భగవాన్ శ్రీ రమణ మహర్షి (మొదటి భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography

ఓం నమో  భగవతే శ్రీ రమణాయ

భారతదేశం వేదభూమి, కర్మభూమి, ఎందరో మహర్షులు మహనీయులు మహితాత్ములు నడయాడిన పుణ్యభూమి. అరుణగిరిలో వెలసి ఆత్మతత్వాన్ని మౌనంగా ప్రపంచానికి భోధించిన దివ్యాత్మ స్వరూపులు భగవాన్ శ్రీ రమణులు.

నిరాడంబరత, ప్రేమ, మూర్తిభవించిన రూపమే భగవాన్ శ్రీ రమణులు. భూతదయ, అహింసను ఆచరించి చూపిన మహనీయులు. "నేను ఎవరో ఆలోచించు" అనే ఆయన దివ్యవాక్కుతోనే ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని భోదించారు. ఆయన జీవితం, ఆచరణే, జగతికి ఆయన ఇచ్చిన సందేశం.

శ్రీ  భగవాన్ 'మౌనముని' గా ప్రసిద్ధిగాంచారు. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అమృతనాధ యతీంద్రులనే కేరళ సన్యాసి శ్రీ భగవాన్ ని  "అరుణాచల రమణుడు గురు రూపంలో కనిపించే స్కందుడా? మహావిష్ణువా? గొప్ప యోగా , లేక  దత్త్తాత్రేయులా?" అని ప్రశ్నించారు.

ఆయన ప్రశ్నలకు భగవాన్ "శ్రీ మహావిష్ణువు మొదలు సమస్త జీవజాతుల యందును, వారి హృదయంలో "నేను" అని ఎరుకగా ప్రకాశించే తత్త్వం ఏదైతే ఉందో అదియే "రమణుడు" అని చెప్పారాయన.

రమణులు మహిమలు ప్రదర్శించలేదు. అయితే వారి సన్నిధిలో మహిమలు జరగని క్షణమే లేదు. ఎందరో రాజకీయ, సాహిత్య, విదేశి ప్రముఖులు శ్రీ రమణులని దర్శించుకుని, ఆయన గొప్పతనాన్ని గుర్తించారు.

శ్రీ భగవాన్ జననము - బాల్యము
శ్రీ భగవాన్ రమణ మహర్షి అసలు పేరు వేంకటరామన్. 1879 డిసెంబరు 30 న తమిళనాడు లోని 'తిరుచ్చళి' లో జన్మించారు. తల్లి అళగమ్మ గారు. తండ్రి సుందరయ్య గారు. 'తిరుచ్చళి' లోనే మెజిస్ట్రేటు కోర్టులో ప్లీడర్ గా ఉండేవారు. వేంకటరామన్ కు ప్రాపంచిక వ్యవహారాల పట్ల ఆసక్తి ఉండేది కాదు. ఒక బంధువు తాను, 'అరుణాచలం' నుంచి వచ్చానని చెప్పగానే 'అరుణాచల'మన్న మాట విన్నప్పుడు పులకరించారు. ఆ పేరు వారిని సమ్మోహితుల్ని చేసింది.

పదహారవ యేట 'మదురై'లో ఉండగా ఒక నాడు వారికి మరణానుభూతి కల్గింది. తాను చనిపోతున్నట్లనిపించింది. ఈ అనుభవం గురించి వారిట్లా చెప్పారు. 'మదురై'ను నేను శాశ్వతంగా విడువటానికి దాదాపు ఆరు వారముల ముందు నాలో హటాత్తుగా  ఒక మార్పు సంభవించింది. నేను మా చిన్నాయన ఇంట్లో ఒక్కడినే గదిలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా మృత్యువంటే భయం నన్ను ముంచేసింది. నా ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదు. కానీ ఎందువల్లనో అలా అనిపించింది. "నేను చనిపోతున్నాను" అన్న భయంవలన మనస్సు అంతర్ముఖమైనది. మానసికంగా ఇట్లా అనుకున్నాను. " సరే చావు వచ్చింది. అయితే చనిపోయేది ఏమిటి ఈ దేహమే కదా" అనుకుంటూ ఆ చావుని నాటకీయంగా అనుభవించటానికి ఊపిరి బిగబట్టి, పెదవులను గట్టిగా బంధించి ఇట్లా అనుకొన్నాను.

" ఈ శరీరం చనిపోయింది. ఈ కట్టెను కాటికి తీసుకుపోతారు. అక్కడ బూడిద అయిపోతుందిది. అయితేమాత్రం ఈ శరీరం చనిపోతే, నేను చనిపోయినట్టేనా? "నేను"  అన్నది దేహమా? "నేను" ఈ దేహాతీతమైన ఆత్మను. దానికి చావులేదు." సచేతనమైన శరీర వ్యాపకమంతా ఆ "నేను" చుట్టూ జరుగుతూ ఉంటుంది. అప్పటినుండి ఆ "నేను" అన్న దానిపైనే కేంద్రీకరించాను. మ్రుత్యువంటే భయం ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ క్షణం నుంచి అవిచ్చిన్నంగా  ఆత్మలో లీనమైనారు. ఈ అనుభవం కలిగిన తర్వాత వేంకటరామన్ కి చదువుపట్ల ఆసక్తి సన్నగిల్లింది.

అరుణాచలానికి  ప్రయాణం
వేంకటరామన్ అత్యధిక సమయం ధ్యానంలో గడిపేవారు. వాళ్ళ అన్నగారికి ఇది నచ్చక విసుగుకోనేవారు. దీనికి మనస్సు చివుక్కుమని వేంకటరామన్ ఇల్లువిడిచి తిరువణ్ణామలై కి వెళ్ళిపోయారు. తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తున్నానని ఒక చీటీ వ్రాసి పెట్టారు. ఆ చీటిలో ఇంకా "నా తండ్రి ఆజ్ఞానుసారం ఆయన్ని వెతుక్కుంటూ వెళ్థున్నను. దీని గురించి ఎవ్వరూ చింతించకండి. ఈ ఉత్తరం "నేను" తో ప్రారంభమై మధ్యలో "ఇది" గా మారి చివరకు సంతకానికి బదులు అడ్డగీతతో అంతమైంది.

వేంకటరామన్ 1-9-1896 నాటి ఉదయాన తిరువణ్ణామలై చేరేను. అరుణాచలేశ్వరుని చేరి "అప్పా! నీ ఆజ్ఞ మేరకు వచ్చితిని అని చెప్పేను. ఆ తరువాత దగ్గరలో ఉన్న సరస్సులోకి దిగి స్నానం చేసి, తన పంచెని చింపి, ఒక్క కౌపీనం మాత్రం మిగుల్చుకున్నారు.

ఆ పదిహేడు సంవత్సరాల యువకుడు ఆ క్షణంలో ఇహం నుండి పరానికి లంఘించాడు. శరణాగతి, వైరాగ్యం, త్యాగం అంటే ఇదే.

అరుణాచల నివాసము
అరుణాచలము నందు వేంకటరామన్ దేవాలయముల యందును, గుహల యందును ధ్యాన నిమగ్నుడగుచుండెను.  పాథాళలింగ గుహలో ధ్యాన నిమగ్నుడై యున్నప్పుడు , శరీరాన్ని పురుగులు తోలచివేస్తున్నా, నెత్తురూ, చీమూ కారుతున్నా అతనికి తెలియకుండెను.

దినముల తరబడి ధ్యాన నిమగ్నుడై కూర్చొని యుండుటచేత బాహ్య ప్రపంచ జ్ఞానము కలిగిన సమయముల యందు మాత్రము ఎవరైనా కొంత ఆహారము నోటికందించిన తినుచుండెను. సుమారు 3 సం॥ లు అన్న పానీయములు లేక, దేహమును విస్మరించి నిద్రమాని సమాధిలో ఉండెను.

ఆ సమయములలో చుట్టుప్రక్కల ప్రజలు భగవాన్ ని బ్రాహ్మణస్వామి అని పిలిచేవాళ్ళు.

దాదాపు పద్దెనిమిది నెలలపాటు ఆయనకి కేశ సంస్కారమంటూ ఏమీ లేదు. అప్పటి తన దేహ స్థితి గురించి శ్రీ సూరినాగమ్మ గారికి ఇలా చెప్పారు.

"జుట్టు అంతా అట్టలు కట్టి, ఒక బుట్టవలె అల్లుకు పోయింది. చిన్న చిన్న బెడ్డలు, దుమ్ము అందులో ఇరుక్కు పోయాయి. తల బరువుగా అయింది. అప్పుడు గుండు చేయించారు. దాంతో శరీరం ఎంతో తేలిక పడింది"

(తరువాయి భాగం వచ్చే సంచికలో...)
 

శ్రీ రమణార్పణమస్తు 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు