"నాదు రూపంబు మనంబున జిక్కిన తరుణి దక్కోరునేలసరకుసేయు?
నాదు లావణ్యంబునకు నిచ్చమెచ్చిన ఎలనాగ పైబడ కేలనిలుచు?..."
అంటూ రాగయుక్తంగా పద్యాన్ని అద్దంలో చూసుకుంటూ ఆలపిస్తూతనలో తానే మురిసిపోతున్నాడు శ్రీనివాసు.
మళ్ళీ ఇంకోసారి అందుకోబోతుండగా,భుజంపై ఏదో చెయ్యి పడేసరికి,వెనక్కి తిరిగి చూసాడు - భార్య లలిత.
"నర్తనశాలలో ద్రౌపది కోసం ఎదురుచూస్తూ, కీచకుడు తన అందాన్నితాను పొగుడుకుంటున్నాడు. కీచకుడు దుర్మార్గుడైనాఅందగాడన్నమాట. తిక్కన గారు ఎంత అద్భుతంగా రాసారో! ఒక్కసారి ఈ పద్యం విను" అంటూ లలితను దగ్గరకు తీసుకున్నాడు శ్రీనివాసు.
"నో!నో! ఏదొ రెండు రోజులు సెలవులొచ్చాయి కాస్త రిలాక్స్అవుదామనుకొంటే, ఈ గోలేమిటి నాకు? అయినా, ఎన్నిసార్లు పాడినా అదే గొంతు కదా!" అంటూ లలిత చెవులు మూసుకుంది,
"అలా అనకే బాబు. ఓర్లాండో తెలుగు అసోషియేషన్ ఉగాదివేడుకలకి మేము వేసే కీచకవధ నాటకానికి ఇంక రెండు వారాలసమయం మాత్రమే ఉంది. మా దర్శకుడు అసలే చండశాసనుడు.ఒక పట్టాన టేక్ ఒకే చెయ్యడు. ప్లీజ్ ఒక్కసారి విని నువ్వు ‘ఒకే’ చెప్పవూ!”అంటూ గోముగా అడిగాడు శ్రీనివాసు.
"ఇప్పుడు కుదరదు. అవతల బోలెడు వంట ఉంది. నీకేం, హాయిగా మొక్కల్లో పుణుక్కుంటావు. ఏదో పెద్ద నువ్వొక్కడివే మొక్కల్ని పెంచుతున్నట్లు.
రా! కూరలు తరగాలి" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది లలిత.
శ్రీనివాసు లలిత ఇండియా వదలి యుఎస్ వచ్చి ముప్ఫై సంవత్సరాలైంది.భార్యాభర్తలిద్దరూ ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు.లలిత ఉన్నవూళ్ళోనే పనిచేస్తుంటే శ్రీనివాసు మాత్రం వారానికి మూడు రోజులు వేరే ప్రాంతంలో పనిచేస్తూ ఉంటాడు.వీకెండులో ఒకరోజు భార్యాభర్తలిద్దరూ కలసి వారానికి సరిపడా భోజనం వండుతారు. వీరికి ఒకే కొడుకు. తను భార్యతోకలసి వేరే ఊళ్ళో ఉంటాడు.
*************************
"లలితా! మామిడి చెట్టుక్రింద చిన్న చిన్న పాట్స్ లో చిక్కుడు విత్తనాలు పాతాను. రేపు కనుక వర్షం రాకపోతే కొద్దిగా వాటర్ పొయ్యవా"అంటూ అడిగాడు శ్రీనివాసు, పనిచేసే ఊరెళ్ళడానికి కారు ఎక్కుతూ.
"నీ గార్డెనింగు నా ప్రాణానికొచ్చినట్టుగా ఉంది. పోస్తాలే బాబు . అన్నీపెట్టుకున్నావా?లేదా? మళ్ళీ సగం దూరం వెళ్ళాకా వెనక్కొస్తావు"అంటూ కారు డోరు తీసి, అన్నీ పెట్టుకున్నాడో లేదో ఒకసారి చూసి శ్రీనివాసుని సాగనంపింది లలిత.
**************************************************
ఒకరోజు ఆఫీసులో "ఇతను సిద్దార్థ, డాటా టీములో ఈరోజే జాయిన్అయ్యాడు" అంటూ సుమారు పాతిక నుంచి 30 సంవత్సరాలలోపున్న ఒక యువకుడిని శ్రీనివాసుకు పరిచయం చేసాడు వాళ్ళ డైరక్టర్ ఫిలిప్.
యుఎస్ కి రీసెంటుగా వచ్చుంటాడనుకుంటూ అనుకుంటూ అతనికి షేక్ హేండ్ఇచ్చాడు శ్రీనివాసు.
శ్రీనివాసుకి అప్పుడప్పుడు బ్రేక్ రూములో సిద్దార్థ కనిపించినప్పుడల్లామట్లాడుతూ ఉండేవాడు. మాటల్లో తెలిసింది అతనుతెలుగువాడని. చాలా కలుపుగోరు మనిషి. ఐపీల్ క్రికెట్ నుంచిఅమెరికా అధ్యక్షుడి నిర్ణయాలవల్ల పడుతున్న వీసా కష్టాల వరకు అన్నీ మాట్లాడుతాడు.
ఒకరోజు ఆఫీసయ్యి రూముకి బయలుదేరిన శ్రీనివాసుకు, బయిట సిద్ధార్థ కనిపించాడు.
"కారుందా? లేక క్యాబ్ కోసం వెయట్ చేస్తున్నావా" అని అడిగాడు శ్రీనివాసు.
"లేదండి, బస్టాపుకి వెళుతున్నా", అంటూ బదులిచ్చాడు సిద్దార్థ.
"ఈ టైములో ఇక్కడికి బస్సులు వస్తాయా? నేనెప్పుడూ చూడలేదే!"అంటూ సందేహంగా అన్నాడు శ్రీనివాసు.
వీళ్ళు పనిచేసే ఆఫీసు, నివశించే ప్రదేశాలకు బాగా దూరంగాఉంటుంది. కారు లేకపొతే కష్టం. బస్సులు ఒకటి అరా తిరుగుతూఉంటాయి.
"ఇంకొక అరగంటలో యూనివర్సిటీకి వెళ్ళే బస్సు ఉందండి. అదిపట్టుకొని రూంకి వెళతాను" అన్నాడు సిద్దార్థ.
"మరి ఉదయం ఎలా వస్తున్నావు?"అని శ్రీనివాసు అడిగితే, "ఉదయాన్నే ఆరింటి బస్సు కేచ్ చేస్తాను" అన్న సిద్దార్థ సమాధానంవినగానే ఆశ్చర్యం వేసింది శ్రీనివాసుకి.
***********************************************
టెల్లహాసీ పట్టణం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని. శ్రీనివాసు నివసించే ఓర్లాండో నగరానికి సుమారు 250 మైళ్ళ దూరం.అమెరికాలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లాగే ఇది కూడా సాదాసీదాపట్టణం. గవర్నమెంటు ఆఫీసులు, రెండు యూనివర్సిటీలు మరియు చిన్న ఎయిర్పొర్ట్ తప్ప చెప్పుకోదగ్గవేవీ లేవు. యూనివర్సిటీ స్టూడెంట్స్ తో రెండు మూడు వీధులు మాత్రమే కొంత సందడిగా ఉంటాయి.సాయింత్రం 7 దాటిందంటే రోడ్లపై అసలు జన సంచారం కనపడదు.చాలా ఏళ్ళుగా నగర వాతావరణానికి అలవాటుపడిపోయిన శ్రీనివాసుకి ఈ ఊరు చాలా బోరుగా అనిపిస్తోంది. అందుకే వీలైనంత సమయం ఆఫీసులోనే గడుపుతాడు.
సిద్ధార్థ మరియు శ్రీనివాసు కలసి లంచ్ టైములో వాకింగుకి వెళ్ళడం,శ్రీనివాసు అప్పుడప్పుడు సిద్దార్థకి రూము దాకా రైడ్ ఇవ్వడం చేస్తూండేవాడు. ఈక్రమంలో కొన్నిరోజులకి సిద్ధార్థ తన వ్యక్తిగతవిషయాలను కూడా శ్రీనివాసుతో పంచుకోసాగాడు.
అలా తెలిసింది అతను వర్క్ వీసాపై అమెరికావచ్చి రెండుసంవత్సరాలైంది. తల్లితండ్రులకు ఒక్కడే కొడుకు, ఇంకా పెళ్ళికాలేదు అని. శ్రీనివాసుని గురువుగారు అంటూ సంభోదిస్తూంటాడు సిద్దార్ధ.
ఒకరోజు సెకండ్ ఫ్లోర్లో మీటింగుకి అటెండయ్యి వస్తుంటే ఎలివేటర్లో సిద్దార్ధ తారసపడ్డాడు శ్రీనివాసుకి.
"గురువుగారు! నిన్న రాత్రి తుఫానేమిటండీ అంత దారుణంగా ఉంది ? ఆ గాలి శబ్దాలు వింటుంటేనే చాలా భయమేసింది.", అని అంటూ శ్రీనివాసుని పలకరించాడు సిద్దార్ధ.
"అవును! ఈసారి తుఫాను చాలా ఉధృతంగా వచ్చింది, ఇంతకుముందెన్నడూ ఇంతలా రాలేదు. ఓర్లాండోని బాగా డామేజ్చేసిందిట. ఇప్పుడే లలితకి కాల్ చేసి అడిగాను మా ఇంటి వెనకచెట్ల పరిస్థితి.ఆమె సమాధానం విన్నాకా వాటి మీద ఆశవదులుకున్నాను", అని నిరాశగా సమాధానమిచ్చాడు శ్రీనివాసు.
"మరి వాటిని ప్రొటెక్ట్ చేసే అవకాశం లేదంటారా?" అన్న సిద్దార్ధప్రశ్నకి, "ప్రకృతిని ఎదుర్కొవడం సాధ్యమంటావా?. మనం హ్యూమన్స్ ", అన్నాడు శ్రీనివాసు అడ్డంగా తల ఊపుతూ .
"అన్నీ బాగుంటాయండి. మీరేమీ వర్రీ కాకండి. అన్నట్లు నేనే మీదగ్గరకు వద్దామనుకున్నాను, ఇంతలో మీరే ఎదురయ్యారు." అన్నాడుసిద్దార్ధ.
"ఏమిటి సంగతి? ఏదైనా సర్ ప్రైజా?", అడిగాడు శ్రీనివాసు.
"లేదండి. ఒక యూజుడు కారు కొందామనుకుంటున్నాను. ఓర్లాండోలో హెర్ట్జ్ రెంటల్ కార్ సేల్స్ ఉంటాయిట. మీకు అభ్యంతరం లేకపోతే ఈ గురువారం మీతో ఓర్లాండోవస్తాను. శుక్రవారం కారు తీసుకొని రిటర్న్ వచ్చెస్తా. కానీ ఇప్పుడు నాకు డౌటుగా ఉంది. మరి తుఫానుకి చెట్లు పడి రోడ్లన్నీ బ్లాక్ అవుతాయేమో కదా! ", అన్నాడు సిద్దార్ధ.
"నో ప్రోబ్లం! హైవెలన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పుడే చెక్ చేశాను. నేను బయలుదేరేముందు పింగ్ చేస్తాను", అని భుజం తట్టాడు శ్రీనివాస్.
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరూ బయలుదేరారు. సన్నగావర్షం మొదలైంది.
"ఎంతసేపు పడుతుంది గురువుగారు రీచ్ అవడానికి" అడిగాడుసిద్దార్ధ.
"ఇప్పుడు మనం ఐ-10 తీసుకున్నాం. దీనిపై సుమారు 100 మైళ్ళువెళ్ళాక ఐ-75 వస్తుంది. అందులో ఇంకొక 150 మైళ్ళు వెళ్ళాలి. ట్రాఫిక్ సవ్యంగా ఉంటే సుమారు మూడున్నర గంటలు పడుతుంది.అదృష్టం బాగోక ట్రాఫిక్ జాం అయిందంటే ఇంక దైవాధీనం. ఓర్లండో దాకా వెళ్ళక్కరలేదు మేముండేది వింటర్ గార్డెన్, ఒక అరగంటముండే వస్తుంది" అని శ్రీనివాస్ చెప్పగానే,
"అవునా! అయితే నేను అక్కడనుంచి క్యాబ్ తీసుకొని హొటల్ కివెళతానండి" అని సిద్దార్ధ అంటూండగా.
"ఏమి అవసరం లేదయ్యా!, నేను ఆల్రెడీ లలితకు చెప్పాను నువ్వువస్తున్నావని. సో! మన ఇద్దరికీ డిన్నర్ రెడీ చేస్తుంది. రాత్రికి మాఇంట్లో ఉండు, ఉదయాన్నే నిన్ను కార్ డీలర్ దగ్గర డ్రాప్ చేస్తాను."అని శ్రీనివాసు అనగానే
"థ్యాంక్యూ గురువు గారు" అని కృతజ్ఞతాపూర్వకంగా శ్రీనివాసు వంకచూసాడు సిద్దార్ధ.
ఐ-75 ఎగ్జిట్ తీసుకోగానే, కార్లన్నీ నిలబడిపోయి ఉన్నాయి.
"ఏక్సిడెంటయినట్లుంది. జీపీఎస్ 25 నిమిషాలు డిలే అంటోంది.ఇంక మన చేతుల్లో లేదు మెల్లగా వెళ్ళడమే" చెప్పాడు శ్రీనివాసు.కార్లన్నీ బంపరు టూ బంపరు వెళుతున్నాయి.
నెమ్మదిగా ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ప్రొజెక్టు వ్యవహారాలు, పోలిటిక్స్,షేర్ మార్కెట్, ఇలా రకరకాల టాపిక్కులన్నీ కవరయ్యాయి.
"ఆంధ్రాలో మీ ప్రోపర్ ఎక్కడ", అని అడిగాడు శ్రీనివాసు.
"ఉత్తరాంధ్ర", సమాధానమిచ్చాడు సిద్దార్ధ.
"ఉత్తరాంధ్ర అంటే ఒక ఊరు కాదు కదా?" అన్నాడు శ్రీనివాసు.
"అదేలెండి, శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరు", అంటూ యధాలాపంగా అన్నాడు సిద్దార్ధ.
"శ్రీకాకుళం జిల్లానా! నేనూ అదే జిల్లాలో కొంతకాలం చదివాను. మీఊరి పేరేమిటి?" అని కుతూహలంగా అడిగాడు శ్రీనివాసు.
"కవిటి, సుమారు 15 కిలోమీటర్లుంటుంది సోంపేట హైవేకి." అనిసమాధానమిచ్చాడు సిద్దార్ధ.
"కవిటా!" కాస్త ఎక్సైటింగా అన్నాడు శ్రీనివాసు.
"అవునండి! కవిటే, మీకు తెలుసా" అంటూ అనుమానంగాచూసాడు సిద్దార్ధ.
"తెలియకపోవడమేమిటి! మా నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు.కవిటిలో కొంత కాలం ఉన్నాము, అక్కడ హైస్కూలులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ విశాఖపట్నం, ఇంజనీరింగు హైదరాబాదులో చేసాను" అంటూ తన బయోడాటా చెప్పాడు శ్రీనివాసు.
"మా ఫాదర్ కూడా అదే హైస్కూల్లో పనిచేసి నాలుగేళ్ళ క్రితమే రిటైరయ్యారు" అన్నాడు సిద్దార్ధ.
"ఓ! టీచరన్నమాట", అని శ్రీనివాసు అంటూండగా "లేదండి తాతగారు టీచర్. నాన్న అటెండర్. ఆయనది ఒక సారొఫుల్ స్టోరీ",అని నిట్టూర్చాడు సిద్దార్ధ.
"ఓ!అయాం సారీ, అభ్యంతరం లేకపోతే నేను తెలుసుకోవచ్చా,అఫ్కోర్స్ అది నీ పర్సనల్ ", అంటూ సిద్దార్ధ కేసి చూసాడు శ్రీనివాసు.
"భలేవారు! తప్పకుండా" అని సిద్దార్ధ మొదలు పెడుతుంటే, "ఆగాగు,అదిగో రెస్ట్ ఏరియా వస్తోంది. అక్కడ కాసేపు కాఫీ తాగుతూకూర్చుందాం. అప్పుడు చెబుదువు గాని." అని కారుని రెస్ట్ఏరియాలోకి పోనిచ్చాడు శ్రీనివాసు.
ఇద్దరూ చెరో కాఫీ తీసుకొని దూరంగా ఖాళీగాఉన్న టేబుల్ దగ్గరకూర్చున్నారు. "ఓకే! గో అహెడ్" అంటూ సిద్దార్ధకేసి చూసాడు శ్రీనివాసు.
"మా తాతగారిది కవిటికి కాస్త దూరంలో ఉన్న బల్లిపుట్టుగ.వ్యవసాయకుటుంబం. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఇద్దరు వ్యవసాయం చూసుకుంటూ అక్కడే ఉండిపోగా, తాతగారికి స్కూలు టీచరుగా కవిటిలో ఉద్యోగం రావడంతో, అక్కడికి మకాం మార్చారు. స్కూలుపక్కనే ఉన్న ఎత్తు అరుగుల ఇల్లు మాదే. తాత గారికి నాన్న ఒక్కరే మగ సంతానం, ముగ్గురు ఆడ పిల్లలు.ఆడపిల్లల తరవాత చాలాఏళ్ళకు నాన్న పుట్టారట. అందుచేత అందరూ బుజ్జీ బుజ్జీ చాలా గారాబం చేసేవారట. కూతుళ్ళ పెళ్ళిళ్ళకు వ్యవసాయం అంతా హరించుకు పోవడంతో, జీత భత్యాలే కుటుంబ పోషణకు ఆధారం.ఆ రోజుల్లో బడిపంతుల జీతాలగురించి మీకు తెలుసుగదా! తాతగారు ట్యూషన్లు చెబుతున్నా కూడా ఆదాయం అంతంత మాత్రమే, ఫ్రీ ఖాతాలే ఎక్కువట " అని కాఫీ కప్పు టేబులుపై పెడుతూ చెప్పడం ఆపి శ్రీనివాసు వైపు చూసాడు సిద్దార్ధ. అతను పైకి ఎక్కడికో చూస్తున్నాడు.కాఫీ తాగనేలేదు.
"గురువు గారు బోరు కొట్టిస్తున్నానా? బయలుదేరుదాం రండి,అంటూ సిద్దార్ధ లేస్తుంటే,
"అవునూ! మీ ఇంటిపేరేమిటి? అలాగే మీ తాత, నాన్నల పేర్లు?"అంటూ అడిగాడు శ్రీనివాసు.
"ఇంటిపేరు బెండాళం, తాత అప్పలస్వామి, నాన్న పేరు జయదేవుదు", అన్న సిద్దార్ధ సమాధానం విన్న శ్రీనివాసు లేచి “నడు బయలుదేరుదాం, కారులో కంటిన్యూ చేద్దుగాని", అనగానే సిద్దార్ధ కూడా అతనిని అనుసరించాడు.
"నాన్న చాలా షార్ప్ గా ఉండేవారుట. సూక్ష్మగ్రాహి దానికితోడు మంచి జ్ఞాపకశక్తి. ప్రతీ క్లాసులోను ఆయనే టాపర్. తాతగారు కొడుకు తెలివితేటలు చూసి మురిసిపోయేవారుట.బాగా చదివించి పెద్దఇంజనీరుని చెయ్యాలని అనుకొనేవారట.
హైస్కూల్ల్లో ఉండగా, ఒక ఫైర్ ఆక్సిడెంటు జరిగి నాన్న రెండు కళ్ళల్లొఒకటి పూర్తిగా దెబ్బతిని చూపు మొత్తం పొయింది. రెండో కన్నులీలగా కనిపించేది. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు కానీ లాభంలేకపొయింది.లీలగా కనపడుతున్న కన్నుతో కూడబలుక్కొని చడవడానికి ప్రయత్నిస్తుంటే, విపరీతమైన తలపోటు వచ్చి కూలపడిపోయేవారుట. దానితో చదువు మానేయవలసి వచ్చింది.తాతయ్య బెంగతో బాగా కృంగిపోయి కన్ను మూసారు. తాతయ్య ఒక్కడే ఆ కుటుంబానికి ఆధారం. ఆయన పోకతో ఒక్కసారి వారి జీవితాలు అఘాతంలో పడిపోయాయి. నానమ్మ పూర్తిగా నిరక్షరాస్యురాలు. కూతుళ్ళు రెండు మూడేళ్ళపాటు ఆదుకున్నారు.ఈలోపులో నాన్నకు 18 సంవత్సరాలు నిండాయి.తాతగారు సర్వీసులో పోవడంతో ఆ స్కూలులోనే నాన్నకు అటెండరుగా ఉద్యోగం ఇచ్చారు. విధి అంటే అదేనండి, ఏకొడుకునైతే బాగా చదివించి గొప్ప ఇంజనీరుని చేయాలనుకున్నారో ఆ కొడుకే తను పని చేసిన స్కూల్లో బంట్రోతుగా చేరాల్సి వచ్చింది. కాల క్రమేణా నానమ్మ గతించింది.నాన్న పెళ్ళి చాలా ఆలస్యంగా జరిగింది. నాన్న తెలివితేటలే నాకువచ్చాయని అందరూ అంటూండేవారు. నేనుకూడా కష్టపడి చదివి ఐఐటి లో సీట్ సంపాదించాను.", చెప్పడం ఆపి కొంచెం వాటర్ తాగాడు సిద్దార్ధ.
అతను చెప్పేదంతా చాలా శ్రద్ధగా వింటూ, "మరి వాళ్ళను వదిలి ఈదేశానికి ఎందుకొచ్చావు? ఇండియాలోనే ఉండచ్చుకదా?" అడిగాడు శ్రీనివాసు.
"నాకసలు వాళ్ళను వదిలి వచ్చే ఉద్దేశం లేదండి. తప్పక రావలసివచ్చింది. నాన్నని హైదరాబాదులో చూపిస్తే, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దానికి కనీసం 50 నుంచి 75 లక్షలవుతుందన్నారు. ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేస్తే ఒక పది పదిహేను లక్షలు రావచ్చు.ఈలోగా అనుకోకుండా నాకు ఆన్సైట్ అవకాశం వచ్చింది. ఇక్కడ రెండు మూడేళ్ళు పనిచేసి, ఎంతవీలైతే అంత సేవ్ చేద్దామని రావడం జరిగింది. కారు కొనే ఉద్దేశం కూడా లేదు. కానీ చాలా టైము వేస్టు అవుతోంది. మీకు తెలుసు కదా ఈ దేశంలో కాలు లేక పొయినా కారుమాత్రం బాగా అవసరం. ఇప్పుడు మన దేశం విలువ తెలుస్తోంది"అని నవ్వుతూ చెప్పాడు సిద్దార్ధ.
ఇంచుమించు రెండు గంటలు ఆలస్యంగా ఇంటికి చేరారు ఇద్దరూ.సిద్దార్ధని లలితకు పరిచయం చేశాడు శ్రీనివాసు.
డిన్నర్ చేసి మంచమ్మీద పడుకున్నాడన్నమాటేగాని, అసలు నిద్రపట్టలేదు. ఏవేవో ఆలోచనలు. ఏ తెల్లవారుఝమునో కొంచెం కునుకు పట్టింది.
ఆ మర్నాడు ఉదయం సిద్దార్ధని కార్ డీలర్ దగ్గర విడిచిపెట్టి,అవసరం అయితే కాల్ చెయ్యమని ఇంటికి వచ్చేశాడు శ్రీనివాసు.
ఆఫీసు క్యాలండర్ ఓపెన్ చేసి మీటింగ్స్ ఏమీ లేకపోవడంతో, వెనుక తోట లోకి నడిచాడు. మామిడి చెట్ల తలలన్నీ విరిగి పొయి ఉన్నాయి . కొన్ని చెట్లయితే కూకటివ్రేళ్ళతో సహా పెకళింపబడ్డాయి.గతసంవత్సరం ఆరు మామిడి చెట్లు కాసాయి. నాలుగు రకాల మావిళ్ళు.ఈసారి ఇంకో రెండు తోడవుతాయని అనుకున్నాడు . గత ఐదారేళ్ళుగా ఊరగాయలన్నీ అమెరికాలోనే. లలితవాళ్ళ అమ్మ గారు గత వేసవిలో ఇక్కడ ఉన్నప్పుడు, చెట్ల నుండిరాలిన పళ్ళను చూసి మురిసిపోయే వారు. అలా చెట్లన్నీ చూసుకుంటూ పనస చెట్టు వద్ద ఆగాడు. సుమారు ఆరేళ్ళక్రితం 100 మైళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చాడు. ఈసారి పిందెలు బాగా వచ్చాయి.కొమ్మలన్నీ విరిగి పోయాయి . లాస్ఏంజెలెస్ తన అన్న ఇంటికి వాళ్ళమ్మను సాగనంపుతూ, "ఈ వేసవికితప్పకుండా రా, పనసపళ్ళు కూడా వస్తాయి" అన్న లలిత మాటలుగుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. ఎన్నెన్నో కలగంటాం, కానీ ప్రకృతికి తలవంచవలసినదే అనుకుంటూ ఒక్కొక్క వృక్షాన్ని పరిశీలిస్తూ కలియతిరుగుతున్నాడు. పెద్ద పెద్ద కొమ్మలతో,పచ్చని ఆకులతో సగర్వంగా తల ఎగరేసిన చెట్లు - మోడులు ఊడి, తలలు తెగి చెల్లాచెదురుగా పడి ఉండిన ఆ నేలంతా మరుభూమిని తలపిస్తోంది.ఒక్కటంటే ఒక్కటి తట్టుకొని నిలబడలేదు. ఎప్పుడో స్కూల్లో చదువుకున్న కళింగ యుద్ధ అనంతరం యుద్ధభూమిని చూస్తూ అశోకుడు స్వగతంగా చేసిన వర్ణన తనకి గుర్తుకొచ్చింది.
"క్షతగాత్రులు, మృతులు నైన వీరవర సముదాయము!గాయపడి నేలకొరిగిన విగత జీవంబైన హయగజాది జంతునివహంబు! మరణయాతననుభవించు జీవకోటికొంత!చిన్నభిన్నములైన రధ పల్యంకాదివాహనములు! సారధి,రధి,రధ్యంబులు లేని రధంబులు!భల్లఖద్గతోమరధనురాద్యాయుధనివమంబులు!పటహకాహళభేరీమార్యాది వాద్య చంబురతునియలై చెలాచదరై పడియున్నవి!"
"నిజమే కదా! సైంటిస్టు జగదీష్ చంద్ర బోస్ మొక్కలు కూడా మిగతాప్రాణుల్లాగే రియాక్ట్ అవుతాయని ప్రూవ్ చేశాడుగా. సో!ఇవన్నీ క్షతగాత్రుల కిందే లెక్క" అని తనలో తాను అనుకుంటూ ఇంట్లోకిఅడుగులు వేసాడు శ్రీనివాసు.
ఇరవైఏళ్ళు అపురూపంగా పెంచుకున్న చెట్లు పోయాయన్న బాధఒకటైతే దానిని మించిన బాధొకటి శ్రీనివాసు గుండెను పిండెస్తోంది.
ఆరున్నర అవుతుండగా లలిత ఆఫీసునుండి ఇంటికి వచ్హింది.అప్పటికే శ్రీనివాసు మోకా పాట్ లో కాఫీ తీసి రెడీగా ఉంచాడు.
ఇద్దరూ కాఫీ కలుపుకొని సోఫాలో కూర్చున్నారు.
"ఏం తిన్నావ్ ఇవాళ?ఉసిరావకాయ టేస్టు ఎలా ఉంది?" అని లలితఅడిగింది టీవీ ఆన్ చేస్తూ.
"ఈ రోజు ఏమీ తినలేదు. అసలు ఆకలి వేయలేదు", అంటూ లేప్టాప్ ఓపెన్ చేసాడు శ్రీనివాసు.
"అదేవిటీ? నీకిష్టమని ఉసిరావకాయ పెట్టాను. చెట్లన్నీపోయాయని ఫీల్ అవుతున్నావా?" అడిగింది లలిత.
"ఎందుకు లేదు, ఉంది, కానీ అంతకంటే ఒక వార్త మనసుపాడయ్యేలా చేసింది." అంటూ లలిత వైపు చూసాడు శ్రీనివాసు.
"అవునా! ఏమైంది?" అంటూ శ్రీనివాసు ప్రక్కకు వచ్చి కూర్చుందిలలిత.
"సిద్దార్ధ వాళ్ళనాన్న గారికి కళ్ళు లేవుట. చిన్నప్పుడు ప్రమాదంలో పోయాయిట." అంటూ నెమ్మదిగా చెప్పాడు శ్రీనివాసు.
"ఓ! సారీ! ఆయన ఎక్కడుంటారు?" అన్న లలిత ప్రశ్నకి"ఇండియాలోనే ఉంటారు, సిద్దార్ధకి మనం సహాయం చెయ్యాలి లలితా", అని జాలిగా అడిగాడు శ్రీనివాసు.
"తప్పకుండా చేద్దాం. ఏం సహాయం చేయగలం?" అని అడిగిందిలలిత.
"ఆయనకు ఆపరేషన్ చేస్తే కళ్ళు తిరిగి వస్తాయని చెప్పారుట. దానికి అయ్యే ఖర్చు కొంత సిద్దార్ధ దగ్గర ఉంది. మిగిలినది మనం ఇస్తే ఎలా ఉంటుంది?" అంటూ ఆతృతగా లలిత వైపు చూశాడు శ్రీనివాసు.
"మిగిలినది అంటే ఎంత ఇవ్వాలి?", అన్న తన ప్రశ్నకి శ్రీనివాసు సమాధానం విని,
"వాట్" అంటూ ఒక్కసారి అరిచింది.
"నీకేమైనా పిచ్చి పట్టిందా! నిన్న గాక మొన్న పరిచయమైన వ్యక్తికి అంత మనీ ఇచ్చేస్తావా!అందరితోబాటు మనం కూడా ఒక చెయ్యి వెయ్యచ్చు గానీ, మరీ అంతా! అసలు ఆయనేమైనా అన్నయ్యా? బాబయ్యా? ఊళ్ళోవాళ్ళనందరినీ ఉద్ధరిస్తానంటావేమిటి? నీకేదో మతి పొయినట్లుగా ఉంది. ఒక్కసారి ఈ ప్రపంచంలోకి రా", అని లేచి వెళ్ళిపోయింది లలిత.
ఆ రాత్రంతా నిద్దర్లేకుండా దొర్లుతూనే ఉన్నాడు శ్రీనివాసు. ఉదయం లేచేసరికే లలిత కాఫీ తాగుతూ ఫొన్ చూసుకుంటోంది.
"చర్చిల్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు, మధ్యాహ్నం వస్తానన్నాడు చెట్లను క్లీన్చెయ్యడానికి", అని సమాచారమిచ్చింది లలిత.
"అవునా! గడ్డి కోయడానికి వస్తాడేమోనని నేనే కాల్చేద్దామనుకున్నా. అన్నట్లు ఈ రోజు నాటకం రిహార్సల్ ఉంది టెంపుల్ ఆడిటోరియంలో. నువ్వు వస్తావా? వచ్చేటప్పుడు పటేల్ బ్రదర్స్నుంచి వెజిటబుల్స్ తెచ్చుకోవచ్చు. లంచ్ కూడా టెంపుల్ కేంటిన్లో చేసేద్దాం ఓకెనా", అని శ్రీనివాసు అడగ్గానే తలూపింది లలిత.
సాధారణంగా ఒకటి లేదా రెండు టేక్స్ కన్నా ఎక్కువ తీసుకోని శ్రీనివాసు ఆ రోజు రిహార్సిల్లో బాగా తడబడ్డాడు. సింపిల్ డైలాగ్స్ కూడా అనేకసార్లు రిపీట్ చేయాల్సి వచ్చింది. రోజంతా ముభావంగానే ఉన్నాడు.
"ఎనిమిదవుతోంది! డిన్నర్ చేసేద్దామా", అన్న లలిత వైపు చూస్తూ, "నాకు హెవీగా ఉంది, నువ్వు తెచ్చుకురా!", అని శ్రీనివాసు లివింగ్ రూమ్ సోఫాలో కూర్చున్నాడు.
లలిత కూడా ఫూడ్ తెచ్చుకొని సోఫాలో కూర్చుని టీవీ ఆన్చేయబోతుంటే,
"ఒక్కసారి నేను చెప్పేది విను లలితా" అని శ్రీనివాసు అనేసరికి,"ఏమిటి?" అన్నట్లు అతని వైపు చూసింది లలిత.
"మనం ఎలాగైనా సిద్దార్ధ ఫాదర్ కి సహాయం చేయాలి.ఈ విషయంలోనువ్వు కోపరేట్ చెయ్యాలి", అంటూ ప్లీజింగ్ గా ఆమె వైపు చూసాడుశ్రీనివాసు.
"అలాగే! వియ్ విల్ డు సంథింగ్", అని లలిత అంటుండగా, "సంథింగ్ కాదు, ఆపరేషన్ కి అవసరమైన మొత్తం మనమే ఇవ్వాలి.ఆయనికి కళ్ళు తిరిగి రావాలి", అంటుండగా శ్రీనివాసు గొంతుజీరబోయింది.
"వాటీస్ దిస్?ఆయనకు కళ్ళు తిరిగి వస్తే నాకూ హేపీయే. కానీ దానానికి కూడా ఒక హద్దుంటుంది. నువ్వు అనవసరంగా టూమచ్ చేస్తున్నావు. నేను చెప్పేది నువ్వు విననప్పుడు నన్ను అడగడం దేనికి? నీకిష్టమైనట్టు చేసుకోవచ్చుగదా" కొంత కోపంగానే అంది లలిత.
"ప్లీజ్ లలిత, కాస్త కూల్ అవ్వు. ఆయనకు ట్రీట్మెంట్ జరిగి కళ్ళు తిరిగివస్తే, నాకు మనఃశాంతి.",అని శ్రీనివాసు అంటుంటే, ఒక్కసారి తలతిప్పి శ్రీనివాసు వైపు చూస్తూ, "నీకు మనఃశాంతి ఏమిటి? మతి ఉండే మాట్లాడుతున్నావా?" విసుక్కుంది లలిత.
"అవును, మతి ఉండే మాట్లాడుతున్నాను. ఒక్క మనఃశాంతే కాదు,చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా", అంటూ కళ్ళు మూసుకొని,రెండు చేతులను మోకాళ్ళపై ఉంచి మధ్యలో ముఖాన్ని దాచాడు శ్రీనివాసు.
అతనికి దగ్గరగా వచ్చి కూర్చొని, శ్రీనివాసు భుజంపై చెయ్యి వేస్తూ ,
"పాపానికి ప్రాయశ్చిత్తమా! నువ్వు పాపం చేశావా? నాకంతా అయోమయంగా ఉంది. అసలేం జరిగిందో చెప్పవూ ?" అంటూ లలిత, మెల్లగా అతని ముఖాన్ని పైకి లేపింది.
శ్రీనివాసు చెప్పడం మొదలుపెట్టాడు…..
"చిన్నీ, నాన్న లంచికి రానని చెప్పారు. ఈ లంచ్ బాక్స్ బ్యాంకుకి పట్టికెళ్ళి ఇచ్చిరా", అన్న అమ్మతో అలాగే అమ్మా అంటూ "ఒరే దేవుడూ ! బ్యాంకుకి వెళదాం వస్తావా ", అంటూ ప్రక్క పోర్షన్ లోఉండే తన క్లాస్ మేట్ దేవుడి ని ఒక కేక వేశాడు.
"నేను రాన్రా, హోం వర్క్ చెయ్యాలి. నువ్వెళ్ళు", అంటూ అక్కడినించే అరిచాడు దేవుడు.
"సరే!", అని సైకిలెక్కి వెళ్ళిపోయాడు చిన్ని.
చిన్ని,దేవుడు ఇద్దరూ 6 వ క్లాసు ఒకే స్కూళ్ళో చదువుతున్నారు. కలిసే స్కూలికి వెళతారు. కలిసే ఆటలూ పాటలూను.
అన్నిటిలోనూ దేవుడు ముందుంటే, చిన్ని అంతంత మాత్రం. ఇద్దరూ 7వ క్లాసులో ప్రవేశించారు. దేవుడు తన ప్రతిభను అంతకంతకూ పెంచుకుంటూ పోతుంటే, చిన్ని మాత్రం వెనుకబడే ఉంటున్నాడు.
తల్లీ తండ్రీ కూడా తనను అన్నిటిలోనూ దేవుడుతో పోల్చడం చిన్నికి నచ్చడం లేదు. దేవుడు పట్ల ఉండే ప్రేమభావం,ఒక్కసారి ద్వేషంగా మారింది. ఇదివరలా క్లోజ్ గాఉండలేకపోతున్నాడు. దేవుడు మాత్రం చిన్నితో బాగానే ఉంటున్నాడు. ఆరోజు 7వ క్లాసు రిజల్ట్స్ వచ్చాయి, అందరూఊహించినట్టే దేవుడు టాపరుగా నిలిచాడు. చిన్నికి బాగా తక్కువమార్కులు వచ్చాయి. ఇంట్లో బాగా తిట్లు తిన్నాడు. బాగా ఉక్రోషం వచ్చింది. సాయింత్రం దాకా ఏటి వడ్డున కూర్చున్నాడు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.ఆ దేవుడు బాగా చదవడంవల్లనే కదా నాకు ఈతిట్లు. వాడిని చదవకుండా చెయ్యాలి. పుస్తకాలన్నీ దాచేస్తే ? లాభంలేదు క్రొత్తవి కొనుక్కుంటాడు. ఆలోచిస్తుంటే మెరుపులా ఒక ఆలోచనవచ్చింది. లేచి ఇంటికి వెళ్ళిపోయాడు.
దేవుడితో మళ్ళా స్నేహంగా ఉండటం మొదలు పెట్టాడు. చిన్నిప్రవర్తన దేవుడికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా, ఏమోలే అనుకొని అంత సీరియస్గా పట్టించుకోలేదు.
ఇంక రెండు రోజుల్లో దీపావళి పండుగ. పిల్లలూ, పెద్దలూ అందరూ మందుగుండు సామాను కొనుక్కొని చిచ్చు బుడ్లు, తపాకాయలు,సిసింద్రీలు చేయడంలో బిజీగా ఉన్నారు.
దేవుడు, చిన్ని కూడా మందుగుండు సామాను కొనుక్కొని, సిసింద్రీలు కూరడం ప్రారంభించారు. ఒకరోజు సాయింత్రం దేవుడు పెరట్లోకూర్చుని ఒక న్యుస్ పేపరు లో మందుగుండు సామాను పెట్టుకొని సిసింద్రీలు కూరుతుండగా, ఒక్కసారి భగ్గున పెద్ద మంట. పెద్ద పెద్ద ఆహాకారాలు. అయ్యో దేవుడి చొక్కా కాలిపోతోంది అంటూ గబగబా అందరినీ పిలుస్తూ దుప్పటీ తీసుకొచ్చి కప్పారు చిన్ని వాళ్ళ అమ్మగారు.
ప్రాణాపాయం లేదు అన్న మాటలు వినబడటంతో"హమ్మయ్య"అనుకొని ఆమె రెండుచేతులు ఎత్తి దేవునికి మ్రొక్కింది.
అది జరిగిన కొన్ని రోజులకే, చిన్ని వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో ఆ ఊరొదిలి వెళ్ళిపోయారు.
అని చెప్పడం ఆపాడు శ్రీనివాసు.
"నాకేమీ అర్ధం కావడంలేదు వాసు. ఇదేదో కధలా ఉంది. అందులో నీ రోల్ ఏముంది?", అని అయోమయంగా అడిగింది లలిత.
"అది కధ కాదు. యదార్ధ గాధ. దేవుడంటే సిద్దార్ధ తండ్రి జయదేవుడు , చిన్ని అంటే నేనే. ఆరొజు మంటలకు కారణం - సిసింద్రీమందులోకి నేను విరిసిన నిప్పురవ్వ. వాడి కళ్ళు పోవాలనే నేనుచేసిన అతి దారుణమైన పని. ఆ విషయం అమ్మకి నాకు తప్ప ఎవరికీతెలియదు. చాలా కాలం ఆ విషయం తలచుకొని భయంతో వణికిపోయేవాడిని. దాదాపు ఏభై యేళ్ళ తరువాత మళ్ళీ ఆసంఘటన నన్ను కుదిపేస్తోంది.క్షణికోద్రేకంలో నేను చేసిన పని ఒక కుటుంబాన్ని కూల్చివేసింది. ఎంతో అద్భుతంగా ఉండవలనిస వాడి జీవితం చితికిపోయింది. మహరాజులా ఉన్నత స్థాయిలో బ్రతకవలసినవాడు, ఒక అటెండరుగా పనిచేయవలసి వచ్చిందంటే దానికి నూటికి నూరు శాతం నేనే. చేసిన పాపం నాది. చితికిన బ్రతుకింకొకరిది. మానసికంగానే కాకుండా ఆర్ధికంగా ఎన్ని కష్టాలు పడుంటాడో.
"సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అంటారు. అటువంటి వాటిని నా ఈవిల్ థాట్ నాశనం చేసింది. వాళ్ళ తండ్రి స్థితికి నేనే కారణం అని సిద్దార్ధకి తెలిస్తే? ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకొనే అవకాశం వచ్చింది. నష్టపోయినజీవితాన్ని తిరిగి ఇవ్వలేను, కానీ ఇప్పుడు కూడా నేనేమీచేయలేకపోతే నా బ్రతుక్కి అర్ధం లేదు లలితా", అంటూ మౌనంగారోదించసాగాడు శ్రీనివాసు.
అప్పటిదాకా అతను చెప్పేదంతా బొమ్మలా వింటున్న లలిత, ఒక్కసారి బాహ్యప్రపంచంలోకి వచ్చింది. శ్రీనివాసు భుజంపై చెయ్యి వేసి, "ఆయన కళ్ళు బాగయ్యి ఇంటికొచ్చేవరకు మనమే మొత్తం రెస్పాన్సిబిలిటి తీసుకుందాం. నువ్వు ఇంక వర్రీ కాకు" అని అతన్నిదగ్గరకు తీసుకుంది.

