మరో మిథునం - భమిడిపాటి ఫణిబాబు

maro mithunam

శ్రీరమణ గారు వ్రాసిన "మిథునం" కథ చదవని వారు కానీ, ఈమధ్యన వచ్చిన, ఆ కథని తెరపైకెక్కించిన సినిమాని చూడనివారు కానీ ఎవరూ ఉండరు. ఆ కథలో బుచ్చిలక్ష్మిగారి కంటే అప్పదాసు గారు ముందరే ఈ లోకాన్ని విడిచిపెట్టినా, ఆవిడ తనకైన ప్రత్యేక కారణాల వల్ల, ఆయనే ముందుగా స్వర్గస్థులవడం తట్టుకోడమే కాక, తన ఆలోచనలని సమర్ధించుకుంటారు కూడానూ. ఆవిడ పసుపుకుంకాలు పోవడంతో, పాఠకులందరూ ఓ కన్నీటి చుక్క విడుస్తారు. హృదయానికి హత్తుకునే ఒక మహత్తర నవలిక "మిథునం". అందులో సందేహమేమీ లేదు. పోయినవాళ్ళెప్పుడూ అదృష్టవంతులే.

కానీ, ఒక్క క్షణం ఇంకోలా కూడా ఆలోచించి చూడండి. నా ఉద్దేశ్యంలో ఆయనకంటే ఆవిడే ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టేసుంటే ఎలాగ ఉండేది? "మిథునం" కథ ఎప్పుడో 20 వ శతాబ్దం నాటి కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వ్రాసింది. కానీ 21 వ శతాబ్దంలో పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. నేను చూసిన చాలా కుటుంబాల్లో, భార్యే ముందుగా పసుపుకుంకాలతో పైలోకాని కి వెళ్ళిపోతే ఎంత బావుండునో కదా అనే వాతావరణం కనిపిస్తుంది. కారణాలు అనేకం. భర్త పోగానే, ఏదో కొన్నిరోజులు సానుభూతి చూపిస్తారు, ఆ తరువాత కూతురుకానీ, కొడుకుకానీ ఈ బతికున్న అమ్మగారిని తమవద్దకు వచ్చేయమంటారు. కానీ అలా రమ్మనడానికి ఉన్న కారణాలు వేరు. అలాగని ప్రేమ, అభిమానమూ లేదనము. కానీ ఈ ప్రేమాభిమానాలని, వారి స్వార్ధం కప్పేస్తుంది.

స్కూలుకి వెళ్ళే పిల్లలని చూడడానికే ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. మరీ అలా అంటే ఒప్పుకోరనుకోండి ఈ తరంవారు, కానీ జరిగేది మాత్రం అదే. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళే ఈ రోజుల్లో, నమ్మకంగా ఇంట్లోఉండి, పిల్లల బాగోగులు చూసుకోడానికి ఈ అమ్మమ్మ/ నానమ్మ లకంటే ఇంకోరెవరుంటారు చెప్పండి? ఇదివరకటి రోజుల్లో అంటే భర్త తోడున్నప్పుడైతే, ఈవిడకి ఏ మందో మాకో వేయవలసొచ్చినా జ్ఞాపకం ఉంచుకుని, ఆ మాత్ర ఏదో వేసుకోమనేవాడు. పైగా వీటిల్లో కొన్ని కొన్ని మాత్రలు పరగడుపునే వేసికోకూడబడదైన కారణం చే, గొంతుకలో ఏదో ఒకటి వేసికుని, మరీ మాత్రలు వేసికోవాలని గుర్తుచేసేవాడు. ఇప్పుడు కట్టుకున్నవాడు లేకపోయినా, మాత్రలూ, మందులూ మాకులూ వదల్లేదుగా. మనవణ్ణో, మనవరాలినో స్కూలుకి తయారుచేయడానికే టైముల్లేని ఈ రోజుల్లో ఇంక మందులకీ వాటికీ శ్రధ్ధ ఎక్కడుంటుందీ? వీటికి సాయం, ఇంట్లో వంటచేయడానికో  వంటమనిషొకటి. ఆ మనిషివచ్చి ఏదో తయారుచేసేదాకా, దిక్కులేదు. పోనీ అలాగని ఏ బిస్కట్టు ముక్కో నోట్లోవేసికుని ఆ మందేదో వేసికుందామా అంటే, అలాటి అలవాటే లేదాయె. ఇదే భార్య పోయి భర్తే మిగిలాడనుకోండి, గొడవేలేదు,  ఏదో వంక పెట్టుకుని బయటకు వెళ్ళి ఏదో ఒకటి నోట్లో పడేసికుని, తరువాత ఆ మందేదో వేసికుంటాడు. కానీ, భర్తృవిహీన అయిన భార్యకి ఈ సదుపాయం లేదే. పైగా ఇలాటివన్నీ చెప్పుకోకూడదూ. అధవా ధైర్యం చేసి చెప్పుకున్నా, అవహేళన చేసేవారే కానీ, అర్ధం చేసికునేవారు తక్కువ.

పిల్లలు స్కూలుకీ, కొడుకూ, కోడలూ ఆఫీసుకీ వెళ్ళిన తరువాత తెలుస్తుంది, ఆ పనిమనిషీ, వంటమనిషీ ఆ పూటకి రావడం లేదని.  వాళ్ళు రావడంలేదని, అంటగిన్నెలు అలా వదిలేస్తే బాగోదుగా, ఓపిక ఉన్నా లేకపోయినా, ఆ అంటగిన్నెలు కడుక్కుని, కొద్దిగా ఉడకేసికుని తినాల్సిందే కదా. సాయంత్రం వాళ్ళు వచ్చిన తరువాత, పోనీ ఇదీ పరిస్థితీ అని చెప్తే, " అయ్యో ఫోను చేయాల్సిందండీ, నేను ఆఫీసునుండి వచ్చేసేదానినీ.." అంటూ, ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చేస్తుంది. ఈవిడ ఒక్కరోజుకే కదా అని ఫోనూ చేయదూ, అధవా చేసినా, మీటింగులో ఉన్నానండీ అంటూ తప్పించుకున్నా ఆశ్చర్యం లేదు. ఈమాత్రం దానికి వెలితి పడడం కూడా ఎందుకూ?

వారాంతంలో పిల్లలని బయటకు తీసికెళ్ళే కార్యక్రమాలుంటాయి. ఏదో మరీ చంకలో వేసికెళ్ళాల్సిన పిల్లలుంటే తప్ప, ఈ అత్త/అమ్మ గారిని ఎవరూ పట్టించుకోరు. శనివారం అంటే ఏదో ఫలహారం చేసికుంటూంటారుకదా, పోనీ ఆ వంటావిడ వచ్చి ఏదో ఒకటి చేస్తుందిలే అని కూర్చుంటే, అప్పటికే ఆవిడకి పిల్లలు చెప్పేసుంటారు-- మేము బయటకి వెళ్తున్నామూ, రావఖ్ఖర్లేదూ- అని.ఇంట్లో ఒక ప్రాణి ఉందీ అనే గుర్తుండదు.

మరీ ఇదివరకటి రోజుల్లోలాగ కాకుండా, ప్రభుత్వం వారి ధర్మమా అని, ప్రస్తుతం, ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తోంది. అంటే ఆర్ధికంగా ఈ భర్తృవిహీనలెవ్వరూ, ఇంకోరిమీద ఆర్ధికంగా ఆధారపడే పరిస్థితి కాదు. కానీ ఉపయోగమేమిటీ, డబ్బులు ఏ.టి.ఎం నుండి తీసికోడం రాదు, కొడుకునో, కోడలునో అడగాలి, వారికి టైముండాలి, డబ్బులు తేవాలి. అలాగని ఇదివరకటి రోజుల్లోలాగ పిల్లలు, తమ తల్లితండ్రుల పెన్షన్ మీదే బతుకుతారని కాదు, పైగా ఎప్పుడైనా డబ్బులు ఏ.టి.ఏం కి వెళ్ళి తీసుకురమ్మన్నా, ఆమాత్రం డబ్బులు నేనివ్వగలనులే అనేసి ఊరుకోబెడతారు. అలాగని వీరికి కావలిసినంతా ఇస్తారా అంటే అదీ లేదు. ఇంట్లోనే కూర్చునేదానికి డబ్బులెందుకూ అనే కానీ, పోనీ ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలొచ్చినప్పుడు, వాళ్ళ చేతుల్లో పెట్టడానికి అడుగుతోందేమో అమ్మా అనే ఆలోచన ఆ కొడుక్కీ రాదు.

ఇలా చెప్పుకుంటూ పోతే  సంతోషించాల్సిన విషయాలకంటే, బాధపడే సంఘటనలే ఎక్కువగా ఉంటాయి. అదే భార్యా విహీనుడైన భర్త విషయం చూడండి, పరిస్థితులు నచ్చకపోతే, ఆరోగ్యం బాగా ఉన్నంతకాలం, ఏ తీర్థయాత్రల పేరో చెప్పి వెళ్ళిపోతాడు.మరి ఈ సదుపాయం భర్తృవిహీనలైన భార్యలకి ఉందంటారా? తీర్థయాత్రల మాటదేముడెరుగు, ఒకసారి బయటకు వెళ్ళాలంటేనే లక్ష ప్రశ్నలు వేస్తారు.

ఇన్నిన్ని కష్టాలు పడుతూ బతికేకన్నా, హాయిగా భర్త ఒడిలో వెళ్ళిపోతేనే హాయికదా. నిజమే, భర్తలేకుండా భార్యా, భార్యలేకుండా భర్తా బ్రతకడమంత కష్టం ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ, అన్ని విషయాలూ బేరీజు వేసికున్నతరువాత ఆవిడే ముందు వెళ్ళిపోవడం హాయేమో అనిపిస్తుంది. అలాగని ఆవిడ లేకపోతే ఈయన ఏవో వెర్రివేషాలు వేయాలని కాదు, బాధనేది ఉంటుంది, కానీ, ఆ వెర్రి ఇల్లాలు సుఖపడాలంటే మాత్రం ఆవిడే ముందుగా వెళ్ళిపోవాలనేది నా అభిప్రాయం.





భమిడిపాటి ఫణిబాబు
 

మరిన్ని వ్యాసాలు

పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
కార్తిక పౌర్ణమి.
కార్తిక పౌర్ణమి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటటల పల్లకిలో...2
పాటటల పల్లకిలో...2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి
పురాణాలలో ఒకే పేరు పలువురికి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు