జలియన్ వాలాబాగ్ .2. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

జలియన్ వాలాబాగ్ .2.

జలియన్ వాలాబాగ్ .2.

తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.

ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.

"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని." — (హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన)

అంతే గాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు.

భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్‌ను క్రింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరసిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు.

కొందరు బ్రిటిష్‌వారు, కొంత బ్రిటిష్ పత్రికారంగం డయ్యర్ కర్తవ్య నిరతిని మెచ్చుకొన్నారు కూడాను. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు - "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" - ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగా డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు.

1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం.

1982లో రిచర్డ్ అటెన్‌బరో సినిమా "గాంధీ"లో ఈ ఘటనను చిత్రీకరించారు. "రంగ్ దే బసంతి", "ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్" సినిమాలలో కూడా ఈ దృశ్యం చూపారు.

 

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్