సుశాస్త్రీయం - శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య - టీవీయస్. శాస్త్రి

shree puchalapalli sundarayya

ఇది అరుణతార శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి శత జయంతి సంవత్సరం !!

ఈ సందర్భంగా ఆ మహనీయుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము.

పేరు: పుచ్చలపల్లి సుందరయ్య
ఊరు: అలగానిపాడు, నెల్లూరు
జననం: 1913
మరణం : 19/05/1985
భార్య : శ్రీమతి లీలా సుందరయ్య
సంతానం : లేదు (సంతానం కలుగకుండా ఆపరేషన్ చేయించుకున్నారు)
ప్రజా నామం : కామ్రేడ్ పీ ఎస్
ప్రత్యేకత : సీ పీ ఎమ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, రచయిత

భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేత శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి శత జయంతి సభ డిల్లీ లో జరగనుంది. ఈ సంవత్సరం మే 1 నుంచి సుందరయ్య గారి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోజీకోడ్ లో ఇటీవల జరిగిన పార్టీ అఖిల భారత మహా సభ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో ఉత్సవాల ప్రారంభ సూచకంగా డిల్లీ లో ఈ సభని నిర్వహించారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ, ఆయనను గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతాను.

పుచ్చలపల్లి సుందరయ్య 1913లో జన్మించారు. స్వగ్రామం నెల్లూరు జిల్లా అలగానిపాడు. చిన్నప్పుడే తండ్రి పోవడం వల్ల బావగారింట్లో వుండి చదువుకునేవారు. 1921-30 మధ్య ప్రైవేటు ట్యూషన్ చెబుతున్న టీచర్ వెంకటరత్నం గారి వాల్ల వీరికి తెలుగు బాష మీద అభిమానం పెరిగింది. దానిని అభివృద్ధి చేసుకోవటంతో భోగరాజు నారాయణ మూర్తి "విమలాదేవి", "రాయచూరు యుద్ధం", "తిమ్మరసు" మొదలైన చారిత్రక నవలలు చదవటంతో స్వాతంత్ర యోధుల మీద భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. వేమన పద్యాలు, సుమతీ శతకం కంటస్థం చేయటంతో సాంఘీక సమానత్వ భావాలంకురించాయి.  నియమబద్ద జీవితానికి పునాదులు ఏర్పడ్డాయి. రాజమండ్రి లో వీరి బావగారు సెషన్స్ జడ్జిగా వున్నప్పుడు 1924-25 లో పందిరి మల్లికార్జున రావు గారితో పరిచయం ఏర్పడింది. వారి సలహా అనుసరించి కొమర్రాజు లక్ష్మణరావు గారి భారతదేశ చరిత్ర గ్రంధాలు, చిలుకూరి వీరభద్రరావు గారి ఆంధ్రుల చరిత్ర , వీరేశిలింగం, చిలకమర్తి లక్ష్మి నరసింహం గార్ల గ్రంధాలు చదవటంతో ఫై భావాలూ ధృడ పడ్డాయి.

1925లో చిత్తరంజన్ దాస్ మరణించారనే వార్త విని, కాంగ్రెస్ ను గురించీ, అది నడిపే పోరాటాన్ని గురించీ తెలుసుకోవాలని కుతూహులపడ్డారు. రోజూ ఆంధ్ర దినపత్రిక చదవటం ప్రారంభించారు. 1919 లో డయ్యరు సేనాని జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణ హోమాన్ని గురించి కాంగ్రెస్ విచారణ కమిటీ ప్రకటించిన రిపోర్ట్ తెలుగులో వెలువడింది. అది చదివి బ్రిటిష్ పాలనను ఏవగించుకోసాగారు . 1925 డిసెంబరు లో ఒక వ్యక్తిగత విప్లవవాద గ్రూప్ లో చేరారు. తరవాత గాంధీజీ ఆత్మకధ చదివారు. వారి సంపాదకత్వంలో వెలువడుతున్న "యంగ్ ఇండియా" వార పత్రిక కూడా చదవసాగారు.  అప్పటి నుంచి ఖద్ధరు ధరించడం ప్రారంభించారు. సాధ్యమైన, తక్కువ అవసరాలతో జీవితాన్ని నియబద్ధంగా గడపటానికి కృషి చేసారు. క్రమంగా ఇతర భావ తరంగాలు వీరి ఆలోచనల్ని పదును పెట్టాయి. 1926లో మద్రాసు లో నాలుగవ ఫారం చదువుతున్నప్పుడు సావర్కార్ జీవితాన్ని గురించి చదివి ఉత్తేజం పొందారు. భారతీయ సంస్కృతిఫై పాశ్యాత్య దేశాల్లో అనేక ఉపన్యాసాలిచ్చిన స్వామి వివేకానంద రచనల్ని చదివి, స్వదేశాభిమానాన్ని, స్వయం శిక్షణను అలవరుచుకున్నారు. తిలక్ మాండలే జైల్లో రచించిన "గీతా రహస్యం" వీరికి కర్తవ్య ప్రభోధం చేసింది. "నేను చదువుకుంటున్న హైస్కూల్లో గీతా రహస్యం మీద నేనిచ్చిన ఉపన్యాసం విని విద్యార్ధులు, ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు  అని ఒక ఇంటర్వ్యూ లో అన్నారాయన. 1927లో జవహరలాల్ నెహ్రూ రష్యా నుంచి తిరిగి వచ్చి, ఆ దేశంలోని సోషలిస్ట్ వ్యవస్థను గురించి ధారావాహికంగా రాసిన వ్యాసాలు వీరిలో మొట్టమొదటిసారిగా సోషలిస్ట్ బీజాలు నాటాయి. 1927లో మద్రాసు లో జరిగిన కాంగ్రేస్ మహాసభ సంపూర్ణ స్వాతంత్ర్యం తన ధ్యేయం అని తీర్మానించడం, మరుసటి సంవత్సరం మద్రాసు లో సైమన్ కమీషన్ కి వ్యతిరేకంగా జరిగిన హర్తాళ్, బహిరంగ సభ ఇవన్నీ సుందరయ్య గారిలో స్వాతంత్ర్యేచ్చను ఇనుమడింప చేసాయి.

ఆ రోజు వీరు హై స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్ధులూ హర్తాళ్ లో పాల్గొన్నారు. మద్రాసు లో చదువుకొంటున్న రోజుల్లో సుందరయ్య గారు ప్రతీ ఏడాది వేసవి సెలవుల్లో స్వగ్రామం వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడల్లా స్వంత పొలంలో కూలీలతో కలసి వ్యవసాయ పనులు చేసేవారు. స్కూల్ ఫైనల్ పాసయ్యాక 1929లో వీరు మద్రాసు లయోలా కాలేజీ లో ప్రవేశించారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొంతమంది తెలుగు విధ్యార్ధులతో కలిసి సోదర సమితిగా ఏర్పడి వ్యాయామం, గ్రంధ పటనం, ఖద్దరు విక్రయం మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బొంబాయి నుండి వెలువడే యంగ్ లిబెరేటర్ పత్రికకు ఇతరులతో కలిసి చందాదారులను చేర్పించారు. అప్పుడే ' 'కమ్యూనిస్ట్ ప్రణాళిక', 'కూలిపని- పెట్టుబడి' మొదలైన మార్కిస్టు గ్రంధాలు కూడా చదివారు. ఆనాటి నుండి  కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేయటానికి నిశ్చయించుకున్నారు. భారత జాతీయ పోరాటంలో పాల్గొన్న తెలుగు ప్రముఖుల్లో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒకరు. కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీలలోని కొందరి నేతలతో కలిసి దక్షిణ భారతదేశం లో కమ్యూనిస్ట్ పార్టీ ని నిర్మించారు. పార్లమెంటుకి అయినా, శాసనసభకయినా సైకిల్ ఫైనే వెళ్ళేవారు. పెళ్లి చేసుకున్నప్పటికీ, పిల్లలు పుడితే ప్రజా ఉద్యమానికి సమయాన్ని కేటాయించలేనేమొననే ఆలోచనతో, సంతానం వద్దనుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ తన పేరు చివర ఏనాడూ 'రెడ్డి' అని పెట్టుకోలేదు. వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ ఎప్పుడూ సహపంక్తి భోజనాలు చేసేవారు. మీరట్ జైల్లో ప్రారంభమయిన కమ్యూనిస్ట్ కుట్ర కేసు విచారణను గురించిన వార్తలు ప్రతీరోజు పత్రికల్లో వెలువడుతుండేవి. ఆ కేసులో ముద్దాయిలు ప్రాసిక్యూషన్ చెప్పే అబద్దాలకు గూబగుయ్యిమనేటట్లు జవాబులు చెప్పటం తమ ధ్యేయాన్ని గురించీ, విధానాన్ని గురించి నిర్మొహమాటంగా బల్ల గుద్ది చెప్పటం ఇవన్నీ సుందరయ్య గారి ఆలోచనల్ని పదును పెట్టాయి.

ఒక రోజున విద్యార్ధి గాంధీ టోపీతో క్లాస్ కి వచ్చి కూర్చున్నాడు. అది చూసి ఒక కాథలిక్ ప్రొఫెసర్ ఆ విద్యార్ధిని బయటికి పంపించేసాడు. మరునాడు విద్యార్ధులందరూ గాంధీ టోపీ లతో క్లాసు కి ప్రత్యక్షం, అది చూసి ప్రొఫెసర్ క్లాసు ని సస్పెండ్ చేసాడు. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. సోదర సమితి సభ్యులు ఇతర విద్యార్థులతో చేతులు కలిపి, సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదంతా గమనిస్తున్న ప్రిన్సిపాల్ తెలివిగా, నోటీసు బోర్డులో ఎవరికీ తోచిన టోపీలు వాళ్ళు ధరించవచ్చని ప్రకటించాడు. విద్యార్ధులకు ఇదొక ఘన విజయం.

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, సుందరయ్య అలగానిపాడు వెళ్ళారు. అక్కడ వ్యవసాయ కార్మికులతో పనిచెయ్యటానికి 1930 వేమన జయంతి నాడు అవర్ణులకు, సవర్ణులకు కలిపి పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. సవర్ణులు సుందరయ్యగారికి దగ్గర బంధువులు దీనిని సహించలేక హరిజనులని రానీకుండా ఆపుచేసారు. భూస్వాముల ఈ చర్యను అసమ్మతిగా సుందరయ్య రెండు రోజులు నిరాహారవ్రతం చేసారు. అది పేద ప్రజలలోనూ, హరిజనులలోనూ ప్రత్యేక అభిమానం కలిగించింది. నిరాహార దీక్ష పూర్తికాగానే సోదర సమితి పిలుపు మీద ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటానికి పశ్చిమగోదావరి జిల్లా వెళ్లారు. భీమవరం తాలూకాలో రెండు చోట్ల చట్ట ధిక్కారం చేశారు. దిరుసుమర్రు వాలంటీర్ శిబిరానికి వచ్చి, అక్కడ వాలంటీర్ కెప్టెన్ గా పనిచేసారు. చట్టధిక్కరానికి పాల్పడినాడని భీమవరం సబ్ కలెక్టర్ 1930 జూన్ 16న సుందరయ్య గారికి రెండేళ్ళు కఠిన శిక్ష విధించినారు. వీరికప్పుడు 17 ఏళ్లు మాత్రమే. మైనరు కావడం చేత తంజావూరులో బాల నేరస్తుల్ని నిర్భందించే బోర్టర్స్ జైలుకు పంపించారు. ఆ జైల్లో పరిస్థితులు అతి నికృష్టంగా ఉండడం చూసి మరికొందరితో కలిసి నిరాహార వ్రతం చేశారు. అయిదో రోజున జైలు వార్డన్లు ఇనుప పట్కారుతో నోటిని తెరిచి గొంతులో గంజిపోశారు.  తరువాత 24 గంటలూ ఒంటికోట్లో నిర్బంధిచారు. రెండు నెలల తరువాత తిరుచినాపల్లి జైలుకి మార్చారు. తిరిగి తంజావూరు బోర్టర్స్ జైలుకి మార్చారు. అక్కడ మళ్ళీ నిరాహారదీక్ష ప్రారంభించడం వల్ల రాజమండ్రి జైలుకు మార్చారు. ఆ జైల్లోని ఇతర రాజకీయ ఖైదీలతో రష్యా విప్లవాన్ని గురించి, అలాంటి విప్లవాన్నే మన దేశంలో కూడా నడపడం గురించీ చర్చలు జరిపెవారు. రాజమండ్రి జైలులో లాహోర్ కుట్రకేసు ఖైదీలు శివవర్మ, విజయకుమార్ సిన్హాలతో వీరికి పరిచయమైంది. వారిది హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ, సోషలిజం సాధనకై వ్యక్తిగత విప్లవాద చర్యలను చేపట్టినవారు. అయితే గాఢమైన దేశభక్తి, అపారమైన ధైర్య సాహసాలు గలవారు. అదే సమయంలో తమ ఉద్యమంలో ద్యోతకమైన బలహీనతలు, అజాగ్రత్త వల్ల కలిగిన నష్టాలు కూడా వారు వివరించారు. ఆ సమయంలో సుందరయ్య గారికి ఎంతగానో తోడ్పడింది. శివవర్మ తన విప్లవ జీవితంలో ఎలా రహస్యంగా పనిచేసిందీ, జరిగిన పొరబాట్లు, విప్లవకారుల్లోని ధైర్యసాహసాలు అన్నీ వర్ణించి చెప్పేవారు. 

శిక్షాకాలం పూర్తి కాకముందే సుందరయ్యగారు గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ప్రకారం 1931 మార్చి 20వ తేదీన విడుదలయ్యారు. అప్పుడు వీరి బావగారు బెంగుళూరులో సెషన్స్ జడ్జిగా ఉండేవారు. అక్కడ సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరంలో ప్రవేశించారు. సుందరయ్య గారి కార్యకలాపాలను గురించి విని అమీర్ హైదర్ ఖాన్ 1931లో ఆయనను కలుసుకోవడానికి వెళ్ళారు. తనను కమ్యూనిస్టుగా పనిచేయమని సలహా ఇచ్చారు. తాను బి.ఎ పూర్తి చేస్తానని తల్లికి మాట ఇచ్చానని, అది పూర్తికాగానే తన కాలాన్ని కమ్యునిస్టు ఉద్యమంలో గడుపుతానని చెప్పారు. కానీ బెంగుళూరులో 1931లో ఆరుమాసాలు మాత్రమే చదివి, ఆ చదువు వల్ల ప్రయోజనమేమి ఉండదనుకొని చదువుకు స్వస్తి చెప్పి తిరిగి అలగానిపాడు వెళ్లారు. ఒకరోజున నెల్లూరు నుంచి వీరెరిగిన దువ్వూరి బలరామిరెడ్డి, చుండి జగన్నాధం, మరికొందరు అలగానిపాడు వచ్చారు. వీరు స్వాతంత్ర్యోద్యమంలో జైళ్ళకు వెళ్లి, విడుదలై వచ్చాక వ్యక్తిగత విప్లవవాదాన్ని చేపట్టినవారు. సుందరయ్య గారిని కూడా తమ వెంట తీసుకుపోవాలనుకొని వచ్చారు. వీరి మధ్య దీర్ఘ చర్చలు జరిగాయి. వ్యక్తిగత విప్లవవాదం సరైనది కాదని ఎంత వాదించినా వారు వినలేదు. చివరకు వారు లాభం లేదని తిరిగి వెళ్ళిపోయారు. అంతకు రెండేళ్ళు ముందే సుందరయ్య గారికి వ్యక్తిగత విప్లవవాదం పట్ల నమ్మకంపోయింది.

సుందరయ్య వాడిన వస్తువులు, పుస్తకాలు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాయి. కార్మికులను విపరీతంగా ప్రేమించే సుందరయ్య పుట్టిన రోజు కార్మిక దినోత్సవం కావడం యాదృచ్చికం. నా చిన్నతనంలో, ఆయనను గురించి అనేక విషయాలను ఆసక్తిగా వినేవాడిని. ఒక మిత్రుడు తన కలకత్తా అనుభవాలను గురించి ఇలా చెప్పాడు. ఒక పార్క్ దగ్గర అశేష జనసంద్రం. ఇళ్ల పైన, చెట్ల పైన, గోడలమీద నిలబడి ప్రజలు ఉత్సాహంగా ఒక ఉపన్యాసం శ్రద్దగా వింటున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి శ్రీ సుందరయ్య గారు. ఆయన గొప్ప వక్త కాదు. సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించటం ఆయనకు చేత కాదు. ఎందుకంటే, ఆయనది 'ఊక దంపుడు' ఉపన్యాసం కాదు, పూర్తి సైద్దాంతిక ఉపన్యాసం. అయినా, అంత మంది ప్రజలు ఆయన కోసం వచ్చారంటే ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానమే కారణం. ఒక తెలుగు తేజం వంగ దేశంలో తన వెలుగులు విరజిమ్ముతుంటే, ఆ విషయం విన్న నేను ఒక ఆంధ్రుడిగా పులకించి పోయాను. అదే సుందరయ్య గారి ఉపన్యాసం వినటానికి ఆయన సొంత గడ్డ అయిన ఆంద్రదేశంలో  పట్టుమని వందలలోనే జనం ఉంటారు. నేనెక్కడో చదివినట్లు నాకు గుర్తు -- కలకత్తాలో స్కూల్ విద్యార్ధులకు drawing పరీక్ష జరుగుతుందట. ప్రశ్నా పత్రంలో 'ఇల్లు' బొమ్మ వెయ్యమని ఒక ప్రశ్న ఉందట. ప్రతి విద్యార్ధి ఇల్లు బొమ్మ వేశాడు. అందులో విశేషమేమి లేదు! అయితే ప్రతి విద్యార్ధి వేసిన ఇంటి బొమ్మ గోడ మీద 'సుత్తీ-కొడవలి' బొమ్మ ఉంది. అదీ! సుందరయ్య గారి ప్రతిభ! చిన్న పిల్లల మనసులలోకి సైతం మార్క్సిస్ట్ సిద్ధాంతాలను నాటుకొని పోయేటట్లు చేయటం! జాతీయస్థాయి రాజకీయాలను ప్రభావితం చేసిన అటువంటి మహనీయునికి, ఆంద్రదేశంలో  తగిన గుర్తింపు రాలేదు. కార్మిక, కర్షక పోరాటాలను నడపడమొక్కటే స్వాతంత్ర సాధనకు మార్గమని ఆయన నమ్మారు. కొన్నాళ్ళ తరువాత అలగానిపాడు విడిచిపెట్టి ఎక్కడెక్కడ కమ్యునిస్టు ఉద్యమ నిర్మాణానికి అవకాశాలున్నాయో కనుగొనడానికి 1933-34 మద్య ఆంధ్ర జిల్లాలు పర్యటించారు. శ్రీ శ్రీ గారు ఎక్కడో ఇలా అన్నారు -- 'ఆంధ్రదేశంలో నువ్వు గొప్పవాడివి కావాలంటే, చచ్చిపో!' అని. చనిపోయిన తర్వాత కూడా ఆ మహనీయుని గొప్పతనం గుర్తించలేని 'ఆంధులం' మనం. పనికిరాని ప్రతి వారికీ శిలా విగ్రహాలు ఉన్నాయి! ఈ మహనీయునికి స్మారక చిహ్నాలను కూడా ఏర్పాటు చేసుకోలేని దౌర్భాగ్యులం మనం!

పొరుగు రాష్త్రీయులైన తమిళ  సోదరులు, పార్టీలతో నిమిత్తం లేకుండా, మహనీయుల పేర విగ్రహాలు, స్మారక మందిరాలు నిర్మించుకుంటారు.

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆ మహనీయుని నిస్వార్ధ సేవకు లాల్ సలాం చేస్తూ ఘనమైన నివాళి సమర్పించుదాం!

శ్రీ ఆరుద్ర గారు సుందరయ్య గారి దివ్యస్మృతికి సమర్పించిన 'బాష్పాంజలి' (సుందరయ్య మరణవార్త తెలియగానే స్పందించి రాసిన కవిత)

జోహరు కామ్రేడు సుందరయ్య 
జోహరు కామ్రేడు సుందరయ్య
నీలాంటి త్యాగజీవు లెందరయ్యా
అగ్రగామిగా నీవే ఉందువయ్యా
అంధ్రలోన పార్టీకి తండ్రివయ్యా

ప్రజారాజ్య స్థాపన నీ ధ్యేయమయ్యా
జగతి శక్తికి నీవు స్నేహమయ్యా
శ్రమజీవులు నిన్నెప్పుడూ మరువరయ్యా
సామ్యవాద సిద్ధాంతము విడువమయ్యా
నింగిలోన మన జెండా ఎగురునయ్యా
నేలమీద సమవృక్షం పెరుగునయ్యా
కలకాలం నీ బోధనలు తలతుమయ్యా
కన్నీటి వీడ్కోలు అందవయ్యా

                                   జోహారు కామ్రేడు సుందరయ్య!!!

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి