కాశీ ప్రయాణ కథలు - బ్రహ్మదత్తుని నిర్ణయం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - bramhadattuni Nirnayam

కాశీ ప్రయాణ కథలు - బ్రహ్మదత్తుని నిర్ణయం.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

సోదరులారా ఈరోజు మీకు బ్రహ్మదత్తుని నిర్ణయం అనే కథ చెపుతాను వినండి అని శ్రీహరి కథ చెప్పడం ప్రారంభించాడు...

సింహపురి నివాసి అయిన బ్రహ్మదత్తుడు రత్నాల వ్యాపారి తను వ్యాపార నిమిత్తం పొరుగు దేశాలకు వెళుతున్నప్పుడు తన అంగడి తన ఏకైక కుమార్తె సుగుణవతికి అప్పగించి వెళుతుండేవాడు. విద్యముగించిన సుగుణవతి తండ్రితోపాటు రోజు అంగడిలో ఉండటం వలన వ్యాపార రహస్యాలు అన్ని తెలుసుకుంది.

ఒకరోజు బ్రహ్మదత్తుడు పొరుగు రాజ్యమైన అవంతిలో తను తెచ్చిన రత్నాలు అమ్మిగా వచ్చిన ధనాన్ని భద్రపరచుకుని వేకువనే సింహిపురి రాజ్యానికి బయలు దేరాడు ,అడవి మార్గంలో బ్రహహ్మదత్తుడు గుర్రంపై ప్రయాణం చేస్తుండగా తన వెనుక భాగాన ఎవరో యువకుడు గుర్రంపై తనను అనుసరించడం గమనించాడు. అలా కొంతసేపు అడవి మార్గంలో ప్రయాణంచేస్తుండగా కొందరు ముసుగు దొంగలు బ్రహ్మదత్తుని అడ్డుకున్నారు గుర్రందిగిన బ్రహ్మదత్తుడు తన నడుముకు ఉన్న కత్తిని తీసి వారితో పోరాడసాగాడు ,ఇదిగమనించిన అదే బాటలో వస్తున్న యువకుడు తన కత్తితో దొంగలపై యుధ్ధంచేయసాగాడు అతని ధాటికి తట్టుకోలేని దొంగలు అడవిలోనికిపారిపోయారు.

"నాయనా సమయానికివచ్చి ఆదుకున్నావు నీవెవరు నీపేరేమిటి "అన్నాడు బ్రహ్మదత్తుడు.

"అయ్యా నాపేరు గుణశేఖరుడు నాఅనేవారులేని నేను గురుకులంలో విద్యముగించి సింహపురి రాజ్యంలో ఏదైనా పనివెదుకుతూ బయలుదేరాను " అన్నాడు.

"నాయనా నాపేరు బ్రహ్మదత్తుడు నేను రత్నాల వ్యాపారిని పలు రాజ్యాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తుంటాను నువ్వు నాఅంగడిలో పనిచేద్దువుగాని బస,భోజనం నాఇంట్లోనే పద "అన్నాడు బ్రహ్మదత్తుడు.

కొద్దిరోజులలోనే వ్యాపార మెళకువలు అన్ని తెలుసుకున్నాడు గుణశేఖరుడు.అతని తెలివి తేటలకు అబ్బురపడిన బ్రహ్మదత్తుడు అతన్ని పొరుగుదేశాలకు పంపి రత్నాల వ్యాపారం చేయసాగాడు. గుణశేఖరుడు,బ్రహ్మదత్తుడు ఇరువురు పొరుగుదేశాలలో వ్యాపారం చేస్తుండేవారు,సంహపురిలో బ్రహ్మదత్తుని కుమార్తె తమ అంగడిలో వ్యాపారం నిర్వహిస్తు ఉండేది. ముగ్గురు సంపాదించడంతో అనతికాలంలోనే బ్రహ్మదత్తుడు సింహపురి ధనవంతులలో ఒకడిగా గుర్తింపుపొందాడు అలావచ్చిన ధనంతో వ్యవసాయ భూములు,పండ్లతోటలు కొనుగోలు చేసాడు.

గుణశేఖరునికి పలుమార్లు ధనం ఇవ్వబోయాడు బ్రహ్మదత్తుడు " ఇప్పుడు నాకు ధనమెందుకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను " అన్నాడు గుణశేఖరుడు.

కొద్దిరోజుల అనంతరం బ్రహ్మదత్తునివద్దకు వచ్చిన గుణశేఖరుడు "మీకు ఇష్టమైతే నేను సుగుణవతిని వివాహంచేసుకుంటాను " అన్నాడు.

"నాయనా సుగుణవతిని నీకు ఇచ్చి వివాహం జరిపించలేను ,మాఅక్కకుమారుడు సదానందుని సుగుణవతి బాల్యంనుండి ఇష్టపడుతుంది ఆమె వివాహం అతనితోనే త్వరలోనే జరిపిస్తాను " అని న్యాయంగా అతనికి రావలసిన ధనం రత్నాల రూపంలో చెల్లించి " వీటితో ఎక్కడైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు " అని గుణ శేఖరుని సాగనంపాడు.

"సోదరులారా వీరుడు,వ్యాపార దక్షత కలిగిన నమ్మకమైన గుణశేఖరుని కాదని సామాన్యుడైన సదానందుడికి తనకుమార్తెను ఇచ్చి ఎందుకు బ్రహ్మదత్తుడు నిర్ణయించాడో మీలో ఎవరైనా చెప్పగలరా? "అన్నాడు శ్రీహరి.

"ఇక్కడ వీరత్వం,ధనం,వ్యాపారం కాదు ముఖ్యం ,మానవసంబంధాలు, అతని కుమార్తె ప్రేమించినవాడు సదానందుడు కనుక బ్రహ్మదత్తుడు ఆనిర్ణయం తీసుకున్నాడు, ధనంతో ప్రేమ,అనురాగాలు కొనలేనివి, అయినా ఇంతధనం సంపాదించాక బ్రహ్మదత్తునికి ధనంపై ఆశ ఉండదు తన కుమార్తె సుఖం,సంతోషమే అతనికిముఖ్యం అందుకే ఆనిర్ణయం తీసుకున్నాడు,ఇక్కడ గుణశేఖరుడు రత్నాలవ్యాపరంలో అనుభవం గడించాడుకనుకనే అతనికి ధనం బదులు రత్నాలు ఇచ్చాడు బ్రహ్మదత్తుడు ఆరత్నాలతో ఏరాజ్యంలోనైనా వ్యాపారిగా స్ధిరపడి నచ్చిన కన్యను వివాహమాడి సుఖంగా జీవించవచ్చు ఆవిధంగా గుణశేఖరుడికి న్యాయం చేసిన బ్రహ్మదత్తుని నిర్ణయం సరైనదే "అన్నది శ్రీలక్ష్శి.

కథ ముగియడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు.