అలా మొదలై..... - .

alaa modalai..

కార్టూనిస్టుగా తెలుగు పత్రికలతో, పాఠకులతో నాది దాదాపు ముప్పైఅయిదేళ్ళ అనుబంధం..
పాఠకులేం కోరుకుంటారో సాహితీ మిత్రులతో చర్చించిన విషయాలన్నీ మనసులో నిక్షిప్తమై ఉన్నాయి...
కుటుంబమంతా కలిసి చదువుకునే వారపత్రిక... అందరికీ అందుబాటులో ఉండే పత్రిక నా మనసులో
అలా కదలాడుతూ...రూపు దిద్దుకున్న ఒక ఆలోచన.... గోతెలుగు .కాం.

ఆలోచనైతే ఉండింది కానీ ఎక్కడి నుండి మొదలెట్టాలి..?
ఎలాంటి రచనలు ఎన్నుకోవాలి? ఎవరికి సంపాదకత్వ బాధ్యతలు అప్పగించాలి?

కార్పొరేట్ వ్యవహారాల్లో, క్షణం తీరిక లేని పనుల్లో నిత్యం తల మునకలై ఉండే నాకైతే రచనలను సమీకరించడం, చదివి నిర్ణయాలు తీసుకునేంత సమయం ఉండదు... సరిగ్గా అలాంటి సమయంలోనే మా గురుదేవులు శ్రీ జయదేవ్ బాబు గారిని సంప్రదించడం జరిగింది. వారి సలహా, సూచనలమేరకు...పత్రిక ఆలోచనను వివరిస్తూ, ముఖ చిత్రం గీసివ్వమని పద్మశ్రీ స్వర్గీయ శ్రీ బాపు గారిని అభ్యర్థించాను..వారు దయతో అంగీకరించి. అందమైన లోగోని, ప్రారంభ సంచికకి చక్కని ముఖచిత్రంతో శ్రీకారం చుట్టడం, దీవెనలందించడంతో గోతెలుగు.కాం  ఒక రూపుకి వచ్చింది.మిత్రులు సిరాశ్రీ గారు, శ్రీ సూర్యదేవర రాం మోహన్ రావు గారు, ప్రముఖ దర్శకులు శ్రీ వంశీ గారు, శ్రీ భాస్కరభట్ల గారు.. ఇలా ఒక్కొక్కరు తోడై పత్రికకు తమ కలాల బలాన్నందించారు.

పత్రిక ఆలోచనకి స్పందించి ఆనందంగా మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. పత్రికారంగంలో పాతికేళ్ళ అనుభవం కలిగిన మాధవ్ గారు. కథలకు వారు గీస్తున్న బొమ్మలకు వచ్చిన స్పందనకూ, రచనల ఎంపిక విషయంలో మాధవ్ గారి చురుకైన పాత్రకూ మెచ్చి వారికే సంపాదకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలాగే, కార్టూనిస్టు మిత్రులందరూ చక్కని కార్టూన్లతో, రచయిత(త్రు)లందరూ మంచి కథలతో పత్రికనలంకరిస్తున్నారు.

వెబ్ పత్రికా ప్రపంచంలో మరే పత్రికా ఇవ్వని విధంగా ప్రచురించిన ప్రతి రచనకూ మా పరిధిలో పారితోషికాలు క్రమం తప్పకుండా చెల్లిచడం జరుగుతోందని సాహితీ మూర్తులందరికీ విదితమే... లాభాపేక్ష లేకుండా సాగితోన్న ఈ సాహితీ క్రతువుకు ప్రత్యక్షంగా, పరోక్షన్గా సహకరిస్తున్న వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.... ఈ అభిమానం కలకాలం ఇలాగే నిలవాలని ఆకాంక్షిస్తూ

-మీ
బన్ను