుల్ అలా అనేసేరు”
“లేకపోతే ఏమిటి. నువ్వు రమేష్ వేరుగా ఉంటే, ఆ ఇంట్లో నీకు నచ్చినట్టు ఉండక మాకు నచ్చినట్టు ఉంటావా”
“నిజమే, సారీ అంకుల్”
“ఇప్పుడు నువ్వు చెప్పిన నీ ప్రవర్తనకు ముఖ్యంగా అంగీకరించవలసినది రమేష్. వాడికి అంగీకారమైతే
ఆశీర్వదించడానికి మేము సిద్ధం”
“నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాన్నగారూ”
“బావగారూ, ‘మియా కాజీ రాజీ అయితే’ మధ్యలో మేమెవ్వరం వేరుగా మాట్లాడేందుకు. వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టి మాకు కబురు చేస్తే మేము పెళ్ళికి తరలి వస్తాం”
“చాలా సంతోషం బావగారూ, మరి చెల్లెమ్మ ఏమంటుందో”
“మీ చెల్లెమ్మ పతివ్రత బావగారూ”
కామేశ్వరిగారితో సహా అందరూ హాయిగా నవ్వుకున్నారు.
“అంకుల్, పెళ్లి మండపానికి పెద్దగా అలంకారం అంటూ, పెళ్లి భోజనాలలో బోలెడు పదార్ధాలు వడ్డించాలి అంటూ అనవసరమైన ఖర్చు పెట్టక మా పెళ్లి సింపుల్ గా జరిపించండి చాలు. ఏమంటావు రష్మీ”
“నా నోట్లో మాట నీ నోటి వెంట వచ్చిందంటాను రమేష్. పెళ్లి ఎంత సింపుల్ గా జరిగినా, శాస్త్రవిధిగా అన్ని ఆచారాలతో సాంప్రదాయబద్ధంగా జరగాలి నాన్నగారూ. అంతే కదా రమేష్”
“నువ్వు కూడా నేను అనాలనుకున్నదే అన్నావు రష్మి”
రష్మి సూచించినట్టుగా మూడు ఫ్లాట్లు ఒకే అపార్ట్మెంట్ లో సంపాదించుకొని వాటిలో అన్నీ హంగులు అమర్చుకున్న తరువతనే రష్మి రమేష్ ల వివాహం సింపుల్ గా జరిపించేరు, రంగారావుగారి దంపతులు.
రమేష్ రష్మిలు నూతన గృహంలోనే వారి కొత్త కాపరానికి ప్రారంభంగా గృహప్రవేశం చేసేరు. గృహప్రవేశం అయిన తరువాత ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోతూంటే –
“ఇగో కోడలు పిల్లా, ఇక నీ ఇంట్లో ఎలా ఉంటావో నీ ఇష్టం, నీకెవరూ అడ్డు రారు. మేము మీ అమ్మా నాన్నా కూడా ఎప్పుడేనా చుట్టపు చూపులా వచ్చి మీ ఇద్దరి ‘కుశలం’ కనుక్కుంటూ ఉంటాం. సరేనా” అంటూ, ఆఖరి అస్త్రం వదలి అందరి వదనాలలో నందనం విరిసేటట్టు చేసేరు.
సుమారు రెండు నెలల తదుపరి, ఒకరోజు రమేష్ రష్మి లు ఉండే ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది.
తలుపు తీసి, చెప్పా పెట్టకుండా వచ్చి ఎదురుగుండా నిలబడిన తల్లి తండ్రులను అత్తా మామలను చూసిన రష్మి లోపలున్న రమేష్ ని –
“ఏమండీ, ఎవరు వచ్చేరో చూడండి” అని పిలుస్తూ, పెద్దవారిని ఇంటి లోపలికి సాదరంగా ఆహ్వానించింది.
రష్మి రమేష్ ని అలా పిలవడం వారికి ఆశ్చర్యం కలిగించడమే కాక, ఎదురుగుండా --
నిండైన చీర కట్టుతో, బొట్టూ కాటుక పెట్టుకొని, పొడవాటి జటలో సుగంధ సుమాలు తురుముకొని, గాజుల గలగలలతో పట్టీల మువ్వల సవ్వడులతో –
రష్మి ఆకారం వారిని విస్మయానందాలలో ముంచేసింది.
వివాహమైన మరునాటి నుంచే అసంకల్పితంగా రష్మిలో ఈ మార్పు వచ్చింది అని తెలుసుకున్న పెద్దలు నలుగురూ –
మన భారతీయ వివాహ సమయమందు వధూవరుల
మేనులు మనసులు పెనవేసుకొనేటట్టుగా జరిగే ఆచార
వ్యవహారాలే బహుశా రష్మిలో వచ్చిన ఈ మార్పుకు
కారణమై ఉంటుంది

