వంశీగారు - చేపల పులుసు - బన్ను

Vamsy gari chepala pulusu

నేను అప్పుడప్పుడు అంటే మూడు నెలలకోసారో లేక ఆరు నెలలకోసారో 'వంశీ' గారిని కలుస్తూ వుంటాను. ఇటీవల ఆయన్ని కలుసుకోవడానికి ఆయన ఇంటికెళ్ళి వస్తుంటే... 'మీరెటెల్తున్నారు? బంజారాహిల్సా? నన్ను కృష్ణానగర్ లో 'చక్రి' గారి ఇంటి దగ్గర డ్రాప్ చేయండన్నారు. సరేనని బయలదేరాము.. 'సార్... మీరు పులుస చేప మీద కధ ఏమన్నా వ్రాశారా?' అనడిగాను. 'రాశానండీ... పసలపూడి కధల్లో చిట్టమ్మ పెట్టిన చేపలపులుసు అనే కధ వ్రాశాను, దానిమీదో కథుంది అన్నారు. 'అవునా? ఏమిటండది?' అనడిగాను.

మొన్నీ మద్యే నాకో ఫోనొచ్చింది.. ఆడగొంతు... "వంశీ గారా?..." అనడిగింది.. "అవునండీ... మీరెవరు?" అనడిగాను.

"చెప్తాను.. నాకెవరో మీరు వ్రాసిన పసలపూడి కధల పుస్తకం ఇచ్చారు. దాన్ని టేబుల్ మీద పెట్టాను. ఓ సారి తిరగేస్తే అదంతా ఈస్ట్ గోదావరి యాసలో వుంది. మాది నెల్లూరు. చదవడానికి కష్టమైనా... ఇంట్రస్టింగ్ గా అనిపించి ఓ కధ చదివాను. బాగుంది.. అలా కష్టపడి రెండువారాల్లో మొత్తం పుస్తకం చదివేశాను. నన్ను బాగా ఆకట్టుకున్న కధ మీరు వ్రాసిన చిట్టమ్మ - చేపలపులుసు. ఆ కధ చదివాక ఆ కూర తినాల్సిందే అనిపించింది" అదండీ ఆవిడ.. అన్నారు.

"ఇంతకీ మీరేవరండి?" అని అడిగానండీ.. ఐతే ఆవిడ "చెప్తా... మా ఇంట్లో ఇద్దరు కుక్ లున్నారండి ఒకరు ఈస్ట్ గోదావరి.. మరొకరిది నెల్లూరు.  మీరు చెప్పినట్టు మా మేనేజర్ని రాజమండ్రి పంపించి... మీరెవరైతే చెప్పారో.. ఆమె దగ్గరనుంచే పులుస చేప తెప్పించి.. మా ఈస్ట్ గోదావరి కుక్ తో మీరు ఎలా చెప్పారో అలాగే.. చింతపండుని లేత కొబ్బరి నీళ్ళలో పిసికించి వేసి, ఆవకాయ నూనె వేసి.. వెన్నపూస మరుగుతున్న పులుసులో వేసి.. అన్నట్టు మీరు చెప్పినట్టే అది బుడుంగుని మునిగి.. పైకొచ్చి కరిగిందండోయ్... తర్వాత కొత్తిమీర వేయించి ఆ పులుసుని భోషాణం పెట్టిలో పెట్టించి తర్వాత రోజు తిన్నానండి...అద్భుతం! ఆహా (.. అన్నట్టు నేను నాన్ వెజ్ మానేశాను.  కాని ఆ ఒక్కపూటా తిని మళ్ళీ మానేశాను" అదండీ ఆవిడ అన్నారు.

"మీరేవరండీ.." అనడిగారా అన్నాను. "లేదండీ.. ఆవిడే చెప్పింది... నా పేరు 'వాణిశ్రీ' అని..." అన్నారు. నాకు భలే అనిపించిందా సందర్భం! అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా...!!

మరిన్ని వ్యాసాలు

Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు