'చెంగల్వ పూదండ': పుస్తక సమీక్ష - ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ

Errapragada Ramakrishna 'chengalva poodanda': Book review

పుస్తకం: చెంగల్వ పూదండ

వెల: రూ. 70/- ($10)

ప్రతులకు:
శ్రీమతి శ్రీలక్ష్మి
సీ-9, ఎమెరాల్డ్ ఎంక్లేవ్, మేడూరి సత్యనారాయణ వీధి,
గాంధిపురం, రాజమండ్రి- 533103

దూరవాణి: 0883-2469411

సంచారవాణి: 9397907344

ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ ..ఈ పేరు చూస్తుంటే భారతం, రామాయణం, భాగవతం కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఎఱ్ఱాప్రగడ భారతం వ్రాస్తే, రామ కృష్ణులిద్దరూ రామాయణ, భాగవత పురుషులని వేరే చెప్పక్కర్లేదు. ఇంతకీ ఈ రామకృష్ణ గారు గుబాళించే 'చెంగల్వ పూదండ'ను అల్లారు. ఆ దండే మనకొక పుస్తకంగా కనిపిస్తుంది. అందులో ఉన్నవన్నీ వ్యాసాలు. అలా దీనినొక వ్యాసగుచ్చం అని కూడ అనవచ్చు. చూసారా 'వ్యాస గుచ్చం' అన్నదాంట్లొ భారత, భాగవత కారుడు వ్యాసుడు కూడా తొంగిచూస్తున్నట్టు లేదూ!

ఈ చెంగల్వ పూదండ శ్రీ బాపూ-రమణలు ఈటీవి కోసం రూపొందించిన శ్రీ భాగవతం ధారావాహికకి అక్షర రూపం. అంటే ఇందులొ ఒక్కొక్క వ్యాసం ఒక్కో భాగం అన్నమాట. ఈటీవి భాగవతంలో కొంత రామాయణం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు భాగవత పురుషుడు కనుక మత్స్యావతారాదిగా కృష్ణావతారం వరకు బాపూ రమణలిద్దరూ బుల్లితెరమీద పెద్ద భాగవతం బొమ్మ వేసేసారు. ఆ ధారావాహిక ఇప్పుడు ప్రసారం కాకున్నా, ఈ పుస్తకం లోని పుటలు తిప్పుతూ అక్షర దర్శనం చేస్తుంటే మన నరాల్లోను, నాడిలోను ఆ ధారావాహిక ప్రసరిస్తున్న అనుభూతి కలుగుతుంది. రామకృష్ణగారి శైలీ విన్యాసమే అందుకు కారణం. ఆయన సంధించిన పదాస్త్రాలు ఊరిస్తూ, మురిపిస్తూ, మరిపిస్తూ ఉంటాయి.

మొత్తానికి ఇతిహాసాలని కాచి అందులోని తత్వ సారాన్ని వడపోసి ఆధునికులకు అందించడంలో వీరు కృతకృత్యులయ్యారు.
ప్రతి ఇంట్లోను పవిత్ర గ్రంధాలతో పాటు ఉంచుకోదగ్గ పుస్తకం ఈ 'చెంగల్వ పూదండ'. ఈ పుస్తకం చదివిన ప్రమోదంలో రామకృష్ణ గారికి పద్యాంజలి

తే: గీ||
రామకృష్ణార్య! కడుగొప్ప రచన తోటి
పరిఢవిల్లెను మీరు ధీ ప్రతిభ చాటి
చలువ చెంగల్వ పూదండ చెలువ మేటి
విష్ణు తత్వార్ధ కిరణాలు వెలుగు కోటి
--సిరాశ్రీ

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం