కొన్ని జ్ఞాపకాలు - కార్టూనిస్ట్ జయదేవ్

few memories with Bapu

ను నిత్యమూ రామ నామం ఆయన నోట వినిపించేది. గోతెలుగుకు లోగో, ముఖ చిత్రం కావాలని అడిగినప్పుడు, వెంటనే ఆ రాముడి మీదే ఒక అందమైన కార్టూను గీసి బన్ను గారికి పంపారు. ఆ కార్టూను గీసే సమయంలో వారి సతీమణికి ఆరోగ్యం బాగా లేదు. ఐనా కార్టూను గీశారు. బాపు గారిని నేను చివరిగా కలిసింది ఫిబ్రవరి 2014లో. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. అప్పటికి ఆయన చాలా ఉత్సాహంగానే కనిపించారు. మీతో ఒక ఫోటో తీసుకుంటాను, చొక్కా కొద్దిగా సర్దుకోండి సార్ అనడిగాను. వొద్దు అసహజంగా ఉంటుంది, కెమెరా క్లిక్ చెయ్యండి అన్నారు.

గోరంత దీపం షూటింగు బాపు రమణల చిత్రకల్పన స్టూడియోలో సాగుతోంది.బాపు గారు కోరుకున్నట్టే వాణిశ్రీ మేకప్ లేకుండా షూటింగ్ స్పాటుకు కారులో వచ్చి దిగింది. ఆ పాటికి ఆమెకు సంబంధించిన షాటుకు క్రూ రెడీగా ఉంది. బాపు గారు ఒక నిముషం ఆగండి అని చెప్పి, కాస్ట్యూంస్ అసిస్టెంటు ( ఒక లేడీ ) ను పిలిచి ఆమె చెవిలో ఏదో చెప్పారు. ఆ లేడీ అసిస్టెంటు వాణిశ్రీని ఒక గదిలోకి తీసుకెళ్ళింది. ఐదు నిముషాల తరువాత వాణిశ్రీ గదిలోంచి బయటికి వచ్చింది. బాపు గారు, వెంటనే గెట్ రెడీ అని షూటింగ్ క్రూ కి ఆర్డరిచ్చారు. ఎందుకు వాణిశ్రీని గదిలోకి పంపించారు, మేకప్ టచప్ కా? ( ఆమెకి మేకప్పే లేదుగా ) అందుకు కాదు. వాణిశ్రీ చీర టైట్ గా కట్టుకొచ్చింది, కాస్తవొదులుగా కట్టుకుంటే వాణిశ్రీ మరింత అందంగా కనబడుతుందని ఆ పని చేయించారు. గోరంత దీపం లో వాణిశ్రీ అందం తో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షక జనాన్ని కవ్వించింది. అన్నింటికి మించి ఆమెలోని సహజ స్త్రీ సౌందర్యాన్ని తెరమీద బాపుగారు అద్భుతంగా తీర్చిదిద్ది నయనారవిందం గావించారు.

అమ్మాయిలో అందం, ఆమె బట్టకట్టే తీరు, నడిచే నడక, చూసే చూపులోనే వుంటుందంటారు. బాపు " హ్యూమన్ " ఎనాటమీ స్పెషలిస్టు. ఆ ఎనాటమీని ఎలా స్టడీ చేయాలి, ఏ విధంగా ఇన్నోవేటివ్ గా ప్రదర్శించాలో ఆయనకి కొట్టిన పిండి. వాకిలి ముందు ముగ్గు పెట్టే అమ్మాయి బొమ్మ, వొంపు సొంపులూ, వయ్యారాల కలబోత చూడముచ్చటేస్తుంది. నిజానికి ఆ అమ్మాయిని నిలబెడితే ఎనిమిదడుగుల పొడవుంటుంది అని చెప్పి తనదైన ధోరణిలో నవ్వుతారు బాపు గారు. ఆర్టిస్టు అనేవాడు, ఆ బొమ్మ గీసేప్పుడు వెనక నుంచి ఆలోచించాలట.అంటే ముందుగా ఎనిమిదడుగుల అమ్మాయిని ఊహించుకుని , ఆమెని వంచి ముగ్గు పెట్టేలా చిత్రించాలా అని అడిగితే, అది కూడా తప్పే. ఆర్టిస్టుకు హ్యూమన్ ఎనాటమీ మీద ముందుగా పట్టు సాధించాలి, శ్రమ పడాలి. లైఫ్ స్కెచ్చింగ్ చెయ్యాలి. తర్వాత ప్రయోగాలు చెయ్యాలి. బొమ్మ అదుపులోకి వస్తుంది అంటారు బాపు గారు. బొమ్మ మీద పట్టు సాధిస్తే, ఆర్టిస్టుకి వేరే ఏ పనైనా సులభ సాధ్యం అవుతుంది. అందుకే బాపుగారు కాగితం నుంచి వెండితెరకు పెద్ద అంగ వేయగలిగారు.

మీకిన్ని ఐడియాలు ఎలా వస్తాయి సార్ అని అడిగాను ( వారి ప్రతి జన్మ దినం, డిసెంబరు 15న, ఆళ్వారుపేట ఆంజనేయస్వామికి అర్చన చేసి, అర్చన ప్రసాదం పొద్దున్నే పట్టుకెళ్ళి వారికిచ్చి, నా శుభాకాంక్షలు తెలిపేవాడిని.) మీ చొప్పదంటు ప్రశ్నకి సమాధానం తెలిస్తే, నేను తిన్నగా హనుమంతుడిగా మారిపోయి, రాముడి కొలువులో చేరిపోదును కదా. అని వెకిలిగా నవ్వేశారు. ఆ తర్వాత ఆ ప్రశ్న నన్ను నేను కూడా అడగడం మానేశాను.

బొమ్మకీ, ఐడియాకీ ఆవిర్భావ సంబంధం ఉందంటారాయన. ఏ బొమ్మ గీసినా, ఆబొమ్మలో ఒక ఆలోచన చెక్కాలి అని ఆర్టిస్టులకి సలహా ఇస్తారు. ఆయన చేసిన పనీ అదే. అందుకే బాపు బొమ్మ ఒక కావ్యాన్ని పలుకుతుంది.

సార్, మీ సినిమాలు చూసేప్పుడు వాటిల్లో ఏమైనా తప్పులున్నాయా అని వెతుకుతుంటాను. మిమ్మల్ని పట్టుకోవాలని..ఐతే, మీరు నాకు ఆ చాన్సే ఇవ్వలేదు. ప్రతి సారీ మీ సినిమా చూసినప్పుడు అందులో ఏదో మరొక కొత్త అంశం కనిపించి, నేను విస్తుపోయేలా చేస్తుంది..అదెలా..? అనడిగా ఒకసారి. కళ్ళు మూసుకుని, చేతులు పైకెత్తి చూపి, అంతా ఆ శ్రీరాముడి దయ అన్నారు.

బాపు గారికి శ్రీరామ కటాక్షం మెండుగా ఉంది. ఆయన అపర పోతన !