అభినవ పోతన శ్రీ వానమామలై వరదాచార్యులుగారు! - టీవీయస్. శాస్త్రి

abhinava pothana shree vaanamaamalai varadaachaaryulugaaru

క మహాకవి చరిత్రను మరో మహాకవి వ్రాస్తే, అది ఎంత సుమధురంగా ఉంటుందో మాటల్లో చెప్పటం కష్టం. ఆ మహాకవి పోతన అయితే, ఆయన చరిత్ర వ్రాసిన మహాకవి శ్రీ వానమామలై వరదాచార్యులుగారు. విశేషమేమిటంటే, సహజకవి అయిన పోతనను గురించి అతి సహజంగా ఆయన చరిత్రను కవితాత్మకంగా వ్రాయటమే! రామాయణాన్నిగురించి అనేక మంది కావ్యాలు వ్రాసారు. కానీ, వాల్మీకిని గురించి వ్రాసినవారు లేరు. భాగవతాన్నిగురించి తెలుగు ప్రజలకు అందచేస్తూ, పోతన గారు, తన పూర్వ కవులైన నన్నయ్య తిక్కనాదులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకంటే, వారు భాగవతాన్ని తెనిగించకుండా తనకోసమే వదిలినందుకు! 'పట్టునది కలమో హలమో! - సేయునది పద్యమో సేద్యమో' అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్యవసాయమే వృత్తిగా చేసుకొని జీవించి, పంచదార గుళికల లాంటి పద్యాలతో తెలుగువారికి భాగవతాన్ని అందించిన పోతరాజు మహాకవికి  నీరాజనం సమర్పించారు. అయితే శ్రీ వానమామలై వరదాచార్యులుగారు, తనకన్నా అయిదు శతాబ్దాల ముందు నివసించిన పోతనను గురించి 'పోతన చరిత్రం' అనే పద్య కావ్యాన్ని వ్రాసారు. ఈ కావ్యంలో, రమారమి మూడువేల రెండువందల పద్యాలున్నాయి. అన్నిటికన్నా మరో గొప్ప విశేషమేమిటంటే, తెలుగుదేశం ఆధునికపు కవితా పోకడలకు అలవాటు పడిన కాలమది. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, వచనకవిత్వం లాంటి ఎన్నో నూతన సాహిత్య ప్రయోగాలాతో వర్ధిల్లుతున్న కాలంలో, ప్రాచీన కవితారీతులతో ప్రజలను మెప్పించిన కవి శ్రీ వానమామలై. ఒక మహాకవి చరిత్రను మరోకవి గ్రంధస్థం చేయటానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. మొదటిది - ఆ మహాకవి కవితా రీతులు నచ్చటం. రెండవది ఆ కవియొక్క జీవన దృక్పథం వల్ల ప్రభావితుడు కావటం. శ్రీ వానమామలై వరదాచార్యులుగారు 'పోతన చరిత్రం' ను వ్రాయటానికి, పైన చెప్పిన రెండూ కారణం కావచ్చును. అందులో సందేహించ వలసినదేమీలేదు.

శ్రీ వానమామలై వరదాచార్యులుగారు,1912, ఆగస్టు 16న వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు. తండ్రి గారి పేరు బక్కయ్యశాస్త్రి గారు. వారు నేటి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు అనే గ్రామంనుండి వచ్చి మడికొండలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. శ్రీ వానమామలై చిన్నతనంలో ఏ బడికీ పోలేదు. ఇల్లే ఆయనకు బడి. స్వయంకృషి వల్లే కవిత్వం, కావ్యాలు వ్రాయటం మొదలు పెట్టారు. ఆయన వ్రాసిన కావ్యాల్లో 'మణిమాల' చాలా ప్రసిద్ధి చెందింది. చెళ్ళపిళ్ళ, విశ్వనాధ వంటి వార్ల చేత ప్రశంసించబడ్డ కావ్యమది. వరదాచార్యులు గారికి పోతన జీవితమే ఆదర్శం. పోతనలాగే, వీరు కూడా 'పోతన చరిత్రం' ను శ్రీ రామచంద్రమూర్తికే అంకితమిచ్చారు. 'పోతన చరిత్రం' లో కొన్ని కాల్పనిక గాధలు కూడా వున్నాయి. అయితే, అవి పోతన గారి ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేసేవే! పోతనగారి లాగే వీరూ అతి సాత్వికులు, నిరాడంబరులు. 'పోతన చరిత్రం' వ్రాయటానికి దాదాపు పది సంవత్సరాలకు పైగా పట్టింది. అటువంటి గొప్ప కావ్యమైన 'పోతన చరిత్రం' ను ముద్రించటానికి ఎవరూ ముందుకు రాలేదు. 1966 లో అనుకుంటాను, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యగారి కృషి, సహకారం వల్ల ఈ కావ్యం వెలుగుచూసింది.

ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు తమ బహుమతితో ఈ కావ్యాన్ని, కవిని సత్కరించారు. బెనారస్లోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. పోతన నివసించిన 'బమ్మెర' తెలంగాణలో ఒక కుగ్రామం. వరదాచార్యులు గారు నివసించిన మడికొండ కూడా కుగ్రామమే! వారిరువురూ భక్తాగ్రేసరులే! అయితే ఒక చిన్న తేడా - పోతన మహాశయుని భక్తే కవిత్వమయింది. వరదాచార్యులు గారి కవిత్వం భక్తి ప్రేరితమైనది. ప్రతిపద్యం హృద్యం. జీవిత ప్రస్థానపు చివరిఘడియలలో వరదాచార్యులుగారు, వారి పూర్వీకులు నివసించిన చెన్నూరు గ్రామానికే చివరకు చేరుకున్నారు. 'అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులుగారి ఆశీర్వాదఫలం గడిచిన మూడు ప్రపంచ తెలుగు మహాసభలకు తోడు తిరుపతిలో డిసెంబర్ (2012) 27 నుంచి 29 వరకు జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల వరకూ తెలుగు జాతిని కాపు కాస్తూనే వచ్చింది. ముచ్చటైన మూడు ప్రాంతాల రూపు రేఖల్ని వానమామలై గారి పద్యంలోనే విందాం -

‘‘ప్రాచ్యదేశాంధ్ర ‘శ్రీమహాభారతమ్ము’
భవ్య తెలంగాణ ‘శ్రీ మహాభాగవతమ్ము’
మహిత రాయలసీమ ‘రామాయణమ్ము’
ఘన త్రివేణీ సమాగమాకారమూనె’’!

మరో విశేషమేమంటే, మరో అభినవ పోతన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు శ్రీ వానమామలై వరదాచార్యులు గారు దాదాపుగా సమవయస్కులు. ఒకరు తెలంగాణాను తెలుగు మాగాణిగా చేస్తే, మరొకరు ఆంధ్రావనిని పునీతం చేసారు. ఈ ఇద్దరి మహనీయుల శతజయంతి ఉత్సవాలు కూడా దాదాపుగా ఒకే సమయంలో ఘనంగా జరగటం కూడా దైవికమే! శ్రీ వానమామలై వరదాచార్యులుగారు వృద్ధాప్యంలో క్షయవ్యాధి సోకి, తన 72 వఏట -1984, అక్టోబర్ 31న, వారు భౌతిక శరీరాన్ని వీడారు. ఒకప్పుడు, వీరి జీవిత చరిత్రను తెలుగు పాఠ్యవాచకంలోబాలబాలికలు చదువుకున్నట్లుగా నాకింకా గుర్తుంది.

ఈ మధ్యనే ఆయన శతజయంతి ఉత్సవాలను జరిపి ఆయన అభిమానులు ఆయనకు ఘనమైన నివాళిని సమర్పించారు!