ప్రాచీన సాహిత్యంలో జానపదం - తోకల రాజేశం

Pracheena sahityam lo janapadam

ప్రాచీన సాహిత్యంలో జానపదం ఏ మానవ సమూహంలోనైనా జానపద సాహిత్యమే ముందు వెలువడుతుంది. ఆ తర్వాతనే శిష్ట సాహిత్యం లేదా మార్గ సాహిత్యం పుడుతుంది. ఎందుకంటే జానపద సాహిత్యానికి చదువుతో పనిలేదు. పండిత సాహిత్యంలో వలె రకరకాల నియమ నిబంధనలతో పనిలేదు. ఆశువుగా తన ఆర్తినీ, అనుభవాలనూ అల్లుకుంటూ వెళ్లడమే.

ప్రజల నోళ్ళలో రోజు నలిగిపోయే పదాలే జానపద గేయాల్లో, కథల్లో చేరి రెట్టింపు అందంతో దర్శనమిస్తాయి. లిపి పుట్టక ముందు, భాషకు స్థిరమైన రూపం ఏర్పడకముందు ఈ జానపద సాహిత్యమే ప్రజల శ్రమజీవితానికి తోడు నీడగా నిలిచింది. ఇదేవిధంగా జానపద కళారూపాలు కూడా. ఏదో ఒకరకమైన కళారూపం లేకుండా విశ్రాంతి సమయం గడవదు. ఆయా భౌగోళిక పరిస్థితులను అనుసరించి కళారూపాలలో మార్పులు ఉన్నప్పటికీ ఏదోరకమైన కళారూపాలు మాత్రం ఉండి తీరుతాయి.కాబట్టి తెలుగు సాహిత్యం నన్నయతో మొదలైనా పాల్కురికి సోమనతో మొదలైనా దానికి ముందు నుంచే జానపద సాహిత్యం,జానపద కళలు, కళాకారులు ఉన్నారనేది స్పష్టం. మనకు అందుబాటులో ఉన్నంత వరకు తెలుగు ప్రాంతం నుంచి లభించిన మొట్టమొదటి ప్రాచీన గ్రంథం'గాధా సప్తశతి'.దాదాపు రెండువేల ఏళ్ల నాటిది.అది ప్రాకృత గ్రంథం. కానీ దానిని సంకలనం చేసిన రాజకవి హాలుడు తెలుగువాడని చరిత్ర పరిశోధకులు నిర్ణయించారు.బహుశా!అందులో వ్యక్తమైనది కూడా తెలుగు వారి జీవితమే.దానిలో చాలా తెలుగు పదాలున్నాయి.

ఈ గాధలలో అనేకచోట్ల జానపద సాహిత్య ప్రస్తావన ఉంది.గాధాసప్తశతిలోని 7 వ శతకంలోని 89 వ గాధలో-'కోరిక తీరినట్లుగా పంట పండింది. దంచిన కొత్తబియ్యపు పిండిని ఆరబోసినట్లుగా ఉన్న శరత్కాలపు వెన్నెల రాత్రిలో ఆనందంతో రైతు గొంతువిప్పి పాట పడుతున్నాడు'అని ఉంది. ఇదే శతకంలోని 42 వ గాధలో పెళ్ళిపాటల ప్రస్తావన వస్తుంది.ఆనాటి జానపదులు పాడుకున్న పాటలు జానపదాలు కాకుండా మరేమవుతాయి? అంటే ఆనాటికే జానపద గేయాలు ఉండి ఉంటాయని అర్థమవుతుంది. కానీ అవి అక్షరబద్ధం కాకపోవడం వల్ల ఇప్పుడవేమిటో మనకు స్పష్టంగా తెలియదు. గాధాసప్తశతిలో ఆనాటి నాటకాల ప్రస్తావన కూడా ఉంది.

సురవరం ప్రతాపరెడ్డి గారొక వ్యాసంలో వాటిని-'జన సామాన్యానికాహ్లాదమునిచ్చునవి ప్రాకృత నాటకాలై యుండు'నన్నాడు.అలాగే దీనిలో వివిధ రకాల సంగీత వాద్యాల ప్రస్తావనను బట్టి ఆనాటి జానపద సంగీతం స్థితిని,స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ఒకటవ శతాబ్దంలో గుణాఢ్యుడు బృహత్కథను రాసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దానిని"జానపదులు చెప్పుకొనెడు వచన కథలను,పాడుకొనెడు గేయకథలను ఆధారముగా చేసుకొని గుణాఢ్యుడు బృహత్కథను రాసియుండున"న్నాడు తంగిరాల వెంకట సుబ్బారావు(తెలుగులో వీర గాధా కవిత్వము, పుట:77). సాహిత్యంలో రెండు స్పష్టమైన మార్గాలున్నాయి. ఒకటి దేశీ సాహిత్యం. రెండోది మార్గ సాహిత్యం.జానపద సాహిత్యం దేశీ సాహిత్యానికి మాతృక. అయినప్పటికీ మార్గ సాహిత్యంలో కూడా జానపద సాహిత్య, సంగీత,కళల ప్రస్తావన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాచీన కాలంలోని కవులయినా సరే వారి అనుభవాలను కవిత్వంలో ప్రతిఫలించకుండా ఉండలేరు.ఎవరైనా తెలిసిన విషయాన్నే రాస్తారు కానీ తెలియని దాన్ని రాయటం సాధ్యం కాదు.ఈ క్రమంలోనే నన్నయ తాను అనువాదం చేసిన 'ఆంధ్ర మహాభారతం'లో మూలంలో లేని నాగీ గీతాలను పేర్కొన్నాడు. భారతంలో ఆదిపర్వంలో ఉలూచి తన నాగలోకానికి అర్జునుని తీసుకెళ్లి అతనితో మాట్లాడుతున్న సందర్భంగా రాసిన పద్యంలో వీటిని పేర్కొన్నాడు. కం:నే గుణములు తొల్లియ నా గీ గీతములందు విని తగిలి యిపుడు మనో రాగమున జూడగంటిని భాగీరథియందు నిన్ను పరహిత చరితా! (భారతం-ఆదిపర్వం-8-131) నన్నయ కాలానికి అట్లాంటి గీతాలు ఉన్నాయి కాబట్టే మూలంలో లేకున్నా వాటిని ప్రస్తావించాడు."ఉదాత్త రసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కు సూచితి"నన్న ఉటంకింపును బట్టి నన్నయ కాలానికే తెలుగునాట నాటకాలున్నాయని తెలుస్తుంది. బహుశా ఆనాటి నాటకాలు జానపద నాటకాలే అయ్యి ఉంటాయి.

నన్నెచోడుడు తన 'కుమార సంభవం'కావ్యంలో సందర్భానుసారంగా రకరకాల గీతాలను పేర్కొన్నాడు. సీ:లీలనీశ్వరు నంకమాలికల్ వాడుచో గీత బేధంబుల రీతులెరిగి.....పార్వతి శివుణ్ణి స్తుతించినట్టు చెప్పాడు .ఇందులోని గీత బేధాల ప్రస్తావనను బట్టి ఆనాడు ఎన్నోరకాల గీతాలను పాడుకునేవారని తెలుస్తుంది."శివ పార్వతీ వివాహ సమయంలో స్త్రీలు అంకమాలికలు,సాహుళి, ఫలమంజరము,పౌరాళి, ఆందోళి భైరవి, నాట రాగాలలో పాడి హారతులిచినట్టు కుమార సంభవంలో చెప్పబడింది"అన్నారు డా:మంత్రవాది గీతాగాయత్రి(కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు-ఒక పరిశీలన).ఇందులో పేర్కొన్నవి దేశీ రాగాలే. ఈ విషయాన్ని మాతంగుడు తన 'బృహద్దేశి' లో చెప్పాడని డా:అల్లాడి వైదేహి గారు తన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" అనే గ్రంథంలో పేర్కొన్నారు. "జీరిక కళ్లు ద్రావి మద సింధుర గామినులన్ని కేరియల్ వారుచు గౌడు గీతములు వాడుచు బొల్పుగ....అంటూ "గౌడు గీతాలు", "పటికపు రోల ముల్వెదురు బ్రాలొగి బోయుచు గౌరుకొమ్ము రో కటగొని దంచుచుం శబర కామని వెక్కులు రాగముల్ రసో త్కటముగ బాడె" అంటూ "రోకటి పాటలు(దంపుడు పాటలు)", "......................... గ్రాలుచు నవపాల బాలికలు నవలతికాం దోలముల వేడ్క సలుపుచు నాలతలొగి జేసి పాడిరభినవ లీలన్"-అంటూ ఊయల పాటలను, "కలయన్ కిన్నెర గీతి గూడ మృదురేఖంబాడు మత్తాళి" అంటూ కిన్నెర గీతాలను పేర్కొన్నాడు నన్నె చోడుడు.చాళుక్య రాజుల కాలంలో ప్రజలు ఊయల పాటలను, గౌడు గీతాలను పాడుకునేవారని 'అభిలషితార్థ చింతామణి'లో ప్రస్తావించబడినది.జానపదుల సంస్కృతిని ప్రధాన స్రవంతి సాహిత్యంలో తరువాతి కాలంలోని పాల్కురికి సోమనలాగా అద్భుతంగా పలికించిన కవి నన్నె చోడుడు. తెలుగు సాహిత్య చరిత్రలో మిగిలిన కవులకంటే విస్తృతంగా, విపులంగా జానపదుల గేయాలను, ఆచార వ్యవహారాలను తదితర అంశాలను పేర్కొన్న కవి పాల్కురికి సోమనాథుడు. ఈయన రచనలను తెలుగు విజ్ఞాన సర్వస్వాలని చెప్పేది ఇందుకే.'బసవపురాణం'లో- " మేటియై చను భక్త కూటువలందు పాటలుగాగట్టి పాడెడు వారు ప్రస్తుతోక్తుల గద్యపద్య కావ్యముల విస్తారముగజేసి వినుతించు వారు ...................................................

మునుమాడి వారు వీరననేల కూడి కనుగొన రోళ్ల రోకళ్ల బాడెదరు"-అంటూ ఆనాటి భక్త బృందాలు అలాగే అమ్మలక్కలు పాడుకునే తీరును వర్ణిస్తాడు పాల్కురికి సోమన.నిన్న మొన్నటి వరకు రోకటి పాటలు తెలుగునాట వినపడుతూనే ఉండేవి. శ్రమను మరిచిపోవటానికి రోకటి పాటలు రోకటి పోటుకు అనుగుణంగా లయబద్ధంగా సాగుతుండేవి.ఇదే సోమన తన "పండితారాధ్య చరిత్ర"లో భక్తులు శివపూజ చేస్తున్న సందర్భంగా పాడే పాటల గురించి విపులంగా రాసాడు. మదినుబ్బి సంసార మాయాస్తవంబు పదములు తుమ్మెద పదముల్ ప్రభాత పదములు పర్వత పదములానంద పదములు శంకర పదముల్ నివాళి ....................................................అంటూ 'తుమ్మెద పదాలు','ప్రభాత పదాలు','పర్వత పదాలు,''నివాళి పదాలు,''గొబ్బి పదాలు'',వెన్నెల పదాలు,''సంజ వర్ణన పదాలు,''గుణవర్ణన పదాలు'మొదలైన వాటిని పేర్కొన్నాడు. ఇవన్నీ ఆనాటి జానపద గేయాలే. సోమన తన రచనలకు ఆధారంగా"ఆతత బసవపురాతన భక్త గీతార్థ సమితియే మాతృక గాగ"అని చెప్పుకున్నాడంటే ఆనాడు భక్త బృందాలు పాడుకునే పాటల పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ, గౌరవం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదేక్రమంలో ....... " అటుగాక సాంగ భాషాంగ క్రియాంగ పటునాటకంబుల నటియించు వారు" అంటూ 'బసవపురాణం' లో ఆనాటి జానపదుల నాటకాలను ప్రస్తావించాడు.

అలాగే బసవని పెళ్లి సందర్భంగా ప్రదర్శించిన కళారూపాలను వర్ణిస్తూ పేరిణీ నృత్యాన్ని, కోలాటాన్ని,గొండ్లిని ప్రస్తావనకు తెచ్చాడు.ఇవన్నీ దేశీయ కళారూపాలే."పండితారాధ్య చరిత్ర" పర్వత ప్రకరణం లో కూడా తనకాలం నాటి రకరకాల జానపద నృత్యాలను విశేషంగా వర్ణించాడు.దీనిలోనే శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కళాకారులు ప్రదర్శించే కళారూపాలను పేర్కొన్నాడు. " నాగట గంధర్వ యక్ష విద్యాధ రాదులై పాడెడునాడెడు వారు విధమున బ్రచ్ఛన్న వేషముల్ దాల్చి యధికోత్సవము గులుకాడినట్లాడు" అంటూ యక్ష గానాలను,తోలు బొమ్మలాటల్ని,జంతు నృత్య విన్యాసాలను ఒకటేమిటి రెండేమిటి ఆనాటి సమస్త కళారూపాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు పాల్కురికి. తరువాత కాలంలో తిక్కన తన భారతంలోని విరాట పర్వంలో ప్రేరణం, దండలాసకం,కుండలి,ప్రెక్కణం లాంటి దేశీయ నాట్యాలను పేర్కొన్నాడు.విరాట పర్వంతో పాటు ఉద్యోగపర్వం లో కూడా నాట్య ప్రసక్తి, నాటక ప్రసక్తి ఉన్నాయి. ' ఉత్తర హరివంశం' రాసిన నాచన సోమనాథుడు"వసంత విలాసం" అనే ఏకాశ్వాస ప్రబంధాన్ని రచించినట్లు కొందరు లక్షణగ్రంధకర్తలు చెప్పారు. వారిలో కొందరు వసంత విలాసం లోనిదే అని ఈ జాజర పాటను ఉదహరించారు.

వీణాగానం వెన్నెల తేట రాణమీరగ రమణుల పాట ప్రాణమైన పినబ్రాహ్మణ వీట జాణలు మెత్తురు జాజర పాట. తన హరివంశం లో బొమ్మలాటను ప్రస్తావిస్తూ యంత్రకుడాడించి యవనిద్రోచిన వ్రాలు బొమ్మలగతి రథపూగములును.... అని అంటాడు. అయితే ఈ బొమ్మలాటల్ని "ప్రతిమలనాడగ బట్టిన యట్లు" అంటూ శ్రీనాథుడు 'పల్నాటి వీర చరిత్ర'లో ఉపమాన పూర్వకంగా ప్రస్తావిస్తాడు. పాల్కురికి సోమన 'పండితారాధ్య చరిత్ర'లో..... "భారతాది కథల చీర మరుగుల నారంగ బొమ్మలనాడించు వారు కడునద్భుతంబుగ కంబ సూత్రంబు లడరంగబొమ్మలనాడించు వారు" .......అంటూ శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలలో తోలుబొమ్మలాటలను కన్నులకు కట్టిస్తాడు.యిదే ఉత్సవాల్లో .... " ......లాలితాంగ రసకళా రేఖ లలవడ బహురూపమాడెడు వారు" అంటూ బహురూపుల కళాకారులను పరిచయం చేస్తాడు. అయితే ముందు చెప్పిన ఈ జాజర పాటలు తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ."జాజర జాజిరీ అను పల్లవితో తెలంగాణ మందు నేటికిని సేద్యము చేయునప్పుడు కూలీలు కొన్ని తావులందు పాడుచున్నట్లు తెలియవచ్చింది"అన్నాడు సురవరం ప్రతాపరెడ్డి.

అన్నమాచార్యులు కూడా "మొల్లలు దురుమల ముడిచిన బరువున మొల్లపు సరసపు మరిపము నా జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లేరతివలు జాజర".......అంటూ జాజర పాటను సంకీర్తనగా రచించిన సంగతి అందరికీ తెలిసిందే.శ్రీనాథ మహాకవి కూడా 'భీమేశ్వర పురాణం'లో జాజర పాటను పేర్కొన్నాడు. "జాదర జాదరించు మృదుచర్చరి గీతులు వారుణీ రసా స్వాదమదాతిరేకముల చంద్రిక కాయగ దక్ష వాటికా వేదుల మీదటన్ కనక వీణలు మీటుచు పాడిరచ్చరల్ మోదమెలర్పగా భువనమోహన విగ్రహు భీమనాథునిన్" 'శబ్ధ రత్నాకరం'ప్రకారం జాజర మరియు జాదర అనే పదాలు పర్యాయ పదాలు.అదే కావ్యంలో శ్రీనాథుడు కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి .....అంటూ వ్యాసుడు దక్షారామములో ప్రవేశించు సందర్భంగా నగర వర్ణనలో భాగంగా యక్షగాన ప్రస్తావన తెస్తాడు.తన' శివరాత్రి మహాత్మ్యం'అనే కావ్యంలో - వేడ్క నృత్యంబులాడిరి వీధులందు పాడి రెత్తిలి పీక కూహూ పంచమమున పంజళంబున ధవళ ప్రబంధ గీత కముల నవ్వేళ కర్ణాట కమల ముఖులు.....ఆడిపాడిన స్త్రీలను వర్ణించాడు. ఇందులోని " 'ఎత్తిలి'అనునది ఒకవిధమగు దేశీగానమని తోస్తున్నది" అన్నాడు సురవరం ప్రతాపరెడ్డి. అయితే ధవళ గీతాలను మంగళకర గీతాలన్నాడు ఎస్వీ. జోగారావు.

అన్నమయ్య తన కీర్తనలలో ధవళ గీతాలు కూడా రాసాడని కొందరంటారు.అయితే పై పద్యం రాసే కంటే ముందే శ్రీనాథుడు తన 'కాశీఖండం'లో 'పంజళము' ను " పాడి మెప్పించెనొక యింతి పంజళమున" అంటూ ప్రస్తావించాడు.సందర్భానుసారంగా పైన చెప్పిన మూడు కావ్యాలలోనూ ఆనాటికి తన అనుభవంలో ఉన్న జానపద గేయ రీతులు,నృత్య రీతులు, ఆచార వ్యవహారాలను స్వభావోక్తి సుందరంగా వర్ణించాడు.

శ్రీనాథుడు రాసిన పల్నాటి వీర చరిత్రను ఆనాటి' పిచ్చుకుంటుల 'అనే కళాకారులు ప్రజలకు చెప్తుండేవారు.అందుకే శ్రీహరి ఆదిశేషువు గారు శ్రీనాథున్ని' జానపద కవి' అన్నాడు. 14 వ శతాబ్దంలో వెలువడిన 'క్రీడాభిరామం' కాకతీయుల కాలంనాటి తెలుగు ప్రజల సాంఘిక జీవితాన్ని అద్భుతంగా వివరించింది. దాదాపు పది పద్యాలలో పల్నాటి వీరుల కథ చెప్పబడింది. ఆ కథ ఉన్న ద్విపదలను పాడుతున్న కళాకారుల వర్ణన ఉంది. ఈ వీధి రూపకం ఆనాటి కళల గురించి, కళాకారుల గురించి దృశ్యమానం చేయిస్తుంది.ఓరుగల్లు లోని ఏకవీరాదేవి బవనీలు, మాదిగ స్త్రీలు గానం చేసే విధానం గురించి.... "వాద్య వైఖరి కడు వెరవాది యనగ ఏక వీరాదేవి యెదుట నిలిచి పరశురాముని కథలెల్ల ప్రౌఢి పాడె చారుతర కీర్తి బవనీల చక్రవర్తి " అని చెప్తాడు వినుకొండ వల్లభరాయుడు.ఆ దేవతను పూజిస్తున్న ప్రజలను,వారి సంగీత వాద్య విశేషాలతో సహా కింది పద్యంలో వర్ణించాడు. "అకలంక స్థితి గోరి కొల్చెదరు బ్రహ్మానంద భావంబునన్ సకలానందమయైక మాతలగుచున్ సంతోషచిత్తంబునన్ తకదుమ్ముల్ యకతాళముల్ జవనికల్ తందానలమ్మయ్యకున్ ఎకవీరమ్మకు మాహురమ్మకు నధోహ్రీంకార మధ్యాత్మకున్" ఆయా సందర్భాలలో జానపద కళల్ని కూడా పేర్కొన్నాడు వల్లభరాయడు.గొరగ నృత్యాన్ని, హల్లీసక నృత్యాన్ని ప్రస్తావించాడు.జక్కుల పురంధ్రి కామవల్లీ కథను గానం చేసే పద్ధతి కూడా క్రీడాభిరామంలో వర్ణించబడింది.

భక్తకవి పోతన కూడా తన భాగవతంలో సందర్భానుసారంగా వివిధ రకాల పాటలను పేర్కొన్నాడు.కింది పద్యంలో గోవిందు పాటల ప్రసక్తి తెచ్చాడు. చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీది పాటలు దయతో నాడుడు హరిభక్తుల కథ లేడహములలోన ముక్తికేగగ నిచటన్ శ్రీకృష్ణుని బాల్యంలో యశోద పాడే పాటలను గురించి చెప్తాడు పోతన. జోల పాటలు అనే పేరు వాడలేదు కానీ అవి కచ్చితంగా జోలపాటలే అయి ఉంటాయి. "బాలునంకించి పాడెడి పాట వలన దరువులిగురొత్త బెరుగింత దరువజొచ్చె". ఇదే క్రమంలో..... సీ: స్వరమండలంబును జంత్రంబు నొకవేళ నింపుమీరంగ వాయించుచుంద్రు కిన్నెర వీణెయు గేలిమై నొకవేళ ముట్టిచూతురు జగన్మోహనముగ సొంపు దండెలు శృతిగూర్చి యొకవేళ పదములు జిందులు బాడుకొంద్రు గీతప్రబంధముల్ కేళిజిక్కిని పంతు లనుకొందురొకవేళ మనములలర తే : నార్య వృత్తంబులును జూర్ణికావళియును మంజరులు ద్విపదలును సమంజసముగ జదువుకొనుచుందు రొకవేళ సరస లీల.....అంటూ పెదపాటి ఎర్రనార్యుడు 'మల్హన చరిత్ర'లో పుష్పగంధులు' పదములు','చిందులు','గీత ప్రబంధములు' శ్రుతిగూర్చి పాడుకొంటారని,అలాగే 'మంజరులు'',ద్విపదలు','చూర్ణికలు' చదువుకుంటారని తెలిపాడు.

'శుక సప్తతి' అనే కావ్యంలో సువ్వి పాటలు, శోభనములు,గొబ్బి పాటలు, ధవళములు,జోల పాటలు, ఏల పాటలు ,బాపనమ్మ పాటలు, దూది పాటలు ఆయా సందర్భాలకు అనుగుణంగా వర్ణించబడినాయి.ఈ కావ్యాన్ని పాలవేకరి కదరీపతి రాసాడు. క:ఆ లలనామణి కాగ య్యాళినొకానొక్క వేళనక్కరతో సు వ్వాలున్శోభనములు ధవ ళాలున్మొదలైన పాటలందగ నేర్పున్ .....అంటూ శుభవతి అనే స్త్రీకి మంత్రసాని పాటలు నేర్పే సందర్భంగా వాటిని పేర్కొన్నాడు. కొరవి గోపరాజు తన 'సింహాసన ద్వాత్రంశిక'లో అంతవరకు ఎవరూ పేర్కొనని 'వెన్నెల గుడి పాటల'ను చెప్పాడు సీ:"పనిజేసి గంజియైననునంబలైనను నెనచల్లగాద్రాగి యెచటనైన బడియుండి వెన్నెల గుడిపాట వాడగా పేదలకాత్మ సంప్రీతి గలుగు"నంటూ చెప్తాడు. ' విజయనగరం' రాజుల కాలంలో 'ఎరుక'చెప్పే కళాకారులకు ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండేవి. దానిని ప్రతిబింబిస్తూ రాయలు ఎరుకల వారిని తన 'ఆముక్తమాల్యద' లో వర్ణించాడు. రామరాజ భూషణుడు 'వసు చరిత్ర'లో గిరిక బాల్యాన్ని వర్ణిస్తున్న సందర్భంగా జోల పాటను ప్రస్తావించాడు. గొనబు పాటల్ని కూడా అదే కావ్యంలో చెప్పాడు. శబ్ధ రత్నాకరం ప్రకారం గొనబు అంటే మనోజ్ఞమైనది అని అర్థం. పింగళి సూరన 'కళాపూర్ణోదయ'కావ్యంలో మధుర లాలసను నిద్ర పుచ్చుతున్న సందర్భంలో జోల పాటలను- చ:పొలుపుగ దన్నువే నిదురపుచ్చుటకై తమతల్లి పైడి యు య్యలనిడి యూచుచో గువలయాధిపు పాటలు పాడినంగరం బలరుచు గేరి కేరినను నన్యుల పాటలు పాడి......అంటూ చంద్రుని పాటలు పాడారట. అదే "కళా పూర్ణోదయం"లో పింగళి సూరన 'గ్రామ విశేష మూర్చనలేరు పడ మంద్ర మధ్యమ తార సామాగ్రి దనర ధాతుమాతువులు గీత ప్రబంధములందు నసమాన లీలమైనతిశయిల్ల' అంటూ పల్లె పాటలను ప్రస్తావిస్తాడు.అలాగే జాంబవతి వీణను వాయిస్తూ పాడిన సందర్భంగా పల్లె పాటలను,మధుర లాలస-కళా పూర్ణుల వివాహ ఘట్టాన్ని వర్ణించే సందర్భంగా పెళ్లిపాటల్ని సుందరంగా వర్ణించాడు. ఇదేకవి తన ఇంకోకావ్యం 'ప్రభావతీ ప్రద్యుమ్నము'అనే కావ్యంలో "నానా తాళములు యధోక్త స్ఫూర్తి బరగువేలాది ప్రబంధ చయము" అంటూ ఏల పాటల్ని పేర్కొన్నాడు. "యక్షులు వీరలో యతివ!మేళము గూడి పాడుచుండెదరు దిక్పాలసభల" అంటూ నంది తిమ్మన 'పారిజాతాపహరణం'లో యక్షజాతి ప్రజలు మేళములు(గుంపులు) గట్టి పాడుకునే విధానాన్ని కళ్ళకు కడతాడు. తంజావూరు నాయకరాజుల కాలం యక్షగానాలకు సువర్ణ యుగమని అందరికీ తెలిసిన సత్యమే. రఘునాథ నాయకుడు,ఆయన కొడుకు విజయరాఘవ నాయకుడు కవిపండితులతో యక్షగానాలు రాయించటమే కాకుండా స్వయంగా అనేక యక్షగానాలు రచించి వాటిని ప్రదర్శింపజేసిన కళా పోషకులు.రఘునాథ నాయకుని ఆస్థాన కవి అయిన చేమకూర వేంకట కవి తన'విజయ విలాసం'లో చాలా సందర్భాల్లో' 'ధవళములను' పేర్కొన్నాడు.

కవి వాడిన సందర్భాలను గమనిస్తే అవి మంగళ గీతాలన్న సంగతి అర్థమవుతుంది.సుభద్రకు అర్జునునికి వివాహం జరుగుతున్న సందర్భంగా ముత్తైదువులకు ఐరేణి పాటలు పాడుతూ ఐరేణి కుండలు తెచ్చారని వర్ణించాడు. "ఐరేణి గొనివచ్చిరైదువుల్ పాటలు పాడుచు శుభవేళ వేడుకల"....తెలుగునాట ఈనాటికీ ఈ పాటలు పెళ్ళి సందర్భంగా పెద్దమనుషులు పాడటం అక్కడక్కడా గమనించవచ్చు. అయ్యలరాజు నారాయణామాత్యుడు తన 'హంస వింశతి'లో ... బారుండమును శుద్ధపద్ధతి బహురూప లక్షణంబును దండలాసకంబు ప్రేంఖన పద్ధతి ప్రేరణ పద్ధతి కుండలీ నృత్తంబు భాండకంబు రాసకాఖ్యము నాట రాసకంబునుజిత్ర పద్ధతియును టేశ్య పద్ధతియును జర్చరీకందుక చానరి కోలాట ములునాగ దగుపేళ్ల గలుగునట్టి.... అంటూ రకరకాల నాట్య బేధాలను పేర్కొన్నాడు. ఈ విధంగా ప్రాచీన సాహిత్యంలో కవులు తమ కాలంలో విరివిగా ప్రచారంలో ఉన్న ఆనాటి జానపద కళారూపాలను, కళాకారులను,గేయసంపదను సందర్భాలను సృష్టించుకొని మరీ తమ కావ్యాల్లో పొందుపరిచారు. నిజానికి ఈ జానపద సాహిత్యాధారాల వల్లనే సురవరం ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు సాంఘిక చరిత్రలు రాయగలిగారు.