"ఈ రోజు మనము ఊరు వెళుతున్నాము కదా! లే ... లే అమ్మలూ... లేచి గబగబా తయారవ్వమ్మా!", హేమంతపు చలికి నిండా రగ్గు కప్పుకుని పడుకున్న పత్ర రేఖ దగ్గరగా వెళ్లి, మెల్లగా చేతి మీద రాస్తూ అంది...
ఈ సంక్రాంతి పండుగ కి పుట్టింటికి వెళ్లి పండుగ జరుపుకోవాలనే నిశ్చయించుకుని, పండగ రేపు అనగా కారులో వెళ్దామని అనుకున్నారు. శ్యామల, కృష్ణ దంపతులు
అందుకే తెల్లవారుఝామునే కూతురిని నిద్ర లేపుతోంది.
తల్లి మాటలతో రేఖ ఒక ఉదటున లేచింది. అమ్మమ్మ గారి ఊరికి బయలుదేరుతున్నాం అనుకోగానే ,ఉరికే జలపాతం లాంటి ఉత్సాహం తన్నుకు వచ్చేసింది. అంతే నిమిషాలలో చక చకా తయారయ్యి తండ్రి దగ్గరకు “డాడీ నేను రెడీ” అంటూ వచ్చేసింది.
అప్పటికే కృష్ణ కారు సిద్ధం చేసి ఉంచుకున్నాడు. హా”య్ బేబీ, వెరీ గుడ్ మార్నింగ్” అంటూ అంతలో ఏదో గుర్తొచ్చినట్లు “ హే శ్యామూ! కాఫీ ,రెడీ చేసావు కదా” !” అన్నాడు . “జీ హుజూర్ ! హాట్ ఫ్లాస్క్ లు కారులో పెట్టేసాను” శ్యామల సమాధానం ఇచ్చింది.
రేఖ ఆనందానికి అంతే లేదు. దారి పొడుగునా తల్లిని తండ్రిని ప్రశ్నలు అడుగుతూనే ఉంది. తన ఐ పాడ్ లో కనిపించే ప్రతి దృశ్యాలు తీసేస్తోంది . కృష్ణతో మాట్లాడుతున్నా శ్యామల కి చిన్నప్పటి సంక్రాంతి సంబరం కళ్ళ ముందు కదులుతూనే ఉంది
రాత్రి అనే సుందరి ఆకాశమనే వాకిట్లో ముగ్గు వేయడానికి ముందు చుక్కలనే పూలను పెట్టింది. ఆ చుక్కలే ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తే, వాటిని చూస్తూ నిలుచుండి పోయిన ఆ సుందరిని, తన భర్త అయిన చంద్రుడు సమీపిస్తూ ఉండడం చూసిన తొట్రుపాటులో ఆ ముగ్గు కాస్తా ఒలికి పోయింది. అలా పుష్య మాసం పండు వెన్నెల ఆకాశం నుండి భూమిపైకి జారిన తెల్లటి శరత్కాలంలో ఎంతో అందంగా ఉంటుంది. రామయణం లో ఈ హేమంత ఋతువు అంటే శ్రీరామచంద్రుడికి సైతం ప్రియమైనదిగా వర్ణిస్తాడు వాల్మీకి.
ఈ కాలంలో విపరీతంగా పూసే పారిజాతాలు. వాటి కోసం శ్రీకృష్ణుడు ఇంద్రునితో యుద్ధం చేశాడు అని వర్ణించడంలో అతిశయోక్తి లేదంటే, వాటి అందం ఎంత గొప్పదో ఊహించవచ్చు
ముఖ్యంగా ఈ హేమంత ప్రకృతి వర్ణనలు చేసిన శేషేంద్ర కవిత్వం అంటే శ్యామలకు చాల చాల ఇష్టం .అందుకే కూతురికి భావుకత్వం నిండిన పేరు పెట్టుకుంది.
ఇవన్నీ నెమరేసుకుంటూ, వాటన్నిటిని రేఖ కు చూపించాలి వీలయితే కనిపించే ప్రతి దృశ్యాన్ని ఫొటోలు, వీడియోలు గా తీసుకోవాలి, అని మనసులోనే నిశ్చయం చేసేసుకుంది.
“శ్యామలా దేవి గారు, ఇక గతం లోంచి వర్తమానం లోకి రండి ఆత్మ్మరాముడు తెగ గోలపెడుతున్నాడు”, అన్న కృష్ణ మాటలకు ఉలిక్కిపడింది. అప్పటికే హోటల్ ముందు కారు ఆపాడు. కారు లోంచి దిగి అందరూ లోపలి వెళ్లారు
**
సాయంత్రానికల్లా ఊర్లోకి చేరుకున్నారు.
అప్పటికే తండ్రిపోయి మూడేళ్లు , తల్లి అన్నపూర్ణ ఒక్క తే ఉంటోంది తమ దగ్గరకు రమ్మన్నా రాదు. పక్కనే మేనత్త శాంకరీ, ఆమె భర్త విశ్వనాధం ఉంటారు. “అత్తయ్య మావయ్య ఉన్నారు, తోడుగా, నాకు ఒంటరి తనం అనిపించదు” అంటుంది. పైగా “నా జీవితం ఇక్కడే వెల్లిపోనీ” అంది.
ఇంక శ్యామల ఏమి మాట్లాడలేకపోయింది.
కారు దిగంగానే, అన్నపూర్ణ దగ్గరగా వెళ్లి చేతులు పట్టుకుని “అమ్మా ఎలా ఉన్నావు’ అంది. ఆవిడ సమాధానం ఇచ్చే లోపల తుఫానులా రేఖ వచ్చి “హాయ్ అమ్మమ్మా” అని చుట్టేసుకుంది. ఆవిడ కూడా మురిపెంగా మనవరాలు బుగ్గలు పుణికింది. “ఇదే, మరి అసలు కంటే వడ్డీ ముద్దు అంటే” కృష్ణ అత్తగారి మీద చెణుకు విసిరాడు . ఒక్క సారిగా అక్కడ పరిసరాలు సందడిగా మారిపోయాయి.
**
" పండుగ మొదలయ్యింది. నీకీ రోజు బోలెడన్ని పనులున్నాయి. త్వరగా లేచి రా రా ! ఆ పొగమంచు మనల్ని పీడించకముందే, మన భోగిమంట సిద్ధమవ్వాలి," అంటూ మనవరాలిని నిద్రలేపింది
అంతే మీట నొక్కినట్లు ఠక్కున లేచి ఉత్సాహంగా, వాకిట్లోకి పరుగు తీసింది. రేఖ. అప్పటికే విశ్వనాధంగారు , కృష్ణ ఆ వీధి వారితో కలిసి భోగి మంటల ఏర్పాట్లు మొదలు పెట్టేసారు. భోగిమంటలు వేసిన తరువాత, ఆ వేడి, చలిని పారదోలుతుండగా, అమాయకంగా తన సందేహాన్ని వెలిబుచ్చింది: శాంకరి తో “బామ్మా ! ఈ మంటలు ఎందుకు వేస్తారు? ఈ చెత్తంతా తగలబెట్టేస్తే మనకి ఇక్కడ అంతా పొల్యుషన్ అయిపోతుంది కదా "
"అవునమ్మా! నీది మంచి సందేహమే. కానీ, భోగి మంటలు అంటే కేవలం చెత్త తగలబెట్టడం కాదు. మన ఇంట్లో ఉండే పాత సామాన్లు, ఇవాళ మనం వేసిన గొబ్బిళ్ళ పిడకలు.. వీటన్నింటినీ భోగి మంటల్లో వేసి కాల్చడం అంటే, పాతదంతా వదిలించుకోవడమనే అర్థం. దీని వెనుక మన పెద్దవాళ్ళ అనుభవం ఉంది. మన మనసులోని అహంకారం, కోపం లాంటి చెడు భావాలను కూడా ఈ మంటల్లో వేసి, కొత్త జీవితాన్ని ఆహ్వానించాలనే అనుభూతిని ఇది ఇస్తుంది."
“అసలు సంక్రాంతి పండుగ అంటే చెబుతాను, విను ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల వర్ణశోభలతో చిత్రవిచిత్రమైన రంగవల్లులూ, గొబ్బియలూ కనువిందు చేస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజుల్లో వేసే ముగ్గుల్లో వైవిధ్యం కనిపిస్తుంది. రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దుతారు.. గొబ్బిళ్లలో బంతిపూలు, సంపెంగలు సుగంధాలు వెదజల్లుతాయి. హరిదాసుల కీర్తనల భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక భావాలు పారవశ్యాన్ని కలిగిస్తాయి. రైతుల లోగిళ్లలో ప్రకాశించే బంగారు రంగు ధాన్యం, కొత్తబెల్లం, పండు మిరపకాయలు పంటల పండుగగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సంక్రాంతి రాకతో ఆయురారోగ్యం ఐశ్వర్యాల ఆనందాల అద్వైతతత్త్వం అంతర్లీనంగా గోచరిస్తుంది. అర్డంయిందా తల్లీ’ అన్నారు
“మీరు అంత వివరంగా విడమర్చి చెప్పాగా అర్డంకాకపోవడమేమిటి . మావయ్యా! ఇది గొ కాఫీ తెసుకోండి” అతని చేతికి గ్లాసు అందించింది. శ్యామల
ఈ లోపల అన్నపూర్ణ మనవరాలికి తలస్నానం చేయించింది భోగి పీడా వదలాలి అంటూ ఆవిడ చెప్పే మాటలకు ఊకొడుతున్నా కట్టబోయే పట్టు పట్టు పరికిణి పైన ఉంది దృష్టి అంతా! అమ్మా అమ్మమ్మ్మా చెప్పినట్లుగా బొమ్మల కొలువు పెట్టుకుని మొదటగా విఘ్నేశ్వరుడిని, ఆ తర్వాత కొత్త గా కొనుక్కున్న రాధాకృష్ణుల విగ్రహాన్ని అమర్చుకుంది.
ఆ రోజు సాయంత్రం రేఖ,
చేమంతులు జడల్లో తురుముకుని, బంతి పూలతో గొబ్బెమ్మలను పీటలపై పెట్టి అందరూ చుట్టూ చేరి పాటలు పాడారు. తల్లి ఇంకా కొంతమంది అక్కడి స్నేహితులని తోడు తీసుకుని కుంకుమ భరిణ పట్టుకుని పేరంటానికి బయలుదేరింది. ఇంటింటికీ వెళ్తూ, "బాగున్నారా అమ్మా! రేపు మీరు తప్పకుండా మా ఇంటికి పేరంటానికి రావాలి," అని బొట్టు పెడుతుంటే, రెండు వీధుల అవతల ఉండే బామ్మగారు రేఖ బుగ్గలు నిమురుతూ, ఆప్యాయంగా పలకరించారు:
“అబ్బో అప్పుడే ఎంత పెద్దదానివయ్యావు! మా మనవరాళ్లు కూడా పెట్టుకుంటారు నువ్వు కూడా రా అంటూ “ఓ లాస్య, సుప్రియా ఇలా రండి మీరు కొనుక్కున్న కొత్త బొమ్మను, అన్నపూర్ణ అమ్మమ్మ మనవరాలు రేఖకు చూపించాలి కదా”!అంటూ వాళ్ళ వైపు తిరిగి “శ్యామలా బావున్నవే ! నీ ఉద్యోగ అదీ బావుందా, మీ ఆయన కూడా వచ్చాడా పండగ కి , ఇంకేం మా అన్నపూర్ణ ఇల్లంతా సందడే సందడి” అంటూ, “తప్పకుండా వస్తాం. అమ్మా, నువ్వు ఇలా వచ్చి పిలవడమే బహు బాగు” అంటూ రేఖలు బుగ్గలు గట్టిగ చిదిమింది. అందరూ నవ్వుకున్నారు ఆ చర్య కు .
అలసిపోయి ఇంటికి చేరిన రేఖ ను చూసి, విశ్వనాధం, "అమ్మలూ, అప్పుడే అలసిపోతే ఎలా రేపు సంక్రాంతి ,ఆ తరువాత కనుమ,అలాగే ఓపిక ఉంటె ప్రభల తీర్థం అన్ని చూడాలి మరి, అన్నట్టు నీ ఐ పాడ్ లో ఫోటోలు వీడియో లు మర్చిపోకుండా తీసుకో” అన్నాడు
“అలాగే తాతగారు” అంది
**
విశ్వనాధం ,కృష్ణ ఉదయాన్నే మాట్లాడుకుంటూ నడుస్తున్నారు
గుడిలోనూ, చెరువుగట్ల దగ్గరా దీపాలు వదిలి పూజలు చేసుకుని గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కనపడుతున్నారు. ఇంత చలిలో ముగ్గులేస్తూ,పాటలు పాడుకుంటున్న వాళ్ళని చూస్తుంటే భక్తి పారవశ్యంతో పాశురాలు ఆలపిఇస్తున్న గోదాదేవిలా ఉన్నారు అనుకున్నారు.
“పెదనాన్నగారు ఈ రావిచెట్టు మీద ఉన్న కొంగల గురించి అచ్చు పత్తి దూదల్లా కనిపిస్తున్నాయి. ఆకాశంలోని తెల్లటి మేఘం కొమ్మలకు అతుక్కున్నట్లే అనిపిస్తుంది."
విశ్వనాధం, నవ్వుతూ కృష్ణ భుజంపై చెయ్యి వేసి "చూశావా కృష్ణా, ఈ చలికాలం గొప్పదనం అదే! రైతులు ఈమధ్యనే వేసిన పత్తిపంట పక్వానికి వచ్చి పగిలి, ఆ పత్తికాయల దూది ఏమైనా గాలికి ఎగిరి ఈ కొమ్మల చివరన అతుక్కుందా? లేక మొన్నామధ్యే వెళ్ళిన శరత్కాలంలోని శరన్మేఘం ఒకటి ఈ రావి చెట్టుని ఢీకొని అందులోని ఆ తెల్లదనమంతా విడివడి ఇలా ఈ కొమ్మల చివర్లన ఉండిపోయిందా? అని కవి మనస్సు అడుగుతుంది. అది కేవలం కొంగల గుంపు కాదు హేమంత ఋతువు మనకు ఇచ్చే గొప్ప కవిత్వం. మన అనుభూతులు, మన కళ్ళకు కనిపించే సౌందర్యాన్ని పెంచుతాయి."
**
ఆ మూడు రోజులు ఎంతో ఉత్శాహంగా సందడిగా పండుగ జరుపుకున్నారు. పండుగ అనుభూతిని నింపుకోవాలని ప్రతి ఏడాది అమ్మమ్మగారి ఊరు రావాలని రేఖ తీర్మానం చేసింది.
అందరూ నవ్వుతూ “ఎస్స్స్…” అంటూ బొటనవేలు పైకెత్తిన ఆ క్షణంలో, చల్ల గాలి లోపలికి వచ్చి, బంతి పూల పూల వాసనతో గదంతా నింపేసింది. శ్యామల ఆ సువాసనలో చిన్ననాటి పండుగ, అమ్మ, తన అమ్మమ్మ, ఆ హడావుడి … అన్నీ కళ్లముందు నిలిచాయి.
ఆమె నిశ్శబ్దంగా రేఖను చూసింది. బాల్యంలో తాను ఉన్న చోటే ఇప్పుడు తన కూతురు నిలబడి ఉందనిపించింది.
వాతావరణాన్ని కాస్త తేలిక చేయడానికి నవ్వుతూ,
"ఇదిగో శ్యామలా దేవి గారు… నా భవిష్యత్తు తీర్మానమైపోయింది! మనం ప్రతి సంక్రాంతికి రావాల్సిందే! " అన్నాడు కృష్ణ.
**
ఆ రోజు రాత్రి, అందరూ విశ్రాంతి తీసుకున్న తర్వాత, శ్యామల తన తల్లి అన్నపూర్ణ గదిలో కూర్చుని ఉంది. "అమ్మా, నాన్న పోయి మూడేళ్లు అయింది. నువ్వు మాతో రాకపోతే నాకు చాలా కష్టంగా ఉంది. ఈ ఇల్లు నీకు చాలా ఇష్టం, కానీ నన్ను అర్థం చేసుకో" అంది శ్యామల.
అన్నపూర్ణ మౌనంగా తన పక్కనున్న పాత చెక్కపెట్టె తెరిచి, జాగ్రత్తగా మడచిన ఒక లేఖ తీసి శ్యామలకు ఇచ్చింది. "నీ నాన్న... చనిపోయే ముందు రాసింది... సమయం వచ్చినప్పుడు నీకు చూపించాలని ఆగాను” అంటూ చేతిలోపెట్టింది
"అన్నపూర్ణా... ఈ ఊరు మట్టి లో,ఈ ఇంటి గోడలలో నా జ్ఞాపకాలు ఉన్నాయి. నేను పోయినా ఈ ఇల్లు మన ఇల్లు గా నే మిగిలాలి. అది నా స్వార్ధమే అనుకో! మన అమ్మాయి, అల్లుడు, మనవరాలు ప్రతి ఏడాది మన ఇంటి కి రావాలి. పండగ కాంతులు నింపాలి ఈ ఇల్లు, మన గతం-వర్తమానం-భవిష్యత్తులను కలిపే వంతెనగా ఉండాలి. తప్పక తీరుస్తావు కదూ !"
ఆ ఉత్తరం చదివి మౌనంగా కూర్చుండిపోయింది. శ్యామల. కళ్లు చెమ్మగిల్లాయి.. అది వట్టి అక్షరాలు కాదు, పుట్టిన ఊరు మీద ప్రేమ, మమకారం తో తండ్రి రాసిన ఉత్తరం. అదే కాదు తల్లి మీద నమ్మకం.
ఆలోచనలలో మునిగిపోయిన కూతురిని దగ్గరగా తీసుకుని చేతిలో చేయి వేసి, "అందుకేనే... ఈ ఇంటిని వదిలి రావడం అంటే, నాకు ప్రాణం వదిలి వచ్చినట్టే, మీ నాన్న ప్రేమ ఇక్కడ శాశ్వతంగా ఉంది," తల్లి మాటలకు శ్యామలకు లో లోపల బాధ పడింది పదే పదే తల్లి ని రమ్మని బలవంతం చేసినందుకు. కానీ అమ్మ మొండితనం వెనుక తండ్రి మాట పైన ఇంతటి గొప్ప ప్రేమ త్యాగం దాగి ఉందని ఆమె ఊహించలేదు.
శ్యామల కళ్లు తుడుచుకుంటూ, “అమ్మా నన్ను క్షమించు” అంది.
అన్నపూర్ణ “ఏమిటి పిచ్చిదానిలా .పొద్దునే ప్రయాణం, హయిగా వెళ్లి పడుకో” అంటూ భుజం తట్టింది.
**
తెరచిన కిటికీ లోంచి మంచు గాలి కి రేఖ ముంగురులు ఎగురుతున్నాయి, కారు ఊరి పోలిమేరలు దాటింది.
ఆ ఉదయస్తమానాల్లా, ఆ ఊరి మీద, తల్లిదండ్రుల హృదయాల్లో, అమ్మమ్మ ఇంటి గోడలపై ఒక మెరిసే మెరపు రేఖలా పండగ అనుభూతులు నిలిచిపోయాయి.
నిజానికి ఆ ఇంట్లో సంక్రాంతి పండుగ ముగియలేదు … జ్ఞాపకాలు, ప్రేమానుబంధాలను ముడి వేస్తూ కొత్త (సం)క్రాంతి మొదలైంది
***

