కాంచనమాల కన్నీటి కథ - టీవీయస్. శాస్త్రి

kaanachana maala story

కాంచనమాల అలనాటి యువకుల కలలరాణి, దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అందగత్తె(Dream Girl) అయిన నటీమణి ఈమె అని చెప్పవచ్చును. కాంచనమాల అందానికి ఆ రోజుల్లోమహా కవులే సలాం చేశారు. శ్రీ శ్రీ గారు 'సంధ్యా సమస్యలు' అనే తన కవితా ఖండికలో, ఈ విధంగా వ్రాసారు

ఆ సాయంత్రం. . . . .
రాక్సీ లో నార్మాషేరర్,
బ్రాడ్వే లో కాంచనమాల!!
ఎట కేగుటో సమస్య తగిలిందొక విద్యార్ధికి!

(రాక్సీ, బ్రాడ్వే లు ఆ రోజుల్లో మద్రాస్ లో పెద్ద Theaters )

చిత్తజల్లు కాంచనమాల(మార్చి 5, 1917 - జనవరి 24, 1981) తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్ గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఈవిడ కూడా ఒకరు. కాంచనమాల మార్చి 5, 1917 లో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఐతావరప్పాడులో జన్మించారు. తండ్రి పేరు దాసరి నారాయణదాసు. కాంచనమాల,  గాలి వెంకటేశ్వర్లు అనే యువకుణ్ణి ప్రేమించి పెళ్ళాడారు. ఇతను కూడా ఆమెతో కొన్ని సినిమాలలో నటించాడు. గాలి వెంకటేశ్వర్లు అలనాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడైన గాలి పెంచలనరసింహారావు గారి సోదరుడు. ఈయన 'వాలిసుగ్రీవ' లాంటి కొన్ని సినిమాలలో హీరోగా నటించారు. చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై. వి. రావు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారము (1935) లో మిత్రవింద వేషం వేయించారు. ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ రోజుల్లో తల్లులు పిల్లను నిద్రపుచ్చటానికి, 'దినదినము పాపడిని దీవించి పొండి దేవలోకములోని దేవతల్లారా' అనే కాంచనమాల గారి పాటను పాడేవారట. 1938 లో 'మాలపిల్ల' అనే సినిమాను శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారు నిర్మించారు. ప్రఖ్యాత రచయిత శ్రీ చలంగారి నాటకం యొక్క ఇతివృత్తం ఆ సినిమా కథ. అది, ఒక బ్రాహ్మణ యువకుడు, ఒక మాల పిల్ల ప్రేమకథ. మాలపిల్ల సినిమాలోని కాంచనమాల బొమ్మ వున్న కాలండర్, ఆ రోజుల్లో ప్రతి ఇంటికీ అలంకారంగా గోడలకు వేలాడుతుండేదట! అదీ ఆమె యొక్క అందం! విశాలమైన కళ్ళు ఆమెకు మరింత శోభను చేకూర్చాయి.

ఇంతటి అందగత్తె శ్రీ రామబ్రహ్మం గారి చేతే ఒక సారి తిరస్కరించబడిందట. శ్రీ రామబ్రహ్మంగారు తన తప్పును గుర్తించటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. గ్రామీణ వాతావరణానికి చెందిన ఒక మాలపిల్ల పాత్ర అయిన 'సంపాలత' పాత్రకు ఆమెను ఎన్నిక చేసారు. ఆ రోజుల్లోని సినీ పండితులు, ఈ అందాలబొమ్మ ఒక విశిష్టమైన పాత్రను ఎలా పోషించగలదని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. కాంచనమాల వారి అనుమానాలను పటాపంచలు చేసి , ఆ పాత్రను అద్భుతంగా పోషించింది. సినిమా మొదటి భాగంలో నిరక్షురాలైన గ్రామీణ యువతిగా అద్భుతంగా నటించిన ఆమె, రెండవ భాగంలో చదువుకున్న ఒక అధునాతన యువతిగా అదే ప్రతిభను కనబరచింది. ఆ రోజుల్లో ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ అందాల తార ఐన Greta Garbo తో పోల్చేవారు. 1935 లో ఆమె శ్రీ చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ కృష్ణ తులాభారం'లో నటించిది. ఆ సినిమాకు పాటలు వ్రాసినది, తెలుగులో మొదటి సినీ గేయ రచయిత అయిన శ్రీ చందాల కేశవదాసు గారు. ఆ సినిమాకు మాతృక వారు వ్రాసిన నాటకమే! అ సినిమాలోనే శ్రీ రేలంగి గారు కూడా ఒక చిన్న వేషం వేసారు. ఆమె తరువాతి సినిమా, 1936 లో నిర్మించిన 'వీరాభిమన్యు'. అందులో ఉత్తరగా నటించారు. ఆ సినిమాకు రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు. గృహలక్ష్మి(1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది. అలానే 'సక్కుబాయి' సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాంచనమాల నటించిన 'వందేమాతరం' దక్షిణ భారత దేశంలో రజతోత్సవం జరుపుకొన్నమొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కూడా అది విజయవంతమైంది. ఆ రోజుల్లో ఈ సినిమాలో నాగయ్య గారు కాంచనమాల కలసి పాడిన యుగళ గీతం 'మధురా నగరిలో చల్ల నమ్మబోవుదు' అనే పాట ప్రతి ఇంటిలోనూ మార్మోగిపోయేదట.

కాంచనమాల స్లీవ్ లెస్ జాకెట్, పెద్ద చెవి రింగులు, అందమైన కళ్ళు, చిరునవ్వు ఒలకించే పెదవులు, చేతిలో కాఫీ కప్, భుజాలమీదకు విరబోసుకున్న జుట్టుతో అందంగా వుండే ఈ అందాలరాశి బొమ్మ ఉన్న కాలండర్ 1940 వ సంవత్సరములో ప్రతి ఇంటికీ అదొక అలంకారం. ఆ కాలండర్ 'మాలపిల్ల' సినిమాకు సంబంధించినది. నటనా ప్రావీణ్యం లేకుండా కేవలం తన అందంతోనే ప్రసిద్ధి చెందింది కాంచనమాల. మాలపిల్ల సినిమాలో ఒక సాంప్రదాయపు బ్రాహ్మణ యువకుడు, ఒక గ్రామీణ మాలపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజుల్లో, ఆ ఇతివృత్తంతో సినిమా తీయటమే ఒక సాహసం. ఆరోజుల్లో సంఘంలోని సామాన్య జనం భావాలు , ఆ సినిమా గురించి ఇలా వున్నాయి-- 'కులం ఏదైతేనేమి? అంత అందగత్తె ఏకులంలోపుట్టితే ఏముంది? ఆమెను పెళ్లి చేసుకోవటం కన్నా అదృష్టం ఏముంది?' ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపడి, అలనాటి హిందీ అందాల తార నర్గీస్ తల్లిగారైన జద్దన్ బాయి గారు, కాంచనమాలను హిందీ సినీరంగానికి ఆహ్వానించారు. జద్దన్ బాయి గారు నిర్మాత, దర్శకురాలు. అలాగే అలనాటి హిందీ ప్రముఖ నటులైన, మోతీలాల్, మెహబూబ్ ఖాన్ గార్లు కూడా ఈమెను హిందీ సినీరంగానికి ఆహ్వానించారు. అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా వెలుగొందారు ఆమె. అప్పట్లోనే కాంచనమాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి. ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వాంఫ్ రోల్ ధరించిన ఈమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు. అది నాగయ్య గారి రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్య గారు, కాంచనమాల గారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీపెళ్ళి, వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం. ఈ చిత్రంలో ఆమె వితంతువుగా కూడా అందంగా ఉన్నారని అందరూ చెప్పుకునేవారట. ఆ తర్వాత ఆమె నటించిన ఇల్లాలు సినిమా విడుదల అయి మునుపటి సినిమాలంత విజయం సాధించ లేకపోయినా ఆంధ్ర పత్రిక ఫిలిం బ్యాలెట్ లో ఉత్తమనటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు. ఆ సమయంలో విడుదలైన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపొయింది. ఆమె కేవలం 11 సినిమాలలోనే నటించింది. అందులో అయిదు సినిమాలు కనకవర్షం కురిపించాయి. అప్పుడే ఆమె దుర్దశ ప్రారంభం అయిందని చెప్పవచ్చు.

ఆ తర్వాత జెమినీ వాసన్ గారి నిర్మాణ సారధ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సినిమాలో కాంచనమాలను బాలనాగమ్మ పాత్రకు తీసుకున్నారు. శ్రీ గోవిందరాజు సుబ్బారావుగారు మాయల పకీరు, శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారు కథానాయకుడు. శ్రీ ఈమని శంకరశాస్త్రి గారు సంగీత దర్శకుడు. ఆ సినిమాలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ సమయంలో వారి చిత్రాలలో మాత్రమే నటిస్తానని కాంచనమాల అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికే, కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. ఆ రోజుల్లో వాసన్ గారి ప్రవర్తన గురించి పలు వివాదాస్పద కథనాలను చెప్పుకునేవారు. వాసన్ ఆమె అందానికి కూడా మోహితుడై ఆమెను వేధించటం ప్రారంభించాడు. ఎన్ని ప్రలోభాలు చూపెట్టినా ఆమె వాసన్ మాయలో, మోహంలో చిక్కుపడ లేదు. అది, వాసన్ ఆగ్రహానికి గురి అయింది. ఒప్పందం ప్రకారం, ఆ సినిమా నిర్మాణం పూర్తి కాకుండా ఆమె మరే చిత్రంలో నటించటానికి వీలులేదు. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదు అని చెప్పడంతో మాటమాట పెరిగి "నీ దిక్కున్న చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడవి ఐతే నా కేంటి?" అని అన్నారు కాంచనమాల. ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. తెలుగులో ఆ సినిమాను విడుదల చేయకుండా చాల రోజులు ఆపి, ఉజ్వలంగా ఉన్న ఆమె సినీ జీవితాన్ని నాశనం చేసాడు వాసన్.

అలా తన సినీ జీవితం నాశనం కావటం వల్ల ఆమెకు మతి భ్రమించింది. ఆ తరువాత తెలుగులో బాలనాగమ్మ విడుదల అయింది. ఆ తర్వాత ఆమెకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఈ సమయం లోనే బాలనాగమ్మ విడుదల అయి అఖండ విజయం సాధించింది. దాని వలన వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్ కు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచనమాల నటనకు ఈ సినిమా గీటురాయి. కానీ ఆ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రం అయింది. ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న ఆమె కళ్లు ఆ షాక్ తో శూన్యంలోకి చూడటం మొదలుపెట్టాయి. హిందీ చిత్ర సీమలో అవకాశాలు వచ్చిన తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇలా జరగడం అత్యంత విచారకరం. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలన చిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది. ఆ స్థితిలో ఉండగానే ఆమె భర్త గాలి వెంకటేశ్వర్లు గారు క్షయ వ్యాధితో మరణించారు. దాంతో ఆమె అసలు కోలుకోలేదు.

కాంచనమాల స్నేహితురాలు, నటి ఐన లక్ష్మీరాజ్యం 1963 లో నర్తనశాల చిత్రం నిర్మించారు. లక్ష్మీరాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల. ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతో మంది కాంచనమాల గారిని చూడటానికి వస్తే, ఆమె ఎవ్వరినీ గుర్తు పట్టకపోగా, మీరెవరూ నాకు తెలియదు అని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మేకప్ వేసుకున్నా కాంచనమాల గారిలో ఏ మాత్రం ఆనందం కానరాలేదు. నటనలో ఆమె నుండి స్పూర్తి పొందిన వారిలో జి. వరలక్ష్మి ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి గారు తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయా చిత్రాన్ని సెట్ లో ఉంచారు.

వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆమె 10000/- పారితోషికంగా తీసుకునేవారు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందినా ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదుట. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాల గారిపై 2 సార్లు కవితలల్లారు. జీవించినంత కాలం విలాసవంతమైన జీవితం గడిపింది. తెనాలిలో మొన్న ఈ మధ్యవరకూ ఆమెకు చెందిన గొప్ప బంగళాను 'కాంచనమాల బంగళా' గా పిలిచేవారు. తెనాలి వాసులందరికీ సుపరిచితమైన భవంతి అది. ఈ మధ్యనే దానిని పడగొట్టి Apartment గా కట్టారు. ఆ బిల్డర్ ఆమె జ్ఞాపకార్ధం, దానిపేరు 'కాంచనమాల అపార్ట్మెంట్స్' అనే పేరునే ఉంచాడు. కాంచనమాల 1981 జనవరి 24 న మద్రాసులో ఈ లోకాన్ని వదిలి పరలోకాన్ని చేరారు.

శ్రీ శ్రీ గారు అన్నట్లు---
విసిగిన ప్రాణుల పిలిచే దెవ్వరు?
దుర్హతి, దుర్గతి,
 దుర్మతి, దుర్మృతి!


"స్త్రీ ఒక మాట వల్ల, చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా... ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి...  నిప్పు వలె ఉండాలి"------ చలం

దుర్మోహితులు అందాన్ని నాశనం చేయాలనుకుంటే, గులాబీని ముళ్ళుకూడా రక్షించలేవు! ఇదే ఆమె జీవితం నేర్పిన నీతి వాక్యం!!
ఆ అందాల నటీమణికి నా ఘనమైన నివాళి!